మానవజాతి పరిణామ క్రమ చరిత్రను చెప్పే పుస్తకం ‘సేపియన్స్’. 2011లో హీబ్రూలో వెలువడి 2014 లో ఇంగ్లిషులోకి అనువాదమైన ఈ పుస్తక రచయిత ఇజ్రాయిల్‌కు చెందిన యువల్ నోఆ హరారీ. దీన్ని తెలుగులోకి ఆర్.శాంతసుందరి అనువదించారు.
డెబ్బై వేల ఏళ్ల క్రితం ఆధునిక సేపియన్లు (‘తెలివైన’ మనుషులు) కొత్తగా భాషా నైపుణ్యం సాధించారనీ, ఇది గంటలకొద్దీ సన్నిహితులతో ఉబుసుపోని కబుర్లు చెప్పుకునేందుకు దోహదం చేసిందనీ, ఈ సాన్నిహిత్యం కోసమే మనుషులు పరిమిత సమూహాలుగా బతికారనీ అంటారు. సమూహంలోని మనుషుల సంఖ్య పెరిగితే సాన్నిహిత్యం తగ్గిపోతుంది.
‘‘ఈ కబుర్లు చెప్పుకోవటం అనే సిద్ధాంతం హాస్యంగా అనిపించవచ్చు, కానీ ఎన్నో అధ్యయనాలు దీన్ని సమర్థిస్తున్నాయి. ఈనాటికీ ఎక్కువశాతం మానవ వ్యక్తీకరణ ఈమెయిల్ ద్వారా అయినా, ఫోన్ ద్వారా అయినా లేక వార్తాపత్రికల్లో కాలమ్‌ల ద్వారా అయినా– అది పోచికోలు కబుర్లే. అది మనకి ఎంత సహజంగా అలవడిందంటే అసలు భాష పుట్టిందే ఇందుకా అనిపిస్తుంది.
చరిత్ర పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు భోజన సమయంలో కలుసుకున్నప్పుడు మొదటి ప్రపంచయుద్ధం గురించి మాట్లాడుకుంటారనీ, అణు శాస్త్రవేత్తలు సమావేశాలకి హాజరైనప్పుడు విరామ సమయంలో కాఫీ తాగుతూ క్వార్క్(ఉపకణం)ల గురించి మాట్లాడుకుంటారనీ అనుకుంటున్నారా? ఎప్పుడైనా అలా జరగవచ్చు. కానీ సాధారణంగా వాళ్లు వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న మొగుణ్ణి పట్టుకున్న మరో ప్రొఫెసర్ గురించో, శాఖాధిపతికీ, డీన్‌కీ మధ్య జరుగుతున్న గొడవ గురించో, లేక ప్రయోగాలు చేసేందుకు ఇచ్చిన డబ్బుతో ఖరీదైన కారు కొనుక్కున్న తమ తోటి ఉద్యోగి గురించో పోచికోలు కబుర్లు చెప్పుకుంటారు. ఈ కబుర్లు సామాన్యంగా ఎవరో చేసిన తప్పులూ, నేరాల గురించే సాగుతాయి.’’
Comments
Please login to add a commentAdd a comment