Kalipatnam Rama Rao
-
తెలుగు కథను మలుపుతిప్పిన కాళీపట్నం రామారావు
-
సమాజం లెక్క తేల్చిన కథల మేష్టారు
ఆయన వృత్తిరీత్యా లెక్కల మాష్టారు. కాని సమాజంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుందని, ఒక లెక్కను పెద్దవాళ్లు కలిసి నిర్ణయిస్తారని, ఆ పెద్దవాళ్లకు రెండు రెళ్లు ఆరనీ, కింద వాళ్లకు శేషం సున్నా అనీ ఆయన స్కూల్లో పిల్లలకు కాకుండా కథల్లో పాఠకులకు చెప్పారు. మనుషులు ఈసురోమని ఉంటే అందుకు కారణం ఆ సదరు మనుషులు కారని వెనుక ఎక్కడో ఉండే మనుషులని ఆయన చెప్తారు. తెలుగు కథను ఉన్నతీకరించిన కాళీపట్నం రామారావు 97వ ఏట జీవించి అస్తమించారు. ఆయన రచనలు, ఆయన రచనా పరిశ్రమ ప్రతి తెలుగు ‘ఫ్యామిలీ’కి తెలిసి ఉండాలి. పోస్ట్‌మేన్ ఇంటికి ఉత్తరాలు తెచ్చి ఇస్తాడు. పోలీసు ఇంటికి రక్షణ కల్పిస్తాడు. ఇంజినీరు ఇల్లు కడతాడు. ప్రభుత్వ అధికారి ఇల్లు నడవడానికి అవసరమైన సంఘపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తాడు. వీరంతా సమాజంతో ఉంటూ సమాజం కోసం పని చేస్తూ సమాజంలో భాగంగా ఉంటారు. కాని ఈ సమాజం ఎలా ఉందో ఎవరు చెప్తారు? కథకుడే చెప్తాడు. సమాజాన్ని చూసి సమాజానికి దానిని తిరిగి చూపిస్తాడు కథకుడు. సమాజం ఎలా ఉందో రాసేవాణ్ణి రచయిత అనొచ్చు. అలా ఎందుకు ఉందో రాసేవాణ్ణి మంచి రచయిత అనొచ్చు. అలా ఉండకుండా ఏమి చేయవచ్చో రాసి పాఠకులను ఆలోచనాశీలురుగా, కర్తవ్యోన్ముఖులుగా చేసే రచయితను గొప్ప రచయిత అనొచ్చు. కాళీపట్నం రామారావు అలాంటి గొప్ప రచయిత. మనం ఏం చేయాలో ముందు నిర్ణయించుకోవడం అందుకు తగ్గట్టుగా జీవితాన్ని నిర్మించుకోవడం అందరూ చేయరు. కాళీపట్నం రామారావు తన వివాహం అయ్యాక, 1947 నాటి కాలంలోనే 80 రూపాయల జీతం వచ్చే స్పోర్ట్స్ డిపోలోని ఉద్యోగానికి రాజీనామా చేశారు. కారణం అది కథలు రాసుకోవడానికి అవసరమైన టైమ్ ఇవ్వదని. 30 రూపాయల జీతం వచ్చే ప్రభుత్వ ఉపాధ్యాయుడి జీతం ఎంచుకున్నాడాయన. తెలుగు కథ తనకు అవసరమై ఆయన జీవితాన్ని రూపుదిద్దుకుందా అనిపిస్తుంది. 1979లో ఆయన రిటైరయ్యారు. అది కూడా కథ చేసుకున్న ఒక ఏర్పాటే. ఎందుకంటే ఆ తర్వాతి సమయమంతా ఆయన తెలుగు కథకే ఇచ్చారు. దాదాపు 30–35 ఏళ్లు తెలుగు కథ ప్రచారానికి, సేకరణకి, భద్రపరచడానికి వెచ్చించారు. దేని నుంచి పొందామో దానికే తిరిగి ఇవ్వడం చేసిన అరుదైన రచయిత కాళీపట్నం రామారావు. శ్రీకాకుళం చైతన్యధార ప్రపంచంలో గొప్ప రచయితలందరూ జీవితంలో రకరకాల పనులు చేసినవారే. శ్రీకాకుళం జిల్లా మురపాక ప్రాంతానికి చెందిన కాళీపట్నం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కుదురుకునేంత వరకూ రకరకాల పనులు చేశారు. టైపిస్ట్‌గా, డిస్ట్రిక్ట్ కోర్టులో చిరుద్యోగిగా, రేషనింగ్ ఆఫీసులో ఎంక్వయిరీ ఆఫీసరుగా ఇలా రకరకాల పనులు చేశారు. పత్రికల్లో పని చేయాలని ఆయనకు గట్టిగా ఉండేది. మద్రాసు (చెన్నై) వెళ్లి ప్రయత్నించినా జరగలేదు. సాహిత్యం పట్ల ఏర్పడిన ఆసక్తి ఆయనను కథకుడిగా ఉండమని కోరింది. 1943లో ఆయన మొదటి కథ ‘ప్లాట్‌ఫారమో?’ అచ్చయ్యింది. ఆ తర్వాత ఆయన కొన్ని కథలు రాసినా ఇవి కాదు కదా రాయాల్సింది అని అనిపించింది. ఆలోచన కలిగించనిది కథ ఎలా అవుతుంది అని ఆయన అనుకున్నారు. పాఠకులకు ఆలోచన కలిగించాలంటే రచయితకు చదువు, అవగాహన, జ్ఞానం, హేతువు, సైద్ధాంతిక భూమిక, ప్రాపంచిక దృక్పథం ఇవన్నీ ఉండాలి కదా అని అధ్యయనంలో పడ్డారు. 1955 నుంచి దాదాపు ఎనిమిదేళ్లు కథలు రాయకుండా పూర్తిగా అధ్యయనంలో ఉండిపోయారు. 1964లో ‘తీర్పు’ కథతో అసలైన కాళీపట్నం రామారావు తెలుగు పాఠకలోకానికి తెలిశారు. 1966లో ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు సాహిత్యానికి చూపు, ఊపు ఇచ్చింది. ‘కథ ఎందుకు?’, ‘కథ ప్రయోజనం ఏమి?’, ‘కథ నడిచే మార్గం ఎలా ఉండాలి’ ఈ ప్రశ్నలన్నింటికి ఆ కథ ఒక మార్గదర్శిగా నిలిచింది. సామాజిక సమస్యలు, అంతర్గత ఆరాటాలు శరీరం మీద పీడన మనసు మీద పడుతుంది. మనసు పడే వొత్తిడి శరీరానికి హాని కలిగిస్తుంది. వ్యవస్థ గతి వ్యవస్థది మాత్రమే కాదు. ఆ గతిలో సమాజంలోని ప్రతి పౌరుడు భాగం. ఆ గతి మతి తప్పితే ఆ పౌరుడు బాధితుడవుతాడు. ఆ పౌరుడే ఇంటికొస్తే వ్యక్తిగా మారి అంటే తండ్రిగా, భర్తగా, కుమారుడిగా వొత్తిడి ఎదుర్కొంటాడు. ఈ రెంటినీ కాళీపట్నం రామారావు కథగా చేసి తెలుగు పాఠకులకు చూపారు. గుప్పిట విప్పేసినట్టుగా రాయడం ఆయన పద్ధతి కాదు. సూచించినట్టుగా పొరల చాటున దాచినట్టుగా ఆయన పరమసత్యాన్ని నిగూఢపరిచి దానిని తానే కనుగొన్న సంతృప్తిని పాఠకునికి ఇస్తారు. పౌరహితం కోరుతున్నట్టు కనిపించే ఈ సామాజిక వ్యవస్థ నిజానికి మేడిపండు. ఇది పైకి మంచిగా కనిపిస్తూ లోపల పీడితుల రక్తాన్ని తాగుతూ ఉంటుందని ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ నాటి సామాజిక, ఆర్థిక మూలాల కఠినత్వాన్ని చూపింది. ఈ కథ ముగింపులో నిస్సహాయుని ఆగ్రహ ప్రకటనగా బాధితుడు తన ఇంటి పిల్లాడి తల నరకడాన్ని రచయిత చూపిస్తాడు. నేటికీ అదే జరుగుతోంది.. బలవంతుడైన పీడకునితో పోరాటానికి దిగితే మనకు ఆపద ఎదురవుతుంది. అప్పుడు మనవాళ్లే వచ్చి మన చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఆ పోరాటం నుంచి విరమింప చేస్తారు. అయితే పోరాటం వొద్దనా? కాదు ఒకరూ ఒకరూ ఒకరూ కాక అందరు కలిసినప్పుడు బలవంతుడు తోక ముడుస్తాడన్న సూచన ఉంది అందులో. ఆ భాష, ఆ సొగసు కాళీపట్నం రామారావు కేవలం ప్రగతిశీల కథ రాసి ఉంటే ఇంత ఖ్యాతి వచ్చి ఉండేది కాదు. ఆయన తాను పుట్టి పెరిగిన శ్రీకాకుళం మీద తన కథలను నిలబెట్టి ఆ స్థానికతే విశ్వజనీయత అనే భావనతో కథలు చెప్పారు. శ్రీకాకుళపు భాషను ఆయన సొగసుగా సంభాషణల్లో దించారు. ముఖ్యం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి మల్లే ఆయన కూడా స్త్రీల పాత్రలకు ఎంతో సజీవమైన సంభాషణలను సమకూర్చారు. ‘నో రూమ్’, ‘ఆర్తి’, ‘చావు’, ‘జీవధార’, ‘భయం’... ఈ కథలన్నీ ఇందుకు ఉదాహరణ. ‘జీవధార’ కథలో పైకి నీటి సమస్య వస్తువుగా కనపడుతుంది. మురికివాడ వాసులకు తాగునీళ్లు ఉండవు. దాపులో ఒక శ్రీమంతుల ఇంటిలో కావల్సినన్ని నీళ్లు. మురికివాడ ఆడవాళ్లు రోజు ఆ శ్రీమంతుల గేటు దగ్గరకు వచ్చి నీళ్లు అడుగుతూ ఉంటారు. ఆ శ్రీమంతులు చీదరించుకుంటూ ఉంటారు. చీదరించుకుంటూ ఉంటే ఆ ఆడవాళ్లు కొన్నాళ్లు పడతారు... మరి కొన్నాళ్లు సహిస్తారు... దప్పికతో ప్రాణం పోతుంటే ఏం చేస్తారు? తిరగబడతారు. అంతమంది తిరగబడితే ఆ శ్రీమంతులు నీళ్లేం ఖర్మ ఏమైనా ఇచ్చి తోక ముడవరూ? బాధితులందరూ కలిసి తిరగబడాలి... పీడితులందరూ కలిసి తిరగబడాలి... మైనార్టీ సమూహాలు అన్నీ కలిసి తిరగబడాలి... అని రచయిత సూచన. ఏదీ ఊరికే రాదు. ‘సాధించుకోవాలి’ ఈ వ్యవస్థ నుంచి. సాధించుకోవడం మెత్తగా సాధ్యం కాదు ఎప్పటికీ. దీపధారి కాళీపట్నం రామారావు ‘విరసం’ (విప్లవ రచయితల సంఘం) ఏర్పడినప్పటి నుంచి దాదాపు 15 ఏళ్లు అందులో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు. రావిశాస్త్రి, వరవరరావు, కె.వి.రమణారెడ్డి వంటి ఉద్దండులతో ఆయన కలిసి పని చేశారు. తెలుగునాట విప్లవ కథ విస్తృతం కావడంలో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి రచయితలు సిద్ధం కావడానికి మరోవైపు మధ్యతరగతి కథను ముందుకు తీసుకెళ్లడంలో వివిన మూర్తి, కవనశర్మ తదితరులు ముందంజ వేయడానికి కాళీపట్నం రామారావు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు ‘సాహిత్య అకాడెమీ’ వచ్చినా తిరస్కరించారు. కొత్త కథకులను సిద్ధం చేసేందుకు ఊరూరు తిరిగి వర్క్‌షాపులు పెట్టారు. కథామెళకువలు చెప్పే వ్యాసాలు రాసి పుస్తకాలు వెలువరించారు. ఈ సమయంలోనే ఆయన ‘కథల మేష్టారు’గా గౌరవం పొందసాగారు. కథానిలయం 1996 ప్రాంతంలో నిజానికి ఎవరైనా సరే విశ్రాంత జీవనం కోరుకునే వయసులో ఆయన ‘కథానిలయం’ అనే బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఈ ఆలోచన చెప్పినప్పుడు ముందు హేళన, ఆ తర్వాత సంశయం, ఆ తర్వాత అంగీకారం పొందారు. తెలుగులో వచ్చిన కథలన్నీ ఒక్కచోట చేరాలి అని ఆయన చేసిన ఆలోచన ఇవాళ తెలుగువారికి ఒక విలువైన భాండాగారాన్ని సిద్ధం చేసింది. శ్రీకాకుళంలో ఆయన రెండస్తుల ‘కథా నిలయం’ కట్టడానికి కథాభిమానులు తలా ఒక ఇటుక ఇచ్చారు. ఇందుకోసమై హైదరాబాద్ రవీంద్రభారతిలో పెద్ద కార్యక్రమం చేసి కాళీపట్నంకు ‘లక్ష రూపాయల’ పర్స్ అందజేశారు. తెలుగులో వచ్చిన వీక్లీలు, మంత్లీలు, కథాసంకలనాలు, వాటితో పాటు రచయితల డేటా, వారు రాసిన కథల పట్టిక ఇవన్నీ చాలా పెద్ద పని. కాళీపట్నం తన భుజాల మీద వేసుకు చేశారు. ఆ తర్వాత ఆ ఆలోచన ఆ మొత్తం కథలను డిజిటలైజ్ చేయడం వైపు మళ్లింది. ఇవాళ ‘కథానిలయం’ వెబ్సైట్లో వేలాది కథలు డిజిటలైజ్ అయి ఉన్నాయి. విద్యార్థులకు, అధ్యయనం చేయాలనుకునేవారికి ఆ సైట్ ఒక అతి పెద్దసోర్స్. ఏనాటి కథలో, కథకులో తెలుసుకోవాలంటే ఆ సైట్‌కు వెళ్లక తప్పదు. మరో భాషకు ఇలాంటి సైట్ ఏమాత్రం లేదు. ఇది తెలుగువారి ఘనత. ఇందుకు కారకులు కాళీపట్నం. నిరంతర అధ్యయన శీలి కాళీపట్నం రామారావు నిరంతర అధ్యయనంలోనే ఉన్నారు. 96 ఏళ్లు వచ్చినా కన్ను కనిపించినంత సేపు చదవడానికే ఇష్టపడ్డారు. శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావు తమ కథను చదివి మెచ్చుకుంటే అదే పెద్ద అవార్డుగా యువ కథకులు భావిస్తారు. ఆయన నిరంతరం కొత్త కథకులను ప్రోత్సహిస్తూనే వచ్చారు. 2006లో రాసిన ‘అన్నెమ్మ నాయురాలు’ ఆయన చివరి కథ. తెలుగు కథ పయనంలో కాళీపట్నం అస్తమయం వల్ల ఒక శకం ముగిసింది. అలాంటి రచయిత, కథా కార్యకర్త మరొకరు సిద్ధం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. తెలుగు కథ ఉన్నంత వరకూ తప్పక కాళీపట్నం ప్రస్తావన, శ్రీకాకుళం ఉనికి ఉంటూనే ఉంటుంది. ఆ మహా కథకునికి నివాళి. కమిటెడ్ రైటర్ కాళీపట్నం రామారావును నిబద్ధ రచయితగా చెబుతారు. నిబద్ధతకు ఒక ఉదాహరణగా చూపుతారు. తన చేతిలో ఉన్న కథను, అక్షరాన్ని దేనికి నిబద్ధం చేయాలో ఎంత మేరకు చేయాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని అంటారు. కనపడిందంతా, తోచిందంతా రాయడం కాళీపట్నం ఏనాడూ చేయలేదు. పొద్దుపోక రాయడం చేయలేదు. కాలక్షేపం కోసం రాయడాన్ని అసలు చేయలేదు. ఒక సత్యాన్ని కనుగొని ఆ సత్యానికి అవసరమైన కథను, పాత్రలను ఎంచుకుని, ఒక ప్రయోజనాన్ని ప్రతిపాదించి, ఒక చూపును ఇవ్వగలిగే కథ రాయగలిగినప్పుడే రాశారు. అందుకే ఆయన ముఖ్యమైన కథలు ఒక డజనుకు మించవు. అయినా సరే అవి వంద కథలకు సమానమైన ఖ్యాతి పొందాయి. – సాక్షి ఫ్యామిలీ -
శతమానం భవతి
ఘనంగా కాళీపట్నం-నవతీతరణం కథల మాస్టారుకు ఘన సత్కారం కారా కథలపై విశ్లేషణాత్మక సదస్సు జీవితం నుంచి సాహిత్యాన్ని సృజించారు... వాస్తవాలను రంగరించి కథలల్లారు... కథకుల గురువుగా నిలిచారు... కారా మాస్టారు కథా నిలయం కోసం జీవితాన్ని ధార పోసారు.. అందుకే ఆయన 90 పుట్టిన రోజు అందరికీ వేడుక... కథకు పట్టాభిషేకం జరుగుతున్న వేళ ఆనంద వీచిక... కాళీపట్నం నవతీతరణ సత్కార మహోత్సవాన్ని అభిమానులు ఆదివారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఉదయం సెయింట్ ఆంథోనీ స్కూలులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంతో ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి ఘన సత్కారంతో ముగిశాయి. సీతంపేట : ప్రచురణలు చవకగా పాఠకులకు అందుబాటులోకి తేవాలని, దీనికి రచయితలంతా ముందుకు వచ్చి సహకరించాలని కథల మాస్టారు కాళీపట్నం రామారావు అన్నారు. కాళీపట్నం-నవతీతరణం సత్కార మహోత్సవాల్లో భాగంగా ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆదివారం ‘కారా కథాచర్వణం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కారా మాస్టారి రచనల్లో ఎంపిక చేసిన 9 ఆణిముత్యాల్లాంటి కథలను సాహితీవేత్తలు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కారా మాస్టారు మాట్లాడుతూ పుస్తకాలను ఇంటర్నెట్లో పెడితే బాగుంటుందని, కానీ ఎంతమంది పాఠకులు అందిపుచ్చుకోగలరన్న సందేహాన్ని వెలిబుచ్చారు. రానున్న రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా పుస్తకాలను చదివే వారికి ప్రయోజనంగా ఉంటుందన్నారు. అనంతరం కారాయజ్ఞం పుస్తక ప్రచురణ సంస్థ ప్రచురించిన మొదటి పుస్తకం... మహమ్మద్ ఖాన్ రచించిన ‘కథానికా రచన’ను ఆవిష్కరించారు. అలాగే స్వదేశీ దీపక్ రచించిన దాసరి అమరేంద్ర అనువాదం ‘కోర్టు మార్షల్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కారా రచన ‘అప్రజ్ఞాత యజ్ఞం’ పుస్తకాన్ని విరసం ప్రతినిధి చలసాని ప్రసాద్ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కె.శివారెడ్డి, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కవన శర్మ, కార్యదర్శి డాక్టర్ జి.రఘురామారావు, సంయుక్త కార్యదర్శులు ఏవీఎన్ చెట్టి, కె.నరేష్, కె.గోపాలకృష్ణ, కోశాధికారి ఎస్.వై.నారాయణరావు, పలువురు సాహితీ వేత్తలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. ‘కథాచర్వణం’లో కొన్ని ఆణిముత్యాలు అప్రజ్ఞాతం దోపిడీ, అదనపు శ్రమ విలువ గురించి సుదర్శనం అనే పాత్ర కథలో చర్చిస్తుంది. కథాకాలం 1951. కాంగ్రెస్ ప్రభుత్వ మాయాజాలం అర్ధమై కమ్యూనిస్టు ప్రభావం సమాజంలో రాజ్యమేలుతున్న దశ అది. రెండు శత్రు వర్గాల మధ్య కాకుండా రెండు పాజిటివ్ పాత్రల ద్వారా దోపిడీ స్వభావాన్ని చక్కగా చూపించారు కారా. తనతో సూరప్పడి వాదోపవాదాలు తనకి అర్ధమైనంతగా మిగిలినవారికి అర్ధం అవుతుందని, అర్ధమైనంత మేరకు ఆచరణలో ఎందుకు బతకలేకపోతున్నారన్న ప్రశ్న సుదర్శనాన్ని వెంటాడుతుంది. సూరప్పడు దోపిడీ చేయలేదు... సూరప్పడు చేత దోపిడీ చేయబడింది. రెండింటి ఫలితం ఒక్కటే అయినప్పటికీ నైతికంగా రెండింటి మధ్యా తేడా ఉందని, అప్రజ్ఞాతం వలన సుదర్శనానికి ఈ విషయం అర్ధం కాలేదంటారు. -నల్లూరి రుక్మిణి సంకల్పం ఈ కథలో రామభద్రయ్య, సుభద్ర దంపతులు ఆస్తిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడే మానసిక హింస, క్షోభను కారా బాగా విశ్లేషించారు. ఒక తరానికి, మరొక తరానికి మధ్య ఘర్షణ అనివార్యమని తెలియజేసేదిగా కథ సాగుతుంది. - వర్మ మహదాశీర్వచనం ఈ కథలో కుటుంబంలోని స్త్రీ, పురుషుల సంబంధాలతోపాటు దేశంలోని ఆర్ధిక పతనం, రూపాయి విలువ పడిపోవడం వంటి విషయాలను ప్రస్తావించారు. మాంద్యంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంది, మధ్యతరగతి స్త్రీలపై మాంద్యం ప్రభావం, బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, కుటుంబ వ్యవస్థపై విమర్శలు, రక్షణ లేని జీవితం అంశాలపై మహదాశీర్వచనం కథలో కారా మాస్టారు బాగా విశదీకరించారు. -కాత్యాయనీ విద్మహే అదృశ్యం కారా 21 ఏళ్ల వ యసులో 1945 సంవత్సరంలో ‘అదృశ్యం’ కథ రాశారు. స్త్రీ, పురుష సంబంధాలు, నైతిక విలువల మధ్య చర్చ ఈ కథలో ప్రధానంగా కన్పిస్తుంది. 70 ఏళ్ల కిందట రాసినా ఇప్పటికీ కథావస్తువులో కొత్తదనం కన్పించడం విశేషం. ఈ కాలానికి కూడా కథ ఉపయోగపడుతుంది. ఎవరినీ సమర్ధించరు. ఎవరినీ వ్యతిరేకించరు. తప్పు ఒప్పులతో నిమిత్తంలేకుండా ఆయా అవసరాలు కోరికలను బట్టి ఏర్పడతాయని స్పష్టం చేశారు. - మల్లీశ్వరి అన్మెమ్మ నాయురాలు ఈ కథలో రెండు గ్రామాల మధ్య ఉన్న భూమి కోసం ఇరు గ్రామాల ప్రజల తగాదాను బాగా విశ్లేషించారు. ఈ క్రమంలో కోర్టుకు వెళ్ళగా రెండు గ్రామాల ప్రజలు ఆర్థికంగా పూర్తిగా చితికిపోతారు. చివరికి కోర్టు తీర్పు ఇచ్చేసరికి భూమిని సేద్యం చేయలేని పరిస్థితి. 1934 ప్రాంతంలో జరిగిన సంఘటనపై కారా రాసిన పుస్తకం అన్మెమ్మ నాయురాలు. -అట్టాడ అప్పలనాయుడు స్నేహం స్నేహం 1969లో యువ మాసపత్రికలో అచ్చయిన కథ. నిడివిలో చిన్న కథ అయినప్పటికీ చదివిన వారి మెదడును చర్చా వేదికగా మారుస్తుంది. మనసును ఊగిసలాడిస్తుంది. కేవలం ఆరు పాత్రలతో కథను క్లుప్తంగా చెప్పారు కారా. -కలశపూడి శ్రీనివాసరావు జీవధార ఈ కథలో మానవ విలువల గురించి చర్చించారు. అందరూ సమృద్ధిగా సంతోషంగా ఉండాలన్నదే మానవుల ప్రాథమిక మౌలికాంశంగా ఇందులో చూపారు. నీళ్ల కోసం స్త్రీలు పడే బాధను బాగా వర్ణించారు కారా. స్త్రీలను వ్యక్తిగా, శ్రమజీవిగా చూస్తారే తప్ప, ఎక్కడా శృంగార భావన కనిపించదు. -అయ్యగారి సీతారత్నం మా అనుబంధం మాటలకందనిది నేను 1973 బ్యాచ్ విద్యార్థిని. చాలా రోజుల తర్వా త మాస్టారు ని కలవడం ఆనందంగా ఉంది. మాస్టారంటే మాకెంతో గౌరవం. ఆయనతో మాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. మ్యాధ్స్ చాలా బాగా చెప్పేవారు. మాస్టా రు ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన మాకు నేర్పించిన క్రమశిక్షణ వల్ల ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. -పి.భోగేంద్రబాబు, జాయింట్ సెక్రటరీ,విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కుటుంబ సభ్యుడిలా మెలిగాను నేను కారా మాస్టారి ఇం ట్లోనే ఎక్కువసేపు గడిపేవాణ్ని.మాస్టా రుగారి అబ్బాయి, నేను క్లాస్ మేట్స్. ఆ విధంగా నాకు వారి కుటుంబంతో అవినాభావ సం బంధం ఏర్పడింది. నా మాధ్యమిక విద్య అంతా మాస్టారి నిర్దేశకత్వంలో జరిగింది. నేను ఇంత పెద్ద డాక్టర్‌గా ఎదిగానంటే... దానికి పునాది ఈ స్కూలేనని నేననుకుంటాను. - పి.వి.సుధాకర్, కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ విలువలకు నిలువెత్తు దర్పణం మాస్టారు 90వ పుట్టిన రోజు వేడుక ల్లో పాల్గొన డం మా అదృష్టం. ఉత్తమ విలువల కోసం బతికే ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉంటారనే దానికి నిలువెత్తు దర్పణం కారా మాస్టారు. నాతో పాటు మా అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఈ జనరేషన్ పిల్లలకు ఈ వాతావరణం, గురువు పట్ల భక్తి, గౌరవం వంటివి తెలియాలని తీసుకొచ్చాను. - రామన్, ఇన్సూరెన్స్ గురు వందనం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం సాక్షి, విశాఖపట్నం : అందరికీ కథకుల గురువు... తమకు మాత్రం విద్యాబుద్ధులు నేర్పిన అసలైన గురువు... లెక్కల చిక్కుల్ని ఎలా పరిష్కరించాలో చెప్పి లెక్కగా బతకడమెలాగో నేర్పిన జగమెరిగిన మా‘స్టారు’... సొంత బిడ్డల్లా ప్రేమించి, తమ ఉన్నతి కోసం తపించిన ఆత్మబంధువు... అందుకే కారా మాస్టారి 90వ జన్మదినోత్సవాన్ని ఆయన శిష్యులు ఘనంగా జరిపారు. సెయింట్ ఆంథోనీ స్కూల్లో ఆయన దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ సమావేశమై గురువుగారితో కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1954 బ్యాచ్ నుంచి ఆయన వద్ద విద్యనభ్యసించినవారంతా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. స్కూలు ఆవరణలో ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం సాగింది. ఆనాటి విద్యార్థులు ఈ రోజున మేటి స్థానంలో ఉన్నారు. వారు తన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలను, గురుభక్తిని చూసి కారా మాస్టారు భావోద్వేగానికి లోనయ్యారు. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో శిష్యులంతా బ్యాచ్‌ల వారీగా మాస్టారితో ఫోటోలు దిగారు. -
అనగనగా ఓ యజ్ఞం
90 ఏళ్ల కారా కాళీపట్నం రామారావు 50 ఏళ్ల కింద- 1966లో ‘యజ్ఞం’ కథ రాశారు. అప్పట్నించి ఇప్పటి వరకూ చదివినవాళ్లూ చదవనివాళ్లూ దాని గురించి మాటలాడుకుంటూనే ఉన్నారు. కాగితాలు కాగితాలు రాసేస్తూనే ఉన్నారు. ఇది ఊరు కథ కాదు దేశం కథ అన్న వాళ్లున్నారు. కాలం కథ అన్నవాళ్లున్నారు. ఓ గ్రామం మౌఢ్యం గురించి గురజాడ రాస్తే దాని రాక్షసం గురించి రాసిన కథ అన్నవాళ్లున్నారు. చదరం ఎండ అని రాశాడంటే ఈ లెక్కల మాస్టరు కొలవకుండా రాయడన్న వాళ్లున్నారు. అంతా బానే ఉంది కాని కొడుకుని చంపడం ఏంటి... టట్.. అన్నవాళ్లున్నారు. ఈ మాస్టరికి రైతు సెంటిమెంటు తెలియదన్నవాళ్లున్నారు. అసలీయన కథ ప్రభుత్వం గుర్తించిందంటే ఇందులో ఏదో మర్మం ఉందని శోధించిన వాళ్లున్నారు. అసలు హరిజనులకి భూములుంటాయా ఓవేళ ఎవడో ఒకరికో ఇద్దరికో ఉంటే మాత్రం అది సమాజమంతటికీ వర్తింపజెయ్యొచ్చా అనీ ఓ ఉద్యమం నడుపుతామని ఎగేసుకుని వెళ్లినవాళ్లున్నారు. ఈ కథని మొయ్యొచ్చా ఇలాంటి తప్పుడు అవగాహన వల్లే మార్క్సు అన్న అసలు విషయాలు మర్చిపోయారు అని అన్నవాళ్లున్నారు. ఇలా ఈ కథ 50 ఏళ్లుగా రకరకాలుగా పొగిడించుకుంటూ తెగిడించుకుంటూ తెగ బతికేస్తోంది. ఇంకో వందేళ్లయినా చూసేట్టుంది. ఈ రామారావుగారు 50 ఏళ్లు నిండకుండానే కొన్ని కథలు రాసేడు. అన్నీ కలిపి ఓ యేబై వేసుకోవ చ్చు. అందులో మంచివి ఓ పాతిక ఉండొచ్చు. గొప్పవి ఓ డజనుండొచ్చు. పాతిక గుర్తుండే కథల్రాసి నలభై ఏళ్లకి పైగా దాని మీద బతికేస్తున్నాడని విసుక్కున్న వాళ్లున్నారు. ఓ కథ రాయటానికి గింజుకుగింజుకు తీసుకుంటాడు ఈయన రచయితా అని ముద్దుముద్దుగా తిట్టుకున్న వాళ్లున్నారు. నిజంగా ఆ కీర్తి మీదే ఆయన బతికేశాడా? చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాడా? తన కథలు లేదా సృజన పేరు చెప్పి మెరిగేస్తున్నాడా? రాసిన పుటలు కన్న చించిన కథలు ఎక్కువ అంటాడాయన. ఏమో మనం చూడొచ్చామా? నమ్మొద్దు. అసలు ఆయన కథలు రాయనేలేదనీ ఇంకెవరో రాసేరనీ కూడా మనం