భాషకు వన్నెతెచ్చిన గురుశ్రేష్ఠుడు | Korada Mahadeva Sastri 100th Birth Anniversary | Sakshi
Sakshi News home page

భాషకు వన్నెతెచ్చిన గురుశ్రేష్ఠుడు

Published Wed, Dec 29 2021 2:33 PM | Last Updated on Wed, Dec 29 2021 2:33 PM

Korada Mahadeva Sastri 100th Birth Anniversary - Sakshi

భాషా శాస్త్ర రంగంలో పరిశోధనపై దృష్టి కేంద్రీకరించి తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన కోరాడ మహాదేవ శాస్త్రి శత జయంతి సంవత్సరం ఇది. ఆర్థిక శాస్త్రంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేసి సిమ్లాలోని లేబర్‌ ఇన్వెస్టిగేషన్‌ కమిషన్, భారతీయ వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఫిక్కీ)లలో ఆర్థికవేత్తగా పనిచేసినా భాషాశాస్త్రంలో విశ్వ విఖ్యాతి పొందిన ప్రొఫెసర్‌ సునీతి కుమార్‌ ఛటర్జీ పిలుపుతో చేస్తున్న ఉద్యోగం వదిలి కలకత్తా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో చేరి, ఎంఏ పట్టా పొందారు. తమిళనాడు చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్ర అధ్యాపకుడుగా పనిచేసి ఆ తర్వాత తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (1960–68), అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుడిగా ఉన్నారు. తెలుగు భాషలో ఎన్నో పరిశోధనా గ్రంథాలు వెలువరించడమే కాదు, సంస్కృత, ఆంగ్లభాషలతోపాటు ప్రాకృతం, హిందీ, భోజ్‌పురి, బెంగాలీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు భాషా సాహిత్య రంగాలు రెండిటా విశేష కృషి చేసి, తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతులపై పలు రచనలు చేశారు.

1969లో వెలువరించిన ‘హిస్టారికల్‌ గ్రామర్‌ ఆఫ్‌ తెలుగు’ అనే గ్రంథంలో భాషలోని వ్యాకరణాంశాలు కాలక్రమాన ఏవిధంగా మారుతూ వచ్చాయో వివరించారు. సాహిత్యంలోని భాష నిర్దిష్టమైన పద్ధతిలో ఉంటుంది. కానీ శాసనాలలో ఉపయోగించే భాష ఆయా కాలాల వ్యవహారిక భాషకు దగ్గరగా ఉంటుంది. ఆరవ శతాబ్దం మొదలుకొని వివిధ కాలాల్లోని వందలాది శాసనాలు పరిశోధించి రూపొందించిన గ్రంథమిది. మహాదేవ శాస్త్రి పరిశోధన పర్యవసానంగా శాసనాలను అర్థం చేసుకోవడం తేలికైంది. ఈ గ్రంథం ఆధారంగానే ఐరావతం మహదేవన్‌ అనే తమిళ పండితుడు సింధు నాగరికత కాలంనాటి శాసనాలలో కనబడే బాణం గుర్తు తెలుగు పదాల చివర ఉండే అంబు ప్రత్యయానికి చిహ్నమని గుర్తించారు. అంటే సింధు నాగరికత కాలం నాటికే తెలుగు భాషా రూపం ఉందని,  ఈ భాష ప్రాచీన తకు అది తార్కాణమని పండితులు నిర్ధరించారు. (చదవండి: చక్కని బొమ్మల చుక్కాని.. బాపు)

జర్మనీ లోని కొలోన్‌ విశ్వవిద్యాలయం ఆహ్వానంపై 1976లో అక్కడికి విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వెళ్లినప్పుడు ఆధునిక తెలుగు భాషా స్వరూపాన్ని వివరిస్తూ, విదేశీయులు తెలుగు నేర్చుకునేందుకు అనువుగా  ‘డిస్క్రిప్టివ్‌ గ్రామర్‌ అండ్‌ హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ మాడర్న్‌ తెలుగు’ అనే గ్రంథం రాశారు. అలాగే ద్రావిడ విశ్వద్యాలయం అభ్యర్థన మేరకు తెలుగు దేశ్య వ్యుత్పత్తి నిఘంటువును 2003లో రచించారు. బాల ప్రౌఢ వ్యాకరణ దీపికను 1987లో, ఆంధ్ర వాంఙ్మయ పరిచయాన్ని 1985లో ఆయన రచించారు. సంస్కృత, ప్రాకృతాల నుంచి తెలుగు భాషలోనికి వచ్చి చేరిన పదాలు, దేశ్య పదాల పుట్టుపూర్వోత్తరాలను, భాషలో కొన్ని ప్రత్యేకార్థాలను స్ఫురింపజేసే ధ్వనులనూ విపులంగా చర్చించే ‘భాష–సంస్కృతి’ అనే గ్రంథాన్ని 2014లో వెలువరించారు. తెలుగులో మాదిరిగానే ఆంగ్లంలో సైతం ప్రవాహ వేగంతో సాగే ఆయన ప్రసంగాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునేవి. ఈ విషయంలో ఆయనకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్ఫూర్తి. (చదవండి: సమసమాజ విప్లవ తపస్వి.. జ్వాలాముఖి)

తెలుగు భాష పట్ల ఆసక్తి, అనురక్తి పుష్కలంగా ఉన్న విద్యార్థులను కులమతాలకు అతీతంగా చేరదీసి, వారిని భాషా శాస్త్రంలో నిపుణులుగా తీర్చిదిద్దారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు, దేశాలలో భాషా సాహిత్య రంగాల్లో సేవలందిస్తున్న ఆయన శిష్యులే తార్కాణం. 1921 డిసెంబర్‌ 29న మచిలీపట్నంలో జన్మించిన మహాదేవ శాస్త్రి 2016లో తమ 94వ ఏట తిరుపతిలో కన్నుమూశారు. శత జయంతి సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు. (చదవండి: అజ్ఞాత మహనీయుడు.. డాక్టర్‌ ఎల్లాప్రగడ)

- డాక్టర్‌ కోరాడ వెంకటరమణ 
వ్యాసకర్త కెమికల్‌ టెక్నాలజీ నిపుణులు
(కోరాడ మహాదేవ శాస్త్రి శతజయంతి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement