కథల మాస్టారుకు ఘనసన్మానం | kalipatnam ramarao felicitated | Sakshi
Sakshi News home page

కథల మాస్టారుకు ఘనసన్మానం

Published Mon, Nov 10 2014 2:08 AM | Last Updated on Mon, Oct 1 2018 6:25 PM

కథల మాస్టారుకు ఘనసన్మానం - Sakshi

కథల మాస్టారుకు ఘనసన్మానం

 విశాఖలో సత్కరించిన శిష్యబృందం
 
 విశాఖపట్నం: ప్రముఖ కథారచయిత, కథానిలయం వ్యవస్థాపకుడు కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) 90వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కారా మాస్టారు శిష్యులు నవతీతరణం పేరుతో ఆదివారం ఆయనను ఘనంగా సత్కరించారు.  విశాఖ కళాభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ సభలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కారా మాస్టారి శిష్యులు ప్రముఖ డెర్మటాలజిస్టు డాక్టర్ రఘురామారావు, ప్రొఫెసర్ కవన శర్మ ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథి, మాజీ మేయర్ డి.వి.సుబ్బారావు కారాను సన్మాన కమిటీ పక్షాన సన్మానించి, రూ. లక్ష చెక్కును ఆయనకు గురుదక్షిణగా అందించారు. ఈ సందర్భంగా డీవీ సుబ్బారావు మాట్లాడుతూ కథ బతికున్నంత కాలం కారా ఉంటారని అన్నారు. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ చైర్మన్ ఎ.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కారా ప్రతి కథలోనూ సామాన్యుడి బతుకు అందులో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు వక్తలు ఆయనతో తమకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. రచయిత రాంభట్ల నృసింహశర్మ సత్కార పత్రాన్ని రచించి, ఆయనకు అంకితమిచ్చారు. కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, రచయిత గొల్లపూడి మారుతీరావు, విజయ్ నిర్మాణ్ అధినేత విజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలశపూడి శ్రీనివాసరావు రచించిన కలశపూడి కథలు పుస్తకాన్ని, నవతీతరణ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. బమ్మిడి జగదీశ్వరరావు హింసపాదు పుస్తకాన్ని కారా చేతుల మీదుగా ఆవిష్కరించారు.
 
 కథలపై గోష్టి: కారా నవతీతరణం సందర్భంగా ఆదివారంఉదయం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో కారా కథాచర్వణం పేరిట ఆయన కథలపైగోష్టి నిర్వహించారు.  సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో యజ్ఞం నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి దర్శకుడు ఎస్.కె. మిశ్రో ప్రయోక్తగా వ్యవహరించారు.  ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్ బృందంపాట రూపంలో కథను నడిపించటంతో నాటకం ఆసక్తికరంగా సాగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement