
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి, నెట్‌వర్క్: కథ కన్నీరు పెడుతోంది. కథా నిలయం బోసిపోయింది. ఒక ‘యజ్ఞం’ పరిసమాప్తమైంది. కథలకు కోవెల కట్టి కథా నిలయాన్ని నిర్మించిన కథా నాయకుడు ఇక లేరు. ప్రముఖ కథా రచయిత, కథకుడు, విమర్శకుడు కాళీపట్నం రామారావు (97) శుక్రవారం ఉదయం 8:20 గంటలకు శ్రీకాకుళంలోని తన నివాసంలో కన్నుమూశారు. వయసు వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా ప్రస్తుతం పెద్దకుమారుడు కాళీపట్నం సుబ్బారావు, చిన్న కుమారుడు కెవీఎస్ ప్రసాద్, కుమార్తె లక్ష్మి మాత్రమే ఉన్నారు.
శ్రీకాకుళం డే అండ్ నైట్ బ్రిడ్జ్ సమీపంలోని శ్మశానవాటికలో ‘కారా మాస్టారు’ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కథానిలయం అధ్యక్షుడు బీవీఏ నారాయణ నాయుడు, కార్యదర్శి దాసరి రామచంద్రరావు, పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, తెలుగు పండితులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు మాస్టారి మృతి పట్ల సంతాపం తెలిపారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో జన్మించిన కారా మాస్టారు యజ్ఞం, తొమ్మిది కథలకు 1996లో ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. కారా మాస్టారు అచ్చయిన కథల కోసం కథా నిలయం పేరిట శ్రీకాకుళంలో ఆలయాన్ని నిర్మించారు. తెలుగు కథలకు గుడి కట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి మనసులను తట్టారు. ‘యజ్ఞం’ కథతో శ్రీకాకుళం మాండలీకానికి మకుటం పెట్టి సాహితీ లోకంలో గుర్తింపు, గౌరవాన్ని సమకూర్చారు.
సరళమైన భాషలో సుప్రసిద్ధ రచనలు..
కాళీపట్నం రామారావు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో సరళమైన భాషలో రచనలు చేస్తూ సామాన్య పాఠకులను సైతం ఆకట్టుకున్నారు. ‘నేనెందుకు వ్రాసాను వ్యాసం’, ‘తీర్పు’, ‘ఇల్లు’, ‘యజ్ఞం’, ‘మహదాశీర్వచనం’ కథలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. 1964లో యువ పత్రికలో తీర్పు కథతో మాస్టారు కథా రచన తిరిగి ప్రారంభమైంది. 1966లో యజ్ఞం కథతో తెలుగు కథల సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. 1967–70 కాలంలో వీరుడు–మహావీరుడు మొదలు భయం వరకు ఏడు కథలు ప్రచురించారు. విరసం సభ్యుడిగా ఉంటున్న సమయంలో 1970–72 మధ్య శాంతి, చావు, జీవధార, కుట్ర మొదలైన కథలతో వ్యవస్థలోని లోపాలను చక్కగా చూపించారు.
శ్రీశ్రీతో ‘యజ్ఞం’ ఆవిష్కరణ
1971 జనవరి 31న విశాఖలో యజ్ఞం కథా సంపుటిని మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించారు. కారా మాస్టారు కొంతమంది మిత్రులతో కలిసి కథా వేదికను ఏర్పాటు చేశారు. 1996 యజ్ఞంతో తొమ్మిది కథలు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.
సామాజిక స్పృహ...
కారా మాస్టారు తెలుగు కథకు దిక్సూచి. వందేళ్ల కథా సాహిత్యంలో పేరెన్నికగన్న పది మంది రచయితల్లో నిలిచేలా, సాహిత్యమే ఊపిరిగా జీవించారు. 97 ఏళ్ల పరిపూర్ణ జీవనయానంలో ఆయన అధిరోహించిన శిఖరాలెన్నో. సాహిత్యం సమాజ పురోగమనానికి దోహదపడాలని రచనలు సాగించిన నిబద్ధత కలిగిన మహనీయుడు. తన రచనల వల్ల ఎంతో మంది జీవితాలు ప్రభావితం కావాలనే లక్ష్యంతో రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. అభూత కల్పనలు, అల్లిబిల్లి కథలు కాకుండా తనను ప్రభావితం చేసిన అంశాలపై కలం పట్టారు. తొలిదశలో కుటుంబాలు, వ్యక్తిగత బాంధవ్యాల నేపథ్యంలో కథలు రాశారు. స్వాతంత్య్రం అనంతరం దేశ సంపాదన ధనవంతులు ఎలా కొల్లగొట్టారో కుండబద్ధలు కొట్టారు. 1963 తరువాత వచ్చిన వీరుడు–వరుడు, ఆదివారం, హింస, నో రూం, స్నేహం, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవధార, న్యాయం, సంజాయిషీ, కుట్ర లాంటివి ఒక ఎత్తు కాగా గ్రామీణ భూస్వామి వ్యవస్ధ, దళితులు, అణగారిన వర్గాల కష్టాలు–కన్నీళ్లకు కారణాలను మార్క్సిస్టు కోణంలో ఆవిష్కరించారు.
