నవల : ది హోల్
రచయిత్రి : హిరోకో ఓయమడా
జపనీస్ నుంచి ఆంగ్లానువాదం : డేవిడ్ బాయ్డ్
ప్రచురణ : న్యూ డైరెక్షన్స్: 2020
చుట్టూ ఉండే సాధారణ వస్తువులు సైతం ప్రతీకలుగా, ఫాంటసీ కలగలసిన అద్భుతాలుగా, మళ్లీ అవే అధివాస్తవికంగా రూపం మార్చుకుంటూ– అలాంటి రూపాంతరాలు ప్రత్యేకించి కొట్టొచ్చినట్టు కనబడకుండా సాగుతూ అబ్బురపరుస్తుంది ఈ నవలిక. 2013లో జపాన్‌లోని అకుతాగవా ప్రైజ్ సంపాదించుకున్న రచయిత్రి హిరోకో ఓయమడా రాసిన ‘ది హోల్’ నవల ఆంగ్లానువాదం ఈ సంవత్సరమే విడుదలయింది. నవలలో జరుగుతున్నవి మామూలు విషయాలుగా జమకట్టి ఉపేక్షించే అవకాశాన్ని ఈ రచన ఎక్కడా ఇవ్వదు– అలా వదిలేస్తున్నామేమో అన్న ఉలికిపాటుని తప్ప.
ముప్పై ఏళ్ల ఆసా తన టెంపరరీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, భర్త బదిలీ కారణంగా అతనితో వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నది బొటాబొటీ సంపాదనే అయినప్పటికీ, దాన్ని వదిలిపెట్టాలంటే కొంత సందేహం. కాకపోతే, వెళ్తున్నది భర్త సొంతవూరికి కాబట్టీ, అక్కడ వాళ్లకి రెండు ఇళ్లున్నాయి కాబట్టీ, వీళ్లు ఒక ఇంట్లో అద్దె ఇవ్వకుండా ఉండవచ్చని అత్తగారు చెబుతుంది. అక్కడికి చేరుకున్నాక గృహిణిగా ఆసా జీవితం ప్రారంభమౌతుంది.
అత్తగారు కూడా ఉద్యోగినే. తన పనుల్లో బిజీగా ఉండే మామగారు కనిపించడం కూడా అరుదే. మానసిక స్థిమితం లేని తాతగారు ఉన్నా, ఆయనకున్న చెముడు వల్ల ఆయనతో సంభాషించే వీలూ లేదు. ఒంటరితనం, వేసవి వేడి తాలూకు ఉక్కపోత, చుట్టుపక్కల భరించలేని కీచురాళ్ల రొద (‘‘అసలేదో కీచురాయి నా ఒంట్లోనే ఉన్నట్టుంది’’), ఏమీ తోచని ఖాళీ ఆమె జీవితాన్ని ఆక్రమించుకుంటాయి.
ఎక్కడికి వెళ్లాలన్నా దూరాలు, సొంత కారు లేదు. జీవితం రసహీనంగా సాగుతున్న తరుణంలో ఒకరోజున అత్తగారు చెప్పిన పనిమీద స్టోర్‌కి వెళ్లిన ఆసా, ఒక వింతజంతువుని రోడ్డుమీద చూసి, ఆసక్తితో దాన్ని అనుసరిస్తూ వెళ్లి, ఒక గోతిలో పడుతుంది (‘‘ఇదేదో సరీగ్గా నా సైజుకి తవ్విన గొయ్యిలాగుంది!’’). ఆ ప్రాంతంలోనే ఉండే ఒక మహిళ సాయంతో దాన్నుంచి బయటపడుతుంది. ఈ సంఘటన దగ్గర మలుపు తిరిగే కథ ఆసా పరంగా కల్పన, వాస్తవికత, అధివాస్తవికతల మధ్య సాగుతూ ఉంటుంది.
తన పరిశోధనల్లో ఇంటి వెనకాల నివాసం ఉంటున్న భర్త సోదరుడి గురించిన సమాచారం; స్టోర్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఆడుకుంటూ కనిపించిన పిల్లలు; స్టోర్స్‌కి వెళ్లే దారికి సమాంతరంగా ఉన్న నది ఒడ్డున ఆడుకుంటున్న పిల్లలు; రోడ్డుకీ, నదికీ మధ్య ఉన్న వాలులో పెరిగిన రెల్లు మాటున దాగివున్న గుంతలు; అత్తగారి ఇంట్లో ఉన్న ఫొటోలో భర్త నానమ్మ పోలికల్లో అత్తగారు ఉండటం – ఇవన్నీ కొన్ని నిజాలుగా, కొన్ని ఊహలుగా, మరికొన్ని భ్రాంతులుగా ఆవిష్కారం అవుతున్నా– అంతర్లీనంగా ఉన్నది మాత్రం కరిగిపోతున్న అస్తిత్వం పట్ల ఆసాలో కలుగుతున్న సంచలనం.
‘‘ఇక్కడ ప్రతి సంవత్సరపు ప్రతి రుతువులోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందా? ఇలాంటి వేడి, ఉక్కపోతే ఉంటుందా?’’అన్న మీమాంసకి లోనయిన ఆసా, తాతగారి మరణానంతరం అంతకుముందు వెళ్లిన స్టోర్స్‌లోనే చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంటుంది. కానీ నిజానికి అక్కడ ఆమె అంతకుముందు చూసిన పిల్లలు ఎవరూ లేరు. అడపాదడపా వచ్చేది కేవలం ముసలివాళ్లేనని ఆ స్టోర్స్ మేనేజర్ అంటుంది. ‘‘మనకి కావాల్సింది మాత్రమే మనం చూస్తాం’’ అని నవలలో ఒక పాత్ర చెప్పినట్టు, తన జీవితంలో లోపించిన దానిని మాత్రమే ఆసా ఊహించుకుంటూ ఉంది.
పేరు తెలియని ఏదో జంతువు (సమాజం) చూపించిన మార్గాన్ని అనుసరిస్తే, చివరికి ఆసా పడింది సంసారకూపంలో. అస్థిమితానికి గురిచేస్తున్న వేసవితాపం తనలోని ఉక్కపోత. సమాజ ధిక్కరణ చేస్తే జరిగే ఫలితానికి ఉదాహరణ వెలివేయబడ్డ భర్త సోదరుడు. చిన్నపిల్లలు నెరవేరని కోరికలు. దూరంగా నది దగ్గర కోలాహలం అవతలివాళ్లు ఆనందోత్సాహాలతో ఉన్నారనుకునే ఇవతలివాళ్ల భ్రాంతి. వీటన్నింటినీ అంతర్గతంగా ఓ స్వరం (కీచురాళ్లు) మనకి వినిపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ హెచ్చరికల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే రచన ఇది!
- ఎ.వి.రమణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment