lectures
-
కాంట్రాక్టు అధ్యాపకుల దుస్థితి
రెగ్యులర్ చేస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు హామీ కళాశాలలు ప్రారంభమై రెండు నెలలవుతున్నా కనీసం రెన్యువల్ కూడా చేయని సర్కారు గత ఏడాది వేతన బకాయిలూ చెల్లించని వైనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ‘మా పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాను’ అంటూ గత ఎన్నికల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. రెగ్యులర్ సంగతలా ఉంచితే.. కళాశాలలు తెరచి రెండు నెలలు గడుస్తున్నా.. ఈ ఏడాది కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వం ఇంతవరకూ రెన్యువల్ కూడా చేయలేదు. దీంతో అటు రెగ్యులర్ కాక, ఇటు రెన్యువల్ జరగక వారు త్రిశంకుస్వర్గంలో మగ్గిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 447 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 6,081 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ 1600 మంది రెగ్యులర్, 3,776 మంది కాంట్రాక్టు అధ్యాపకులు మాత్రమే బోధన సాగిస్తున్నారు. జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిల్లో 550 మంది అధ్యాపకులు ఉండాలి. వీరిలో రెగ్యులర్ 110 మంది, కాంట్రాక్టు అధ్యాపకులు 325 మంది ఉన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు ఏటా జూన్ ఒకటిన రెన్యువల్ ఇచ్చి మార్చి 28 వరకూ కొనసాగిస్తారు. 16 ఏళ్లుగా ఇదే విధానం కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులవల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లుగా జూన్ ఒకటిన వీరిని రెన్యువల్ చేయడంలేదు. విద్యా సంవత్సరం మధ్యలో రెన్యువల్ ఇచ్చి దానిని డిసెంబర్ వరకూ మాత్రమే కొనసాగిస్తున్నారు. తెల్లకాగితాలపై హాజరు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటికే రెండు నెలల కావస్తోంది. అయినప్పటికీ కాంట్రాక్టు అధ్యాపకులను ఇప్పటివరకూ రెన్యువల్ చేయలేదు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, స్పాట్ వేల్యుయేషన్ అనంతరం జూన్ ఒకటి నుంచి కళాశాలల్లో వీరిచేత అనధికారికంగానే విద్యాబోధన సాగిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల హాజరును సైతం ప్రిన్సిపాల్ తెల్లకాగితంపై నమోదు చేస్తున్నారు. అసలు ప్రభుత్వం తమను రెన్యువల్ చేస్తుందో చేయదో తెలియని పరిస్థితిలో కాంట్రాక్టు అధ్యాపకులు అభద్రతాభావంతో విధులు నిర్వర్తిస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుతో సరి కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు పొందుపర్చారు. తదనంతరం వీరిని రెగ్యులర్ చేసే అంశంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలతో 2014 సెప్టెంబర్ 9న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కనీసం కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఈ కమిటీ సేకరించలేదు. ఈ కమిటీ సమావేశమై, నివేదిక ఇచ్చేదెప్పుడు? తమ ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యేదెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు.. కనీసం తమను రెన్యువల్ కూడా చేయని సర్కారు తీరుపై మండిపడుతున్నారు. తెలంగాణలో స్వయంగా అక్కడి ముఖ్యమంత్రి కేసీఆరే పర్యవేక్షిస్తూ కాంట్రాక్టు అ«ధ్యాపకులను క్రమబద్ధీకరిస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు రెగ్యులరైజేష¯Œæపై మాట ఇచ్చి కూడా తప్పారని ఇక్కడివారు ఆవేదన చెందుతున్నారు. అందని వేతన బకాయిలు మరోపక్క కాంట్రాక్టు అధ్యాపకులకు గత విద్యా సంవత్సరం వేతన బకాయిలను కూడా ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదు. దీంతో వారికి పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. సర్కారీ కళాశాలల్లో బోధన మెరుగుపర్చేందుకు తమను వెంటనే రెన్యువల్ చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకుడు యార్లగడ్డ రాజాచౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అంశమేదైనా అదరగొట్టేస్తాడు..!
