కాళీపట్నం రామారావు
ఘనంగా కాళీపట్నం-నవతీతరణం
కథల మాస్టారుకు ఘన సత్కారం
కారా కథలపై విశ్లేషణాత్మక సదస్సు
జీవితం నుంచి సాహిత్యాన్ని సృజించారు... వాస్తవాలను రంగరించి కథలల్లారు... కథకుల గురువుగా నిలిచారు... కారా మాస్టారు కథా నిలయం కోసం జీవితాన్ని ధార పోసారు.. అందుకే ఆయన 90 పుట్టిన రోజు అందరికీ వేడుక... కథకు పట్టాభిషేకం జరుగుతున్న వేళ ఆనంద వీచిక... కాళీపట్నం నవతీతరణ సత్కార మహోత్సవాన్ని అభిమానులు ఆదివారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఉదయం సెయింట్ ఆంథోనీ స్కూలులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంతో ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి ఘన సత్కారంతో ముగిశాయి.
సీతంపేట : ప్రచురణలు చవకగా పాఠకులకు అందుబాటులోకి తేవాలని, దీనికి రచయితలంతా ముందుకు వచ్చి సహకరించాలని కథల మాస్టారు కాళీపట్నం రామారావు అన్నారు. కాళీపట్నం-నవతీతరణం సత్కార మహోత్సవాల్లో భాగంగా ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆదివారం ‘కారా కథాచర్వణం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కారా మాస్టారి రచనల్లో ఎంపిక చేసిన 9 ఆణిముత్యాల్లాంటి కథలను సాహితీవేత్తలు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కారా మాస్టారు మాట్లాడుతూ పుస్తకాలను ఇంటర్‌నెట్‌లో పెడితే బాగుంటుందని, కానీ ఎంతమంది పాఠకులు అందిపుచ్చుకోగలరన్న సందేహాన్ని వెలిబుచ్చారు. రానున్న రోజుల్లో ఇంటర్‌నెట్ ద్వారా పుస్తకాలను చదివే వారికి ప్రయోజనంగా ఉంటుందన్నారు. అనంతరం కారాయజ్ఞం పుస్తక ప్రచురణ సంస్థ ప్రచురించిన మొదటి పుస్తకం... మహమ్మద్ ఖాన్ రచించిన ‘కథానికా రచన’ను ఆవిష్కరించారు.
అలాగే స్వదేశీ దీపక్ రచించిన దాసరి అమరేంద్ర అనువాదం ‘కోర్టు మార్షల్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కారా రచన ‘అప్రజ్ఞాత యజ్ఞం’ పుస్తకాన్ని విరసం ప్రతినిధి చలసాని ప్రసాద్ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కె.శివారెడ్డి, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కవన శర్మ, కార్యదర్శి డాక్టర్ జి.రఘురామారావు, సంయుక్త కార్యదర్శులు ఏవీఎన్ చెట్టి, కె.నరేష్, కె.గోపాలకృష్ణ, కోశాధికారి ఎస్.వై.నారాయణరావు, పలువురు సాహితీ వేత్తలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.
‘కథాచర్వణం’లో కొన్ని ఆణిముత్యాలు
అప్రజ్ఞాతం
దోపిడీ, అదనపు శ్రమ విలువ గురించి సుదర్శనం అనే పాత్ర కథలో చర్చిస్తుంది. కథాకాలం 1951. కాంగ్రెస్ ప్రభుత్వ మాయాజాలం అర్ధమై కమ్యూనిస్టు ప్రభావం సమాజంలో రాజ్యమేలుతున్న దశ అది. రెండు శత్రు వర్గాల మధ్య కాకుండా రెండు పాజిటివ్ పాత్రల ద్వారా దోపిడీ స్వభావాన్ని చక్కగా చూపించారు కారా. తనతో సూరప్పడి వాదోపవాదాలు తనకి అర్ధమైనంతగా మిగిలినవారికి అర్ధం అవుతుందని, అర్ధమైనంత మేరకు ఆచరణలో ఎందుకు బతకలేకపోతున్నారన్న ప్రశ్న సుదర్శనాన్ని వెంటాడుతుంది. సూరప్పడు దోపిడీ చేయలేదు... సూరప్పడు చేత దోపిడీ చేయబడింది. రెండింటి ఫలితం ఒక్కటే అయినప్పటికీ నైతికంగా రెండింటి మధ్యా తేడా ఉందని, అప్రజ్ఞాతం వలన సుదర్శనానికి ఈ విషయం అర్ధం కాలేదంటారు.