800తో మొదలై లక్షకు పైగా కథలతో..
కథా నిలయం.. తెలుగు కథల సేకరణకు అంకితమైన గ్రంథాలయం. తెలుగు సాహిత్యంలో ప్రచురితమైన కథలను భావితరాలకు అందించాలన్న ఆశయంతో ఏర్పాటైంది. ఎనిమిది వందల పుస్తకాలతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగిన కథానిలయం ప్రస్తుతం లక్షకుపైగా కథలకు వేదికగా నిలిచింది. కథానిలయం డాట్‌కామ్ పేరిట వెబ్‌సైట్ కూడా రూపొందించారు. ప్రస్తుతం 45 ఇతర భాషల్లో ముద్రితమైన తెలుగు అనువాదాలు, 67 ఆత్మకథలు, 95 జీవిత చరిత్రలు, 97 పరిశోధనా పత్రాలు, 100 సంచిత వ్యాసాలు, 105 సంకలన వ్యాసాలు, 414 సంకలనాలు, 450 రకాల శీర్షికలతో పత్రికలు, 2,213 సంపుటాలు, 11,576 పుస్తకాలు, 20,500 పత్రికల సంచికలు కథా నిలయంలో ఉన్నాయి. 15 వేల వరకు కథా రచయితల వివరాలు అందుబాటులో ఉన్నాయి. కారా మాస్టారు తనకు వచ్చిన పురస్కారాలన్నీ వెచ్చించి శ్రీకాకుళంలో 1997 ఫిబ్రవరి 22న ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. తర్వాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చారు.
అవార్డులు, రివార్డులు తీసుకోవడం విరసం నిబంధనలకు వ్యతిరేకం కావడంతో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోలేదు. కథా నిలయంలో 1944 నుంచి భారతి పత్రిక ప్రతులున్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కథలు ఇక్కడి సేకరణలలో అన్నిటికంటే పాతది. తానున్నా లేకపోయినా కథా నిలయాన్ని మూడు దశాబ్దాలు నిరవధికంగా నిర్వహిస్తామని ముగ్గురు వాగ్దానం చేశారని కారా మాస్టారు తరచూ చెప్పేవారు. కొన్నాళ్లుగా కథా రచనకు దూరంగా ఉంటూ కథా నిలయం కోసం ఎక్కువగా శ్రమించారు. తాను జన్మించిన మురపాక అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఏడాదిలో ఒక్కసారైనా వచ్చి వెళ్లేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.
ఉప రాష్ట్రపతి, గవర్నర్ సంతాపం..
కారా మాష్టారు మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, గవర్నర్ హరిచందన్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ సమితి కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ఏపీ రచయితల సంఘం అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, రచయితలు పరచూరి అజయ్, కాటూరి రవీంద్ర, బాబ్జీ, సుధారాణి సంతాపం తెలిపారు.
సీఎం జగన్ సంతాపం
కారా మాస్టారు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. తనదైన శైలిలో కథలు రచించి తెలుగు సాహితీ లోకానికి విశేష సేవలు అందించారన్నారు. కారా మాస్టారు కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సానుభూతి తెలిపారు.
రచనలలో సామాజిక బాధ్యత...
మాస్టారు బయటకు సౌమ్యుడిగా కనిపించినా ఆయన సామాజిక బాధ్యత తెలిసిన రచయిత. ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలకు కారణం శ్రమ జీవులే, వారి చేతుల్లోనే అధికారం ఉండాలని అంటారు. కన్నీళ్లు, రక్తపాతం లేనిదే అది సాధ్యం కాదనేది ఆయన భావన. రచయితకు ఆవేశం ఉండాలి.. ఆవేశం కదలిక ఇస్తుంది.. కదలిక సృజనకు వారధినిస్తుందనేది కారా అభిప్రాయం.
లోక్ నాయక్ పురస్కారం
► 1943 సెప్టెంబర్ 1న తొలికథ చిత్రగుప్తలో రాశారు
► 2008లో లోక్‌నాయక్ పురస్కారం
► 1996లో కేంద్ర సాహిత్య అవార్డు
► 1997లో కథా నిలయం నిర్మాణం.. 1998లో ప్రారంభం
ఎందరికో మార్గదర్శకులు..
1979లో ‘పువ్వుల కొరడా’ కథ రచించిన నాటి నుంచి మాస్టారితో పరిచయం ఉంది. ఏ కథ రాసినా కారా మాస్టారు చూడకుంటే నాకు నిద్రపట్టేది కాదు. నాతోపాటు ఎందరికో మార్గ నిర్దేశకులు. కథానిలయంలో నేనూ భాగస్వామిని కావడం గర్వకారణం. 2020 నవంబర్ 9న 97వ జన్మదినోత్సవం రోజు ‘బహుళ’ అనే నవలను మాస్టారుతో ఆవిష్కరించాం. ఆయన మరణం చాలా బాధాకరం.
– అట్టాడ అప్పలనాయుడు, కథా నవలా రచయిత