kalipatnam ramarao
-
సమాజ రుణం తీర్చుకున్న మాస్టారు
కా.రా. గారు ఉదయం 8.20కి తుది శ్వాస విడిచారు. సహజ మరణం. టీ తాగి అలా కూతురు చేతులలో.. అని కాళీపట్నపు ఇందిర నుండి ఈ ఉదయం తొమ్మిదిన్నరకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇందిర అంటే కాళీపట్నపు రామారావు మాస్టారు చిన్న కోడలు. ఇలాంటి వార్త ఎప్పుడు వినవలసి వస్తుందోనని గత కొన్ని మాసాలుగా మనసు మూలల్లో భయం కలుగుతూ వచ్చింది. మాస్టారు 97 సంవత్సరాల వయసులో మరణించారు. నా వ్యక్తిగత జీవితంలో మా బాపు మరణించినప్పుడు నాకు ఎటు వంటి దుఃఖం కలిగిందో, ఓ రచయితగా ఇప్పుడు మాస్టారు మరణించిన విషయం విన్న తరువాత కూడా అటువంటి దుఃఖమే కలిగింది. నాకూ, అల్లం రాజయ్యకీ కారా మాస్టారుతో సుమారు 40 ఏళ్ల పరిచయం. అది నేటితో ముగిసింది. కాళీపట్నపు రామారావు 1924 నవంబర్ 9న జన్మించారు. ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామంలో– అది వారి అమ్మగారి గ్రామం. అక్కడికి దగ్గరలో ఉన్న మురపాక వారి స్వగ్రామం. తన పద్నాలుగవ యేటనే ‘ముద్దు’ అనే కథ రాశారు గానీ అది అలభ్యం. ఓ అయిదారు ప్రభుత్వ ప్రైవేటు రంగాల ఉద్యోగాలు చేసి నచ్చక వదిలేశారు. తన సాహిత్య వ్యాసంగానికి ఉపాధ్యాయ వృత్తి సరిపోతుందని సెకండరీ గ్రేడ్ టీచర్ శిక్షణ తీసుకుని 1948లో విశాఖపట్నం సెయింట్ ఆంథోనీ స్కూల్లో చేరి, 1979లో రిటైర్ అయ్యే వరకు అక్కడే పనిచేశారు. 1943లో రాసిన మొదటి కథ ‘ప్లాటుఫారం’ నుండి 1955 వరకు రాసిన ‘అశిక్ష–అవిద్య’ వరకు ఒక తరహా కథలు. వాటిల్లో ప్రధానంగా సంస్కరణ, సహృదయత, ఉమ్మడి కుటుంబ సంబంధాల చిత్రణ ఉంది. తరువాత రోజుల్లో సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి పరిచయం వల్ల ఆలోచనల్లో మార్పు వచ్చింది. సంస్కార వాద దృష్టికి సామాజిక దృష్టి తోడైంది. ఆయన కథల్లో అతి ముఖ్యమైనవి రాయడం జరిగింది. 1964లో ‘తీర్పు’ కథతో ప్రారంభమై ఈ మలిదశ కథలు 1972లో రాసిన ‘కుట్ర’తో ఆగాయి. ఈ సిరీస్‌లో 1966లో రాసిన ‘యజ్ఞం’ పెద్ద సంచలనం సృష్టించింది. అప్పటి వరకు తెలుగులో అంతటి సంచలనం సృష్టించిన మరో కథ లేదు. దాని మీద సాగిన చర్చలను ‘కథాయజ్ఞం’ పేరుతో ఓ పుస్తకంగా ప్రచురించారు. ఆ కథ ఆధారంగా గుత్తా రామినీడు దర్శకత్వంలో సినిమా వచ్చింది. దేశ స్వాతంత్య్రం తరువాత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో పంచవర్ష ప్రణాళికల అభివృద్ధి ఫలితాలు ఒక గ్రామంలో ఎలా ప్రతిఫలించాయో, వాటి పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో సునిశిత పరిశీలనతో రాసిన కథ యజ్ఞం. తదనంతర కాలంలో దేశ రాజకీయ రంగంలో జరిగిన పరిణామాలు మాస్టారు అంచనా నిజమే అని నిర్ధారించాయి. మరో ప్రసిద్ధ కథ కుట్రలో దేశ స్వాతంత్య్రం తరువాత పారిశ్రామిక రంగంలో జరిగిన విప రిణామాలు, వాటిని ఎదిరించిన వారి వాదాలు కలిసి కథగా రూపుదాల్చాయి. ఏలిన వారిదే కుట్ర అని, ఆ కుట్రను ఎదిరిస్తే కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించే కథ. ఇంకా నో రూమ్, వీరుడు మహావీరుడు, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవధార, న్యాయం వంటి సుమారు 54 కథలు రాశారు. ఇంకా రాగ మయి అనే చిన్న నవల కూడా ఉంది. ఉద్యోగం నుండి రిటైర్ అయిన తరువాత ఆయన శిష్యులు కొందరు శ్రీకాకుళంలో సన్మానం చేశారు. ఆ సభలో నేను, అల్లం రాజయ్య కూడా ఉన్నాం. తన జీవితంలో ఒప్పుకున్న మొదటి సన్మానం ఇదేననీ, రిటైర్ అయిన తరువాత కూడా ఏదైనా సమాజానికి పనికి వచ్చేది చెయ్యాలని ఉందనీ అన్నారు. ‘ప్రతీ మనిషికి మూడు రుణాలు ఉంటాయని అంటారు. తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం అని. నేను మరో రుణం కూడా ఉంటుందని అనుకుంటున్నాను. అది సామాజిక రుణం! రిటైర్ అయినా, పెన్షన్ తీసుకుంటున్నాను కనుక, సమాజానికి రుణపడి ఉన్నట్టు లెక్క. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నాకు చేతనైన సామాజిక సేవ చేస్తాను’ అన్నారు. తనకు అవార్డుల రూపంలో అభిమానులు ఇచ్చిన లక్ష రూపాయలను ఏం చెయ్యాలి అనే ప్రశ్న ఉదయించింది. అది క్రమంగా కథా నిలయం ఏర్పాటుకు దారితీసింది. దాదాపు నలభై ఏళ్ల పాటు విశాఖపట్నంలో స్కూల్ టీచర్ ఉద్యోగం చేసినా, ఇల్లు గురించి ఆలోచన చెయ్యలేదు. కానీ ఎవరో ఇచ్చిన సలహా నచ్చి, తనకు అవార్డు రూపేణా వచ్చిన డబ్బుతో తెలుగు కథకు ఒక ప్రత్యేక లైబ్రరీ పెట్టడం జరిగింది. ప్రపంచ సాహిత్యంలో కథకు ఒక నిలయం ఉండటం ఇదే మొదటిసారి. 1997 పిబ్రవరి 22న శ్రీకాకుళంలో కథానిలయం ప్రారంభమైంది. ఆధునిక తెలుగు కథలను మొత్తం సేకరించి పరిశోధకులకు అందుబాటులో పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికి దాదాపుగా తొంభై శాతం కథలను సేకరించడం జరిగింది. మాస్టారు ఆధ్వర్యంలో కథా నిలయం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల సొంత భవనం–వందలాది తెలుగు కథానవలా రచయితల ఫొటోలు, చేతిరాతలు, కంఠస్వరాలు, వివరాలు సేకరించి భద్రపరిచారు. రామారావు మాస్టారుకు సొంత ఇల్లు లేదు. కానీ, తెలుగు కథకు మాత్రం ఓ ఇల్లును ఏర్పాటు చేశారు. మాస్టారు తన ఆలోచనలకు, మాటలకు, చేతలకు తేడా లేకుండా బతికారు. వారితో నలౖభై సంవత్సరాల పరిచయం ఉండటం నాకు కలిగిన అదృష్టం. ఆయన జీవితంలో తన కళ్ల ముందే ముగ్గురు కొడుకులు మరణించారు. భార్య సీతమ్మ కూడా మరణించారు. మాస్టారు తొంభై ఏడు సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపారు. నాకు ఒక రోల్ మాడల్ మాస్టారు జీవితం! ‘మాస్టారు మాట’ అనే పేరుతో నా ఫేస్బుక్ వాల్ మీద రెండేళ్లపాటు సీరియల్ రాశాను. మాస్టారు నుండి నేను గ్రహించిన విషయాలను వారితో నాకు ఉన్న పరిచయాన్ని అందులో రాశాను. బతికి ఉండగానే పుస్తకాన్ని అచ్చు వేయించి వారి చేతుల్లో పెట్టాలని ఎంత వేగిరపడినా సాధ్యం కాలేదు. అది ఇక ఎన్నటికీ తీర్చుకోలేని లోటు. మాస్టారు కుటుంబ సభ్యులు కూడా నా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపారు. ఈ కష్టకాలంలో వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపు కుంటున్నాను. - తుమ్మేటి రఘోత్తమరెడ్డి వ్యాసకర్త ప్రసిద్ధ కథారచయిత 90001 84107 -
