రెండో ప్రపంచ యుద్ధానంతరం సుప్రసిద్ధ అమెరికన్ వ్యంగ్య నవలా రచయితల్లో మేటి అయిన ఫిలిప్ రాత్ మంగళవారం రాత్రి న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 20వ శతాబ్దికి చెందిన అత్యంత వివాదాస్పద రచయితల్లో ఒకరిగా గుర్తింపుపొందిన ఈ పులిట్జర్ అవార్డు గ్రహీత వయస్సు 85 ఏళ్లు. ‘అమెరికన్ పేస్టోరల్’, ‘పోర్ట్‌నోయ్స్ కంప్లయింట్’ వంటి 25 నవలలు, గ్రంథాలు రాసిన ఫిలిప్ సాహిత్యంలో నోబెల్ అవార్డు దక్కని అత్యంత ప్రముఖ రచయితల్లో ఒకరు. సెక్స్, మృత్యువు, జాతుల సమ్మేళనం, విధి వంటి అంశాలపై నిర్భయంగా, సాహసోపేతంగా తాను వర్ణించిన తీరు నాటి సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికన్‌గా ప్రత్యేకించి యూదుగా, రచయితగా, మనిషిగా ఉండటం అంటే ఏమిటి అనే అన్వేషణలో భాగంగా జీవితాంతం రచనలు చేశారు. ప్రత్యేకించి అమెరికన్ యూదుల సమస్య గురించి, పురుషుల లైంగికత ఉనికిపై సాహసోపేతమైన వ్యక్తీకరణలతో 50 ఏళ్ల క్రితం అమెరికన్ సమాజానికి షాక్ కలిగించారు.
ఫిలిప్ 1959లో అంటే 20 ఏళ్ల ప్రాయంలో రాసిన ‘గుడ్‌బై, కొలం బస్’ రచన తనకు నేషనల్ బుక్ అవార్డును తెచ్చిపెట్టింది. దశాబ్దం తర్వాత రాసిన ‘పోర్ట్‌నోయ్స్ కంప్లయింట్’ అమెరికన్ సమాజంలో సంచలనం కలిగించింది. కఠినతరమైన యూదు కుటుంబ పెంపకం నుంచి బయటపడటానికి అసాధారణ లైంగిక చర్యలను వాహికగా చేసుకోవడంపైనా, యువకుల లైంగికతపైనా ఈ పుస్తకంలో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. పురుషుల ప్రత్యేకించి యూదుల లైంగిక వాంఛల గురించి ఫిలిప్ వ్యాఖ్యానించిన తీరు తనకు పురుషాహంకారి అనే బిరుదును కూడా తెచ్చిపెట్టాయి.
తదనంతర జీవితంలో ‘అమెరికన్ పేస్టోరల్’ (1997), ‘ది హ్యూమన్ స్టెయిన్’ (2000), ‘ది ఫ్లాట్ ఎగైనెస్ట్ అమెరికా’ (2004) వంటి ప్రామాణిక రచనలు రాసినా, 1969లో రాసిన ‘పోర్ట్‌నోయ్స్ కంప్లయింట్’ అతడిని అత్యంత వివాదాస్పద రచయితగా మార్చింది. ఈ నవలను అమెరికన్ బూర్జువా ఉదారవాద స్వేచ్చపై చేసిన పెనుదాడిగా విమర్శకులు పేర్కొన్నారు. దీని తర్వాత తాను రాసిన ‘సబ్బాత్స్ థియేటర్’ కూడా పాఠకులకు షాక్ కలి గించింది. పురుషుల అసాధారణ లైంగిక చర్యలపై తన వ్యక్తీకరణలను స్త్రీవాదులు దుమ్మెత్తి పోశారు కూడా. యూదుల కుటుంబ జీవితంలోని సాంప్రదాయిక ఛాందసత్వం నుంచి తన నవలల్లో విముక్తి దారి చూపించానని ఫిలిప్ సమర్థించుకున్నారు.
జీవించి ఉండగానే లైబ్రరీ ఆఫ్ అమెరికాలో తన రచనలకు చోటు లభించిన మూడో అమెరికన్ రచయితగా ఫిలిప్ అరుదైన గుర్తింపు పొందారు. 1960–70లలో పులిట్జర్ ప్రైజ్, మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, నేషనల్ బుక్ అవార్డ్స్, నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు వంటి వలు అవార్డులు తన సొంతమయ్యాయి. 2012లో రాసిన ‘నెమిసెస్’ తన చివరి రచన. జీవితంలోని వాస్తవానికి భిన్నంగా కల్పననే ఎక్కువగా రాసుకుంటూ పోయానని, ఇక తన రచనలను మళ్లీ చదవాల్సిన అవసరం కానీ, తిరగరాయాల్సిన అవసరం కానీ లేదని ప్రకటించారు.
యూదుల ఉనికి, యూదు వ్యతిరేకత, అమెరికాలో యూదుల అనుభవం వంటి కథాంశాలే ఆయన రచనలకు మూలం. కల్పన, వాస్తవం ఎల్లప్పుడు సాహిత్యంలో తమ పాత్రలను మార్చుకుంటుంటాయని, ఒకదాన్ని మరొకటి అధిగమిస్తుంటాయని అందుకే తన జీవిత చరిత్ర పుస్తకంలో వాస్తవానికి విరుద్ధ ఘటనలు కూడా రూపొందించాల్సి వచ్చిందని, తన చరిత్ర రచనల్లో కూడా కాస్త కల్పన చోటు చేసుకుందని ఇది తన జీవితంలోని వాస్తవ నాటకీయత అని ఫిలిప్ సమర్థించుకున్నారు. దీనికి అనుగుణంగానే సాహిత్యం అంటే నైతిక సౌందర్య ప్రదర్శన కానే కాదని స్పష్టం చేశారు.
రచయితగా ఫిలిప్ రాత్ తీవ్రమైన వ్యంగ్యానికి, రాజీలేని వాస్తవికతకు మారుపేరు. పురుషుల లైంగికత నుంచి మొదలుకుని అన్నే ఫ్రాంక్ వరకు జీవితంలోని పలు అంశాలను సాహిత్యరూపంలోకి తీసుకొచ్చిన దిట్ట. తనను యూదు రచయితగా కాకుండా అమెరికన్ రచయితగానే చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. వలస జీవితంతో యూదులు అలవర్చుకున్న బాధాకరమైన సర్దుబాటు ధోరణిని తన రచనలు ప్రతిభావంతంగా చిత్రించాయి. మనిషి స్వేచ్చను, స్వాతంత్య్రాన్ని, 1960ల నాటి అమెరికన్ లైంగిక భావోద్వేగాలను ప్రతిభావంతంగా చిత్రించిన రచయితగా అమెరికన్ సమాజం తనను గుర్తించుకుంటుంది.
-కె. రాజశేఖర రాజు
Comments
Please login to add a commentAdd a comment