కవులు బాల్యమిత్రులు | childwood friends poetry | Sakshi
Sakshi News home page

కవులు బాల్యమిత్రులు

Published Sun, Jun 7 2015 2:04 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

childwood friends poetry

పుస్తక పరిచయం:  ‘హైకూ అంటే ఒక పదచిత్రం. ఆ పదచిత్రం మనసులో సున్నితమైన అనుభూతిని కలిగించాలి. ఆ అనుభూతి లోపల ఒక విధమైన మెలకువ లాంటిది కలిగిస్తుంది, సౌందర్యం పట్ల,’ అంటారు బివివి ప్రసాద్. ఈ జపనీయ కవితారీతిని అనుసరించి, తెలుగులో స్వతంత్ర హైకూలు రాసిన గాలి నాసరరెడ్డి, ఇస్మాయిల్‌లాగానే బివివి ప్రసాద్ (ఫోన్: 9493478556) కూడా నిక్కమైన హైకూలు రాశారు. వాటిని 1995-99 మధ్య ‘దృశ్యాదృశ్యం’, ‘హైకూ’, ‘పూలు రాలాయి’ సంకలనాలుగా తెచ్చారు. చదవాల్సినట్టుగా చదివితే హైకూలు అద్దే పరిమళం, అవి మేల్కొలిపే కరుణ మామూలుది కాదు. వాటితో స్నేహం కోసమే ఈ పాత పసిడి:
 
 గోడలో పూచినపూవు
 పరిచయం చేసింది
 మా గోడని
 కవులు
 పెద్దయాక పరిచయమైన
 బాల్యమిత్రులు
 చేయి పట్టుకుంది నిద్రలో.
 పాప కలలోకి
 ఎలా వెళ్లను?
 చేప దొరికింది
 విలవిల్లాడింది
 కొలను
 కిటికీ
 ఎవరూ తగిలించని
 చిత్రపటం
 
 మొట్టమొదటి తెలుగు అనువాదం
వివిధ విభాగాలలో ఎన్నో ప్రామాణిక గ్రంథాలను ప్రచురించిన తెలుగు అకాడమి, తాజాగా ‘పాణినీయ అష్టాధ్యాయి’ని రెండు భాగాలుగా వెలువరించింది. ‘క్రీ.పూ. 350 నుంచి 250 మధ్యకాలంలో సంస్కృత వ్యాకరణకారుడు పాణిని రచించిన అష్టాధ్యాయి అత్యున్నత మానవమేధకు తార్కాణం అనీ, ఇప్పటివరకు ప్రపంచభాషల్లో ఏ భాషకూ ఇంతటి గొప్ప వ్యాకరణశాస్త్ర గ్రంథం లేదనీ’ ప్రఖ్యాత భాషావేత్త లియొనార్డ్ బ్లూం ఫీల్డ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాకరణశాస్త్రాన్ని ‘ప్రపంచంలోని అన్ని భాషలకు అనువర్తింప చేసుకోవచ్చునని’ మాక్స్‌ముల్లర్ కూడా అభిప్రాయపడ్డారు. ఇలాంటి గ్రంథాన్ని ఆచార్య రవ్వా శ్రీహరి ‘దశాబ్దకాలానికి పైగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి’ తెలుగులోకి తెచ్చారు. సంస్కృత సూత్రాలను తెలుగు లిపిలో యథాతథంగా పొందుపరిచి,  వాటికి తెలుగులో వివరణల్ని ఇస్తూ వ్యాఖ్యానించారు.
 ఈ గ్రంథం గురించి ‘ప్రవేశిక’ ఇంకా ఇలా తెలియజేస్తోంది: ‘సూత్రరూపంలో రచించిన ఈ వ్యాకరణంలో లౌకిక, వైదిక సంస్కృతభాషల రెండింటి స్వరూపాన్ని వర్ణించే మొత్తం 3981 సూత్రాలు ఉన్నాయి. అష్టాధ్యాయి ఎనిమిదధ్యాయాలుగా విభక్తం కావడం వల్ల దీనికి అష్టాధ్యాయి అనే పేరు వచ్చింది. దీనికి పతంజలి మహర్షి రచించిన మహాభాష్యమనే వ్యాఖ్యానం, వామన జయాదిత్యులు రచించిన కాశికావృత్తి ప్రసిద్ధాలు. కాశికావ్యాఖ్య సూత్రార్థం, ఉదాహరణం, పదప్రయోజనం మొదలైన అంశాలతో కూడి ఉంది. ఈ వృత్తి కాశిలో రచించడం వల్ల కాశిక అనే పేరుతో ప్రసిద్ధమైంది. పఠన పాఠనాదుల్లో ఈ వ్యాఖ్య ఎక్కువ ప్రచారంలో ఉంది.
 ప్రస్తుత గ్రంథం అష్టాధ్యాయీ గ్రంథానికేకాక కాశికావ్యాఖ్యానానికి కూడా తెలుగులో వెలువడుతున్న మొట్టమొదటి అనువాదం’.
 
 పాణినీయ అష్టాధ్యాయి (వామన జయాదిత్యకృత కాశికావృత్తసహితం)
 తెలుగు అనువాదం: ఆచార్య రవ్వా శ్రీహరి
 మొదటి సంపుటం (1-4 అధ్యాయాలు)
 పేజీలు: 934; వెల: 350
 రెండవ సంపుటం (5-8 అధ్యాయాలు)
 పేజీలు: 1048; వెల: 390
 ప్రచురణ: తెలుగు అకాడమి, హైదరాబాద్
 
 పంజరపు రంగుల కథ!
 ‘సంకెళ్ల సవ్వడి’ ఆవిష్కరణ 13 జూన్ నాడు సారస్వత పరిషత్ హాల్, బొగ్గులకుంట(హైదరాబాద్)లో సాయంత్రం 5:30కి జరుగుతుంది. బొజ్జా తారకం అధ్యక్షత వహించే ఈ కార్యక్రమంలో జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, ప్రొ. హరగోపాల్, అరుణ్ ఫరేరా, సీమా ఆజాద్, ఎన్.వేణుగోపాల్, కె.శ్రీనివాస్ పాల్గొంటారు.
 
సాంకేతికంగా మాత్రమే ఇది అనువాద పుస్తకం. సారాంశంలో అచ్చ తెలుగు పుస్తకం. ప్రజాస్వామిక హక్కుల కార్యకర్త, చిత్రకారుడు అరుణ్ ఫరేరాను రకరకాల ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ‘కలర్స్ ఆఫ్ ద కేజ్’ పేరుతో తన అయిదేళ్ల జైలు జీవిత అనుభవాలకు పుస్తకం రూపం ఇచ్చారు అరుణ్. వాటిని చదువుతుంటే ఒకప్పటి తెలంగాణ కల్లోల కథా చిత్రాలు కళ్ల ముందు వరుస కడుతాయి.
 ‘కారాగార సాహిత్యం’ మనకు కొత్తదేమీ కాదు. జైలు గోడలు కవిత్వం వినిపించాయి. ఊచలు కథలు వినిపించాయి. ములాఖతులు మౌనగానాలయ్యాయి. అపురూపమైన కారాగార సాహిత్యానికి ‘సంకెళ్ల సవ్వడి’ సరికొత్త చేర్పు. ఈ పుస్తకం ద్వారా, జైలు ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్లి అండాసెల్ నుంచి గూనఖానా వరకు  అణువణువూ పరిచయం చేశారు అరుణ్. అది భౌతిక పరిచయం మాత్రమే కాదు; ఆ గాలిలోని కన్నీటి వేడిని, వేదనను, తిరుగుబాటు తత్వాన్ని, హక్కుల స్పృహ గురించి చేసే పరిచయం కూడా.
 పుస్తకంతో మమేకం కావడానికి మన పరిచిత ప్రపంచంలో అరుణ్‌లాంటి వాళ్ల కథలు ఎన్నో ఉండి ఉంటాయి. అందుకే ఇది మన తెలుగు రాష్ట్రాల అసలు సిసలు పుస్తకం. దీన్ని  చదువుకోవడం అంటే... ఒక వ్యక్తి వైయక్తిక విషాద అనుభవాలను చదువుకోవడం ఎంత మాత్రం కాదు. రాజ్యహింసలోని రాక్షసత్వాన్ని, హక్కుల విధ్వంసాన్ని తెల్లటి పుటల మీద నల్లటి వెలుగులతో చూడడం. ఎన్.వేణుగోపాల్ అనువాదం, ‘పంజరంలో రంగుల ఆకాశం’ పేరుతో బి.అనురాధ రాసిన ముందుమాట పుస్తకాన్ని మరింత చేరువ చేస్తాయి.
   యాకుబ్ పాషా
 సంకెళ్ల సవ్వడి (ఒక ‘మావోయిస్ట్’ ఖైదీ జైలు అనుభవాలు)
 రచన: అరుణ్ ఫరేరా; తెలుగు: ఎన్.వేణుగోపాల్
 పేజీలు: 192; వెల: 150; ప్రచురణ: మలుపు, హైదరాబాద్ ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్-500044
 