Kalipatnam Ramarao: దిగంతాలకు ‘కథా’నాయకుడు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి, నెట్వర్క్: కథ కన్నీరు పెడుతోంది. కథా నిలయం బోసిపోయింది. ఒక ‘యజ్ఞం’ పరిసమాప్తమైంది. కథలకు కోవెల కట్టి కథా నిలయాన్ని నిర్మించిన కథా నాయకుడు ఇక లేరు. ప్రముఖ కథా రచయిత, కథకుడు, విమర్శకుడు కాళీపట్నం రామారావు (97) శుక్రవారం ఉదయం 8:20 గంటలకు శ్రీకాకుళంలోని తన నివాసంలో కన్నుమూశారు. వయసు వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా ప్రస్తుతం పెద్దకుమారుడు కాళీపట్నం సుబ్బారావు, చిన్న కుమారుడు కెవీఎస్ ప్రసాద్, కుమార్తె లక్ష్మి మాత్రమే ఉన్నారు. శ్రీకాకుళం డే అండ్ నైట్ బ్రిడ్జ్ సమీపంలోని శ్మశానవాటికలో ‘కారా మాస్టారు’ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కథానిలయం అధ్యక్షుడు బీవీఏ నారాయణ నాయుడు, కార్యదర్శి దాసరి రామచంద్రరావు, పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, తెలుగు పండితులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు మాస్టారి మృతి పట్ల సంతాపం తెలిపారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో జన్మించిన కారా మాస్టారు యజ్ఞం, తొమ్మిది కథలకు 1996లో ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. కారా మాస్టారు అచ్చయిన కథల కోసం కథా నిలయం పేరిట శ్రీకాకుళంలో ఆలయాన్ని నిర్మించారు. తెలుగు కథలకు గుడి కట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి మనసులను తట్టారు. ‘యజ్ఞం’ కథతో శ్రీకాకుళం మాండలీకానికి మకుటం పెట్టి సాహితీ లోకంలో గుర్తింపు, గౌరవాన్ని సమకూర్చారు. సరళమైన భాషలో సుప్రసిద్ధ రచనలు.. కాళీపట్నం రామారావు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో సరళమైన భాషలో రచనలు చేస్తూ సామాన్య పాఠకులను సైతం ఆకట్టుకున్నారు. ‘నేనెందుకు వ్రాసాను వ్యాసం’, ‘తీర్పు’, ‘ఇల్లు’, ‘యజ్ఞం’, ‘మహదాశీర్వచనం’ కథలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. 1964లో యువ పత్రికలో తీర్పు కథతో మాస్టారు కథా రచన తిరిగి ప్రారంభమైంది. 1966లో యజ్ఞం కథతో తెలుగు కథల సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. 1967–70 కాలంలో వీరుడు–మహావీరుడు మొదలు భయం వరకు ఏడు కథలు ప్రచురించారు. విరసం సభ్యుడిగా ఉంటున్న సమయంలో 1970–72 మధ్య శాంతి, చావు, జీవధార, కుట్ర మొదలైన కథలతో వ్యవస్థలోని లోపాలను చక్కగా చూపించారు. శ్రీశ్రీతో ‘యజ్ఞం’ ఆవిష్కరణ 1971 జనవరి 31న విశాఖలో యజ్ఞం కథా సంపుటిని మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించారు. కారా మాస్టారు కొంతమంది మిత్రులతో కలిసి కథా వేదికను ఏర్పాటు చేశారు. 1996 యజ్ఞంతో తొమ్మిది కథలు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. సామాజిక స్పృహ... కారా మాస్టారు తెలుగు కథకు దిక్సూచి. వందేళ్ల కథా సాహిత్యంలో పేరెన్నికగన్న పది మంది రచయితల్లో నిలిచేలా, సాహిత్యమే ఊపిరిగా జీవించారు. 97 ఏళ్ల పరిపూర్ణ జీవనయానంలో ఆయన అధిరోహించిన శిఖరాలెన్నో. సాహిత్యం సమాజ పురోగమనానికి దోహదపడాలని రచనలు సాగించిన నిబద్ధత కలిగిన మహనీయుడు. తన రచనల వల్ల ఎంతో మంది జీవితాలు ప్రభావితం కావాలనే లక్ష్యంతో రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. అభూత కల్పనలు, అల్లిబిల్లి కథలు కాకుండా తనను ప్రభావితం చేసిన అంశాలపై కలం పట్టారు. తొలిదశలో కుటుంబాలు, వ్యక్తిగత బాంధవ్యాల నేపథ్యంలో కథలు రాశారు. స్వాతంత్య్రం అనంతరం దేశ సంపాదన ధనవంతులు ఎలా కొల్లగొట్టారో కుండబద్ధలు కొట్టారు. 1963 తరువాత వచ్చిన వీరుడు–వరుడు, ఆదివారం, హింస, నో రూం, స్నేహం, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవధార, న్యాయం, సంజాయిషీ, కుట్ర లాంటివి ఒక ఎత్తు కాగా గ్రామీణ భూస్వామి వ్యవస్ధ, దళితులు, అణగారిన వర్గాల కష్టాలు–కన్నీళ్లకు కారణాలను మార్క్సిస్టు కోణంలో ఆవిష్కరించారు. 800తో మొదలై లక్షకు పైగా కథలతో.. కథా నిలయం.. తెలుగు కథల సేకరణకు అంకితమైన గ్రంథాలయం. తెలుగు సాహిత్యంలో ప్రచురితమైన కథలను భావితరాలకు అందించాలన్న ఆశయంతో ఏర్పాటైంది. ఎనిమిది వందల పుస్తకాలతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగిన కథానిలయం ప్రస్తుతం లక్షకుపైగా కథలకు వేదికగా నిలిచింది. కథానిలయం డాట్‌కామ్ పేరిట వెబ్సైట్ కూడా రూపొందించారు. ప్రస్తుతం 45 ఇతర భాషల్లో ముద్రితమైన తెలుగు అనువాదాలు, 67 ఆత్మకథలు, 95 జీవిత చరిత్రలు, 97 పరిశోధనా పత్రాలు, 100 సంచిత వ్యాసాలు, 105 సంకలన వ్యాసాలు, 414 సంకలనాలు, 450 రకాల శీర్షికలతో పత్రికలు, 2,213 సంపుటాలు, 11,576 పుస్తకాలు, 20,500 పత్రికల సంచికలు కథా నిలయంలో ఉన్నాయి. 15 వేల వరకు కథా రచయితల వివరాలు అందుబాటులో ఉన్నాయి. కారా మాస్టారు తనకు వచ్చిన పురస్కారాలన్నీ వెచ్చించి శ్రీకాకుళంలో 1997 ఫిబ్రవరి 22న ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. తర్వాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చారు. అవార్డులు, రివార్డులు తీసుకోవడం విరసం నిబంధనలకు వ్యతిరేకం కావడంతో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోలేదు. కథా నిలయంలో 1944 నుంచి భారతి పత్రిక ప్రతులున్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కథలు ఇక్కడి సేకరణలలో అన్నిటికంటే పాతది. తానున్నా లేకపోయినా కథా నిలయాన్ని మూడు దశాబ్దాలు నిరవధికంగా నిర్వహిస్తామని ముగ్గురు వాగ్దానం చేశారని కారా మాస్టారు తరచూ చెప్పేవారు. కొన్నాళ్లుగా కథా రచనకు దూరంగా ఉంటూ కథా నిలయం కోసం ఎక్కువగా శ్రమించారు. తాను జన్మించిన మురపాక అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఏడాదిలో ఒక్కసారైనా వచ్చి వెళ్లేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఉప రాష్ట్రపతి, గవర్నర్ సంతాపం.. కారా మాష్టారు మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, గవర్నర్ హరిచందన్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ సమితి కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ఏపీ రచయితల సంఘం అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, రచయితలు పరచూరి అజయ్, కాటూరి రవీంద్ర, బాబ్జీ, సుధారాణి సంతాపం తెలిపారు. సీఎం జగన్ సంతాపం కారా మాస్టారు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. తనదైన శైలిలో కథలు రచించి తెలుగు సాహితీ లోకానికి విశేష సేవలు అందించారన్నారు. కారా మాస్టారు కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సానుభూతి తెలిపారు. రచనలలో సామాజిక బాధ్యత... మాస్టారు బయటకు సౌమ్యుడిగా కనిపించినా ఆయన సామాజిక బాధ్యత తెలిసిన రచయిత. ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలకు కారణం శ్రమ జీవులే, వారి చేతుల్లోనే అధికారం ఉండాలని అంటారు. కన్నీళ్లు, రక్తపాతం లేనిదే అది సాధ్యం కాదనేది ఆయన భావన. రచయితకు ఆవేశం ఉండాలి.. ఆవేశం కదలిక ఇస్తుంది.. కదలిక సృజనకు వారధినిస్తుందనేది కారా అభిప్రాయం. లోక్ నాయక్ పురస్కారం ► 1943 సెప్టెంబర్ 1న తొలికథ చిత్రగుప్తలో రాశారు ► 2008లో లోక్‌నాయక్ పురస్కారం ► 1996లో కేంద్ర సాహిత్య అవార్డు ► 1997లో కథా నిలయం నిర్మాణం.. 1998లో ప్రారంభం ఎందరికో మార్గదర్శకులు.. 1979లో ‘పువ్వుల కొరడా’ కథ రచించిన నాటి నుంచి మాస్టారితో పరిచయం ఉంది. ఏ కథ రాసినా కారా మాస్టారు చూడకుంటే నాకు నిద్రపట్టేది కాదు. నాతోపాటు ఎందరికో మార్గ నిర్దేశకులు. కథానిలయంలో నేనూ భాగస్వామిని కావడం గర్వకారణం. 2020 నవంబర్ 9న 97వ జన్మదినోత్సవం రోజు ‘బహుళ’ అనే నవలను మాస్టారుతో ఆవిష్కరించాం. ఆయన మరణం చాలా బాధాకరం. – అట్టాడ అప్పలనాయుడు, కథా నవలా రచయిత -
కారా మాస్టారు కన్నుమూత
-
కారా మాస్టారు కన్నుమూత: సీఎం జగన్ సంతాపం
సాక్షి, శ్రీకాకుళం: కారా మాస్టారుగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కథానిలయం వ్యవస్థాపకులు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత శ్రీకాకుళంలోని స్వగృహంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సాహితీలోకం తీవ్ర దిగ్ర్భాంతిలో మునిగిపోయింది. కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ రచయితలు, కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదంటూ పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కథకు చిరునామాగా, 'కథానిలయం' పేరుతో భావి తరాల కోసం సాహితీ సంపదను కాపాడిన సాహితీ మూర్తి కారా మాస్టారు అంటూ కొనియాడారు. 1924లో శ్రీకాకుళం జిల్లా మురపాకలో జన్మించారు కాళీపట్నం రామారావు. తన దైన శైలిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఆయన వేలాది మంది శిష్యులు, అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 1964లో రాసిన యజ్ఞం కథ ఆయన విశేష ఖ్యాతిని తీసుకొచ్చింది. కథా రచయితగా తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఆయనది. ఫ్యూడల్ వ్యవస్థలోని దోపిడికి ‘యజ్ఞం’ అద్దంపడుతుంది. అందుకే ఈ రచన రష్యాలో అనువదింపబడి ప్రపంచ గుర్తింపు పొందింది. భావితరాలను దృష్టిపెట్టుకుని ఫిబ్రవరి 22, 1997లో శ్రీకాకుళంలో కథానిలయం స్థాపించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ద్వారా సమకూరిన డబ్బు, మరికొందరు సాహితీవేత్తల సహకారంతో 800 కథల పుస్తకాలతో ఆరంభమైన ఈ కథా నిలయం లక్ష పుస్తకాలతో అలరారుతుండటం విశేషం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన సరళమైన రచన శైలితో వేలాది అభిమానులను ఆకట్టుకున్నారు. కుట్ర, రాగమయి, జీవధార, కారా కథలు, రుతుపవనాలు వంటి ఆయన రచనలూ ఆదరణ పొందాయి. సీఎం జగన్ సంతాపం సాహిత్య అకాడమీ గ్రహీత, కారా మాస్టారుగా పేరొందిన కాళీపట్నం రామారావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. చిన్న కథలతో, తనదైన కథా శైలితో ఆకట్టుకున్న ఉత్తరాంధ్రలోని సాహిత్యకారుల్లో ఆయన ప్రముఖుడని సీఎం గుర్తు చేశారు. కారా మాస్టారు కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియజేశారు. -
సాహిత్యాభివృద్ధికే అవార్డులను స్వీకరిస్తున్నా
తెలుగు కథకు ఒక గుడి కట్టి ఆ విశిష్ట సాహిత్య ప్రక్రియకు తానే బడిగా, ఒడి, వరవడిగా మారి భావి తరాలకు కథామృతాన్ని పంచి ఇస్తున్న కథకుల గురువు కాళీపట్నం రామారావు. అందరిచేతా నోరారా కారా మాస్టారిగా పిలిపించుకుంటున్న కాళీపట్నం విశిష్ట కథా రచనతో లోకాన్ని ఒప్పించడంతో ఆగకుండా, వందలాది మంది వర్థమాన కథకులకు దారీతెన్నూ చూపి, వారి రచనలను తీర్చిదిద్ది ఓ ‘స్థాయి’కి తీసుకువచ్చి మహదానంద భరితుడు కావడం ఆ కథాజనకుడి విశిష్ట లక్షణం. వందేళ్ల తెలుగు కథకు భౌతికంగా చిరునామాను సమకూర్చి, కథలు కంచికి పోకుండా కథానిలయంలో ప్రేమమీర పొందుపర్చి, ఈ సదాశయ సాధనకు అహరహం శ్రమించి, అందులోనే అనంతానందాన్ని అనుభవించి, కథ పట్ల వాత్సల్యపూరిత గాథగా తన జీవితాన్నే మలచుకోవడం కాళీపట్నం వారికే చెల్లింది. కారా మాస్టారు ఎన్టీఆర్ భారతసాహిత్య పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆయనతో సాక్షి ముచ్చటించింది. ప్రశ్న: చాలా కాలంపాటు అవార్డులను తిరస్కరిస్తూ వచ్చిన మీకు ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు పురస్కారం ప్రకటించడంపై మీ అభిప్రాయం? జవాబు: మొదట్లో ఎంతో మంది అవార్డులు ప్రకటించినా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాను. కొందరు మిత్రులు సూచనల మేరకు అవార్డులను తీసుకుంటున్నాను. దానితో వచ్చే డబ్బులను సాహిత్యాభివృద్ధికి వెచ్చిస్తున్నాను. ఆ కృషి ఫలితంగానే ఈనాటి ‘కథానిలయం’. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సాహిత్యం కోసం మంచి జరుగుతుందంటే దానికోసం నేను ముందుంటాను. మొదట గా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1996లో తీసుకున్నాను. నాటి నుంచి అవార్డులను స్వీకరిస్తున్నాను. ఎన్టీఆర్ గతంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి వాసిరెడ్డి సీతాదేవి ద్వారా అవార్డు కోసం నా పేరును ఎంపిక చేయగా దానిని స్వీకరించలేదు. మళ్లీ ఇప్పుడు ఆ అవార్డును ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు ఈ పుర స్కారాన్ని ప్రకటించటం సంతోషం కలిగించింది. ఎన్టీఆర్ మహోన్నత నటుడే కాకుండా ఆంధ్ర రాజకీయాలలో పెను మార్పులు తీసుకువచ్చిన ప్రముఖుడు. ఆయన పేరు మీదుగా ఇచ్చే అవార్డుకు ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంది. డెబ్భై సంవత్సరాల పైబడిన రచనా క్రమంలో మీ సాహిత్య పరిణామం ఎలా సాగింది? నా మొదటి కథ కార్డు కథల శీర్షికలో ‘ప్లాటుఫారమో’ అనే రచనను చిత్రగుప్తలో ప్రచురించారు. ప్రచురణలో ఇదే నా మొదటి రచన 1943లో ప్రచురితమైంది. అక్కడ నుంచి ‘భాయిజాన్’, ‘వెళ్లిపోయింది’, ‘వెనుకచూపు’, ‘నిజమే అయితే’ వంటి కథలు రాశాను. 1949-55 మధ్య రచనా వ్యాసంగం, నిరంతర పఠనా చింతన ఒకానొక ‘ఎరుక’ రచనకు దారితీసింది. 1956 నుంచి 67 వరకు కథలు ఏవీ పత్రికలలో ప్రచురితం కాలేదు. 1964-67 మధ్య ‘నేనెందుకు రాసేను’ వ్యాసం, ‘తీర్పు’, ఇల్లు’, యజ్ఞం’, మహదాశీర్వచనం’ అన్న అయిదు కథలు ఉన్నాయి. 1964లో యువ పత్రికలో ‘తీర్పు’ కథ వెలువడటంతో కథా రచన తిరిగి మొదలైంది. 1967-70 మధ్యకాలంలో ‘వీరుడు-మహావీరుడు’ మొదలుకొని ‘భయం’ వరకు ఏడు కథలు రాశాను. విరసంలో సభ్యులుగా ఉంటున్న సమయంలో 1970-72 మధ్య ‘శాంతి’, ‘చావు’, ‘జీవధార’, ‘కుట్ర’ కథలు ప్రచురించాను. 1971 జనవరి 31న ‘యజ్ఞం’ కథాసంపుటిని విశాఖలో శ్రీశ్రీ ఆవిష్కరించిన ఘట్టం మరువలేనిది.1979లో ఉద్యోగ విరమణ అనంతరం విరసం సభ్యునిగా అనేక రాజకీయ సభల్లో, సాహిత్య సభలలో పాల్గొన్నాను. 1980లో మిత్రులతో కలసి ‘కథావేదిక‘ను స్థాపించాను. 1986-89 మధ్య ఒక దినపత్రికలో ‘నేటి కథ’ శీర్షిక నిర్వహించి అనేక మంది యువ రచయితలు కథా రచనలలో ఎదుర్కొనే సాధారణ ఇబ్బందులను ఆకళింపు చేసుకున్నాను. కథా నిలయం ఎలా నిర్వహిస్తున్నారు? 1996 ‘యజ్ఞంతో తొమ్మిది కథలు’ అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. జనపీఠ అవార్డు పేరున అభిమానులు, మిత్రులు సేకరించిన లక్ష రూపాయిలు స్వీకరించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి వారి ‘హంస అవార్డు 1999లో అందుకున్నాను. సాహిత్యం మీద రెమ్యూనరేషన్ ద్వారా, సన్మానాల ద్వారా లభించిన ప్రతి పైసాను ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న కాలంలో కూడా విడిగా ఉంచి సాహిత్యాభివృద్ధికి వెచ్చించా. ఆ సొమ్ముతో 1997 ఫిబ్రవరిలో కథానిలయం ఏర్పాటు చేశా. కథానిలయం పుట్టిన నాటి నుంచి కథల సేకరణే ధ్యేయంగా పనిచేశా. కథానిలయం 800 పుస్తకాలతో ప్రారంభమైంది. 20,500 పత్రికా సంచికలు, 11,576 పుస్తకాలు, 414 సంకలనాలు, 2,213 సంపుటాలు, 100 సంచిత వ్యాసాలు, 105 వ్యాస సంకలనాలు, 67 ఆత్మకథలు, 97 పరిశోధనా పత్రాలు, 95 జీవిత చరిత్రలు, 45 ఇతర భాషల్లో ముద్రితమైన తెలుగు అనువాదాలు ఉన్నాయి. 12,350 మంది కథారచయితలు ఉండగా 2,400 మంది వ్యక్తిగత సమాచారాన్ని 285 ఫొటోలను కథా నిలయానికి సమాచారంగా పొందు పరిచాము. 90వ ఏట మీరు ప్రారంభించిన యజ్ఞం ప్రచురణల లక్ష్యం ఏమిటి? కథలను సేకరించే ప్రక్రియ ఒక పక్క చేస్తూనే నా 90వ ఏట ‘కా.రా. యజ్ఞం ప్రచురణలు’ ప్రారంభించా. మొదటిగా రెండు పుస్తకాలను విశాఖలో నాకు జరిగిన ‘నవత రణ’సత్కారోత్సవంలో ఆవిష్కరించాం. 1944లో మొహ్మ ద్ ఖాసీం ఖాన్ రచించిన ‘కథానిక రచన’ పుస్తకాన్ని తిరిగి ముద్రించాం. భవిష్యత్తులో మంచి అరుదైన పుస్తకాలను నా ప్రచురణల ద్వారా అతి తక్కువ ఖరీదుతో ప్రజలకు చేరువ చేయడమనే లక్ష్యంతో పనిచేస్తున్నా. - దూరి గోపాలరావు -
కారా మాస్టారికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు 2015 - ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని మే 28న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అందజేస్తారు. అవార్డుతో పాటు రూ.లక్ష ప్రైజ్ మనీ కూడా ప్రదానం చేస్తారు. కారా మాస్టారుగా పేరొందిన 'కాళీపట్నం రామారావు' 1924, నవంబరు 9న శ్రీకాకుళం లో జన్మించారు. శ్రీకాకుళంలోనే తొలి విద్యాభ్యాసం, భీమిలిలో సెకండరీ గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1948 నుంచి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. కాళీపట్నం రామారావు ఎలిమెంటరీ స్కూలు ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ పొందారు. కారా మాస్టారు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఆయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేశారు. 1966లో కాళీపట్నం రాసిన 'యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు. కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఆయన ఎక్కువగా శ్రమిస్తున్నారు. ఈ కథానిలయంలో 2,000 పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. రచనలు: * యజ్ఞం (నవల) * అభిమానాలు * రాగమయి * జీవధార * రుతుపవనాలు (కథా సంకలనం) * కారా కథలు -
కథల మాస్టారుకు ఘనసన్మానం
విశాఖలో సత్కరించిన శిష్యబృందం విశాఖపట్నం: ప్రముఖ కథారచయిత, కథానిలయం వ్యవస్థాపకుడు కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) 90వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కారా మాస్టారు శిష్యులు నవతీతరణం పేరుతో ఆదివారం ఆయనను ఘనంగా సత్కరించారు. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ సభలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కారా మాస్టారి శిష్యులు ప్రముఖ డెర్మటాలజిస్టు డాక్టర్ రఘురామారావు, ప్రొఫెసర్ కవన శర్మ ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథి, మాజీ మేయర్ డి.వి.సుబ్బారావు కారాను సన్మాన కమిటీ పక్షాన సన్మానించి, రూ. లక్ష చెక్కును ఆయనకు గురుదక్షిణగా అందించారు. ఈ సందర్భంగా డీవీ సుబ్బారావు మాట్లాడుతూ కథ బతికున్నంత కాలం కారా ఉంటారని అన్నారు. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ చైర్మన్ ఎ.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కారా ప్రతి కథలోనూ సామాన్యుడి బతుకు అందులో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు వక్తలు ఆయనతో తమకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. రచయిత రాంభట్ల నృసింహశర్మ సత్కార పత్రాన్ని రచించి, ఆయనకు అంకితమిచ్చారు. కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, రచయిత గొల్లపూడి మారుతీరావు, విజయ్ నిర్మాణ్ అధినేత విజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలశపూడి శ్రీనివాసరావు రచించిన కలశపూడి కథలు పుస్తకాన్ని, నవతీతరణ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. బమ్మిడి జగదీశ్వరరావు హింసపాదు పుస్తకాన్ని కారా చేతుల మీదుగా ఆవిష్కరించారు. కథలపై గోష్టి: కారా నవతీతరణం సందర్భంగా ఆదివారంఉదయం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో కారా కథాచర్వణం పేరిట ఆయన కథలపైగోష్టి నిర్వహించారు. సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో యజ్ఞం నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి దర్శకుడు ఎస్.కె. మిశ్రో ప్రయోక్తగా వ్యవహరించారు. ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్ బృందంపాట రూపంలో కథను నడిపించటంతో నాటకం ఆసక్తికరంగా సాగింది.