Kara Master
-
సమాజ రుణం తీర్చుకున్న మాస్టారు
కా.రా. గారు ఉదయం 8.20కి తుది శ్వాస విడిచారు. సహజ మరణం. టీ తాగి అలా కూతురు చేతులలో.. అని కాళీపట్నపు ఇందిర నుండి ఈ ఉదయం తొమ్మిదిన్నరకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇందిర అంటే కాళీపట్నపు రామారావు మాస్టారు చిన్న కోడలు. ఇలాంటి వార్త ఎప్పుడు వినవలసి వస్తుందోనని గత కొన్ని మాసాలుగా మనసు మూలల్లో భయం కలుగుతూ వచ్చింది. మాస్టారు 97 సంవత్సరాల వయసులో మరణించారు. నా వ్యక్తిగత జీవితంలో మా బాపు మరణించినప్పుడు నాకు ఎటు వంటి దుఃఖం కలిగిందో, ఓ రచయితగా ఇప్పుడు మాస్టారు మరణించిన విషయం విన్న తరువాత కూడా అటువంటి దుఃఖమే కలిగింది. నాకూ, అల్లం రాజయ్యకీ కారా మాస్టారుతో సుమారు 40 ఏళ్ల పరిచయం. అది నేటితో ముగిసింది. కాళీపట్నపు రామారావు 1924 నవంబర్ 9న జన్మించారు. ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామంలో– అది వారి అమ్మగారి గ్రామం. అక్కడికి దగ్గరలో ఉన్న మురపాక వారి స్వగ్రామం. తన పద్నాలుగవ యేటనే ‘ముద్దు’ అనే కథ రాశారు గానీ అది అలభ్యం. ఓ అయిదారు ప్రభుత్వ ప్రైవేటు రంగాల ఉద్యోగాలు చేసి నచ్చక వదిలేశారు. తన సాహిత్య వ్యాసంగానికి ఉపాధ్యాయ వృత్తి సరిపోతుందని సెకండరీ గ్రేడ్ టీచర్ శిక్షణ తీసుకుని 1948లో విశాఖపట్నం సెయింట్ ఆంథోనీ స్కూల్లో చేరి, 1979లో రిటైర్ అయ్యే వరకు అక్కడే పనిచేశారు. 1943లో రాసిన మొదటి కథ ‘ప్లాటుఫారం’ నుండి 1955 వరకు రాసిన ‘అశిక్ష–అవిద్య’ వరకు ఒక తరహా కథలు. వాటిల్లో ప్రధానంగా సంస్కరణ, సహృదయత, ఉమ్మడి కుటుంబ సంబంధాల చిత్రణ ఉంది. తరువాత రోజుల్లో సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి పరిచయం వల్ల ఆలోచనల్లో మార్పు వచ్చింది. సంస్కార వాద దృష్టికి సామాజిక దృష్టి తోడైంది. ఆయన కథల్లో అతి ముఖ్యమైనవి రాయడం జరిగింది. 1964లో ‘తీర్పు’ కథతో ప్రారంభమై ఈ మలిదశ కథలు 1972లో రాసిన ‘కుట్ర’తో ఆగాయి. ఈ సిరీస్‌లో 1966లో రాసిన ‘యజ్ఞం’ పెద్ద సంచలనం సృష్టించింది. అప్పటి వరకు తెలుగులో అంతటి సంచలనం సృష్టించిన మరో కథ లేదు. దాని మీద సాగిన చర్చలను ‘కథాయజ్ఞం’ పేరుతో ఓ పుస్తకంగా ప్రచురించారు. ఆ కథ ఆధారంగా గుత్తా రామినీడు దర్శకత్వంలో సినిమా వచ్చింది. దేశ స్వాతంత్య్రం తరువాత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో పంచవర్ష ప్రణాళికల అభివృద్ధి ఫలితాలు ఒక గ్రామంలో ఎలా ప్రతిఫలించాయో, వాటి పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో సునిశిత పరిశీలనతో రాసిన కథ యజ్ఞం. తదనంతర కాలంలో దేశ రాజకీయ రంగంలో జరిగిన పరిణామాలు మాస్టారు అంచనా నిజమే అని నిర్ధారించాయి. మరో ప్రసిద్ధ కథ కుట్రలో దేశ స్వాతంత్య్రం తరువాత పారిశ్రామిక రంగంలో జరిగిన విప రిణామాలు, వాటిని ఎదిరించిన వారి వాదాలు కలిసి కథగా రూపుదాల్చాయి. ఏలిన వారిదే కుట్ర అని, ఆ కుట్రను ఎదిరిస్తే కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించే కథ. ఇంకా నో రూమ్, వీరుడు మహావీరుడు, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవధార, న్యాయం వంటి సుమారు 54 కథలు రాశారు. ఇంకా రాగ మయి అనే చిన్న నవల కూడా ఉంది. ఉద్యోగం నుండి రిటైర్ అయిన తరువాత ఆయన శిష్యులు కొందరు శ్రీకాకుళంలో సన్మానం చేశారు. ఆ సభలో నేను, అల్లం రాజయ్య కూడా ఉన్నాం. తన జీవితంలో ఒప్పుకున్న మొదటి సన్మానం ఇదేననీ, రిటైర్ అయిన తరువాత కూడా ఏదైనా సమాజానికి పనికి వచ్చేది చెయ్యాలని ఉందనీ అన్నారు. ‘ప్రతీ మనిషికి మూడు రుణాలు ఉంటాయని అంటారు. తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం అని. నేను మరో రుణం కూడా ఉంటుందని అనుకుంటున్నాను. అది సామాజిక రుణం! రిటైర్ అయినా, పెన్షన్ తీసుకుంటున్నాను కనుక, సమాజానికి రుణపడి ఉన్నట్టు లెక్క. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నాకు చేతనైన సామాజిక సేవ చేస్తాను’ అన్నారు. తనకు అవార్డుల రూపంలో అభిమానులు ఇచ్చిన లక్ష రూపాయలను ఏం చెయ్యాలి అనే ప్రశ్న ఉదయించింది. అది క్రమంగా కథా నిలయం ఏర్పాటుకు దారితీసింది. దాదాపు నలభై ఏళ్ల పాటు విశాఖపట్నంలో స్కూల్ టీచర్ ఉద్యోగం చేసినా, ఇల్లు గురించి ఆలోచన చెయ్యలేదు. కానీ ఎవరో ఇచ్చిన సలహా నచ్చి, తనకు అవార్డు రూపేణా వచ్చిన డబ్బుతో తెలుగు కథకు ఒక ప్రత్యేక లైబ్రరీ పెట్టడం జరిగింది. ప్రపంచ సాహిత్యంలో కథకు ఒక నిలయం ఉండటం ఇదే మొదటిసారి. 1997 పిబ్రవరి 22న శ్రీకాకుళంలో కథానిలయం ప్రారంభమైంది. ఆధునిక తెలుగు కథలను మొత్తం సేకరించి పరిశోధకులకు అందుబాటులో పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికి దాదాపుగా తొంభై శాతం కథలను సేకరించడం జరిగింది. మాస్టారు ఆధ్వర్యంలో కథా నిలయం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల సొంత భవనం–వందలాది తెలుగు కథానవలా రచయితల ఫొటోలు, చేతిరాతలు, కంఠస్వరాలు, వివరాలు సేకరించి భద్రపరిచారు. రామారావు మాస్టారుకు సొంత ఇల్లు లేదు. కానీ, తెలుగు కథకు మాత్రం ఓ ఇల్లును ఏర్పాటు చేశారు. మాస్టారు తన ఆలోచనలకు, మాటలకు, చేతలకు తేడా లేకుండా బతికారు. వారితో నలౖభై సంవత్సరాల పరిచయం ఉండటం నాకు కలిగిన అదృష్టం. ఆయన జీవితంలో తన కళ్ల ముందే ముగ్గురు కొడుకులు మరణించారు. భార్య సీతమ్మ కూడా మరణించారు. మాస్టారు తొంభై ఏడు సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపారు. నాకు ఒక రోల్ మాడల్ మాస్టారు జీవితం! ‘మాస్టారు మాట’ అనే పేరుతో నా ఫేస్బుక్ వాల్ మీద రెండేళ్లపాటు సీరియల్ రాశాను. మాస్టారు నుండి నేను గ్రహించిన విషయాలను వారితో నాకు ఉన్న పరిచయాన్ని అందులో రాశాను. బతికి ఉండగానే పుస్తకాన్ని అచ్చు వేయించి వారి చేతుల్లో పెట్టాలని ఎంత వేగిరపడినా సాధ్యం కాలేదు. అది ఇక ఎన్నటికీ తీర్చుకోలేని లోటు. మాస్టారు కుటుంబ సభ్యులు కూడా నా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపారు. ఈ కష్టకాలంలో వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపు కుంటున్నాను. - తుమ్మేటి రఘోత్తమరెడ్డి వ్యాసకర్త ప్రసిద్ధ కథారచయిత 90001 84107 -
సమాజం లెక్క తేల్చిన కథల మేష్టారు
ఆయన వృత్తిరీత్యా లెక్కల మాష్టారు. కాని సమాజంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుందని, ఒక లెక్కను పెద్దవాళ్లు కలిసి నిర్ణయిస్తారని, ఆ పెద్దవాళ్లకు రెండు రెళ్లు ఆరనీ, కింద వాళ్లకు శేషం సున్నా అనీ ఆయన స్కూల్లో పిల్లలకు కాకుండా కథల్లో పాఠకులకు చెప్పారు. మనుషులు ఈసురోమని ఉంటే అందుకు కారణం ఆ సదరు మనుషులు కారని వెనుక ఎక్కడో ఉండే మనుషులని ఆయన చెప్తారు. తెలుగు కథను ఉన్నతీకరించిన కాళీపట్నం రామారావు 97వ ఏట జీవించి అస్తమించారు. ఆయన రచనలు, ఆయన రచనా పరిశ్రమ ప్రతి తెలుగు ‘ఫ్యామిలీ’కి తెలిసి ఉండాలి. పోస్ట్‌మేన్ ఇంటికి ఉత్తరాలు తెచ్చి ఇస్తాడు. పోలీసు ఇంటికి రక్షణ కల్పిస్తాడు. ఇంజినీరు ఇల్లు కడతాడు. ప్రభుత్వ అధికారి ఇల్లు నడవడానికి అవసరమైన సంఘపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తాడు. వీరంతా సమాజంతో ఉంటూ సమాజం కోసం పని చేస్తూ సమాజంలో భాగంగా ఉంటారు. కాని ఈ సమాజం ఎలా ఉందో ఎవరు చెప్తారు? కథకుడే చెప్తాడు. సమాజాన్ని చూసి సమాజానికి దానిని తిరిగి చూపిస్తాడు కథకుడు. సమాజం ఎలా ఉందో రాసేవాణ్ణి రచయిత అనొచ్చు. అలా ఎందుకు ఉందో రాసేవాణ్ణి మంచి రచయిత అనొచ్చు. అలా ఉండకుండా ఏమి చేయవచ్చో రాసి పాఠకులను ఆలోచనాశీలురుగా, కర్తవ్యోన్ముఖులుగా చేసే రచయితను గొప్ప రచయిత అనొచ్చు. కాళీపట్నం రామారావు అలాంటి గొప్ప రచయిత. మనం ఏం చేయాలో ముందు నిర్ణయించుకోవడం అందుకు తగ్గట్టుగా జీవితాన్ని నిర్మించుకోవడం అందరూ చేయరు. కాళీపట్నం రామారావు తన వివాహం అయ్యాక, 1947 నాటి కాలంలోనే 80 రూపాయల జీతం వచ్చే స్పోర్ట్స్ డిపోలోని ఉద్యోగానికి రాజీనామా చేశారు. కారణం అది కథలు రాసుకోవడానికి అవసరమైన టైమ్ ఇవ్వదని. 30 రూపాయల జీతం వచ్చే ప్రభుత్వ ఉపాధ్యాయుడి జీతం ఎంచుకున్నాడాయన. తెలుగు కథ తనకు అవసరమై ఆయన జీవితాన్ని రూపుదిద్దుకుందా అనిపిస్తుంది. 1979లో ఆయన రిటైరయ్యారు. అది కూడా కథ చేసుకున్న ఒక ఏర్పాటే. ఎందుకంటే ఆ తర్వాతి సమయమంతా ఆయన తెలుగు కథకే ఇచ్చారు. దాదాపు 30–35 ఏళ్లు తెలుగు కథ ప్రచారానికి, సేకరణకి, భద్రపరచడానికి వెచ్చించారు. దేని నుంచి పొందామో దానికే తిరిగి ఇవ్వడం చేసిన అరుదైన రచయిత కాళీపట్నం రామారావు. శ్రీకాకుళం చైతన్యధార ప్రపంచంలో గొప్ప రచయితలందరూ జీవితంలో రకరకాల పనులు చేసినవారే. శ్రీకాకుళం జిల్లా మురపాక ప్రాంతానికి చెందిన కాళీపట్నం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కుదురుకునేంత వరకూ రకరకాల పనులు చేశారు. టైపిస్ట్‌గా, డిస్ట్రిక్ట్ కోర్టులో చిరుద్యోగిగా, రేషనింగ్ ఆఫీసులో ఎంక్వయిరీ ఆఫీసరుగా ఇలా రకరకాల పనులు చేశారు. పత్రికల్లో పని చేయాలని ఆయనకు గట్టిగా ఉండేది. మద్రాసు (చెన్నై) వెళ్లి ప్రయత్నించినా జరగలేదు. సాహిత్యం పట్ల ఏర్పడిన ఆసక్తి ఆయనను కథకుడిగా ఉండమని కోరింది. 1943లో ఆయన మొదటి కథ ‘ప్లాట్‌ఫారమో?’ అచ్చయ్యింది. ఆ తర్వాత ఆయన కొన్ని కథలు రాసినా ఇవి కాదు కదా రాయాల్సింది అని అనిపించింది. ఆలోచన కలిగించనిది కథ ఎలా అవుతుంది అని ఆయన అనుకున్నారు. పాఠకులకు ఆలోచన కలిగించాలంటే రచయితకు చదువు, అవగాహన, జ్ఞానం, హేతువు, సైద్ధాంతిక భూమిక, ప్రాపంచిక దృక్పథం ఇవన్నీ ఉండాలి కదా అని అధ్యయనంలో పడ్డారు. 1955 నుంచి దాదాపు ఎనిమిదేళ్లు కథలు రాయకుండా పూర్తిగా అధ్యయనంలో ఉండిపోయారు. 1964లో ‘తీర్పు’ కథతో అసలైన కాళీపట్నం రామారావు తెలుగు పాఠకలోకానికి తెలిశారు. 1966లో ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు సాహిత్యానికి చూపు, ఊపు ఇచ్చింది. ‘కథ ఎందుకు?’, ‘కథ ప్రయోజనం ఏమి?’, ‘కథ నడిచే మార్గం ఎలా ఉండాలి’ ఈ ప్రశ్నలన్నింటికి ఆ కథ ఒక మార్గదర్శిగా నిలిచింది. సామాజిక సమస్యలు, అంతర్గత ఆరాటాలు శరీరం మీద పీడన మనసు మీద పడుతుంది. మనసు పడే వొత్తిడి శరీరానికి హాని కలిగిస్తుంది. వ్యవస్థ గతి వ్యవస్థది మాత్రమే కాదు. ఆ గతిలో సమాజంలోని ప్రతి పౌరుడు భాగం. ఆ గతి మతి తప్పితే ఆ పౌరుడు బాధితుడవుతాడు. ఆ పౌరుడే ఇంటికొస్తే వ్యక్తిగా మారి అంటే తండ్రిగా, భర్తగా, కుమారుడిగా వొత్తిడి ఎదుర్కొంటాడు. ఈ రెంటినీ కాళీపట్నం రామారావు కథగా చేసి తెలుగు పాఠకులకు చూపారు. గుప్పిట విప్పేసినట్టుగా రాయడం ఆయన పద్ధతి కాదు. సూచించినట్టుగా పొరల చాటున దాచినట్టుగా ఆయన పరమసత్యాన్ని నిగూఢపరిచి దానిని తానే కనుగొన్న సంతృప్తిని పాఠకునికి ఇస్తారు. పౌరహితం కోరుతున్నట్టు కనిపించే ఈ సామాజిక వ్యవస్థ నిజానికి మేడిపండు. ఇది పైకి మంచిగా కనిపిస్తూ లోపల పీడితుల రక్తాన్ని తాగుతూ ఉంటుందని ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ నాటి సామాజిక, ఆర్థిక మూలాల కఠినత్వాన్ని చూపింది. ఈ కథ ముగింపులో నిస్సహాయుని ఆగ్రహ ప్రకటనగా బాధితుడు తన ఇంటి పిల్లాడి తల నరకడాన్ని రచయిత చూపిస్తాడు. నేటికీ అదే జరుగుతోంది.. బలవంతుడైన పీడకునితో పోరాటానికి దిగితే మనకు ఆపద ఎదురవుతుంది. అప్పుడు మనవాళ్లే వచ్చి మన చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఆ పోరాటం నుంచి విరమింప చేస్తారు. అయితే పోరాటం వొద్దనా? కాదు ఒకరూ ఒకరూ ఒకరూ కాక అందరు కలిసినప్పుడు బలవంతుడు తోక ముడుస్తాడన్న సూచన ఉంది అందులో. ఆ భాష, ఆ సొగసు కాళీపట్నం రామారావు కేవలం ప్రగతిశీల కథ రాసి ఉంటే ఇంత ఖ్యాతి వచ్చి ఉండేది కాదు. ఆయన తాను పుట్టి పెరిగిన శ్రీకాకుళం మీద తన కథలను నిలబెట్టి ఆ స్థానికతే విశ్వజనీయత అనే భావనతో కథలు చెప్పారు. శ్రీకాకుళపు భాషను ఆయన సొగసుగా సంభాషణల్లో దించారు. ముఖ్యం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి మల్లే ఆయన కూడా స్త్రీల పాత్రలకు ఎంతో సజీవమైన సంభాషణలను సమకూర్చారు. ‘నో రూమ్’, ‘ఆర్తి’, ‘చావు’, ‘జీవధార’, ‘భయం’... ఈ కథలన్నీ ఇందుకు ఉదాహరణ. ‘జీవధార’ కథలో పైకి నీటి సమస్య వస్తువుగా కనపడుతుంది. మురికివాడ వాసులకు తాగునీళ్లు ఉండవు. దాపులో ఒక శ్రీమంతుల ఇంటిలో కావల్సినన్ని నీళ్లు. మురికివాడ ఆడవాళ్లు రోజు ఆ శ్రీమంతుల గేటు దగ్గరకు వచ్చి నీళ్లు అడుగుతూ ఉంటారు. ఆ శ్రీమంతులు చీదరించుకుంటూ ఉంటారు. చీదరించుకుంటూ ఉంటే ఆ ఆడవాళ్లు కొన్నాళ్లు పడతారు... మరి కొన్నాళ్లు సహిస్తారు... దప్పికతో ప్రాణం పోతుంటే ఏం చేస్తారు? తిరగబడతారు. అంతమంది తిరగబడితే ఆ శ్రీమంతులు నీళ్లేం ఖర్మ ఏమైనా ఇచ్చి తోక ముడవరూ? బాధితులందరూ కలిసి తిరగబడాలి... పీడితులందరూ కలిసి తిరగబడాలి... మైనార్టీ సమూహాలు అన్నీ కలిసి తిరగబడాలి... అని రచయిత సూచన. ఏదీ ఊరికే రాదు. ‘సాధించుకోవాలి’ ఈ వ్యవస్థ నుంచి. సాధించుకోవడం మెత్తగా సాధ్యం కాదు ఎప్పటికీ. దీపధారి కాళీపట్నం రామారావు ‘విరసం’ (విప్లవ రచయితల సంఘం) ఏర్పడినప్పటి నుంచి దాదాపు 15 ఏళ్లు అందులో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు. రావిశాస్త్రి, వరవరరావు, కె.వి.రమణారెడ్డి వంటి ఉద్దండులతో ఆయన కలిసి పని చేశారు. తెలుగునాట విప్లవ కథ విస్తృతం కావడంలో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి రచయితలు సిద్ధం కావడానికి మరోవైపు మధ్యతరగతి కథను ముందుకు తీసుకెళ్లడంలో వివిన మూర్తి, కవనశర్మ తదితరులు ముందంజ వేయడానికి కాళీపట్నం రామారావు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు ‘సాహిత్య అకాడెమీ’ వచ్చినా తిరస్కరించారు. కొత్త కథకులను సిద్ధం చేసేందుకు ఊరూరు తిరిగి వర్క్‌షాపులు పెట్టారు. కథామెళకువలు చెప్పే వ్యాసాలు రాసి పుస్తకాలు వెలువరించారు. ఈ సమయంలోనే ఆయన ‘కథల మేష్టారు’గా గౌరవం పొందసాగారు. కథానిలయం 1996 ప్రాంతంలో నిజానికి ఎవరైనా సరే విశ్రాంత జీవనం కోరుకునే వయసులో ఆయన ‘కథానిలయం’ అనే బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఈ ఆలోచన చెప్పినప్పుడు ముందు హేళన, ఆ తర్వాత సంశయం, ఆ తర్వాత అంగీకారం పొందారు. తెలుగులో వచ్చిన కథలన్నీ ఒక్కచోట చేరాలి అని ఆయన చేసిన ఆలోచన ఇవాళ తెలుగువారికి ఒక విలువైన భాండాగారాన్ని సిద్ధం చేసింది. శ్రీకాకుళంలో ఆయన రెండస్తుల ‘కథా నిలయం’ కట్టడానికి కథాభిమానులు తలా ఒక ఇటుక ఇచ్చారు. ఇందుకోసమై హైదరాబాద్ రవీంద్రభారతిలో పెద్ద కార్యక్రమం చేసి కాళీపట్నంకు ‘లక్ష రూపాయల’ పర్స్ అందజేశారు. తెలుగులో వచ్చిన వీక్లీలు, మంత్లీలు, కథాసంకలనాలు, వాటితో పాటు రచయితల డేటా, వారు రాసిన కథల పట్టిక ఇవన్నీ చాలా పెద్ద పని. కాళీపట్నం తన భుజాల మీద వేసుకు చేశారు. ఆ తర్వాత ఆ ఆలోచన ఆ మొత్తం కథలను డిజిటలైజ్ చేయడం వైపు మళ్లింది. ఇవాళ ‘కథానిలయం’ వెబ్సైట్లో వేలాది కథలు డిజిటలైజ్ అయి ఉన్నాయి. విద్యార్థులకు, అధ్యయనం చేయాలనుకునేవారికి ఆ సైట్ ఒక అతి పెద్దసోర్స్. ఏనాటి కథలో, కథకులో తెలుసుకోవాలంటే ఆ సైట్‌కు వెళ్లక తప్పదు. మరో భాషకు ఇలాంటి సైట్ ఏమాత్రం లేదు. ఇది తెలుగువారి ఘనత. ఇందుకు కారకులు కాళీపట్నం. నిరంతర అధ్యయన శీలి కాళీపట్నం రామారావు నిరంతర అధ్యయనంలోనే ఉన్నారు. 96 ఏళ్లు వచ్చినా కన్ను కనిపించినంత సేపు చదవడానికే ఇష్టపడ్డారు. శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావు తమ కథను చదివి మెచ్చుకుంటే అదే పెద్ద అవార్డుగా యువ కథకులు భావిస్తారు. ఆయన నిరంతరం కొత్త కథకులను ప్రోత్సహిస్తూనే వచ్చారు. 2006లో రాసిన ‘అన్నెమ్మ నాయురాలు’ ఆయన చివరి కథ. తెలుగు కథ పయనంలో కాళీపట్నం అస్తమయం వల్ల ఒక శకం ముగిసింది. అలాంటి రచయిత, కథా కార్యకర్త మరొకరు సిద్ధం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. తెలుగు కథ ఉన్నంత వరకూ తప్పక కాళీపట్నం ప్రస్తావన, శ్రీకాకుళం ఉనికి ఉంటూనే ఉంటుంది. ఆ మహా కథకునికి నివాళి. కమిటెడ్ రైటర్ కాళీపట్నం రామారావును నిబద్ధ రచయితగా చెబుతారు. నిబద్ధతకు ఒక ఉదాహరణగా చూపుతారు. తన చేతిలో ఉన్న కథను, అక్షరాన్ని దేనికి నిబద్ధం చేయాలో ఎంత మేరకు చేయాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని అంటారు. కనపడిందంతా, తోచిందంతా రాయడం కాళీపట్నం ఏనాడూ చేయలేదు. పొద్దుపోక రాయడం చేయలేదు. కాలక్షేపం కోసం రాయడాన్ని అసలు చేయలేదు. ఒక సత్యాన్ని కనుగొని ఆ సత్యానికి అవసరమైన కథను, పాత్రలను ఎంచుకుని, ఒక ప్రయోజనాన్ని ప్రతిపాదించి, ఒక చూపును ఇవ్వగలిగే కథ రాయగలిగినప్పుడే రాశారు. అందుకే ఆయన ముఖ్యమైన కథలు ఒక డజనుకు మించవు. అయినా సరే అవి వంద కథలకు సమానమైన ఖ్యాతి పొందాయి. – సాక్షి ఫ్యామిలీ -
శతమానం భవతి
ఘనంగా కాళీపట్నం-నవతీతరణం కథల మాస్టారుకు ఘన సత్కారం కారా కథలపై విశ్లేషణాత్మక సదస్సు జీవితం నుంచి సాహిత్యాన్ని సృజించారు... వాస్తవాలను రంగరించి కథలల్లారు... కథకుల గురువుగా నిలిచారు... కారా మాస్టారు కథా నిలయం కోసం జీవితాన్ని ధార పోసారు.. అందుకే ఆయన 90 పుట్టిన రోజు అందరికీ వేడుక... కథకు పట్టాభిషేకం జరుగుతున్న వేళ ఆనంద వీచిక... కాళీపట్నం నవతీతరణ సత్కార మహోత్సవాన్ని అభిమానులు ఆదివారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఉదయం సెయింట్ ఆంథోనీ స్కూలులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంతో ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి ఘన సత్కారంతో ముగిశాయి. సీతంపేట : ప్రచురణలు చవకగా పాఠకులకు అందుబాటులోకి తేవాలని, దీనికి రచయితలంతా ముందుకు వచ్చి సహకరించాలని కథల మాస్టారు కాళీపట్నం రామారావు అన్నారు. కాళీపట్నం-నవతీతరణం సత్కార మహోత్సవాల్లో భాగంగా ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆదివారం ‘కారా కథాచర్వణం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కారా మాస్టారి రచనల్లో ఎంపిక చేసిన 9 ఆణిముత్యాల్లాంటి కథలను సాహితీవేత్తలు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కారా మాస్టారు మాట్లాడుతూ పుస్తకాలను ఇంటర్నెట్లో పెడితే బాగుంటుందని, కానీ ఎంతమంది పాఠకులు అందిపుచ్చుకోగలరన్న సందేహాన్ని వెలిబుచ్చారు. రానున్న రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా పుస్తకాలను చదివే వారికి ప్రయోజనంగా ఉంటుందన్నారు. అనంతరం కారాయజ్ఞం పుస్తక ప్రచురణ సంస్థ ప్రచురించిన మొదటి పుస్తకం... మహమ్మద్ ఖాన్ రచించిన ‘కథానికా రచన’ను ఆవిష్కరించారు. అలాగే స్వదేశీ దీపక్ రచించిన దాసరి అమరేంద్ర అనువాదం ‘కోర్టు మార్షల్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కారా రచన ‘అప్రజ్ఞాత యజ్ఞం’ పుస్తకాన్ని విరసం ప్రతినిధి చలసాని ప్రసాద్ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కె.శివారెడ్డి, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కవన శర్మ, కార్యదర్శి డాక్టర్ జి.రఘురామారావు, సంయుక్త కార్యదర్శులు ఏవీఎన్ చెట్టి, కె.నరేష్, కె.గోపాలకృష్ణ, కోశాధికారి ఎస్.వై.నారాయణరావు, పలువురు సాహితీ వేత్తలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. ‘కథాచర్వణం’లో కొన్ని ఆణిముత్యాలు అప్రజ్ఞాతం దోపిడీ, అదనపు శ్రమ విలువ గురించి సుదర్శనం అనే పాత్ర కథలో చర్చిస్తుంది. కథాకాలం 1951. కాంగ్రెస్ ప్రభుత్వ మాయాజాలం అర్ధమై కమ్యూనిస్టు ప్రభావం సమాజంలో రాజ్యమేలుతున్న దశ అది. రెండు శత్రు వర్గాల మధ్య కాకుండా రెండు పాజిటివ్ పాత్రల ద్వారా దోపిడీ స్వభావాన్ని చక్కగా చూపించారు కారా. తనతో సూరప్పడి వాదోపవాదాలు తనకి అర్ధమైనంతగా మిగిలినవారికి అర్ధం అవుతుందని, అర్ధమైనంత మేరకు ఆచరణలో ఎందుకు బతకలేకపోతున్నారన్న ప్రశ్న సుదర్శనాన్ని వెంటాడుతుంది. సూరప్పడు దోపిడీ చేయలేదు... సూరప్పడు చేత దోపిడీ చేయబడింది. రెండింటి ఫలితం ఒక్కటే అయినప్పటికీ నైతికంగా రెండింటి మధ్యా తేడా ఉందని, అప్రజ్ఞాతం వలన సుదర్శనానికి ఈ విషయం అర్ధం కాలేదంటారు. -నల్లూరి రుక్మిణి సంకల్పం ఈ కథలో రామభద్రయ్య, సుభద్ర దంపతులు ఆస్తిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడే మానసిక హింస, క్షోభను కారా బాగా విశ్లేషించారు. ఒక తరానికి, మరొక తరానికి మధ్య ఘర్షణ అనివార్యమని తెలియజేసేదిగా కథ సాగుతుంది. - వర్మ మహదాశీర్వచనం ఈ కథలో కుటుంబంలోని స్త్రీ, పురుషుల సంబంధాలతోపాటు దేశంలోని ఆర్ధిక పతనం, రూపాయి విలువ పడిపోవడం వంటి విషయాలను ప్రస్తావించారు. మాంద్యంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంది, మధ్యతరగతి స్త్రీలపై మాంద్యం ప్రభావం, బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, కుటుంబ వ్యవస్థపై విమర్శలు, రక్షణ లేని జీవితం అంశాలపై మహదాశీర్వచనం కథలో కారా మాస్టారు బాగా విశదీకరించారు. -కాత్యాయనీ విద్మహే అదృశ్యం కారా 21 ఏళ్ల వ యసులో 1945 సంవత్సరంలో ‘అదృశ్యం’ కథ రాశారు. స్త్రీ, పురుష సంబంధాలు, నైతిక విలువల మధ్య చర్చ ఈ కథలో ప్రధానంగా కన్పిస్తుంది. 70 ఏళ్ల కిందట రాసినా ఇప్పటికీ కథావస్తువులో కొత్తదనం కన్పించడం విశేషం. ఈ కాలానికి కూడా కథ ఉపయోగపడుతుంది. ఎవరినీ సమర్ధించరు. ఎవరినీ వ్యతిరేకించరు. తప్పు ఒప్పులతో నిమిత్తంలేకుండా ఆయా అవసరాలు కోరికలను బట్టి ఏర్పడతాయని స్పష్టం చేశారు. - మల్లీశ్వరి అన్మెమ్మ నాయురాలు ఈ కథలో రెండు గ్రామాల మధ్య ఉన్న భూమి కోసం ఇరు గ్రామాల ప్రజల తగాదాను బాగా విశ్లేషించారు. ఈ క్రమంలో కోర్టుకు వెళ్ళగా రెండు గ్రామాల ప్రజలు ఆర్థికంగా పూర్తిగా చితికిపోతారు. చివరికి కోర్టు తీర్పు ఇచ్చేసరికి భూమిని సేద్యం చేయలేని పరిస్థితి. 1934 ప్రాంతంలో జరిగిన సంఘటనపై కారా రాసిన పుస్తకం అన్మెమ్మ నాయురాలు. -అట్టాడ అప్పలనాయుడు స్నేహం స్నేహం 1969లో యువ మాసపత్రికలో అచ్చయిన కథ. నిడివిలో చిన్న కథ అయినప్పటికీ చదివిన వారి మెదడును చర్చా వేదికగా మారుస్తుంది. మనసును ఊగిసలాడిస్తుంది. కేవలం ఆరు పాత్రలతో కథను క్లుప్తంగా చెప్పారు కారా. -కలశపూడి శ్రీనివాసరావు జీవధార ఈ కథలో మానవ విలువల గురించి చర్చించారు. అందరూ సమృద్ధిగా సంతోషంగా ఉండాలన్నదే మానవుల ప్రాథమిక మౌలికాంశంగా ఇందులో చూపారు. నీళ్ల కోసం స్త్రీలు పడే బాధను బాగా వర్ణించారు కారా. స్త్రీలను వ్యక్తిగా, శ్రమజీవిగా చూస్తారే తప్ప, ఎక్కడా శృంగార భావన కనిపించదు. -అయ్యగారి సీతారత్నం మా అనుబంధం మాటలకందనిది నేను 1973 బ్యాచ్ విద్యార్థిని. చాలా రోజుల తర్వా త మాస్టారు ని కలవడం ఆనందంగా ఉంది. మాస్టారంటే మాకెంతో గౌరవం. ఆయనతో మాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. మ్యాధ్స్ చాలా బాగా చెప్పేవారు. మాస్టా రు ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన మాకు నేర్పించిన క్రమశిక్షణ వల్ల ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. -పి.భోగేంద్రబాబు, జాయింట్ సెక్రటరీ,విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కుటుంబ సభ్యుడిలా మెలిగాను నేను కారా మాస్టారి ఇం ట్లోనే ఎక్కువసేపు గడిపేవాణ్ని.మాస్టా రుగారి అబ్బాయి, నేను క్లాస్ మేట్స్. ఆ విధంగా నాకు వారి కుటుంబంతో అవినాభావ సం బంధం ఏర్పడింది. నా మాధ్యమిక విద్య అంతా మాస్టారి నిర్దేశకత్వంలో జరిగింది. నేను ఇంత పెద్ద డాక్టర్‌గా ఎదిగానంటే... దానికి పునాది ఈ స్కూలేనని నేననుకుంటాను. - పి.వి.సుధాకర్, కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ విలువలకు నిలువెత్తు దర్పణం మాస్టారు 90వ పుట్టిన రోజు వేడుక ల్లో పాల్గొన డం మా అదృష్టం. ఉత్తమ విలువల కోసం బతికే ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉంటారనే దానికి నిలువెత్తు దర్పణం కారా మాస్టారు. నాతో పాటు మా అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఈ జనరేషన్ పిల్లలకు ఈ వాతావరణం, గురువు పట్ల భక్తి, గౌరవం వంటివి తెలియాలని తీసుకొచ్చాను. - రామన్, ఇన్సూరెన్స్ గురు వందనం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం సాక్షి, విశాఖపట్నం : అందరికీ కథకుల గురువు... తమకు మాత్రం విద్యాబుద్ధులు నేర్పిన అసలైన గురువు... లెక్కల చిక్కుల్ని ఎలా పరిష్కరించాలో చెప్పి లెక్కగా బతకడమెలాగో నేర్పిన జగమెరిగిన మా‘స్టారు’... సొంత బిడ్డల్లా ప్రేమించి, తమ ఉన్నతి కోసం తపించిన ఆత్మబంధువు... అందుకే కారా మాస్టారి 90వ జన్మదినోత్సవాన్ని ఆయన శిష్యులు ఘనంగా జరిపారు. సెయింట్ ఆంథోనీ స్కూల్లో ఆయన దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ సమావేశమై గురువుగారితో కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1954 బ్యాచ్ నుంచి ఆయన వద్ద విద్యనభ్యసించినవారంతా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. స్కూలు ఆవరణలో ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం సాగింది. ఆనాటి విద్యార్థులు ఈ రోజున మేటి స్థానంలో ఉన్నారు. వారు తన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలను, గురుభక్తిని చూసి కారా మాస్టారు భావోద్వేగానికి లోనయ్యారు. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో శిష్యులంతా బ్యాచ్‌ల వారీగా మాస్టారితో ఫోటోలు దిగారు.