సాహిత్యాభివృద్ధికే అవార్డులను స్వీకరిస్తున్నా
తెలుగు కథకు ఒక గుడి కట్టి ఆ విశిష్ట సాహిత్య ప్రక్రియకు తానే బడిగా, ఒడి, వరవడిగా మారి భావి తరాలకు కథామృతాన్ని పంచి ఇస్తున్న కథకుల గురువు కాళీపట్నం రామారావు. అందరిచేతా నోరారా కారా మాస్టారిగా పిలిపించుకుంటున్న కాళీపట్నం విశిష్ట కథా రచనతో లోకాన్ని ఒప్పించడంతో ఆగకుండా, వందలాది మంది వర్థమాన కథకులకు దారీతెన్నూ చూపి, వారి రచనలను తీర్చిదిద్ది ఓ ‘స్థాయి’కి తీసుకువచ్చి మహదానంద భరితుడు కావడం ఆ కథాజనకుడి విశిష్ట లక్షణం. వందేళ్ల తెలుగు కథకు భౌతికంగా చిరునామాను సమకూర్చి, కథలు కంచికి పోకుండా కథానిలయంలో ప్రేమమీర పొందుపర్చి, ఈ సదాశయ సాధనకు అహరహం శ్రమించి, అందులోనే అనంతానందాన్ని అనుభవించి, కథ పట్ల వాత్సల్యపూరిత గాథగా తన జీవితాన్నే మలచుకోవడం కాళీపట్నం వారికే చెల్లింది. కారా మాస్టారు ఎన్టీఆర్ భారతసాహిత్య పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆయనతో సాక్షి ముచ్చటించింది.
ప్రశ్న: చాలా కాలంపాటు అవార్డులను తిరస్కరిస్తూ వచ్చిన మీకు ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు పురస్కారం ప్రకటించడంపై మీ అభిప్రాయం?
జవాబు: మొదట్లో ఎంతో మంది అవార్డులు ప్రకటించినా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాను. కొందరు మిత్రులు సూచనల మేరకు అవార్డులను తీసుకుంటున్నాను. దానితో వచ్చే డబ్బులను సాహిత్యాభివృద్ధికి వెచ్చిస్తున్నాను. ఆ కృషి ఫలితంగానే ఈనాటి ‘కథానిలయం’. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సాహిత్యం కోసం మంచి జరుగుతుందంటే దానికోసం నేను ముందుంటాను. మొదట గా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1996లో తీసుకున్నాను. నాటి నుంచి అవార్డులను స్వీకరిస్తున్నాను. ఎన్టీఆర్ గతంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి వాసిరెడ్డి సీతాదేవి ద్వారా అవార్డు కోసం నా పేరును ఎంపిక చేయగా దానిని స్వీకరించలేదు. మళ్లీ ఇప్పుడు ఆ అవార్డును ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు ఈ పుర స్కారాన్ని ప్రకటించటం సంతోషం కలిగించింది. ఎన్టీఆర్ మహోన్నత నటుడే కాకుండా ఆంధ్ర రాజకీయాలలో పెను మార్పులు తీసుకువచ్చిన ప్రముఖుడు. ఆయన పేరు మీదుగా ఇచ్చే అవార్డుకు ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంది.
డెబ్భై సంవత్సరాల పైబడిన రచనా క్రమంలో మీ సాహిత్య పరిణామం ఎలా సాగింది?
