ఓ సాధువు తన శిష్యుడిని పిలిచి ‘‘ఓ రోజంతా నువ్వు రాజుగారి కోటలో ఉండి పాఠం నేర్చుకురా’’ అని ఆదేశించారు.‘‘ఆశ్రమంలో నేర్చుకోని పాఠాన్ని రాజుగారి కోటలో ఏం నేర్చుకుంటాను’’ అని మనసులో అనుకున్నా గురువుగారి ఆజ్ఞగా శిష్యుడు సరేనని రాజుగారి కోటకు వెళ్ళాడు. ఆ శిష్యుడు రాజుగారి ఆస్థానానికి వెళ్ళి గురువుగారి మాట చెప్పాడు. అలాగా అని రాజుగారు ఆ యువకుడికి ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా సకల మర్యాదలతో చూసుకున్నాడు. రాజుగారి కోటలో ఎటు చూసినా ఆటాపాటలే. విలాసాలకు ఏ మాత్రం లోటు లేకుండా ఉంది. కానీ ఇవేవీ అతనికి నచ్చలేదు. ఒంటి మీద జెర్రులు పాకుతున్నట్లు అనిపించింది అతనికి. అయినా మనసుని నియంత్రించుకుని పగలంతా కోటలో గడిపాడు. రాత్రి కాగానే నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే రాజు ఆ యువకుడిని పిలిచి దగ్గర్లోనే ఉన్న కోనేటిలో స్నానం చేసి వద్దాం అన్నాడు.
యువకుడు, రాజు ఇద్దరూ వెళ్ళారు. అప్పుడు ఉన్నట్లుండి రాజుగారి కోటలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చూపించాడు రాజు. ఆ యువకుడు స్నానం మానేసి కోట వైపు వెంటనే పరుగెత్తాడు. అక్కడ ఉంచేసిన తన కౌపీనం తగలబడిపోకుండా ఉండేందుకు పరుగెత్తాడు. కౌపీనం తీసుకుని యువకుడు కోనేటి వద్దకు చేరుకున్నాడు. అప్పటికీ రాజుగారు అక్కడే నింపాదిగా స్నానం చేస్తూ కనిపించారు. కోట ఓ పక్క అగ్నిప్రమాదంలో చిక్కుకోగా ఈ రాజు ఏ మాత్రం దిగులుపడకుండా ఇలా జలకాలాడుతున్నాడేమిటి చెప్మా అనుకున్నాడు మనసులో ఆ యువకుడు. కానీ తాను మాత్రం తన కౌపీనం కోసం ఇలా పరుగులు తీసానేమిటీ అని సిగ్గుతో తలదించుకున్నాడు. రాజుగారికి నమస్కరించి ‘‘ఏ విధంగా మీరిలా నిశ్చలంగా ఉండగలిగారు’’ అని యువకుడు అడిగాడు.
అప్పుడు రాజు చెప్పాడు ... ‘‘ఈ కోట నాదనే తలపు ఉండి ఉంటే నేనూ పరుగెత్తే వాడిని, అది ఒట్టి కోటే. నేను నేనే. అంతే తప్ప కోట నాదెలా అవుతుంది. నేను చనిపోయిన తర్వాత కూడా ఆ కోట అక్కడే ఉంటుంది. కౌపీనం నీదని, కోట నాదని నువ్వు అనుకున్నావు కనుకే పరుగెత్తుకుని వెళ్ళి నీ కౌపీనాన్ని మాత్రం తెచ్చుకున్నావు... కోట సంగతి వదిలేశావు. కానీ నేనలా అనుకోలేదు. కనుకే పరుగెత్తలేదు. మనిషి తన మనసు ఇష్టాయిష్టాలకు దాసోహమవుతున్నాడు. ఇష్టాయిష్టాలను వదులుకున్నవాడే ఇందులోంచి విముక్తి పొందుతాడు’’ అని రాజు చెప్పేసరికి తననెందుకు ఓ రోజు కోటలో ఉండి పాఠం నేర్చుకోమన్నాడో గ్రహించాడు ఆ యువకుడు.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment