పుస్తక పరిచయం
చరిత్ర తాటాకు చప్పుళ్లపై ధిక్కారస్వరం
పురాణగాథల్ని సరికొత్తగా పునర్లిఖించడమనే కోవలోకి చేరిన తాజా తెలుగు నవల బెజ్జారపు రవీందర్ ‘తాటక‘. బాధితుల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి పీడకుల దమననీతిని ఎం.ఆర్.ఐ. స్కాన్ చేయడమే ఇటువంటి నవలల ప్రధానోద్దేశం. ఆనంద్ నీలకంఠన్ నవలలు ‘అసుర‘, ‘అజయ’ సాహితీ ప్రపంచంలో ఎంత సంచలనాన్ని సృష్టించాయో తెల్సిందే.
మనకు తెల్సిన ‘తాటక‘ రామాయణంలోని ఒక రాక్షస స్త్రీ. యాగ రక్షణార్థం విశ్వామిత్రుడి ఆదేశం మేరకు రామలక్ష్మణులు సంహరించిన పాత్ర. రచయితే చెప్పినట్లు, ‘ఒళ్ళంతా నల్లరంగు పులుముకొని, నోటికి ఇరువైపులా నిమ్మకాయలు, ఎర్రటి కృత్రిమ నాలుక, భారీ కృత్రిమ స్తనాలు, పిరుదులు, కాళ్ళకు గజ్జెలతో భయానకంగా’ తలపుకు వచ్చే రూపం ‘తాటక‘. కానీ చలామణీలో వున్న చరిత్ర మాటున మరుగునపడ్డ చీకటి కోణాల్ని ఆవిష్కరిస్తుంది ‘తాటక‘. ఆధిపత్య బ్రాహ్మణ భావజాలాన్ని బట్టబయలు చేస్తుంది. నాస్తికత్వాన్ని తెగనరకడానికి జరిగిన కుట్రల్ని తేటతెల్లం చేస్తుంది. అటవీభూముల ఆక్రమణకోసం ఆదిమ స్థానిక తెగలను అంతమొందించే దుర్మార్గాలను కళ్ళకు కడ్తుంది.
సరళంగా, సూటిగా, సాధ్యమైనంతవరకు సత్యానికి దగ్గరగా ఉందనిపించేట్లుగా సాగిన ఈ రచన కొత్త ప్రశ్నల్ని సంధిస్తుంది. పాఠకుడి చైతన్య పరిధిని విçస్తృతం చేయడానికి ప్రయత్నిస్తుంది. అన్నింటికీ మించి అభివృద్ధి పేరిట అడవుల్లోని గిరిజనులపై దాష్టీకాలు పెచ్చరిల్లుతున్న కాలంలో ‘తాటక’ రిలవెంట్‌గా తోస్తుంది.
‘బలహీనుడిలోనూ కొన్ని బలహీనత లుంటాయి. అయినా నా సానుభూతి ఎప్పుడూ దెబ్బతిన్నవాడివైపే వుంటుంది’ అంటుంది ఇందులోని ఒక పాత్ర(అష్టకుడు). నవల చేసిన పని కూడా అదే. ‘పరాజితుల గాథలను కీర్తించడం ప్రమాదాల్లోకెల్లా ప్రమాదం’ అంటూనే రచయిత ఆ ప్రమాదాన్ని తలపెట్టాడు. అందుకు నిజంగా అభినందనీయుడు.
ఠి ఎమ్మార్ ఆనంద్
తాటక; బెజ్జారపు రవీందర్; 144 పేజీలు; రూ.80; ప్రతులకు: పాలపిట్ట బుక్స్. ఫోన్: 040–27678430
మడేలుమిట్ట కతలు
రచన: వింజమూరు మస్తాన్‌బాబు; పేజీలు: 160; వెల: 50; ప్రతులకు: రచయిత, రజక సమాఖ్య కార్యాలయం, 5/360, 2వ అంతస్థు, కె.పి.కాంప్లెక్స్, స్టోన్‌హౌస్‌పేట, నెల్లూరు–524002. ఫోన్: 9491920429
‘జ్ఞాపకాలుగా కనిపించే ఈ కతలు స్వీయాత్మకంగా ఉంటూనే, సహజ పరిణామాలకు అద్దం పడుతున్నాయి. చాకలివృత్తి జీవుల జీవనపోరాటం ఈ కథల వస్తువు. కథలోని అనుభవాలు ఆశు పద్ధతిని జీర్ణం చేసుక్ను లిఖిత పద్ధతిలో రాయబడ్డాయి.’ ‘జానపదవాణి, పౌరాణిక వాసన, సాంఘిక వాస్తవికత పెనవేసుకుని ఆసక్తికరంగా చదివిస్తాయి.’ ‘కావలి పరిసర ప్రాంత భాషా యాసా పలుకుబళ్ల’తో ‘ఒక కొత్త కుల వాతావరణాన్ని పరిచయం చేస్తాయి.’