Khalil jibran
-
Kahlil Gibran: ప్రవక్త వాణి
అల్ముస్తఫా వెళ్లిపోవాల్సిన సమయం వచ్చేసింది. పన్నెండేళ్లుగా ఉంటున్న ఆర్ఫాలీస్ ద్వీప నగరాన్ని ఇక విడిచిపెట్టాలి. సముద్రాన్ని దాటిస్తూ తన జన్మస్థలానికి తిరిగి చేర్చగలిగే సరైన(?) ఓడ వచ్చేస్తోంది. కానీ నగరవాసులు ఆయన్ని వదిలిపెడతారా? వియోగం వచ్చేంతవరకూ ప్రేమలోని లోతు తెలియదు కదా! నువ్వు మాకు అతిథివి కావు, మాలో ఒకడివి, మాకు ప్రియమైనవాడివి, మా కలలకు కలలిచ్చేందుకు నీ యవ్వనాన్ని ధారబోసినవాడివి, నువ్వు ఎలా వెళ్లగలవని వాళ్లు నిలదీయరా? తనకోసం చాలులోనే నాగలి వదిలేసివచ్చిన మనిషికి ఏం జవాబివ్వాలి? తనకోసం ద్రాక్షసారా యంత్ర చక్రాన్ని ఆపి పరుగెత్తుకొచ్చినవాడికి ఏం చెప్పాలి? హృదయం విరగకాసిన పళ్ల చెట్టయి వాటన్నింటినీ రాల్చితే? వారి పాత్రలను కోర్కెల జలధారై నింపితే? సర్వేశ్వరుడి శ్వాసను తనలోంచి పోనిచ్చే వేణువు అయితే? నిశ్శబ్దాల్లో కనుగొన్న నిధిని మాటల ద్వారా పంచితే? వారిని సముద్రపు అలలు వేరుపరచకముందే వీడ్కోలు చెప్పడానికి ఒకరి వెంట ఒకరు రావడంతో అక్కడ గుంపు పోగైంది. అలా విడిపోబోయే రోజే సమావేశపు రోజు కూడా అయ్యింది. అందరూ నెమ్మదిగా మందిరం వైపు అడుగులు వేశారు. మందిరంలోంచి యోగి అల్మిత్ర బయటికి వచ్చింది. వాళ్లందరి తరఫునా ఆమె మేము మా పిల్లలకు, ఆ పిల్లలు వారి పిల్లలకు చెప్పుకొనేలా జనన మరణాల మధ్యలి సత్యాన్ని తెలియజేయమని కోరింది. జనంలో గమనించిన సత్యాన్ని జనానికే చెప్పడానికి పూనుకొంటాడు అల్ముస్తఫా. లెబనాన్ మూలాలున్న అమెరికన్ కవి ఖలీల్ జిబ్రాన్(6 జనవరి 1883–10 ఏప్రిల్ 1931) రచన ‘ద ప్రాఫెట్’కు ఇదీ భూమిక. నూరేళ్లుగా అన్ని ప్రపంచ భాషల్లోకీ మళ్లీ మళ్లీ అనువాదమవుతూ, ఇప్పటికీ కొత్త ఆసక్తి రేపుతున్న ఈ మహత్తర రచన 1923లో ప్రచురితమైంది. వచన కవిత్వం రూపంలో జిబ్రాన్ తన పాఠకులకు ఎన్నో అంశాల మీద సున్నితమైన దృక్కోణాన్ని ఇస్తారు. ‘ప్రేమ’తో మొదలైన సంభాషణ– తాపీమేస్త్రి, నేత కార్మికుడు, సత్రం నిర్వాహకుడు, పిల్ల తల్లి, న్యాయమూర్తి ఇలా ఒక్కొక్కరూ తమ సందేహాలను తీర్చమనడంతో అల్ముస్తఫా–– పెళ్లి, పిల్లలు, కాలం, జ్ఞానం, మంచి, చెడు, ప్రార్థన, దయ, ఆనందం, అందం, మతం, ఇవ్వడం... ఇలా