పుస్తక పరిచయం.. అర్ధనారీశ్వరుడు
ఒక రచయిత తాను చనిపోయానని ప్రకటించుకునేంత వేదనకు గురైంది ఈ పుస్తకం వల్లా? (దేవరన్యాయం, నియోగం సంతానాల పాత్రలు ఎన్నోవున్న) మహాభారత గ్రంథాన్ని అక్కున చేర్చుకోగలిగినవారు పెరుమాళ్ మురుగన్‌లాంటి రచయితలను ఎందుకు తూలనాడుతున్నారు? అని మద్రాస్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఈ నవల గురించిన కేసులోనా? అనిపిస్తుంది ఈ పుస్తకం పూర్తిచేశాక. పశ్చిమ తమిళనాడులోని నమక్కాల్ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఓ సామాజిక సాంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. పిల్లలు లేనివాళ్లు అక్కడి అర్ధనారీశ్వరుడికి జరిగే రథోత్సవ వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లను వదిలి, ఆ రాత్రి ఎవరితోనైనా శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనవచ్చు. ఆ రోజు కలిసేది సాక్షాత్తూ దేవుడే!
పిల్లలు లేని కాళి, పొన్న దంపతుల కథ ఇది. ఇద్దరూ గౌండర్‌లే. కాని కాళి కాటాయి విభాగానికీ, పొన్న వెంటువ విభాగానికీ చెందినవారు. ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. ‘నేను పదిమంది పిల్లలను కన్నా వాడే నా మొదటి పిల్లాడు’ అనుకునేంత ప్రేమ వాళ్లది. కానీ పన్నెండేళ్లయినా వాళ్లకు పిల్లలు కలగరు. ‘నా బదులు నువ్వు ఒక మేకను కట్టుకొని వుంటే అది నేను మింగిన పసరు మందులు మొత్తం మింగివుంటే ఈ పాటికి మందలు మందలుగా పిల్లలను కనేది’ అనుకునేంత బాధ వాళ్లది.
ఒక అతిసాధారణ గ్రామీణ జంటకు ఉండగలిగే చైతన్యపు పరిధిలో వారిముందున్న ప్రతి అవకాశాన్నీ స్పృశించాడు రచయిత. ఆ సమాజంలో పిల్లలు లేనివాళ్లు ఎదుర్కోగలిగే సూటిపోటి మాటల్నీ, వివక్షనీ, నిరసననీ అన్నీ చూపించాడు. పిల్లలు లేకుండా ఆనందంగా జీవిస్తున్న నల్లప్ప మామ పాత్రను సమాంతరంగా నడిపించడం ద్వారా ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా వాళ్ల ముందుంచాడు. ‘సంతోషం గురించి తెలియని వెర్రివాళ్లు పిల్లలను పుట్టించి బాధపడనీ. అది చూసి నవ్వుకుందాం మనం’ అంటాడు నల్లప్ప. కానీ అంత గుండె దిటవు లేదు వారికి.
‘ప్రతి ఒకరిని ఏదో ఒక లోపంతోనే సృష్టించాడు ఆ దేవుడు. ఆ లోపాలను సవరించుకునే మార్గాలు కూడా ఆ దేవుడే ఇచ్చాడు.’ మరి ఆ ‘దేవుడి మార్గం’లో వెళ్లాలా? వద్దా? వెళ్లాక మునుపటిలాగా ముఖాలు చూసుకోగలమా? వెళ్లి తీరాలని పట్టుబట్టే పొన్న ఇంటివాళ్లు, వెళ్లమనడానికి నోరురాని కాళి... ఈ సున్నితమైన బాహ్య, అంతః ఘర్షణే నవలంతా నిజానికి! ఏ సంచలనాన్నో సృష్టించడం కోసం కాకుండా, ఒక పాత ఆచారపు ఆలంబనగా కథ నడిపించాడు రచయిత. పక్షాలు వహించకుండా, సంయమనం కోల్పోకుండా, కావాల్సినంత విశృంఖల శృంగారాన్ని దట్టించే అవకాశం వుండీ దాని జోలికి పోకుండా పద్ధతిగా నవలను నడిపించాడు.
అయితే, దాచుకునేంత షెల్ఫ్‌లైఫ్ లేని ఈ పుస్తకం వివాదాస్పదం కాకపోయివుంటే ఇంత ఆసక్తితో చదివేలా చేసేదా అన్నది అనుమానమే! ఈ పుస్తకాన్ని ఎల్.ఆర్.స్వామి చక్కగా అనువదించారు. ఏ మాత్రం అభిరుచి లేని ముఖచిత్రంతో ప్రచురించింది మాత్రం విశాలాంధ్ర!
పి.శివకుమార్
అర్ధనారీశ్వరుడు; తమిళ మూలం: పెరుమాళ్ మురుగన్; తెలుగు: ఎల్.ఆర్.స్వామి; పేజీలు: 152; వెల: 120; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ; ఫోన్: 0866-2430302