చిన్నకోడూరు: సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినా అతని తెలివితేటలు అమోఘం. అందుకే ఉపన్యాసాల్లోనూ.. వ్యాసరచల్లోనూ దంచేస్తున్నాడు. తండ్రికి వ్యవసాయంలో సాయపడుతూనే ఈ ఘనత సాధిస్తున్నాడు విద్యార్థి గణేశ్. మండల పరిధిలోని పెద్దకోడూరు గ్రామానికి చెందిన గౌరిగోణి చంద్రయ్య, సత్తవ్వ దంపతుల చిన్నకుమారుడు గణేశ్. వీరిది సామాన్య రైతు కుటుంబం. పెద్దకుమారుడు డిగ్రీ పూర్తి చేయగా, గణేశ్ పెద్దకోడూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రాథమిక స్థాయి నుంచే గణేశ్ చదువులో ప్రథమ స్థానంలో నిలుస్తున్నాడు. పాఠ్యాం శాలను ఏకాగ్రతతో వింటూనే పత్రికలు చదువుతూ పలు అంశాలపై పట్టు సాధిస్తున్నాడు. గెలుపొందిన బహుమతులు 2013లో జిల్లా స్థాయిలో బాల ప్రతిభా మేళా కవితలపై నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానంలో నిలిచాడు. 2014లో ‘నేనే ప్రధానినైతే’ అనే అంశంపై జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లోనూ ఫస్ట్ప్రైజ్ గెలుచుకున్నాడు. సిద్దిపేటలో జిల్లాస్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ‘నేనే శాస్త్రవేత్తనైతే..’ అనే అంశపై జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి పొదాడు. ఉపాధ్యాయుల స్ఫూర్తి ఉపాధ్యాయుల స్ఫూర్తితో ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో రాణిస్తున్నా. ప్రతి అంశంపై పట్టా సాధించాలని ఉంది. పదో తరగతిలో 10 జీపీఏ పాయింట్లు సాధించాలని కష్టపడుతున్నా. - గణేశ్, పదో తరగతి -
ఆ నేడు ఆగస్ట్ 28, 1963
నాకో కల ఉంది! పదాలు వాక్యాలవుతాయి. వాక్యాలు ఉపన్యాసాలవుతాయి. ఉపన్యాసాలు ఉద్యమాలవుతాయి. అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ ఉపన్యాసం ఈ కోవకే చెందుతుంది. మాటలకే కింగ్ అయిన మార్టిన్ లూథర్ ఉపన్యాసమిచ్చాడంటే... ఉద్యమానికి ఊతం ఇవ్వడమే! వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి మార్టిన్ వాషింగ్టన్ డి.సిలో ఇచ్చిన ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ ఉపన్యాసం అందరినీ ఉర్రూతలూగించింది. టాప్ అమెరికన్ స్పీచ్‌లలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఉపన్యాసంలో పద పదమున ‘మనుషులందరూ సమానమే’ అనే నినాదం వినిపిస్తుంది. జాత్యహంకారాన్ని ఉప్పుపాతరవేసే ఈ ఉపన్యాసం ఉద్యమాలకు కొత్త శక్తిని ఇచ్చింది. ఇప్పటికీ ఇస్తూనే ఉంది. -
రజ్వీ.. లాతూర్ ప్రకంపన
హైదరాబాద్ స్టేట్ శతాబ్దాలుగా మత సామరస్యానికి చిరునామాగా నిలిచింది. పాలకులు ఢిల్లీ సుల్తానులకు ఆ తర్వాత బ్రిటిష్ వారికి నమ్మకస్తులుగా మారారు. స్వతంత్ర రాజ్యానికి ఉండాల్సిన అన్ని హంగులూ ఉన్నా, ప్రజల రక్షణ భాధ్యతలను ‘పై’వారికి అప్పగించారు. వారి వారసుడు ఏడో నిజాం. కిషన్ ప్రసాద్, అక్బర్ యార్జంగ్ వంటి సామరస్య వ్యక్తిత్వాలు లేని లోటు ఆయన అధికారానికి చరమగీతం పాడింది. మత భావనలు తీవ్రంగా వీచాయి. అధికారం అనే దీపం ఆరకూడదని నిజాం విఫలయత్నాలు చేశాడు! ఈ క్రమంలో కాశిం రజ్వీ కథ! ‘మజ్లిస్-ఎ-ఇత్తెహాద్-ఉల్ ముసల్మీన్’ అధ్యక్షుడు బహదూర్ యార్జంగ్ 1946లో అకస్మికంగా మరణించిన వైనం (Legends and Anecdotes of Hyderabad ) గురించి చెప్పుకున్నాం కదా! ఆయనోసారి హైదరాబాద్ స్టేట్‌లోని లాతూర్ (ప్రస్తుతం మహారాష్ట్ర) వెళ్లారు. పార్టీ కార్యాలయం కోసం తగిన వసతి చూడమని పార్టీ సభ్యులను కోరారు. ఒక వ్యక్తి తన ఇంటిని పార్టీ కార్యాలయానికి