కారా మాస్టారికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు 2015 - ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని మే 28న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అందజేస్తారు. అవార్డుతో పాటు రూ.లక్ష ప్రైజ్ మనీ కూడా ప్రదానం చేస్తారు.
కారా మాస్టారుగా పేరొందిన 'కాళీపట్నం రామారావు' 1924, నవంబరు 9న శ్రీకాకుళం లో జన్మించారు. శ్రీకాకుళంలోనే తొలి విద్యాభ్యాసం, భీమిలిలో సెకండరీ గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1948 నుంచి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. కాళీపట్నం రామారావు ఎలిమెంటరీ స్కూలు ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ పొందారు.
కారా మాస్టారు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఆయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేశారు. 1966లో కాళీపట్నం రాసిన 'యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు.
దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు. కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఆయన ఎక్కువగా శ్రమిస్తున్నారు. ఈ కథానిలయంలో 2,000 పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి.
రచనలు:
* యజ్ఞం (నవల)
* అభిమానాలు
* రాగమయి
* జీవధార
* రుతుపవనాలు (కథా సంకలనం)
* కారా కథలు