తీరీలు పీకొచ్చు. గురజాడ కన్యాశుల్కమే రాయనేదనేసినట్టు... ఉదాహరణకు ఇంత మెత్తటోడు అంతలా దొరికిన తాటిమట్టతో కనిపించని నక్కల మీదకు పరుగెత్తే పిల్లని చూడగలడా.. లోకం నాకు అవుద్ది అనే వెంపటాపు సత్యాన్ని భయం వెనక సత్యంగా మలచగలడా? అసలు భారతీయుడు, తెలుగోడు, ఆ మాటకొస్తే ఇంగ్లిషోడంత ఆలోచించగలడా? ఆవిడెవరో ఆఫ్రికా ఆవిడ తన నవలలో- కొడుకు బానిస కాకూడదని నరికేసే తండ్రిని రాసింది కదా- దానికి నోబెల్ ఇచ్చారు కదా- అజ్జదివీసి నేదంటే ఆ నోటా ఈ నోటా ఇనేసి ఈ మాస్టరు రాసేసి ఇంత కీర్తి కొట్టేసాడా? మాస్టరి పంచెకట్టూ, సెకండ్రీగ్రేడు టీచరు వృత్తీ, మాటాడ్డానికి అన్నిన్ని జాగ్రత్తలు పడటం చూసి అనుమానించి.. మన దృష్టిలో ఉండే ఊహకి భిన్నంగా వాస్తవ రూపం ఉంది కనుక డౌటైతే పడొచ్చు. కాని కారాగారు లక్ష కథల నోము పట్టారనే సంగతిని మాత్రం డౌటు పడటానికి వీల్లేదు. అంటే తన జీవిత కాలంలో కనీసం లక్ష కథలు చదవాలనే నోము. 40 ఏళ్లుగా చూస్తున్నాను. పత్రికో, పుస్తకమో లేకుండా ఆయన్ని చూట్టం గగనం. తన గురించి గప్పాలు కొట్టకుండా ఇంకోళ్ల కథల గురించి డబ్బా కొట్టటం ఇన్నిసార్లు చూసాన్నేను. ఇలా కథలు చదూకుంటూ నవ్వొచ్చినపుడు నవ్వూ... ఏడుపొచ్చినపుడు ఏడుపూ... ఆలోచన వచ్చినపుడు ఆలోచనా... కోపం వచ్చినపుడు కోపం... ఏం కథ ఇది అనిపించినపుడు విరక్తీ... బతికెయ్యొచ్చుగదా... అలాగని చదివీసి ఊరుకోలేదు. రాసినవాళ్లని వెతుక్కుంటూ వెళ్లాడు. ఉత్తరాలప్పుడు ఉత్తరాలు.. ఫోన్లప్పుడు ఫోన్లు.. నీ కథ బావుంది గురూ.. ఇలా రాసి చూడు.. అలా ఆలోచించి చూడు. ఫోను చేసినపుడు పెద్దంత్రం చిన్నంత్రం ఉండాలి గదా అదీలేదు. కథ కదిలించేస్తే ఆ కదలికంతా గొంతులో.. వాళ్లందరూ ఇప్పుడాయన సైన్యం అని నా అనుమానం. ఎందుకంటే రాతగాళ్లకన్నా ఎర్రోళ్లుండరు. ఎవడో చదివానంటే చాలు ఆ వేళ పెళ్లాం పిల్లల్ని సినిమాకు తీసుకుపోయే బాపతు. స్నేహితులకి మందుపోసి మరీ సంబరం పంచుకునే అల్ప సంతోషులు. ఇది తెలిసే ఈయన ఈ స్ట్రాటజీ ఫాలో అయాడా? పోనీ అలా కూడా బతికెయ్యలేదు. త నకి తెలిసిందేంటో వాళ్లు తెలుసుకోవాలని క థాకథనం పేరిట వ్యాసాలు రాసాడు. గింజుకు గింజుకు రాసే ఈ మనిషి కథలెలా రాయాలో ఇంకొకళ్లకి చెప్పేపాటా అని పుసు శర్మ వాపోయాట్ట. కాని అవి కూడా చదవీసి తెలుగు జనాలు ఆహా ఓహో అనీసారు. పోనీ రాసేడు. ఏదో అయింది. ఆ లక్ష కథల నోముల కథ ఏమయింది? రోజుకి అధమపక్షం రెండు కథలు తీసుకున్నా 90 ఏళ్లు అంటే 32,850 రోజులకి 60 లేదా 65 వేలైనా నమిలేసి ఉండాలిగదా.. లేదు. అసలు అన్ని కథలున్నాయా అనీసి డౌటొచ్చిందో ఏంటో 72వ ఏట ఉన్న కథలన్నీ ఓ దగ్గర పడేస్తే పోలా అనుకుని నడుం బిగించాడు. తనకొచ్చిన సాహిత్యం డబ్బులు పెట్టి స్థలం కొన్నాడు. ఇల్లు కట్టాడు. ఉన్న పుస్తకాలు అందులో పెట్టాడు. దాన్ని కథానిలయం అన్నాడు. వచ్చిన ప్రతి కథనీ రచయితలు పుస్తకంగా వేసేస్తారని లెక్కేసి అవి సంపాదించేస్తే చాలని భ్రమపడ్డాడు. నాలాంటోళ్లు వచ్చి అబ్బే పుస్తకాల్లో వచ్చినవి నూటికి ఒకటో రెండో శాతం ఉంటాయంతే అనీసరికి అప్పటికే వచ్చిన చప్పట్లతో బతికెయ్యొచ్చుగదా... లేదు. పత్రికల మీద పడ్డాడు. తిరిగాడండీ.. చిత్తు కాగితాలు పోగేసుకునేవాడిలా తిరిగాడు. అలా పోగేసినవన్నీ పుస్తకాలలో రాసి దాసరి రామచంద్రరావు లాంటి వెర్రాళ్లు దొరికితే రాయించి అది సరింగా లేదనిపించితే అయ్యవార్లంగారేం చేస్తున్నారయ్యా అంటే అన్నట్టు మళ్లీ మళ్లీ కొత్తపుస్తకాల్లో రాసి.. ఏం చెప్పమంటారు.. పదేహేనేళ్లు.. దాంతో ఏం పంజేస్తున్నాడయ్యా ఈ ముసిలాయన అని మెచ్చుకున్నోళ్లు.. పొగట్టానికి తెలుగులో పదాలు దొరక్క నోళ్లు వెళ్లబెట్టినోళ్లు.... పోనీ లక్షకథల నోము మర్చిపోయాడా అంటే అదీలేదు. వెనకబెట్టాడు కాని వదిలిపెట్టలేదు. ఈ బాకీ సంగతి తెలిసే కాబోలు అక్కడెక్కడో ఉన్నాడని చాలామంది నమ్మేవాడు ఆనోము పూర్తయే వరకూ నువ్వక్కడే ఉండనీసీడు. రాసినా చప్పట్లే.. చదివినా చప్పట్లే.. చదివిన వాటి గురించి రాసినా చప్పట్లే.. చప్పట్లు శాశ్వతం కాదని కీర్తికాముడు కథ రాసి తేల్చుకున్న కారాకి చప్పట్లే.. చప్పట్లు... వద్దంటే డబ్బులా. ఆ బరువుని పడిపోకుండా కాసుకుంటా నాబోటాళ్లు దోవ తప్పాడని నొచ్చుకుంటే ఓ దణ్ణంపెట్టి తన మానాన తాను 90 పూర్తి చేసుకుని సాగుతున్నాడు కారా మాస్ట్రు. అందరూ కలిసి ఈ కథానిలయానికి 90 ఏళ్లు నిండుతున్నాయని సంబరాలు ఆరంభించారు. సాధారణ ంగా ఇంద్రుడనీ, చంద్రుడనీ మనిషిని దేవుణ్ణి చేసేసే రాసేయటమే కనిపిస్తుంది ఇలాంటి సంబరాలలో. మరి నా తిక్కలు నావి కదా.. అందుకని సాఫల్యాలతో బాటు వైఫల్యాలూ, నిలబడ్డంతో బాటు పడిపోటాలూ, చెప్పినవాటితోబాటు చెప్పలేకపోటాలూ, తెలియటంతో బాటు తెలియకపోటాలూ.. అన్నీ కలిస్తేనే గదా.. మొత్తం గుదిగుచ్చితేనే కదా.. మనిషి బొమ్మ అవుతుంది. లేకపోతే నాలుగు తలల బ్రహ్మో, పది తలల రావణాసురుడో, మూడుకళ్ల శివుడో అవుతాడుగాని మనిషి అవడనీసి.. నేను అనుకున్నాను. ఇవన్నీ కలిపి చదూకున్న వారికి ఓ వ్యక్తి ఒక సమాజంలోనే పుడతాడనీ, తన కాలానికి అడుగు ముందుకో వెనక్కో తప్ప అతీతంగా ఉండలేడనీ అనిపించాలని నా ఊహ. 90 ఏళ్ల కారా మాస్టారు.. నా తండ్రి తర్వాత నా ఆలోచనలకు కేటలిస్టు, కాళీపట్నం రామారావు గారి లక్ష కథల నోము పూర్తయే వరకూ వదిలేస్తానని భీష్మించుకు కూర్చున్న అదేదో ఉందో లేదో తెలీనిది ఉండుంటే.. దానికి అంత శక్తి ఉండుంటే.. వదిలేస్తే.. అందాకా నేనుంటే.. వందేళ్ల సంబరాలలో కలుసుకుందాం మరి.. సెలవు. - వివిన మూర్తి, 9603234566 -
తేడాగా రాయడానికే కలం పట్టాను - కాళీపట్నం రామారావు
తొలినాళ్లలో మీ జీవితంపై ప్రభావం కలిగించిన వ్యక్తులు ఎవరు? మా గ్రామం పేరు పెద మురపాక (శ్రీకాకుళం). నిజానికి అది ఏడు గ్రామాలకు కూడలే అయినా చిన్న ఊరే. ఆ ఊరిలో దినపత్రికలు చదివే పెద్దలు ముగ్గురుండేవారు. వారు మా తండ్రి కాళీపట్నపు పేర్రాజుగారు, పాలిశెట్టి అప్పల సూరిగారు, భద్రం సత్యనారాయణా చార్యులుగారు. వీరి మాటలు వింటూ ఉండేవాడిని. నేను ఫోర్త్ ఫామ్‌లో ఉండగా తొలిసారిగా రచన చేయడం జరిగింది. అందులో పదమూడేళ్ల బాలిక భగవద్గీతను విమర్శిస్తూ మాట్లాడినట్టుగా నేను రాసేను. అది మా నాన్న కంటపడింది. ఆయన నువ్వుగానీ నీ చెల్లెలుగానీ భగవద్గీత చదివేరా అని ప్రశ్నించారు. లేదన్నాను. ఇప్పుడు చదువుకోవడం ముఖ్యం. కొంత జ్ఞానం అంటూ వచ్చాక రచనలు చేయవచ్చు అని చెప్పారు. ఆ మాటతో చదవడం మొదలుపెట్టాను. ఏవో ఇతిహాసాలు తప్ప మిగిలిన సాహిత్యం అంతా లైబ్రరీలోనో పుస్తకాలున్నవారి ఇళ్లలోనో చదువుకున్నాను. 19 ఏళ్ల వయసులో మీరు రాసిన తొలి కథ ‘ప్లాట్‌ఫారమ్’ (1943) నేపథ్యం చెప్పండి నా తొలి రైలు ప్రయాణం నా పన్నెండేళ్ల వయసులో చేశాను. 1937లో శ్రీకాకుళం స్టేషన్ (ఆముదాలవలస) నుంచి సిగడాం రైలు ప్రయాణం చేశాను. ఆ రోజులలోనే విశాఖపట్నానికి ఒక పెళ్లికి రావడం జరిగింది. ఇది నా మనసులో పడి ఉండవచ్చు. ప్లాట్‌ఫారమ్ కథలో భర్త కోసం ఎదురు చూసే ఒక కొత్త పెళ్లికూతురిని మనుషుల కోసం ఎదురు చూసే ప్లాట్‌ఫారమ్‌తో పోల్చి రాయడం విలక్షణంగా ఉందని కొందరు అన్నారు. ఇరవై ఏళ్ల రచయిత అంటే ప్రేమ, వసంతం, యువతుల గురించి ఊహలు వంటివి రాస్తారు. కాని మీరు ఆ వయసులో రాబర్ట్ క్లైవ్ గురించి ఒక కథ (అడ్డం తిరిగిన చరిత్ర) రాశారు... ఆ రోజులలో మాకు భారతదేశ చరిత్ర మాత్రమే కాకుండా బ్రిటిష్ చరిత్ర కూడా పాఠ్యాంశంగా ఉండేది. అది బాగా చదివాను. చిన్నప్పుడే తుపాకీ గుండు కాల్చుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసి విఫలమైన రాబర్ట్ క్లైవ్ అప్పుడే కన్ను మూసుంటే భారతదేశ చరిత్ర వేరుగా ఉండేదన్న ఊహతో ఆ కథ పుట్టింది. తేడాగా రాద్దామన్నదే నా ఉద్దేశం. అయితే అందరికన్నా వేరుగా రాస్తున్నానని నేనెప్పుడూ భావించలేదు. పాతికేళ్ల వయసులో మీరు చేసిన రచనలు గమనిస్తే అవి తాత్త్వికంగా, తార్కికంగా ఉంటాయి. ఏమిటీ లోకం అనే బెంగా, సమస్యలకు పరిష్కారాలుంటాయనే ఆశా రెండూ కనిపిస్తాయి... నా పద్దెనిమిదేళ్ల వయసులో మానసిక సంక్షోభానికి గురి కావడం ఇంట్లో చెప్పకుండా ఒకటి రెండుసార్లు వెళ్లిపోవడాలు ఆత్మహత్యా ప్రయత్నం వంటివి జరిగాయి. ఇలాంటి ఆందోళనలన్నింటికీ సాహిత్యంలోనూ జీవితంలోనూ పరిష్కారాలు ఉంటాయి అని పెద్దలు చెప్పడం జరిగింది. దాని ఫలితంగానే నా రచనలలో కూడా అలాంటి చింతన కనిపించింది. కీర్తి కాముడు (1949) కథ రాసే కాలానికి మీకు 25 ఏళ్లు. కీర్తి అనేది ఒక అనవసరమైన బరువు అనే అవగాహన అప్పటికే మీకు ఉంది. ఆ సమయానికే మీకు కీర్తి, గుర్తింపు వచ్చాయా? లేదు. గుర్తింపు రెండు రకాలు. పాఠకులు గుర్తించడం. తెలిసిన మిత్రులు, సాటి రచయితలు చదివి గుర్తించడం. మొదటిది కొంచెం కష్టం. ఎందుకంటే పాఠకులకు మనం నిజంగా నచ్చితే తప్ప గుర్తించరు. కాని మిత్రులు, సాటి రచయితలు గుర్తించడానికి ఏమి? కాని ఆ రెండో గుర్తింపు కూడా రాలేదు. ఆ కాలంలో విశాఖ రచయితలలో బలివాడ కాంతారావు గారికే చాలా ఎక్కువ గుర్తింపు ఉండేది. అంత పేరు నాకు రాలేదే అని వారి పట్ల నాకు ఆ రోజులలో స్పర్థ కూడా ఉండేది . అది కొంతకాలం కొనసాగింది. ‘రాగమయి’ (1950) మీ మొదటి నవల. దీని ద్వారా మీకంటూ కొంత పాఠక లోకాన్ని సమకూర్చుకోగలిగారా? రాగమయి నవలికను ఒక వారం రోజులలో రాయగలిగాను. దానిని మెచ్చుకున్న పాఠకలోకం కూడా ఏర్పడింది. అయితే నాకు అర్థం అయినది ఏమంటే పాఠకులను అర్థం చేసుకోవడం కష్టమని. నేను ఏ పాఠకులను దృష్టిలో పెట్టుకొని రాయాలో వారికి అంతే నచ్చే రచనలు చేయాలంటే ఇంకా చేయాలని అప్పట్లో నేను తెలుసుకున్నాను. కథలకు రంగులు వేయకుండా సహజంగా చెప్పాలనే అవగాహన కూడా అప్పుడే కలిగింది. అందుకే అంటాను 1957 వరకూ నా కథలన్నీ కథలు రాయడానికి అవసరమైన సాధన కొరకే ఉపయోగపడ్డాయని. అసలైన కథలు ఆ తర్వాత రాసినట్టే లెక్క. మీ కథలకు అచ్చుకు ముందు తొలి పాఠకుడు ఎవరైనా ఉండేవారా? ఐ.విగా పేరొందిన ఇవటూరి సాంబశివరావు నా కథలకు తొలి చదువరి. గ్రామీణ విషయాలు రాసేటప్పుడు అవి సరిగానే ఉన్నా పెద మురపాక కరణీకం చేసిన మా తమ్ముడు కాళీపట్నపు కృష్ణారావు మరొక్కసారి సరి చూసేవాడు. రావిశాస్త్రి గురించి మీ పరిచయం గురించి... ఆయన ఆనర్స్ చదువుకొని కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న లాయర్. ఆయనని మనం కలవవచ్చునా అనే సంశయం నాలో ఉండేది. చివరకు ఒక మీటింగ్‌లో కలిశాం. వారు చాలా స్నేహశీలి అని గ్రహించాను. ఆయన కూడా నాపై శ్రద్ధ పెట్టేవారని గ్రహించాను. సరస్వతీహాల్ టీబల్లల వద్దా లీలామహల్ అరుగులపై దాదాపు రోజూ కలిసేవారం. ఆయన ప్రోద్బలం వల్ల ఇంగ్లిష్ సాహిత్యం చదవడం ఇంగ్లిష్ సినిమాలు చూడటం జరిగింది. వారి పరోక్ష ప్రోత్సాహం నేను కథలు రాయగలననే నమ్మకం పెంచింది. ‘యజ్ఞం’ కథ రాసే ఆలోచన ఎలా కలిగింది? దీనిని మీరు 1964లో రాస్తే 1966లో కానీ అచ్చు కాలేదు. దీనిని అచ్చుకు ముందే చదివిన వారు ఉన్నారా? అచ్చు తరువాతి స్పందనలు... విశాలాంధ్ర వారి నవలల పోటీకి రాద్దామనుకున్న ఇతివృత్తం అది. 1964లో ఒక హోటల్లో కాఫీ తాగుతుండగా అప్పల్రాముడు పాత్ర నా కళ్ల ముందు అవుపడింది. అది నాలో కలిగించిన ప్రేరణ ప్రభావంతో ఆము తిన్న పసరంలా తయారయ్యాను. ఆ కథ గురించి ఐ.వి సాంబశివరావుతో చెప్తే ఇది తప్పకుండా రాయాల్సిందే అని రాసే వరకూ ఊరుకోలేదు. అలా రెండు మూడు నెలల్లో యజ్ఞం తయారైంది. తెలుగు కథ ఉన్నంతకాలం ఈ కథ ఉంటుందని శాస్త్రిగారు అన్నట్టు నాకు గుర్తు. రోజూ ఎంత రాస్తూ ఉంటే అంతా చదివినవాడు ఐ.వి. కథ పూర్తి అయినాక ఫెయిర్ కాపీ చదివినవారు రాచకొండ. నా భ్రమో ఏమో తెలీదుకానీ తరువాత్తరువాత అసలు తానా కథ చదవనే లేదని శాస్త్రిగారు అంటూ ఉండేవారు. ఈ కథను నేను ద్రష్టగా, కథకుడిగా, పాఠకుడిగా, విమర్శకుడిగా, రంధ్రాన్వేషిగా అయిదు బాధ్యతలు నిర్వహిస్తూ రాశాను. వచ్చిన స్పందనల్లో వ్యతిరేకమూ అనుకూలమూ అయినవి అప్పుడూ ఇప్పుడూ ఉన్నా ఎక్కువమంది సమర్థింపు కథకు లభించిందనే నా భావన. ఆత్మకథ రాస్తారా? సమాజానికి పనికిరాని వ్యక్తిగత విషయాలు గుదిగుచ్చి మన ఘనతలు చెప్పుకోవడం కన్నా సమాజ పురోగమనానికి దోహదపడే నాలుగుమాటలు ఏదో రూపేణా చెప్పడమే నా మనసుకు నచ్చిన పద్ధతి. ఆ ఆలోచనలు సఫలం కావాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలతో... సెలవు.. సెలవు. నమస్కారం. ఇంటర్వ్యూ: రామతీర్థ, జగద్ధాత్రి 9849200385 తొంభై ఏళ్ల వయసులో ఇంకా మీరు రాయదల్చుకున్నవి ఏమైనా ఉన్నాయా? ‘నేటి కథ’ శీర్షికను గతంలో నేను ఒక పత్రికలో నిర్వహిస్తున్నప్పుడు ఒక గృహిణి తన జీవితానుభవాలను కథలా రాసి పంపింది. అందులో నాకు మంచి కథాబీజం కనిపించింది. అదొక నవలగా రాయాలన్నది నా తలపు. అన్నీ అనుకూలిస్తే ఆ పని చేస్తాను.