కిటికీలోంచి వాన
పుస్తక పరిచయం
‘ఆకాశం నుండి భూమికి ఏదో వర్తమానం తీసుకువస్తున్నట్లు రాలే చినుకు... బంగారు తీగలా మెరిసే మెరుపు ’ ఇలా వానని సౌందర్య దృష్టితో చూసిన పదిహేనేళ్ల జవ్వని, జీవితపు ఆటుపోట్లలో చిక్కుకున్న పాతికేళ్ల తర్వాత, ‘పెరుగుతున్న వానలా రోజురోజుకీ అప్పు పెరిగిపోతుంది... వాన పడిన తర్వాత ఏర్పడిన బురదలా ఉంది జీవితం’ అంటుంది. వాన అదే. చూసే దృష్టిలోనే మార్పు. ఇలాంటి కథను సృష్టించిన రచయిత ఆకెళ్ల శివప్రసాద్.
‘కిటికీలోంచి వాన’ 27 కథల సంకలనం. జీవితాన్ని చూసి భయపడి పారిపోదామనుకునే వారూ, జీవితాన్ని ఎదుర్కొని పోరాడే ఆడపిల్లలూ, కళా సాంస్కృతిక రంగాల్లోని కుహనా వ్యక్తులు, అవకాశాల్ని తమకు అనువుగా మార్చుకొనే జర్నలిస్టులు... ఇలా చాలామంది తారసపడతారు.
ఆఫీసుల్లో చిన్న చిన్న మొత్తాల్ని తీసుకుని తిరిగి ఇవ్వని వాళ్లంటే మనకు చులకన. అలాంటి ఒక వ్యక్తి ఆ అప్పుల్ని రిటైరయ్యే రోజు తిరిగి తీర్చేస్తే! ఇది ‘అంతరంతరం’ కథ. రిటైరైపోయినవాళ్లకు తమను ఇంట్లో పట్టించుకోవట్లేదన్న న్యూనత ఉంటుంది. అందులోంచి పుట్టిన కథ ‘వినిపించని రాగాలు’. పేదరికంలో ఉన్న ఆడపిల్ల ఒక టెంపరరీ ఉద్యోగంలో అడుగుపెడితే వేధించే మగాళ్లకు కొరతలేదీ దేశంలో. అలాంటి మృగాళ్ల ‘జనారణ్యం’ కథ గుండెల్ని తాకుతుంది. చదువుకోవాలన్న తపనతో ఓ కుర్రాడు (సుకృతం), తన తాతల నాటి గుడిని కాపాడుకోవాలన్న తపనతో మరో కుర్రాడు (మహా సంకల్పం) మనల్ని చాలాకాలం వెంటాడుతారు. ఒక సంస్కృతిలోని సంపదను కాపాడుకోవాలనే సత్యాన్ని ఆర్ద్రంగా ఆవిష్కరించిన కథ ‘సరస్వతి లిపి’.
జీవితాన్ని అల్లుకుని పెనవేసుకుంటూ సాగటం శివప్రసాద్ కథల లక్షణం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల దుఃఖాల్ని, సంతోషాల్ని పాఠకుల ముందు నక్షత్రాల్లా పరుస్తాయి.
- సి.ఎస్.రాంబాబు 9490401005