-నల్లూరి రుక్మిణి
సంకల్పం
ఈ కథలో రామభద్రయ్య, సుభద్ర దంపతులు ఆస్తిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడే మానసిక హింస, క్షోభను కారా బాగా విశ్లేషించారు. ఒక తరానికి, మరొక తరానికి మధ్య ఘర్షణ అనివార్యమని తెలియజేసేదిగా కథ సాగుతుంది.
- వర్మ
మహదాశీర్వచనం
ఈ కథలో కుటుంబంలోని స్త్రీ, పురుషుల సంబంధాలతోపాటు దేశంలోని ఆర్ధిక పతనం, రూపాయి విలువ పడిపోవడం వంటి విషయాలను ప్రస్తావించారు. మాంద్యంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంది, మధ్యతరగతి స్త్రీలపై మాంద్యం ప్రభావం, బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, కుటుంబ వ్యవస్థపై విమర్శలు, రక్షణ లేని జీవితం అంశాలపై మహదాశీర్వచనం కథలో కారా మాస్టారు బాగా విశదీకరించారు.
-కాత్యాయనీ విద్మహే
అదృశ్యం
కారా 21 ఏళ్ల వ యసులో 1945 సంవత్సరంలో ‘అదృశ్యం’ కథ రాశారు. స్త్రీ, పురుష సంబంధాలు, నైతిక విలువల మధ్య చర్చ ఈ కథలో ప్రధానంగా కన్పిస్తుంది. 70 ఏళ్ల కిందట రాసినా ఇప్పటికీ కథావస్తువులో కొత్తదనం కన్పించడం విశేషం. ఈ కాలానికి కూడా కథ ఉపయోగపడుతుంది. ఎవరినీ సమర్ధించరు. ఎవరినీ వ్యతిరేకించరు. తప్పు ఒప్పులతో నిమిత్తంలేకుండా ఆయా అవసరాలు కోరికలను బట్టి ఏర్పడతాయని స్పష్టం చేశారు.
- మల్లీశ్వరి
అన్మెమ్మ నాయురాలు
ఈ కథలో రెండు గ్రామాల మధ్య ఉన్న భూమి కోసం ఇరు గ్రామాల ప్రజల తగాదాను బాగా విశ్లేషించారు. ఈ క్రమంలో కోర్టుకు వెళ్ళగా రెండు గ్రామాల ప్రజలు ఆర్థికంగా పూర్తిగా చితికిపోతారు. చివరికి కోర్టు తీర్పు ఇచ్చేసరికి భూమిని సేద్యం చేయలేని
పరిస్థితి. 1934 ప్రాంతంలో జరిగిన సంఘటనపై కారా రాసిన పుస్తకం అన్మెమ్మ నాయురాలు. -అట్టాడ అప్పలనాయుడు
స్నేహం
స్నేహం 1969లో యువ మాసపత్రికలో అచ్చయిన కథ. నిడివిలో చిన్న కథ అయినప్పటికీ చదివిన వారి మెదడును చర్చా వేదికగా మారుస్తుంది. మనసును ఊగిసలాడిస్తుంది. కేవలం ఆరు పాత్రలతో కథను క్లుప్తంగా చెప్పారు కారా.
-కలశపూడి శ్రీనివాసరావు
జీవధార
ఈ కథలో మానవ విలువల గురించి చర్చించారు. అందరూ సమృద్ధిగా సంతోషంగా ఉండాలన్నదే మానవుల ప్రాథమిక మౌలికాంశంగా ఇందులో చూపారు. నీళ్ల కోసం స్త్రీలు పడే బాధను బాగా వర్ణించారు కారా. స్త్రీలను వ్యక్తిగా, శ్రమజీవిగా చూస్తారే తప్ప, ఎక్కడా శృంగార భావన కనిపించదు.
-అయ్యగారి సీతారత్నం
మా అనుబంధం మాటలకందనిది
నేను 1973 బ్యాచ్ విద్యార్థిని. చాలా రోజుల తర్వా త మాస్టారు ని కలవడం ఆనందంగా ఉంది. మాస్టారంటే మాకెంతో గౌరవం. ఆయనతో మాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. మ్యాధ్స్ చాలా బాగా చెప్పేవారు. మాస్టా రు ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన మాకు నేర్పించిన క్రమశిక్షణ వల్ల ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం.
-పి.భోగేంద్రబాబు, జాయింట్ సెక్రటరీ,విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్
కుటుంబ సభ్యుడిలా మెలిగాను
నేను కారా మాస్టారి ఇం ట్లోనే ఎక్కువసేపు గడిపేవాణ్ని.మాస్టా రుగారి అబ్బాయి, నేను క్లాస్ మేట్స్. ఆ విధంగా నాకు వారి కుటుంబంతో అవినాభావ సం బంధం ఏర్పడింది. నా మాధ్యమిక విద్య అంతా మాస్టారి నిర్దేశకత్వంలో జరిగింది. నేను ఇంత పెద్ద డాక్టర్‌గా ఎదిగానంటే... దానికి పునాది ఈ స్కూలేనని నేననుకుంటాను.
- పి.వి.సుధాకర్, కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్
విలువలకు నిలువెత్తు దర్పణం
మాస్టారు 90వ పుట్టిన రోజు వేడుక ల్లో పాల్గొన డం మా అదృష్టం. ఉత్తమ విలువల కోసం బతికే ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉంటారనే దానికి నిలువెత్తు దర్పణం కారా మాస్టారు. నాతో పాటు మా అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఈ జనరేషన్ పిల్లలకు ఈ వాతావరణం, గురువు పట్ల భక్తి, గౌరవం వంటివి తెలియాలని తీసుకొచ్చాను.
- రామన్, ఇన్సూరెన్స్
గురు వందనం
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
సాక్షి, విశాఖపట్నం : అందరికీ కథకుల గురువు... తమకు మాత్రం విద్యాబుద్ధులు నేర్పిన అసలైన గురువు... లెక్కల చిక్కుల్ని ఎలా పరిష్కరించాలో చెప్పి లెక్కగా బతకడమెలాగో నేర్పిన జగమెరిగిన మా‘స్టారు’... సొంత బిడ్డల్లా ప్రేమించి, తమ ఉన్నతి కోసం తపించిన ఆత్మబంధువు... అందుకే కారా మాస్టారి 90వ జన్మదినోత్సవాన్ని ఆయన శిష్యులు ఘనంగా జరిపారు. సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో ఆయన దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ సమావేశమై గురువుగారితో కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1954 బ్యాచ్ నుంచి ఆయన వద్ద విద్యనభ్యసించినవారంతా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. స్కూలు ఆవరణలో ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం సాగింది. ఆనాటి విద్యార్థులు ఈ రోజున మేటి స్థానంలో ఉన్నారు. వారు తన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలను, గురుభక్తిని చూసి కారా మాస్టారు భావోద్వేగానికి లోనయ్యారు. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో శిష్యులంతా బ్యాచ్‌ల వారీగా మాస్టారితో ఫోటోలు దిగారు.