
కథకుడు, నవలాకారుడు
ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక మంచికథకి కావాల్సిన ‘అనుభవం’, సంఘటన, వస్తువు వుండి తీరతాయి.
నవలాకారుడికి కుదించడం అవసరం లేదని కాదు. నవలకీ స్వరూపం, అంతం వుంటాయి. కథకి మల్లేనే నవలాకారుడి అభిమాన పాత్రలు ‘కాలం’, ‘స్థలం’ అనేవి. ఈ రెంటి సమన్వయం సాధించిన పరిణామంతో నిమిత్తం వున్నవాడు నవలాకారుడు. అతని జగత్తు సముద్రం అయితే కథకుడి జగత్తు అందులో ఒక కెరటం. ఎక్కడో మధ్యలో ఎప్పుడు లేస్తుంది– కదుల్తుంది– చుట్టూ వున్న మరికొన్ని తుంపరలని, పిల్ల కెరటాలని తనతో లాక్కుపోతుంది– వెళ్లినకొద్దీ ఆకృతి పెంచుకుంటుంది. దానికొక శిఖరం ఏర్పడుతుంది. మనం చూస్తూ వుండగానే తుంపరల కింద విడి, అవతారం చాలించుకుంటుంది. ఆ క్షణికమైన దృశ్యం చూసేవారిలో ఒక అనుభూతిగా నిలిచిపోతుంది. కెరటాన్ని లేవదీసేవాడు కథకుడు.