అన్నింటికీ సమాధానాలు ఇస్తూపోతాడు. స్రేమ తప్ప ఇంకేమీ ఇవ్వని ప్రేమ ప్రాధాన్యతను ప్రేమగా చెబుతాడు. మీ పిల్లలు మీ పిల్లలు కాదు; వాళ్లు మీ ద్వారా వస్తారు కానీ మీ నుంచి కాదు; వాళ్లు మీతో ఉన్నప్పటికీ మీకు చెందరంటాడు. నీకు ఎంతో ప్రియమైనవాళ్లు ఆ ఇంటిలో నివసిస్తారన్నట్టగా ఒక ఇంటిని నిర్మించమని చెబుతాడు. ఆకలి కోసం ఒక సీమరేగిపండు తిన్నాకూడా దాని విత్తనాలు నీ శరీరంలో పెరుగుతాయన్నంత స్పృహతో ఆ పనిచేయమని చెబుతాడు. ఆనందమూ దుఃఖమూ వేర్వేరు కాదు; నీ హృదయానికి సాంత్వన ఇచ్చే వేణువు కూడా కత్తి గాట్లకు గురైందని అంటాడు. జీవితాన్ని ఎంత సుతారంగా, సుందరగా సమీపించవచ్చో అత్యంత మృదువుగా, సరళంగా వివరిస్తాడు. స్వయంగా చిత్రకారుడు కూడా అయిన జిబ్రాన్ పుస్తకంలోని పన్నెండు చిత్రాలను స్వయంగా గీశారు. విడుదలైన సంవత్సరం ప్రచురించిన రెండు వేల కాపీలకుగానూ 1,500 మాత్రమే అమ్ముడుపోయింది. కానీ ఆ తర్వాత అది పునర్ముద్రణలు వరుసగా పొందుతూనే ఉంది. లక్షల కాపీలు అమ్ముడుపోయిన ఈ పుస్తకం ఒక దశలో వారంలో సగటున 5,000 కాపీలు ఎక్కడో ఓచోట అమ్ముడవుతూనే ఉంది. ఈ నూరేళ్లలో ఏ ఒక్క సందర్భంలోనూ ఈ చిరుపొత్తం అచ్చులో లేకుండా లేదు. ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిని రగిలించేట్టుగా రాయడం వల్ల ఇది తరచుగా బహుమానాలు ఇచ్చుకునే పుస్తకంగా కూడా ఉంటోంది. అయితే మేధావులు మాత్రం దీన్నొక పంచదార పాకంగా భావించకపోలేదు. ‘శాండ్ అండ్ ఫోమ్’, ‘ద వాండెరర్’ లాంటి ఇతర ప్రసిద్ధ రచనలు కూడా వెలువరించిన జిబ్రాన్– అరబిక్, ఆంగ్లం రెండు భాషల్లోనూ రాయగలరు. ఆయన్ని బహాయీ, సూఫీ మతాలు విశేషంగా ఆకర్షించాయి. వాటి అంతస్సారమైన నిశ్శబ్దం, ప్రేమ ‘ద ప్రాఫెట్’ నిండుగా పరుచుకొని ఉంటాయి. చిత్రంగా జిబ్రాన్ తల్లిదండ్రులు క్రైస్తవులు. తాతల కాలంలో ముస్లింలు. అలా అన్ని మతాలనూ ఇముడ్చుకునే గుణం ఆయనకు చిన్నతనంలోనే అలవడింది. అందుకే ఒక చోట నేను నీ మసీదులో, నీ చర్చిలో, నీ సినగాగ్లో కూడా ప్రార్థిస్తాను అంటాడు. ప్రపంచంలో శాంతి నెలకొనా లంటే అన్ని మతాల మధ్య సమన్వయం జరగాలన్న భావన ఆయనది. దానికి కావాల్సిన హృదయ వైశాల్యాన్ని పెంచేదిగా ఈ పుస్తకం ఉంటుంది. ప్రతి ఒక్క చెడుకూ ప్రతి ఒక్కరూ బాధ్యులేనన్న సామూహిక ఇచ్ఛ ఇందులో దర్శనమిస్తుంది. వ్యాపారంలో ప్రేమ, కరుణపూరిత న్యాయం చూపకపోతే, అది కొందరి దురాశకూ, మరికొందరి ఆకలికీ కారణమవుతుందని చెబుతుంది. అల్ముస్తఫా నిజానికి వెళ్లింది స్వస్థలానికేనా? తన కాలం ముగిసి, మళ్లీ మరో జీవితపు చక్రానికి సిద్ధం చేసే సముద్రాన్ని దాటాడు. ఇప్పుడిక జీవితం అనేది ఒక కల. అనంత శక్తి ప్రవాహంలో లిప్తకాలపు జీవులం మనం. ఈ భావన మనశ్శాంతినీ, సాంత్వననూ ప్రసాదిస్తుంది. జీవితం నుంచి ఒక విముక్త భావనను కలిగిస్తుంది. ముఖ్యంగా మతాల్లోని అసలైన ఆధ్యాత్మిక గంధం ఇగిరిపోయి, కేవలం అవి బల ప్రదర్శనలకు మాత్రమే పనికొస్తున్నప్పుడు– అన్ని జీవుల్లోనూ దేవుడిని చూసుకోవడమనే ప్రాచ్య భావనను రేకెత్తిస్తుంది. పుస్తకం ఒక పంచదార పాకమే కావొచ్చు. కానీ ఈ కల్లోల ద్వేషాల కాలంలో అప్పుడప్పుడూ నోటికి అత్యవసరమైన తీపి! -
కొత్తగా ఖలీల్ జిబ్రాన్ రెండు పుస్తకాలు
- ముందుమాట నేను చెప్పిన వాటిల్లో సగం అర్థరహితమైనవే- కానీ అలా ఎందుకు చెప్తానో తెల్సా! మిగతా సగమైనా నిన్ను చేరతాయని. - ఖలీల్ జిబ్రాన్ (ఇసుక మరియు నురగ) ఖలీల్ జిబ్రాన్ ఊహాశక్తి గొప్పది. భావాల్లో స్పందన పార్శ్వం ఎక్కువ. అది అనుభూతి ప్రధానం. అందువల్ల అది ‘ఆలోచన’గా, గతంగా మారని వర్తమానం. అతని భావాలు, అనుభూతులు, ప్రతీకలు, వ్యక్తావ్యక్తాలు, చదివే పాఠకుల స్థలకాల, మానసిక స్థితిగతులను అనుసరించి అర్థమౌతుంటాయి. జిబ్రాన్ సగం చెప్పిన భావాల్లో మిగతా సగం పాఠకులనే ఊహించుకోమంటాడు. సగం చెప్పిన తీరులో అనేక అనుభూతులు. ప్రవచించేవాడు ప్రవక్త. అతడీ ప్రపంచాన్ని ప్రవచిస్తున్నాడు. అందులో ఒకడై సంచరించి ఆలపిస్తున్నాడు. పాఠకుడు తనకు తాను ఆ తత్వాల్లో లీనమైపోతాడు. బైరాగి తత్వాలకు వినేవారిని తనలో కలుపుకొనే శక్తి ఉంటుంది. అలా మనల్ని లాక్కుంటాడు జిబ్రాన్. మనలోకి విస్తరిస్తాడు. మనద్వారా విస్తరిస్తాడు. ‘ప్రవక్త’ అంటే అదే. మనలోకి విస్తరించడమే ‘ప్రవక్త’ లక్షణం. సూఫీ తత్వవేత్తల వైరాగ్యం చావును, జీవితాన్ని ఒక్కటిగా చూసే చూపును అందిస్తుంది. ఈ విశ్వానికి డిటాచ్మెంట్గా ఉండాలని బౌద్ధం నుండి కొనసాగుతూ వస్తున్న భావజాలం ఇది. కొన్ని అస్తిత్వవాదాలు కూడా దీన్నే చెప్పాయి. సుఖము, దుఃఖము, బాధ, సంతోషము ఒక్కటే అంటాడు జిబ్రాన్. ఒకటిగా స్వీకరించే తత్వానికి చేరినప్పుడే ఈ జీవితాన్ని ముందుకు సాగించడం సాధ్యమని చెప్పడం దీని ఉద్దేశంగా భావించాలి. జీవితం, మృత్యువు రెండూ ఒకే స్థాయిలో ఎందుకు సామాన్యీకరిస్తారో దాన్ని అర్థం చేసుకునే దశకు చేరుకునేదాకా తెలుసుకోవడం కష్టం. ఖలీల్ జిబ్రాన్ అర్థం కావడం కూడా అంతే. జిబ్రాన్ ఎన్నో పార్శ్వాలు కలిసిన ఒక రంగుల కలయిక. అందుకే అతడు నిరంతరం తన రచనల ద్వారా ఆకర్షిస్తూనే ఉంటాడు. ఆ ఆకర్షణని జతిన్ కుమార్ తన అనువాదంలో చక్కగా పట్టుకోగలిగాడు. చాలామంది రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని రాసింది కాకుండా, రాయనిదాని అంతరార్థాన్ని తెలుసుకోవాలనుకుంటారు. జిబ్రాన్ అలా కాకుండా రాసినదానికి ఆవలగల దాన్ని చూడాలంటాడు. అలా మరింత ఊహాశక్తిని, నూతన సత్యాలను మనకు మనం తెలుసుకోవడానికి ఒక దారాన్ని, ఆధారాన్ని అందిస్తూ హృదయాన్ని చకితం చేస్తుంది జిబ్రాన్ ‘ఇసుక మరియు నురగ’. పాత ఈస్తటిక్ ప్రక్రియ రూపాలను ఎందుకు తీసుకోవాలి? తనదైన అభివ్యక్తిలో ఎందుకు ముందుకు సాగకూడదు అనే నిశ్చయం జిబ్రాన్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తీకరణకు రూపం ఇచ్చింది. (వాటిని) సులభంగా, సామాన్యులకు అర్థమయ్యేవిధంగా తెలుగులోకి అనువదించారు (మామిడి హరికృష్ణ, అయినంపూడి శ్రీలక్ష్మి). (దీనివల్ల) అతను ప్రత్యేకంగా చెప్పే నైపుణ్యాన్ని పూర్తిగా తెలుపకపోయినా సారం మాత్రం అందుతుంది. - బి.ఎస్.రాములు 8331966987 ‘ది ప్రాఫెట్’ను డాక్టర్ ఎస్.జతిన్కుమార్ ‘ప్రవక్త’గానూ, ‘శాండ్ అండ్ ఫోమ్’ను మామిడి హరికృష్ణ, అయినంపూడి శ్రీలక్ష్మి ‘ఇసుకను తోసుకొచ్చిన తీరం - నురగను మోసుకొచ్చిన కెరటం’గానూ తెలుగులోకి తెచ్చారు. వీటిని ఎస్.వి.ఎల్.నరసింహారావు రంగవల్లి పబ్లికేషన్స్ తరఫున ప్రచురించారు. వెల: ఒక్కోటీ 100. ప్రతులకు: ఫ్లాట్ నం.103, దుర్గా అపార్ట్మెంట్, దుర్గా నగర్, సోమాజిగూడ, హైదరాబాద్-82. ఫోన్: 9963374567. పై వ్యాసం, ఈ రెండు పుస్తకాలకూ బి.ఎస్.రాములు వేర్వేరుగా రాసిన ముందుమాటకు సంక్షిప్త రూపం. -
మరణానికి జీవితమే లేదు!
తత్వ చింతన ఓ వ్యవసాయ భూమి సమీపంలో నిల్చున్న ఖలీల్ జిబ్రాన్ దృష్టి అక్కడ ఉన్న ఓ గడ్డిబొమ్మపై పడింది. ఆ బొమ్మ వంకే ఆయన చూస్తూ నిల్చున్నారు. దానిని చూసి జిబ్రాన్ ‘‘నువ్వు ఇలా రోజుల తరబడి ఇక్కడ నిల్చున్నావు. నీకు విసుగేయడం లేదా?’’ అని అడిగాడు. దానికి ఆ బొమ్మ ఇలా చెప్పింది - ‘‘నాకే విసుగూ లేదు. ఇటుగా వచ్చే పక్షుల్ని భయపెట్టడంలో పొందుతున్న ఆనందం ముందు మరెందులోనూ దొరకడం లేదనుకో. పక్షులు నన్ను చూసి భయపడి ఎగిరిపోయే తీరుని మాటల్లో చెప్పలేను. కనుక కాలం ఎలా గడిచిపోతోందో తెలియనే తెలీదు’’ అని. ఆ మాటలతో జిబ్రాన్ ఆలోచించాడు. కాస్సేపు తర్వాత ఆయన ‘‘నిజమే. ఈ ఆనందాన్ని నేనూ అనుభవించాను. మనల్ని చూసి ఇతరులు భయపడేటప్పుడు కలిగే ఆనందాన్ని మరి దేనితోనూ పోల్చలేను’’ అని అనగా బొమ్మ ‘‘నిజం. నాలోపల గడ్డి, ఒకింత మట్టి తప్ప మరేమీ లేదు. నాలాగే లోపల గడ్డి, మట్టి నింపిన వాళ్ళు తప్పకుండా ఆనందం అనుభవిస్తారు’’ అని చాలా మామూలుగా చెప్పింది. జిబ్రాన్ ఓ చోట రాసుకున్న ఈ మాటలు మన జీవితాన్ని ఫొటో తీసి చూపుతోంది. దాన్ని చూసి జాలి పడి ఒకడు అనుకుంటాడు... లోపల గడ్డి, మట్టి మినహా మరేదీ లేని వికృతరూపం ఈ గడ్డిబొమ్మ. ఎటూ కదల్లేదు. అయినా అది పక్షులన్నీ తనను చూసి భయపడి దరిదాపుల్లోకి రావడం మానేశాయని చెప్పుకుంటోంది. ఎలా సాధ్యం?’’ అని. మనుషుల్లోనూ చాలా మందికి లోపల ఏమీ లేదు. జ్ఞానం లేని వొట్టి రూపాలు. ఆ గడ్డిబొమ్మ లోపల గడ్డి, మట్టి ఉన్నట్టు మనలో ఎముకలు, రక్తం ఉన్నాయి. కనుక జ్ఞానమున్న వారెవరైనా అజ్ఞానులైన వారిని చూసి పాపం వారిలో ఏమీ లేదు కదా అని జాలిపడతారు. కానీ అజ్ఞానులు ఆ మాటకు ఒప్పుకోరు. ‘‘ఎవరన్నారు? వాడికన్నా నేను గొప్పోడిని...వీడి కన్నా పెద్దవాడిని. ఫలానా వాడిని ఓమారు ఫలానా విషయంలో ఓడించాను అని చంకలు గుద్దుకుని తెగ ఆనంద పడతారు. కానీ ఆ గడ్డి బొమ్మ ఒకే చోట ఎటూ కదలక ఉంది. మనం ప్రాణమున్నా కదిలే శక్తి ఉన్నా జీవితంలో చలనం లేకుండా ఉన్నాం. నిజానికి మనల్ని మనం ఆ బొమ్మతో కాకుండా పక్షులతో పోల్చుకోవాలి. గడ్డిబొమ్మ కనీసం పక్షుల్ని బెదరగొట్టి పంటపొలాలను కాపాడుతోంది. మనిషి తన లోపల ఏమీ లేదనే వాస్తవాన్ని తెలుసుకుని కూడా ఎదుటి వారి వద్ద అన్నీ ఉన్నట్టు తెలిసినట్టు డాంబికాలు పోతాడు. విర్రవీగుతాడు. ఆ మాయలోనే బతుకుతాడు. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా అలాగే ఒక రోజు అదృశ్యమైపోతాడు. జీవితానికి ఎప్పుడూ మరణం లేదు. మరణానికి ఎప్పుడూ జీవితం లేదు. జీవితాన్ని తెలుసుకున్న వారే మరణమే జీవితానికి ముగింపు అని అనుకుంటున్నారు. - యామిజాల జగదీశ్