నా మొదటి కథ కార్డు కథల శీర్షికలో ‘ప్లాటుఫారమో’ అనే రచనను చిత్రగుప్తలో ప్రచురించారు. ప్రచురణలో ఇదే నా మొదటి రచన 1943లో ప్రచురితమైంది. అక్కడ నుంచి ‘భాయిజాన్’, ‘వెళ్లిపోయింది’, ‘వెనుకచూపు’, ‘నిజమే అయితే’ వంటి కథలు రాశాను. 1949-55 మధ్య రచనా వ్యాసంగం, నిరంతర పఠనా చింతన ఒకానొక ‘ఎరుక’ రచనకు దారితీసింది. 1956 నుంచి 67 వరకు కథలు ఏవీ పత్రికలలో ప్రచురితం కాలేదు. 1964-67 మధ్య ‘నేనెందుకు రాసేను’ వ్యాసం, ‘తీర్పు’, ఇల్లు’, యజ్ఞం’, మహదాశీర్వచనం’ అన్న అయిదు కథలు ఉన్నాయి. 1964లో యువ పత్రికలో ‘తీర్పు’ కథ వెలువడటంతో కథా రచన తిరిగి మొదలైంది. 1967-70 మధ్యకాలంలో ‘వీరుడు-మహావీరుడు’ మొదలుకొని ‘భయం’ వరకు ఏడు కథలు రాశాను. విరసంలో సభ్యులుగా ఉంటున్న సమయంలో 1970-72 మధ్య ‘శాంతి’, ‘చావు’, ‘జీవధార’, ‘కుట్ర’ కథలు ప్రచురించాను. 1971 జనవరి 31న ‘యజ్ఞం’ కథాసంపుటిని విశాఖలో శ్రీశ్రీ ఆవిష్కరించిన ఘట్టం మరువలేనిది.1979లో ఉద్యోగ విరమణ అనంతరం విరసం సభ్యునిగా అనేక రాజకీయ సభల్లో, సాహిత్య సభలలో పాల్గొన్నాను. 1980లో మిత్రులతో కలసి ‘కథావేదిక‘ను స్థాపించాను. 1986-89 మధ్య ఒక దినపత్రికలో ‘నేటి కథ’ శీర్షిక నిర్వహించి అనేక మంది యువ రచయితలు కథా రచనలలో ఎదుర్కొనే సాధారణ ఇబ్బందులను ఆకళింపు చేసుకున్నాను.
కథా నిలయం ఎలా నిర్వహిస్తున్నారు?
1996 ‘యజ్ఞంతో తొమ్మిది కథలు’ అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. జనపీఠ అవార్డు పేరున అభిమానులు, మిత్రులు సేకరించిన లక్ష రూపాయిలు స్వీకరించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి వారి ‘హంస అవార్డు 1999లో అందుకున్నాను. సాహిత్యం మీద రెమ్యూనరేషన్ ద్వారా, సన్మానాల ద్వారా లభించిన ప్రతి పైసాను ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న కాలంలో కూడా విడిగా ఉంచి సాహిత్యాభివృద్ధికి వెచ్చించా. ఆ సొమ్ముతో 1997 ఫిబ్రవరిలో కథానిలయం ఏర్పాటు చేశా. కథానిలయం పుట్టిన నాటి నుంచి కథల సేకరణే ధ్యేయంగా పనిచేశా. కథానిలయం 800 పుస్తకాలతో ప్రారంభమైంది. 20,500 పత్రికా సంచికలు, 11,576 పుస్తకాలు, 414 సంకలనాలు, 2,213 సంపుటాలు, 100 సంచిత వ్యాసాలు, 105 వ్యాస సంకలనాలు, 67 ఆత్మకథలు, 97 పరిశోధనా పత్రాలు, 95 జీవిత చరిత్రలు, 45 ఇతర భాషల్లో ముద్రితమైన తెలుగు అనువాదాలు ఉన్నాయి. 12,350 మంది కథారచయితలు ఉండగా 2,400 మంది వ్యక్తిగత సమాచారాన్ని 285 ఫొటోలను కథా నిలయానికి సమాచారంగా పొందు పరిచాము.
90వ ఏట మీరు ప్రారంభించిన యజ్ఞం ప్రచురణల లక్ష్యం ఏమిటి?
కథలను సేకరించే ప్రక్రియ ఒక పక్క చేస్తూనే నా 90వ ఏట ‘కా.రా. యజ్ఞం ప్రచురణలు’ ప్రారంభించా. మొదటిగా రెండు పుస్తకాలను విశాఖలో నాకు జరిగిన ‘నవత రణ’సత్కారోత్సవంలో ఆవిష్కరించాం. 1944లో మొహ్మ ద్ ఖాసీం ఖాన్ రచించిన ‘కథానిక రచన’ పుస్తకాన్ని తిరిగి ముద్రించాం.
భవిష్యత్తులో మంచి అరుదైన పుస్తకాలను నా ప్రచురణల ద్వారా అతి తక్కువ ఖరీదుతో ప్రజలకు చేరువ చేయడమనే లక్ష్యంతో పనిచేస్తున్నా.
- దూరి గోపాలరావు