కొత్తగా ఖలీల్ జిబ్రాన్ రెండు పుస్తకాలు
- ముందుమాట
నేను చెప్పిన వాటిల్లో సగం అర్థరహితమైనవే- కానీ అలా ఎందుకు చెప్తానో తెల్సా!
మిగతా సగమైనా నిన్ను చేరతాయని.
- ఖలీల్ జిబ్రాన్ (ఇసుక మరియు నురగ)
ఖలీల్ జిబ్రాన్ ఊహాశక్తి గొప్పది. భావాల్లో స్పందన పార్శ్వం ఎక్కువ. అది అనుభూతి ప్రధానం. అందువల్ల అది ‘ఆలోచన’గా, గతంగా మారని వర్తమానం. అతని భావాలు, అనుభూతులు, ప్రతీకలు, వ్యక్తావ్యక్తాలు, చదివే పాఠకుల స్థలకాల, మానసిక స్థితిగతులను అనుసరించి అర్థమౌతుంటాయి.
జిబ్రాన్ సగం చెప్పిన భావాల్లో మిగతా సగం పాఠకులనే ఊహించుకోమంటాడు. సగం చెప్పిన తీరులో అనేక అనుభూతులు.
ప్రవచించేవాడు ప్రవక్త. అతడీ ప్రపంచాన్ని ప్రవచిస్తున్నాడు. అందులో ఒకడై సంచరించి ఆలపిస్తున్నాడు. పాఠకుడు తనకు తాను ఆ తత్వాల్లో లీనమైపోతాడు. బైరాగి తత్వాలకు వినేవారిని తనలో కలుపుకొనే శక్తి ఉంటుంది. అలా మనల్ని లాక్కుంటాడు జిబ్రాన్. మనలోకి విస్తరిస్తాడు. మనద్వారా విస్తరిస్తాడు. ‘ప్రవక్త’ అంటే అదే. మనలోకి విస్తరించడమే ‘ప్రవక్త’ లక్షణం.
సూఫీ తత్వవేత్తల వైరాగ్యం చావును, జీవితాన్ని ఒక్కటిగా చూసే చూపును అందిస్తుంది. ఈ విశ్వానికి డిటాచ్‌మెంట్‌గా ఉండాలని బౌద్ధం నుండి కొనసాగుతూ వస్తున్న భావజాలం ఇది. కొన్ని అస్తిత్వవాదాలు కూడా దీన్నే చెప్పాయి. సుఖము, దుఃఖము, బాధ, సంతోషము ఒక్కటే అంటాడు జిబ్రాన్. ఒకటిగా స్వీకరించే తత్వానికి చేరినప్పుడే ఈ జీవితాన్ని ముందుకు సాగించడం సాధ్యమని చెప్పడం దీని ఉద్దేశంగా భావించాలి. జీవితం, మృత్యువు రెండూ ఒకే స్థాయిలో ఎందుకు సామాన్యీకరిస్తారో దాన్ని అర్థం చేసుకునే దశకు చేరుకునేదాకా తెలుసుకోవడం కష్టం. ఖలీల్ జిబ్రాన్ అర్థం కావడం కూడా అంతే.
జిబ్రాన్ ఎన్నో పార్శ్వాలు కలిసిన ఒక రంగుల కలయిక. అందుకే అతడు నిరంతరం తన రచనల ద్వారా ఆకర్షిస్తూనే ఉంటాడు. ఆ ఆకర్షణని జతిన్ కుమార్ తన అనువాదంలో చక్కగా పట్టుకోగలిగాడు.
చాలామంది రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని రాసింది కాకుండా, రాయనిదాని అంతరార్థాన్ని తెలుసుకోవాలనుకుంటారు. జిబ్రాన్ అలా కాకుండా రాసినదానికి ఆవలగల దాన్ని చూడాలంటాడు. అలా మరింత ఊహాశక్తిని, నూతన సత్యాలను మనకు మనం తెలుసుకోవడానికి ఒక దారాన్ని, ఆధారాన్ని అందిస్తూ హృదయాన్ని చకితం చేస్తుంది జిబ్రాన్ ‘ఇసుక మరియు నురగ’.
పాత ఈస్తటిక్ ప్రక్రియ రూపాలను ఎందుకు తీసుకోవాలి? తనదైన అభివ్యక్తిలో ఎందుకు ముందుకు సాగకూడదు అనే నిశ్చయం జిబ్రాన్‌లో ఒక ప్రత్యేకమైన వ్యక్తీకరణకు రూపం ఇచ్చింది. (వాటిని) సులభంగా, సామాన్యులకు అర్థమయ్యేవిధంగా తెలుగులోకి అనువదించారు (మామిడి హరికృష్ణ, అయినంపూడి శ్రీలక్ష్మి). (దీనివల్ల) అతను ప్రత్యేకంగా చెప్పే నైపుణ్యాన్ని పూర్తిగా తెలుపకపోయినా సారం మాత్రం అందుతుంది.
- బి.ఎస్.రాములు
8331966987
‘ది ప్రాఫెట్’ను డాక్టర్ ఎస్.జతిన్‌కుమార్ ‘ప్రవక్త’గానూ, ‘శాండ్ అండ్ ఫోమ్’ను మామిడి హరికృష్ణ, అయినంపూడి శ్రీలక్ష్మి ‘ఇసుకను తోసుకొచ్చిన తీరం - నురగను మోసుకొచ్చిన కెరటం’గానూ తెలుగులోకి తెచ్చారు. వీటిని ఎస్.వి.ఎల్.నరసింహారావు రంగవల్లి పబ్లికేషన్స్ తరఫున ప్రచురించారు. వెల: ఒక్కోటీ 100. ప్రతులకు: ఫ్లాట్ నం.103, దుర్గా అపార్ట్‌మెంట్, దుర్గా నగర్, సోమాజిగూడ, హైదరాబాద్-82. ఫోన్: 9963374567. పై వ్యాసం, ఈ రెండు పుస్తకాలకూ బి.ఎస్.రాములు వేర్వేరుగా రాసిన ముందుమాటకు సంక్షిప్త రూపం.