  కొత్త పుస్తకాలు
 1. భారత కార్మికోద్యమ చరిత్ర (1830-2010)
 రచన: సుకోమల్ సేన్
 తెలుగు: కె.కె.డి.హనుమంతరావు, ఎస్.ధనుంజయరావు
 పేజీలు: 832; వెల: 500
 
 2. కమ్యూనిస్టు యోధుడు-శాసనసభా ధీరుడు
 నర్రా రాఘవరెడ్డి
 పేజీలు: 168; వెల: 70
 
 3. నేను- నా ప్రజా జీవితం
 రచన: పర్సా సత్యనారాయణ
 పేజీలు: 112; వెల: 60
 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్-తెలంగాణ,
 ఎమ్‌హెచ్ భవన్, ప్లాట్ నం. 21/1,
 అజామాబాద్, ఆర్టీసీ కళ్యాణమండపం దగ్గర, హైదరాబాద్-20
 ఫోన్: 040-27660013
 
 అమ్మచీర (కథల సంపుటి)
 రచన: వేంపల్లి సికిందర్
 పేజీలు: 118; వెల: 75
 ప్రతులకు: రచయిత, నం. 8, గ్రీన్‌పార్క్ అపార్ట్‌మెంట్, బ్లాక్ ఎ, డి.ఆర్.మహల్ రోడ్, తిరుపతి-517501; ఫోన్: 9666426875
 
 షట్చక్రాలు- జ్యోతిర్వైద్యం
 రచన: అడవికొలను మాలతి
 పేజీలు: 160; వెల: 100
 ప్రతులకు: సాహితీ ప్రచురణలు, 29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-520002; ఫోన్: 0866-2436643
 
 సంభవామి యుగే యుగే
 రచన: ఆర్.శోభాదేవి
 పేజీలు: 208; వెల: 180
 ప్రతులకు: రచయిత్రి, బి-408, సాయికృపా రెసిడెన్సీ, మోతీనగర్, హైదరాబాద్-18; ఫోన్: 8500120960
 
 సాహిత్య ప్రభలు (వ్యాస సంపుటి)
 రచన: డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్
 పేజీలు: 96; వెల: 100
 ప్రతులకు: శ్రీలేఖ సాహితి, 14-5/2, శ్రీలేఖ కాలనీ, హసన్‌పర్తి, వరంగల్-506371; ఫోన్: 9949857955
 
 సెల్ఫ్ హిప్నాటిజం
 రచన: బి.వి.సత్యనాగేష్
 పేజీలు: 152; వెల: 80
 ప్రతులకు: మైండ్ ఫౌండేషన్, 203, మనోహర్ అపార్ట్‌మెంట్స్, ఓయూ రోడ్, విద్యానగర్,
హైదరాబాద్-44; ఫోన్: 9849064614

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement