కాంట్రాక్టు అధ్యాపకుల దుస్థితి contract lectures bad position | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు అధ్యాపకుల దుస్థితి

Published Wed, Jul 27 2016 1:24 AM

కాంట్రాక్టు అధ్యాపకుల దుస్థితి

రెగ్యులర్‌ చేస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు హామీ
కళాశాలలు ప్రారంభమై రెండు నెలలవుతున్నా కనీసం రెన్యువల్‌ కూడా చేయని సర్కారు
గత ఏడాది వేతన బకాయిలూ చెల్లించని వైనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
‘మా పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని రెగ్యులర్‌ చేస్తాను’ అంటూ గత ఎన్నికల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు టీడీపీ అధినేత చంద్రబాబు
హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. రెగ్యులర్‌ సంగతలా ఉంచితే.. కళాశాలలు తెరచి రెండు నెలలు గడుస్తున్నా.. ఈ ఏడాది కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వం ఇంతవరకూ రెన్యువల్‌ కూడా చేయలేదు. దీంతో అటు రెగ్యులర్‌ కాక, ఇటు రెన్యువల్‌ జరగక వారు త్రిశంకుస్వర్గంలో మగ్గిపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 447 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 6,081 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ 1600 మంది రెగ్యులర్, 3,776 మంది కాంట్రాక్టు అధ్యాపకులు మాత్రమే బోధన సాగిస్తున్నారు. జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. వీటిల్లో 550 మంది అధ్యాపకులు ఉండాలి. వీరిలో రెగ్యులర్‌ 110 మంది, కాంట్రాక్టు అధ్యాపకులు 325 మంది ఉన్నారు.
కాంట్రాక్టు అధ్యాపకులకు ఏటా జూన్‌ ఒకటిన రెన్యువల్‌ ఇచ్చి మార్చి 28 వరకూ కొనసాగిస్తారు. 16 ఏళ్లుగా ఇదే విధానం కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులవల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లుగా జూన్‌ ఒకటిన వీరిని రెన్యువల్‌ చేయడంలేదు. విద్యా సంవత్సరం మధ్యలో రెన్యువల్‌ ఇచ్చి దానిని డిసెంబర్‌ వరకూ మాత్రమే కొనసాగిస్తున్నారు.
తెల్లకాగితాలపై హాజరు
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటికే రెండు నెలల కావస్తోంది. అయినప్పటికీ కాంట్రాక్టు అధ్యాపకులను ఇప్పటివరకూ రెన్యువల్‌ చేయలేదు. అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు, స్పాట్‌ వేల్యుయేషన్‌ అనంతరం జూన్‌ ఒకటి నుంచి కళాశాలల్లో వీరిచేత అనధికారికంగానే విద్యాబోధన సాగిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల హాజరును సైతం ప్రిన్సిపాల్‌ తెల్లకాగితంపై నమోదు చేస్తున్నారు. అసలు ప్రభుత్వం తమను రెన్యువల్‌ చేస్తుందో చేయదో తెలియని పరిస్థితిలో కాంట్రాక్టు అధ్యాపకులు అభద్రతాభావంతో విధులు నిర్వర్తిస్తున్నారు.
కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటుతో సరి
కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు పొందుపర్చారు. తదనంతరం వీరిని రెగ్యులర్‌ చేసే అంశంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలతో 2014 సెప్టెంబర్‌ 9న కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కనీసం కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఈ కమిటీ సేకరించలేదు. ఈ కమిటీ సమావేశమై, నివేదిక ఇచ్చేదెప్పుడు? తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ అయ్యేదెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు.. కనీసం తమను రెన్యువల్‌ కూడా చేయని సర్కారు తీరుపై మండిపడుతున్నారు. తెలంగాణలో స్వయంగా అక్కడి ముఖ్యమంత్రి కేసీఆరే పర్యవేక్షిస్తూ కాంట్రాక్టు అ«ధ్యాపకులను క్రమబద్ధీకరిస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు రెగ్యులరైజేష¯Œæపై మాట ఇచ్చి కూడా తప్పారని ఇక్కడివారు ఆవేదన చెందుతున్నారు.
అందని వేతన బకాయిలు
మరోపక్క కాంట్రాక్టు అధ్యాపకులకు గత విద్యా సంవత్సరం వేతన బకాయిలను కూడా ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదు. దీంతో వారికి పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. సర్కారీ కళాశాలల్లో బోధన మెరుగుపర్చేందుకు తమను వెంటనే రెన్యువల్‌ చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులర్‌ చేయాలని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకుడు యార్లగడ్డ రాజాచౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement