తేడాగా రాయడానికే కలం పట్టాను - కాళీపట్నం రామారావు | Pen to write different degree | Sakshi
Sakshi News home page

తేడాగా రాయడానికే కలం పట్టాను - కాళీపట్నం రామారావు

Published Fri, Nov 7 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

తేడాగా రాయడానికే  కలం పట్టాను   - కాళీపట్నం రామారావు

తేడాగా రాయడానికే కలం పట్టాను - కాళీపట్నం రామారావు

తొలినాళ్లలో మీ జీవితంపై ప్రభావం కలిగించిన వ్యక్తులు ఎవరు?

 మా గ్రామం పేరు పెద మురపాక (శ్రీకాకుళం). నిజానికి అది ఏడు గ్రామాలకు కూడలే అయినా చిన్న ఊరే. ఆ ఊరిలో దినపత్రికలు చదివే పెద్దలు ముగ్గురుండేవారు. వారు మా తండ్రి కాళీపట్నపు పేర్రాజుగారు, పాలిశెట్టి అప్పల సూరిగారు, భద్రం సత్యనారాయణా చార్యులుగారు. వీరి మాటలు వింటూ ఉండేవాడిని. నేను ఫోర్త్ ఫామ్‌లో ఉండగా తొలిసారిగా రచన చేయడం జరిగింది. అందులో పదమూడేళ్ల బాలిక భగవద్గీతను విమర్శిస్తూ మాట్లాడినట్టుగా నేను రాసేను. అది మా నాన్న కంటపడింది. ఆయన నువ్వుగానీ నీ చెల్లెలుగానీ భగవద్గీత చదివేరా అని ప్రశ్నించారు. లేదన్నాను. ఇప్పుడు చదువుకోవడం ముఖ్యం. కొంత జ్ఞానం అంటూ వచ్చాక రచనలు చేయవచ్చు అని చెప్పారు. ఆ మాటతో చదవడం మొదలుపెట్టాను. ఏవో ఇతిహాసాలు తప్ప మిగిలిన సాహిత్యం అంతా లైబ్రరీలోనో పుస్తకాలున్నవారి ఇళ్లలోనో చదువుకున్నాను.

19 ఏళ్ల వయసులో మీరు రాసిన తొలి కథ ‘ప్లాట్‌ఫారమ్’ (1943) నేపథ్యం చెప్పండి

నా తొలి రైలు ప్రయాణం నా పన్నెండేళ్ల వయసులో చేశాను. 1937లో శ్రీకాకుళం స్టేషన్ (ఆముదాలవలస) నుంచి సిగడాం రైలు ప్రయాణం చేశాను. ఆ రోజులలోనే విశాఖపట్నానికి ఒక పెళ్లికి రావడం జరిగింది. ఇది నా మనసులో పడి ఉండవచ్చు. ప్లాట్‌ఫారమ్ కథలో భర్త కోసం ఎదురు చూసే ఒక కొత్త పెళ్లికూతురిని మనుషుల కోసం ఎదురు చూసే ప్లాట్‌ఫారమ్‌తో పోల్చి రాయడం విలక్షణంగా ఉందని కొందరు అన్నారు.

ఇరవై ఏళ్ల రచయిత అంటే ప్రేమ, వసంతం, యువతుల గురించి ఊహలు వంటివి  రాస్తారు. కాని మీరు ఆ వయసులో రాబర్ట్ క్లైవ్ గురించి ఒక కథ (అడ్డం తిరిగిన చరిత్ర) రాశారు... ఆ రోజులలో మాకు భారతదేశ చరిత్ర మాత్రమే కాకుండా బ్రిటిష్ చరిత్ర కూడా పాఠ్యాంశంగా ఉండేది. అది బాగా చదివాను. చిన్నప్పుడే తుపాకీ గుండు కాల్చుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసి విఫలమైన రాబర్ట్ క్లైవ్ అప్పుడే కన్ను మూసుంటే భారతదేశ చరిత్ర వేరుగా ఉండేదన్న ఊహతో ఆ కథ పుట్టింది. తేడాగా రాద్దామన్నదే నా ఉద్దేశం. అయితే అందరికన్నా వేరుగా రాస్తున్నానని నేనెప్పుడూ  భావించలేదు.

పాతికేళ్ల వయసులో మీరు చేసిన రచనలు గమనిస్తే అవి తాత్త్వికంగా, తార్కికంగా ఉంటాయి. ఏమిటీ లోకం అనే బెంగా, సమస్యలకు పరిష్కారాలుంటాయనే ఆశా రెండూ కనిపిస్తాయి... నా పద్దెనిమిదేళ్ల వయసులో మానసిక సంక్షోభానికి గురి కావడం ఇంట్లో చెప్పకుండా ఒకటి రెండుసార్లు వెళ్లిపోవడాలు ఆత్మహత్యా ప్రయత్నం వంటివి జరిగాయి. ఇలాంటి ఆందోళనలన్నింటికీ సాహిత్యంలోనూ జీవితంలోనూ పరిష్కారాలు ఉంటాయి అని పెద్దలు చెప్పడం జరిగింది. దాని ఫలితంగానే నా  రచనలలో కూడా అలాంటి చింతన కనిపించింది.
 కీర్తి కాముడు (1949) కథ రాసే కాలానికి మీకు 25 ఏళ్లు. కీర్తి అనేది ఒక అనవసరమైన బరువు అనే అవగాహన అప్పటికే మీకు ఉంది. ఆ సమయానికే మీకు కీర్తి, గుర్తింపు వచ్చాయా?  లేదు. గుర్తింపు రెండు రకాలు. పాఠకులు గుర్తించడం. తెలిసిన మిత్రులు, సాటి రచయితలు చదివి గుర్తించడం. మొదటిది కొంచెం కష్టం. ఎందుకంటే పాఠకులకు మనం నిజంగా నచ్చితే తప్ప గుర్తించరు. కాని మిత్రులు, సాటి రచయితలు గుర్తించడానికి ఏమి? కాని ఆ రెండో గుర్తింపు కూడా రాలేదు. ఆ కాలంలో విశాఖ రచయితలలో బలివాడ కాంతారావు గారికే చాలా ఎక్కువ గుర్తింపు ఉండేది. అంత పేరు నాకు రాలేదే అని వారి పట్ల నాకు ఆ రోజులలో  స్పర్థ కూడా ఉండేది . అది కొంతకాలం కొనసాగింది.

 ‘రాగమయి’ (1950) మీ మొదటి నవల. దీని ద్వారా మీకంటూ కొంత పాఠక లోకాన్ని సమకూర్చుకోగలిగారా?
 రాగమయి నవలికను ఒక వారం రోజులలో రాయగలిగాను. దానిని మెచ్చుకున్న పాఠకలోకం కూడా ఏర్పడింది. అయితే నాకు అర్థం అయినది ఏమంటే పాఠకులను అర్థం చేసుకోవడం కష్టమని. నేను ఏ పాఠకులను దృష్టిలో పెట్టుకొని రాయాలో వారికి అంతే నచ్చే రచనలు చేయాలంటే ఇంకా చేయాలని అప్పట్లో నేను తెలుసుకున్నాను. కథలకు రంగులు వేయకుండా సహజంగా చెప్పాలనే అవగాహన కూడా అప్పుడే కలిగింది. అందుకే అంటాను 1957 వరకూ నా కథలన్నీ కథలు రాయడానికి అవసరమైన సాధన కొరకే ఉపయోగపడ్డాయని. అసలైన కథలు ఆ తర్వాత రాసినట్టే లెక్క.

మీ కథలకు అచ్చుకు ముందు తొలి పాఠకుడు ఎవరైనా ఉండేవారా?

ఐ.విగా పేరొందిన ఇవటూరి సాంబశివరావు నా కథలకు తొలి చదువరి. గ్రామీణ విషయాలు రాసేటప్పుడు అవి సరిగానే ఉన్నా పెద మురపాక కరణీకం చేసిన మా తమ్ముడు కాళీపట్నపు కృష్ణారావు మరొక్కసారి సరి చూసేవాడు.
 
రావిశాస్త్రి గురించి మీ పరిచయం గురించి...

 ఆయన ఆనర్స్ చదువుకొని కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న లాయర్. ఆయనని మనం కలవవచ్చునా అనే సంశయం నాలో ఉండేది. చివరకు ఒక మీటింగ్‌లో కలిశాం. వారు చాలా స్నేహశీలి అని గ్రహించాను. ఆయన కూడా నాపై శ్రద్ధ పెట్టేవారని గ్రహించాను. సరస్వతీహాల్ టీబల్లల వద్దా లీలామహల్ అరుగులపై దాదాపు రోజూ కలిసేవారం. ఆయన ప్రోద్బలం వల్ల ఇంగ్లిష్ సాహిత్యం చదవడం ఇంగ్లిష్ సినిమాలు చూడటం జరిగింది. వారి పరోక్ష ప్రోత్సాహం నేను కథలు రాయగలననే నమ్మకం పెంచింది.

‘యజ్ఞం’ కథ రాసే ఆలోచన ఎలా కలిగింది? దీనిని మీరు 1964లో రాస్తే 1966లో కానీ అచ్చు కాలేదు. దీనిని అచ్చుకు ముందే చదివిన వారు ఉన్నారా? అచ్చు తరువాతి స్పందనలు...

విశాలాంధ్ర వారి నవలల పోటీకి రాద్దామనుకున్న ఇతివృత్తం అది. 1964లో ఒక హోటల్లో కాఫీ తాగుతుండగా అప్పల్రాముడు పాత్ర నా కళ్ల ముందు అవుపడింది. అది నాలో కలిగించిన ప్రేరణ ప్రభావంతో ఆము తిన్న పసరంలా తయారయ్యాను. ఆ కథ గురించి ఐ.వి సాంబశివరావుతో చెప్తే ఇది తప్పకుండా రాయాల్సిందే అని రాసే వరకూ ఊరుకోలేదు. అలా రెండు మూడు నెలల్లో యజ్ఞం తయారైంది. తెలుగు కథ ఉన్నంతకాలం ఈ కథ ఉంటుందని శాస్త్రిగారు అన్నట్టు నాకు గుర్తు. రోజూ ఎంత రాస్తూ ఉంటే అంతా చదివినవాడు ఐ.వి. కథ పూర్తి అయినాక ఫెయిర్ కాపీ చదివినవారు రాచకొండ. నా భ్రమో ఏమో తెలీదుకానీ తరువాత్తరువాత అసలు తానా కథ చదవనే లేదని శాస్త్రిగారు అంటూ ఉండేవారు. ఈ కథను నేను ద్రష్టగా, కథకుడిగా, పాఠకుడిగా, విమర్శకుడిగా, రంధ్రాన్వేషిగా అయిదు బాధ్యతలు నిర్వహిస్తూ రాశాను. వచ్చిన స్పందనల్లో వ్యతిరేకమూ అనుకూలమూ అయినవి అప్పుడూ ఇప్పుడూ ఉన్నా ఎక్కువమంది సమర్థింపు కథకు లభించిందనే నా భావన.
 
ఆత్మకథ రాస్తారా?

సమాజానికి పనికిరాని వ్యక్తిగత విషయాలు గుదిగుచ్చి మన ఘనతలు చెప్పుకోవడం కన్నా సమాజ పురోగమనానికి దోహదపడే నాలుగుమాటలు ఏదో రూపేణా చెప్పడమే నా మనసుకు నచ్చిన పద్ధతి. ఆ ఆలోచనలు సఫలం కావాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలతో... సెలవు..  సెలవు. నమస్కారం.  ఇంటర్వ్యూ: రామతీర్థ, జగద్ధాత్రి
 9849200385
 
తొంభై ఏళ్ల వయసులో ఇంకా మీరు రాయదల్చుకున్నవి ఏమైనా ఉన్నాయా?
‘నేటి కథ’ శీర్షికను  గతంలో నేను ఒక పత్రికలో నిర్వహిస్తున్నప్పుడు ఒక గృహిణి తన జీవితానుభవాలను కథలా రాసి పంపింది. అందులో నాకు మంచి కథాబీజం కనిపించింది. అదొక నవలగా రాయాలన్నది నా తలపు. అన్నీ అనుకూలిస్తే ఆ పని చేస్తాను.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement