కాస్త పొట్టి ఆకారం! తెల్లగా మెరిసిపోయే బిళ్లంచు ఖద్దరు ధోవతి; నాజూగ్గా కట్టుకున్న తీరు.అంతే తెల్లని జుబ్బా, రింగులు తిరిగిన ముంగురులు. ముఖానికే అందమిచ్చే కళ్ల జోడు. మనిషి అసలే అందగాడు. ఆహార్యం ఇంకా అందాన్ని రెట్టింపు చేస్తుంటుంది. భుజాల మీద కప్పుకున్న పండిత శాలువా, అదీ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల్లోవే. నడక లోనూ నాజూకుతనం. మాటలో సుకుమార్యం. సౌహార్దం, కాసింత సున్నిత హాస్యం అప్పుడప్పుడూ పండిత కవి మిత్రులతోనైతే వ్యంగ్యా స్త్రాలు సంధించే నైజం.
డిగ్రీలో గణితమే ప్రధానాంశమైనా, తాత్కాలిత గణిత ఉపాధ్యాయుడిగా అక్కడ క్కడే కొలువు చేసినా, ఆయన అభిమాన మంతా తెలుగు సాహిత్యం మీదే. అందుకే ప్రాచీన నవీన రచనలెన్నింటినో ఆపోశన పట్టారు. ఊరక చదివింది కాదు, వాటిలోని ప్రశస్తమైన పద్యగద్యాలు, ఆసక్తికర సన్ని వేశాలు, సంభాషణలు, పద్యాలు చలోక్తులూ వంటివెన్నింటినో పుక్కిట బట్టారు. సందర్భాలకు తగినట్టుగా వాటిని ప్రయోగించేవారు. అలాగే ఆధునిక కవులనూ, రచయితలనూ, రచనలనూ తన మనోమందిరంలో నిక్షిప్తం చేసుకున్నాడు. ఈ ‘సాహిత్య వ్యసనం’ ఎంతగా మారిపోయిందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ మూల సాహిత్య సభ జరిగినా తన హాజరు ఆవశ్యం ఉండేలా చూసుకునేవారు. ఆ రీతిగా ఎందరో కవులు, పండితులు, రచయితలు, రచయిత్రులతో పరిచయం పెంచుకున్నారు.
ప్రాచీనులలో కవిత్రయము, శ్రీనాథ పోతనలు, ప్రబంధ కవులూ మిక్కిలి అభి మానం. పదకర్తలంటే ప్రత్యేక గౌరవం. మొదట్లో శతకం వంటి రచనలు చేసినా తర్వాత వచనరచయితగా, రూపాంతరం చెందారు. అతివ–అభిజాత్యం నవలతో మొదలైన ఆయన రచనా ప్రస్థానం స్వతంత్ర నవలలు, పలు పత్రికలలో సీరియల్స్‌గా వచ్చిన నవలలు ముద్రణ పొందడంతో యావదాంధ్రలో ఆయన పేరుపొందారు. ఆయనే యామినీ సరస్వతి. ఇది కలంపేరు. సరస్వతి ఆయన భార్యపేరు. ఆయన అసలు పేరు డీవీ సుబ్బారావు.
కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ ఫిర్కాలోని జిల్లేళ్ల గ్రామం స్వస్థలం. ఆగస్టు 3, 1941న జన్మించారు. కానీ సాహిత్య సంచారానికీ, రచనా రంగానికీ నంద్యాలనే ఆవాసం చేసు కున్నారు. నండూరు రామకృష్ణమాచార్య, గుంటూరు శేషేంద్రశర్మ, కొండవీటి వెంకట కవి, బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ సినారె వంటి ప్రముఖులెందరితోనే పరిచయం ఏర్పర్చుకుని నిత్య చర్చలు జరిపేవారు. నంద్యాల నూతన సారస్వత సంఘం కార్యదర్శిగా పని చేశారు.
దాదాపు యాబై పైగా నవలలు, వంద కుపైగా కథలు రాశారు. తన రచనా వ్యాసం గంతోనే కొండవీటి వెంకటకవికి, దాసరి నారాయణరావుకు సహరచయితగా మారారు. సినీ, టీవీ రచయితగా పేరొందారు. టీవీలో విశ్వామిత్ర సీరియల్‌కి, సినిమాకు రచయితగా, తాండ్రపాపారాయుడు, విశ్వనాథనాయకుడు సినిమాలకు సహరచయితగా పనిచేశారు.
సాహిత్యారాధన కోసం స్వగ్రామంలో తనకున్న ఆస్తులను కరిగించేశారు. 2004 సెప్టెంబర్ 5న ఆప్తులను, ఆత్మీయులను, హిత మిత్రులను వదిలి కీర్తిశేషులయ్యారు. రాయల సీమలో పేరెన్నికగన్న నవలా రచయితల్లో యామిని ఒకరు. కానీ రచనా రంగంలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల కంటే కర్నూలు వెనుకబడినందున కాబోలు ఆయనకు రావలసినంత పేరు రాలేదనే చెప్పాలి. సాహిత్యరంగంలో ఒకరికి పేరు రావడానికీ, మరొకరికి పేరు రాకపోవడానికీ మధ్య నడిచే బోలెడు కథల బాగోతంలో చిక్కిన బడుగు రచయితల్లో యామిని కూడా ఒకరయ్యారని చెప్పడం సబబు.
- దినకర్, విశ్రాంత తెలుగు పండితుల
Comments
Please login to add a commentAdd a comment