జోర్జ్ లూయీ బోర్హెస్... మేజిక్ రియలిజంకు ఆద్యుడు | Magic realism found by Jorge luis Borges | Sakshi
Sakshi News home page

జోర్జ్ లూయీ బోర్హెస్... మేజిక్ రియలిజంకు ఆద్యుడు

Published Sat, Jul 5 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

జోర్జ్ లూయీ బోర్హెస్... మేజిక్ రియలిజంకు ఆద్యుడు

జోర్జ్ లూయీ బోర్హెస్... మేజిక్ రియలిజంకు ఆద్యుడు

తెలుసుకోవాల్సిన రచయిత: జోర్జ్ లూయీ బోర్హెస్ (1899-1986) అర్జెంటీనాకు చెందిన కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు. మేజిక్ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకు ఆద్యుడు. మేజిక్ రియలిజం ప్రక్రియ పట్ల గొప్ప క్రేజ్ కనపరచే తెలుగు సాహిత్యంలో కూడా బోర్హెస్ పేరు విన్నవారూ ఆయన రచనల్ని సాకల్యంగా చదివినవారు ఏమంత ఎక్కువ లేరు. మేజికల్ రియలిజం అంటే బోర్హెస్ చూపించిన ధోరణికి, తక్కిన రచయితలు చూపించిన ధోరణికి చాలా తేడా ఉంది. బోర్హెస్ సత్యమేమిటో తెలుసుకోవాలని తపించి దాన్ని అసత్యం ద్వారా నిరూపించాలని ప్రయత్నించిన కాఫ్కా తరహా కళాకారుడు.
 బోర్హెస్ రాసిన కథలు చదవడం గొప్ప అనుభవం. కథ అనే ప్రక్రియకి కాలక్రమంలో ఏర్పడ్డ పరిమితులన్నిటినీ అతడు తుంచేశాడు. వ్యాసాన్ని, పుస్తక సమీక్షని, లేని పుస్తకానికి లేని విమర్శకుడి పేరు మీద రాసిన సమీక్షని, రేఖామాత్రపు జీవిత చిత్రణని... ఇలా ఎన్నో రకాల ప్రక్రియల్ని ఆయన మనతో కథలుగా ఒప్పిస్తాడు. ఫిక్షన్‌కీ నాన్ ఫిక్షన్‌కీ మధ్య హద్దులు చెరిపేసిన బోర్హెస్ కథలు చదవడం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అతడి నాన్ ఫిక్షన్ చదవడం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. యదార్థానికి రెండింటి మూలమూ ఒకటే. అది బోర్హెస్ పఠనానుభవం. బహుశా ప్రపంచ రచయితల్లోనే అంత విస్తృత పఠనానుభవం కలిగిన రచయిత మరొకరుండరేమో.
 
 బ్యునోస్ ఎయిర్స్‌లో అర్జెంటీనా జాతీయ గ్రంథాలయానికి డెరైక్టరుగా పని చేసిన బోర్హెస్ తన గ్రంథాలయంలో ఉన్న ప్రతి ఒక్క పుస్తకం చదివేశాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా విజ్ఞాన సర్వస్వాలు. మనం మామూలుగా విజ్ఞాన సర్వస్వాల్ని రిఫరెన్సు కోసం వాడుకుంటాం. కాని ఆయన విజ్ఞాన సర్వస్వాల్లో అ నుంచి క్ష దాకా ప్రతి ఒక్క ఎంట్రీ కూడా చదివేశాడు. చరిత్ర, తత్త్వశాస్త్రం, గణితం, భూగోళశాస్త్రం, భౌతిక రసాయనిక శాస్త్రం, సాహిత్యం... ఇలా ప్రతి ఒక్క రంగానికి సంబంధించి ఎంత చదవగలడో అంతా చదివేడు. ఎంత చదివేడంటే ఆ అక్షరాగ్నికి అతడి కళ్లు ఆహూతైపోయాయి. యాభై యేళ్లు వచ్చేటప్పటికి అంధుడైపోయాడు. జీవితంలో చివరి ముప్పై నలభయ్యేళ్లు అంధత్వాన్ని మోస్తూనే రచనలు చేశాడు. ప్రసంగాలు చేశాడు. ప్రపంచమంతా పర్యటించేడు.
 
 బోర్హెస్ రాసిన వ్యాసాలు చదువుతుంటే సంభ్రమం కలుగుతుంది. ఈర్ష్య జనిస్తుంది. కొంతసేపటికి అది ఆరాధనగా మారుతుంది. మనలో నిద్రాణంగా ఉన్న జిజ్ఞాసని మేల్కొల్పి మనం చూస్తుండగానే తృష్ణగా మార్చేస్తుంది. తన పాఠకుల్లో తాను ఇటువంటి జ్ఞానతృష్ణ మేల్కొల్పుతున్నానని బోర్హెస్‌కి తెలుసు. అందుకని అతడు తన చివరి రోజుల్లో ప్రపంచసాహిత్యంలో తాను చదివిన సర్వోత్కృష్ణ రచనల్ని అర్జెంటీనా పాఠకులకి పరిచయం చేయడానికి ప్రయత్నించాడు. అతడు పరిచయం చేసిన రచనల పేర్లు చూస్తేనే మనకు అతడి ప్రపంచం ఎంత విస్తృతమో తెలుస్తుంది. జాక్ లండన్, హెన్రీ జేమ్స్, వోల్టేర్, హథార్న్, చెస్టర్ టన్, రాబర్ట్ లూయీ స్టెవెన్సన్, డాస్టవస్కీ, పో, కాఫ్కా, మెల్విల్లీ, గిబ్బన్, మార్కోపోలో, ఫ్లాబే, భగవద్గీత, కిర్క్ గార్డ్, ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెడ్...
 
 బోర్హెస్ ఒకచోట ఇలా రాస్తాడు: అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటారు. కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటాను. నేను మంచి రచయితను అవునో కాదు నాకు తెలియదుగాని నేను చాలా మంచి పాఠకుణ్ణి. సున్నిత పాఠకుణ్ణి. చదివిన పుస్తకాల పట్ల సదా కృతజ్ఞుణ్ణి’
 
 బోర్హెస్‌ని చదివితే ఏమవుతుంది? ఈ ప్రశ్నకి రెండంచెల్లో జవాబివ్వచ్చు. బోర్హెస్ రాసిన ఫిక్షన్ చదివితే ఈ ప్రపంచం మనం చూస్తున్నంతమేరకు మాత్రమే పరిమితం కాదేమో అని అనుమానమొస్తుంది. అతడు రాసిన నాన్-ఫిక్షన్ చదివితే ఈ ప్రపంచం మనం చూస్తున్నంత మేరకే పరిమితం కాదని నిశ్చయంగా తేలిపోతుంది.
 - వాడ్రేవు చినవీరభద్రుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement