కా.రా. గారు ఉదయం 8.20కి తుది శ్వాస విడిచారు. సహజ మరణం. టీ తాగి అలా కూతురు చేతులలో.. అని కాళీపట్నపు ఇందిర నుండి ఈ ఉదయం తొమ్మిదిన్నరకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇందిర అంటే కాళీపట్నపు రామారావు మాస్టారు చిన్న కోడలు. ఇలాంటి వార్త ఎప్పుడు వినవలసి వస్తుందోనని గత కొన్ని మాసాలుగా మనసు మూలల్లో భయం కలుగుతూ వచ్చింది. మాస్టారు 97 సంవత్సరాల వయసులో మరణించారు. నా వ్యక్తిగత జీవితంలో మా బాపు మరణించినప్పుడు నాకు ఎటు వంటి దుఃఖం కలిగిందో, ఓ రచయితగా ఇప్పుడు మాస్టారు మరణించిన విషయం విన్న తరువాత కూడా అటువంటి దుఃఖమే కలిగింది. నాకూ, అల్లం రాజయ్యకీ కారా మాస్టారుతో సుమారు 40 ఏళ్ల పరిచయం. అది నేటితో ముగిసింది.
కాళీపట్నపు రామారావు 1924 నవంబర్ 9న జన్మించారు. ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామంలో– అది వారి అమ్మగారి గ్రామం. అక్కడికి దగ్గరలో ఉన్న మురపాక వారి స్వగ్రామం. తన పద్నాలుగవ యేటనే ‘ముద్దు’ అనే కథ రాశారు గానీ అది అలభ్యం. ఓ అయిదారు ప్రభుత్వ ప్రైవేటు రంగాల ఉద్యోగాలు చేసి నచ్చక వదిలేశారు. తన సాహిత్య వ్యాసంగానికి ఉపాధ్యాయ వృత్తి సరిపోతుందని సెకండరీ గ్రేడ్ టీచర్ శిక్షణ తీసుకుని 1948లో విశాఖపట్నం సెయింట్ ఆంథోనీ స్కూల్లో చేరి, 1979లో రిటైర్ అయ్యే వరకు అక్కడే పనిచేశారు.
1943లో రాసిన మొదటి కథ ‘ప్లాటుఫారం’ నుండి 1955 వరకు రాసిన ‘అశిక్ష–అవిద్య’ వరకు ఒక తరహా కథలు. వాటిల్లో ప్రధానంగా సంస్కరణ, సహృదయత, ఉమ్మడి కుటుంబ సంబంధాల చిత్రణ ఉంది. తరువాత రోజుల్లో సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి పరిచయం వల్ల ఆలోచనల్లో మార్పు వచ్చింది. సంస్కార వాద దృష్టికి సామాజిక దృష్టి తోడైంది. ఆయన కథల్లో అతి ముఖ్యమైనవి రాయడం జరిగింది. 1964లో ‘తీర్పు’ కథతో ప్రారంభమై ఈ మలిదశ కథలు 1972లో రాసిన ‘కుట్ర’తో ఆగాయి. ఈ సిరీస్‌లో 1966లో రాసిన ‘యజ్ఞం’ పెద్ద సంచలనం సృష్టించింది. అప్పటి వరకు తెలుగులో అంతటి సంచలనం సృష్టించిన మరో కథ లేదు. దాని మీద సాగిన చర్చలను ‘కథాయజ్ఞం’ పేరుతో ఓ పుస్తకంగా ప్రచురించారు. ఆ కథ ఆధారంగా గుత్తా రామినీడు దర్శకత్వంలో సినిమా వచ్చింది.
దేశ స్వాతంత్య్రం తరువాత మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సారథ్యంలో పంచవర్ష ప్రణాళికల అభివృద్ధి ఫలితాలు ఒక గ్రామంలో ఎలా ప్రతిఫలించాయో, వాటి పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో సునిశిత పరిశీలనతో రాసిన కథ యజ్ఞం. తదనంతర కాలంలో దేశ రాజకీయ రంగంలో జరిగిన పరిణామాలు మాస్టారు అంచనా నిజమే అని నిర్ధారించాయి. మరో ప్రసిద్ధ కథ కుట్రలో దేశ స్వాతంత్య్రం తరువాత పారిశ్రామిక రంగంలో జరిగిన విప రిణామాలు, వాటిని ఎదిరించిన వారి వాదాలు కలిసి కథగా రూపుదాల్చాయి. ఏలిన వారిదే కుట్ర అని, ఆ కుట్రను ఎదిరిస్తే కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించే కథ. ఇంకా నో రూమ్, వీరుడు మహావీరుడు, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవధార, న్యాయం వంటి సుమారు 54 కథలు రాశారు. ఇంకా రాగ మయి అనే చిన్న నవల కూడా ఉంది.
ఉద్యోగం నుండి రిటైర్ అయిన తరువాత ఆయన శిష్యులు కొందరు శ్రీకాకుళంలో సన్మానం చేశారు. ఆ సభలో నేను, అల్లం రాజయ్య కూడా ఉన్నాం. తన జీవితంలో ఒప్పుకున్న మొదటి సన్మానం ఇదేననీ, రిటైర్ అయిన తరువాత కూడా ఏదైనా సమాజానికి పనికి వచ్చేది చెయ్యాలని ఉందనీ అన్నారు. ‘ప్రతీ మనిషికి మూడు రుణాలు ఉంటాయని అంటారు. తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం అని. నేను మరో రుణం కూడా ఉంటుందని అనుకుంటున్నాను. అది సామాజిక రుణం! రిటైర్ అయినా, పెన్షన్ తీసుకుంటున్నాను కనుక, సమాజానికి రుణపడి ఉన్నట్టు లెక్క. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నాకు చేతనైన సామాజిక సేవ చేస్తాను’ అన్నారు. తనకు అవార్డుల రూపంలో అభిమానులు ఇచ్చిన లక్ష రూపాయలను ఏం చెయ్యాలి అనే ప్రశ్న ఉదయించింది. అది క్రమంగా కథా నిలయం ఏర్పాటుకు దారితీసింది.
దాదాపు నలభై ఏళ్ల పాటు విశాఖపట్నంలో స్కూల్ టీచర్ ఉద్యోగం చేసినా, ఇల్లు గురించి ఆలోచన చెయ్యలేదు. కానీ ఎవరో ఇచ్చిన సలహా నచ్చి, తనకు అవార్డు రూపేణా వచ్చిన డబ్బుతో తెలుగు కథకు ఒక ప్రత్యేక లైబ్రరీ పెట్టడం జరిగింది. ప్రపంచ సాహిత్యంలో కథకు ఒక నిలయం ఉండటం ఇదే మొదటిసారి. 1997 పిబ్రవరి 22న శ్రీకాకుళంలో కథానిలయం ప్రారంభమైంది. ఆధునిక తెలుగు కథలను మొత్తం సేకరించి పరిశోధకులకు అందుబాటులో పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికి దాదాపుగా తొంభై శాతం కథలను సేకరించడం జరిగింది. మాస్టారు ఆధ్వర్యంలో కథా నిలయం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల సొంత భవనం–వందలాది తెలుగు కథానవలా రచయితల ఫొటోలు, చేతిరాతలు, కంఠస్వరాలు, వివరాలు సేకరించి భద్రపరిచారు. రామారావు మాస్టారుకు సొంత ఇల్లు లేదు. కానీ, తెలుగు కథకు మాత్రం ఓ ఇల్లును ఏర్పాటు చేశారు.
మాస్టారు తన ఆలోచనలకు, మాటలకు, చేతలకు తేడా లేకుండా బతికారు. వారితో నలౖభై సంవత్సరాల పరిచయం ఉండటం నాకు కలిగిన అదృష్టం. ఆయన జీవితంలో తన కళ్ల ముందే ముగ్గురు కొడుకులు మరణించారు. భార్య సీతమ్మ కూడా మరణించారు. మాస్టారు తొంభై ఏడు సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపారు. నాకు ఒక రోల్ మాడల్ మాస్టారు జీవితం! ‘మాస్టారు మాట’ అనే పేరుతో నా ఫేస్‌బుక్ వాల్ మీద రెండేళ్లపాటు సీరియల్ రాశాను. మాస్టారు నుండి నేను గ్రహించిన విషయాలను వారితో నాకు ఉన్న పరిచయాన్ని అందులో రాశాను. బతికి ఉండగానే పుస్తకాన్ని అచ్చు వేయించి వారి చేతుల్లో పెట్టాలని ఎంత వేగిరపడినా సాధ్యం కాలేదు. అది ఇక ఎన్నటికీ తీర్చుకోలేని లోటు. మాస్టారు కుటుంబ సభ్యులు కూడా నా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపారు. ఈ కష్టకాలంలో వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపు కుంటున్నాను.
- తుమ్మేటి రఘోత్తమరెడ్డి
వ్యాసకర్త ప్రసిద్ధ కథారచయిత
90001 84107
Comments
Please login to add a commentAdd a comment