ఇస్తాన న్నాడు. క్షణాల్లో ఇంట్లోని సామాన్లను వీధుల్లోకి విసిరేశాడు. అధ్యక్షుడు హృదయానికి హత్తుకున్న ఆ కార్యకర్త సయ్యద్ కాశిం రజ్వీ ! బహదూర్ యార్జంగ్ మరణానంతరం సహజంగానే పార్టీ అధ్యక్షుడయ్యాడు. హైదరాబాద్‌కు ‘ప్రకంపనలను’ పరిచయం చేశాడు. ఖడ్గంతోనే ముస్లింలు హిందుస్థాన్‌కు పాలకులయ్యారన్నాడు. ఆయన ఉపన్యాసాలు కొందరిని ఉద్వేగపరచాయి. సామరస్య జీవనాన్ని కోరుకునే అధిక సంఖ్యాకులైన ముస్లింలకు ఆందోళన కలిగించాయి. స్వతంత్ర రాజ్యంగా అవతరించబోతోన్న బ్రిటిష్ పాలిత భారత్‌లో కలవకుండా, నిజాం స్వతంత్ర రాజుగా ఉండాలని రజ్వీ ఆయనలో రాజ్యకాంక్షను రగిలించాడు. ‘మై హూ నా’ అన్నాడు. ఎర్రకోటపై నిజాం జెండా రెపరెపలాడుతుందని, బెంగాల్ సముద్రజలాలు ఆయన పాద ప్రక్షాళన చేస్తాయని అభివర్ణించాడు. ప్రధానమంత్రిని తరిమారు! ‘నైజాం రాజ్య రక్షణ’ కోసం రజాకార్స్ అనే పేరుతో పారా మిలటరీ దళాన్ని ఏర్పరచాడు రజ్వీ! నాయకుని కోసం ప్రాణత్యాగం చేస్తామని, హైదరాబాద్ స్టేట్ విలీనం కాకుండా చివరి క్షణం వరకూ పోరాడుతామని సభ్యులతో ప్రమాణం చేయించాడు. ఫీల్డ్ మార్షల్ దుస్తుల్లో ఉండేవాడు. హోదాలను బట్టి ఇతరులు తుపాకులు, కత్తులు, కర్రలు చేతబట్టేవారు. ఏడాదిపాటు ‘యథాతథ స్థితి’ని గౌరవించేందుకు ఒప్పందానికి రావాలని 1947లో కేంద్ర ప్రభుత్వం, నిజాం ప్రభుత్వమూ భావించాయి. ఢిల్లీకి బయలుదేరిన నిజాం ప్రతినిధి బృందాన్ని రజాకార్లు అడ్డుకున్నారు. హైదరాబాద్ స్టేట్ ప్రధానమంత్రిపై చేయి చేసుకున్నారు! సౌమ్యుడైన ప్రధానమంత్రి సర్ మీర్జా ఇస్మాయిల్ స్టేట్ వదిలే వరకూ రజ్వీ మనుషులు తరిమారు. ఈ నేపథ్యంలోనే, నిజాం అధికార కాంక్షను నిరసిస్తూ, హైదరాబాద్ స్టేట్ భారత్‌లో అంతర్భాగం కావడం అనివార్యమని వార్తలు రాసిన షోయబుల్లాఖాన్ హత్యకు గురయ్యాడు. నిజాం ప్రధానమంత్రిగా నియమించిన నవాబ్ చట్టారీ స్థానంలో నిజాం నిర్ణయాన్ని పరిహసిస్తూ మీర్ లాయక్ అలీని ప్రధానమంత్రిగా రజ్వీ నియమించాడు. 1948 నాటి ఈ పరిస్థితుల్లో అధికసంఖ్యాకులు వలసపోయారు. అల్పసంఖ్యాకులు వలసవచ్చారు. పోలీస్ చర్యకు ‘రజ్వీ’ ఆహ్వానం! నిజాం నవాబుకు వత్తాసుగా ఎన్నో డాంబికాలు పలికిన రజ్వీ, హైదరాబాద్ స్టేట్ ఇండియాలో విలీనం కావాలని భావించిన షోయబుల్లాఖాన్ మరణానికి కారకుడైన రజ్వీ, పోలీస్ చర్యను ఆహ్వానించిన వారిలో ముందు వరుసలో ఉన్నాడు! 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్య ప్రారంభమైంది (17 పోలో గ్రౌండ్స్‌తో హైదరాబాద్ ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉండేది!). నాలుగు రోజుల్లోనే నిజాం బేషరతుగా లొంగిపోయాడు. అనుయాయులతో రజ్వీ అరెస్టయ్యాడు. హిందు-ముస్లిం-క్రిస్టియన్ న్యాయమూర్తుల స్పెషల్ ట్రిబ్యునల్ రజ్వీ బృందంపై విచారణను ప్రారంభించింది. లా చదివిన రజ్వీ తన కేసును తానే వాదించుకున్నాడు. 1950 సెప్టెంబర్ 10న ట్రిబ్యునల్ విధించిన ఏడేళ్ల జైలుశిక్షను హైదరాబాద్, పూణెలలో పూర్తిచేసుకున్నాడు. ‘వా’హెద్! పూణెలోని ఎరవాడ జైలు నుంచి విడుదలైన రజ్వీని ఆయన అనుయాయి, న్యాయవాది కమిల్ అడిక్‌మెట్‌లో ఉన్న తన నివాసానికి కారులో తీసుకువచ్చాడు. పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు! 140 మందికి ఆహ్వానాలు వెళ్లగా 40 మంది వచ్చారు. ‘పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించే సాహసి లేరా’ అనే రజ్వీ పిలుపునకు స్పందన రాలేదు. 12 ఏళ్లు దాటిన ఏ పురుషుడైనా అధ్యక్షుడు కావచ్చని నిబంధన సవరించారు. అబ్దుల్ వాహెద్ ఒవైసీ అనే యువకుడు అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ దీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ ముస్లింల యోగక్షేమాల పరిరక్షణ ధ్యేయమని పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ముస్లిమేతరులనూ పార్టీ పదవులకు, ఉన్నత స్థానాలకు ఎంపిక చేస్తోంది. ఎంఐఎం పార్టీకి ప్రస్తుతం ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షుడు. మరో కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో శాసనసభాపక్షనేత. కన్నీరు కరవైంది! తాను దక్కన్లో పుట్టాను దక్కన్‌లోనే మరణిస్తానని గతంలో చెప్పుకున్న రజ్వీ, పార్టీ అప్పగింతలు పూర్తయిన తర్వాత తనకు భారత్‌లో భవిష్యత్ లేదని, పాకిస్థాన్ వెళ్తానని ప్రకటించాడు. పోలీస్ చర్య పూర్తయిన తొమ్మిదేళ్లకు సెప్టెంబర్ 18న పాకిస్థాన్ పయనమయ్యాడు. కమిల్ ముంబై వరకూ వెళ్లి సెండాఫ్ పలికారు. రజ్వీని పాకిస్థాన్‌లో ఎవ్వరూ రిసీవ్ చేసుకోలేదు. మద్దతు పలకలేదు. గుర్తించలేదు. ఇండియా నుంచి, ముఖ్యంగా దక్కన్ నుంచి కరాచీకి వెళ్లి బాధలు పడుతున్న వారికి న్యాయవాదిగా సేవలు అందించాడు. 67వ ఏట 1970 జనవరి 15న కరాచీలో రజ్వీ చనిపోయాడు. హైదరాబాద్‌లో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలని కలగన్న కాశిం రజ్వీ.. తాను పుట్టిన నేలకు సుదూరాన ఏర్పడ్డ మత రాజ్యం పాకిస్థాన్‌లో మరణించాడు. అక్కడ రజ్వీ కోసం ఏ ఒక్కరూ కన్నీరు పెట్టలేదు! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
నేటి నుంచి వైఖానస ఆగమ సదస్సు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమప్రోక్తంగా నిర్వహించే పూజా కైంకర్యాలు, ఆర్జిత సేవల విశిష్టతను తెలిపేలా శుక్రవారం నుంచి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు వైఖానస ఆగమ సదస్సు నిర్వహించనున్నారు. టీటీడీ ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యుల నేతృత్వంలో ఆస్థాన మండపంలో ఈ సదస్సు నిర్వహణకోసం హిందూ ధర్మప్రచార పరిషత్ ఏర్పాట్లు చేసింది. తొలి రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఉపన్యాసాలు ఉంటాయి. 12వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ప్రసంగాలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి ముగింపు సమావేశం నిర్వహిస్తారు. సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి వైఖానస ఆగమ పండితులు పాల్గొంటారు. లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యం- జిజ్ఞాసాధికరణం, వైఖానసమ తత్త్వచింతన, అష్టాదశ శారీర సంస్కార విశిష్టత, ఉత్తమ బ్రహ్మ విద్య వైఖానస ఆగమం వంటి అనేక అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు. 15న తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17వ తేదీన ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 17 తేదీన ఆణివార ఆస్థానం పురస్కరించుకుని ఆలయంలో 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ సందర్భంగా భక్తులను దర్శనానికి అనుమతించరు. ఆరోజు ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాదపద్మారాధన ప్రత్యేక వారపు సేవను రద్దు చేశారు. ఇక 17వ తేదీ సాలకట్ల ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమల ఆలయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఆ రోజు నుంచే ఆలయ నిర్వహణ లెక్కలు ప్రారంభిస్తారు.