
ఇదిగో.. శ్రీశ్రీ సాహితీ నిధి
26 వ విజయవాడ పుస్తక మహోత్సవం
సమకాలీన సమాజంలోని రుగ్మతలను పారదోలి.. తన కలంతో వ్యవస్థలో మార్పు తేవడానికి నేనుసైతం అంటూ ముందుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అంతటి మహోన్నత వ్యక్తి సాహిత్యాన్ని నలుగురిలోకి తీసుకెళ్లి నవ వికాసం అడుగు కదిపారు ఓ అభిమాని. ‘శ్రీశ్రీ సాహిత్య నిధి’ పేరుతో ఓ సాహిత్య బులెటిన్‌ను నడపడమే కాదు.. పుస్తక మహోత్సవంలో శ్రీశ్రీ స్పెషల్ స్టాల్ ఏర్పాటుచేసి తన సాహిత్యాభిలాష తీర్చుకుంటున్నారాయన.
వన్‌టౌన్ : ఆధునిక తెలుగు సాహిత్యంలో చెదరని ముద్ర వేసిన సుప్రసిద్ధ సాహితీవేత్త మహాకవి శ్రీశ్రీ. తన సాహిత్యంతో సామాజిక చైతన్యానికి బాటలు వేసిన మహోన్నత చైతన్య దీప్తి. తెలుగు అభ్యుదయ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొన్న మహాకవి మన నుంచి దూరమై దశాబ్దాలు గడిచినా ఆయన సాహిత్యం నిత్యం దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. నేటి సమకాలీన సమాజంలో పాతుకుపోయిన అనేక రుగ్మతలను తన కలంతో ఎత్తిచూపి వ్యవస్థలో మార్పు కోసం పాటుపడిన సంఘ సంస్కర్త ఆయన. అటువంటి మహాకవి శ్రీశ్రీ సాహిత్యాన్ని ఇంకా విస్తృతం చేయడానికి తద్వారా సమాజాన్ని జాగృతం చేయాలని ‘శ్రీశ్రీ సాహిత్య నిధి’ పాటు పడుతోంది. నగరానికి చెందిన యువ సాహితీవేత్త సింగంపల్లి అశోక్‌కుమార్ ఈ సంస్థను స్థాపించి సాహితీ వికాసానికి ముఖ్యంగా శ్రీశ్రీ సాహితీ వ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే 26వ విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటుచేసి శ్రీశ్రీ సాహితీ గ్రంథాలను సాహితీ ప్రియులకు అందుబాటులోకి తెచ్చారు.
ప్రత్యేక బులెటిన్
నగరంలోని శ్రీశ్రీ సాహిత్య నిధి సంస్థ ప్రతి మూడు మాసాలకు శ్రీశ్రీ రచనలతో ఒక సాహిత్య బులెటిన్‌ను ప్రచురిస్తోంది. దానిని శ్రీశ్రీ అభిమానులకు ఉచితంగా అందిస్తున్నారు. అయితే, పోస్టల్ ఖర్చుల నిమిత్తం వంద రూపాయలను సంస్థకు చెల్లించి బులెటిన్ పొందవచ్చు. ఈ బులెటిన్‌ను అందుకుంటున్న వారి సంఖ్య ఇటీవలే నాలుగు వేలకు చేరింది. ప్రతి మూడు మాసాలకోసారి శ్రీశ్రీ సాహిత్యంపై నాలుగు పుస్తకాలను సైతం ఈ సంస్థ ప్రచురిస్తోంది. ఒకసారి వెయ్యి రూపాయలు చెల్లిస్తే విడతలవారీగా 50 పుస్తకాల వరకు అందజేస్తారు. ఇప్పటివరకు ఈ సంస్థ 30 బులెటిన్స్‌ను, 60 పుస్తకాలను తీసుకొచ్చింది. పుస్తక మహోత్సవంలోని స్టాల్ నంబరు 197లో కొలువుదీరిన శ్రీశ్రీ సాహిత్య నిధి కొలువులో పలు శ్రీశ్రీ సాహితీ గ్రంథాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా అభ్యుదయ సాహిత్యంలో అద్భుతమైన ప్రశంసలు పొందిన శ్రీశ్రీ మహాప్రస్థానానికి అపూర్వమైన ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు ‘సాక్షి’కి తెలిపారు.
సామాజిక చైతన్యం కోసం కృషి
శ్రీశ్రీ సాహిత్యం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ సమకాలీన సామాజిక పరిస్థితులను ఆవిష్కరిస్తూనే ఉంటుంది. శ్రీశ్రీ సాహిత్యం కేవలం ప్రచురణలకే పరిమితం కాకుండా సామాజిక చైతన్యానికి కూడా పాటు పడుతుందని నేను విశ్వసిస్తున్నాను. అందుకే ఆయన సాహిత్యం నేటి వ్యవస్థకు మరింత అవసరమని భావిస్తున్నా. అనేక మంది మిత్రులు, సాహితీమూర్తుల సహకారంతో శ్రీశ్రీ సాహిత్య నిధిని ముందుకు తీసుకెళ్తున్నా.
- సింగంపల్లి అశోక్‌కుమార్, శ్రీశ్రీ సాహిత్య నిధి వ్యవస్థాపకుడు