నిర్లక్ష్యం నీడన పిళ్లై సమాధి
అన్నానగర్: మయూరం వేదనాయగంపిళ్లై తమిళ సాహిత్య తొలి నవలా రచయిత. తన రచనల ద్వారా స్త్రీ విద్య, స్త్రీల స్వేచ్ఛకు ఎంతో కృషి చేశారు. కరువు సంభవించిన సమయంలో సొంత డబ్బుతో పేద వారికి ఇతోధికంగా సాయం అందించిన దయూగుణ శీలి. సామాజిక వేత్త. అలాంటి వ్యక్తి సమాధిని ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడంపై రచయితలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైలాడుదురై సమీపంలోని మయూరం ప్రాంతానికి మునసబుగా పనిచేసిన వేదనాయగంపిళ్లై కొలత్తూరులో 1826 అక్టోబరు 11న జన్మించారు. ఆయన రచయితగా పేరు తెచ్చుకున్నారు.
తన రచనల ద్వారా స్త్రీల స్వేచ్ఛను, స్త్రీలకు విద్యను అందించాలని పేర్కొన్నారు. ఆయన రచనల్లో నేతినూళ్, తిరువాళుర్‌మాలై, తిరువాళుర్ అంతాడి, దేవమాత, పెరియనాయగి, అమ్మన్‌పధిగం, తమిళ భాషలో తొలి నవలగా చెప్పబడుతున్న ప్రతాపమందలియారుచరితం, సుగుణంబాల్ చరిత్ర, పెన్‌మణం, పెణ్‌కల్వి, పెణ్‌మదిమాలై, సంగీత పర గ్రంథాలైన దేవ స్త్రోత్ర కీర్తనగళ్ తదితరాలు ఉన్నారు. వేదనాయగంపిళ్లై క్రిస్టియన్ వనితను వివాహం చేసుకోవడంతో వారి వంశస్తులు ఆయనను కులం నుంచి వెలివేశారు. దీంతో ఆయన మైలాడుదురై వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తమిళ సాహిత్యానికి ఎంతో సేవ చేశారు.
పేదలకు తనకు చేతనైనంత మేరకు సహాయం అందించారు. మయూరం ప్రాంతానికి మునసబుగా పనిచేశారు. ఆ సమయంలో కరువు సంభవించడంతో తన సొంత డబ్బుతో పేదలకు సాయం అందించారు. ఆయన 1889 జూలై 21న తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయూన్ని మైలాడుదురై మెయిన్ రోడ్డు నుంచి మాయవరానికి వెళ్లే దారిలోని ఆర్‌సీ శ్మశాన వాటికలో సమాధి చేశారు. ఆయన సమాధికి ఆనుకునే ఆయన తల్లి మరియమ్మాళ్, భార్య లాజర్ అమ్మాళ్ (వీరిద్దరూ బ్రిటీష్ వనితలు)ల సమాధులు కూడా ఉన్నాయి.
పసుపు రంగు సున్నపురాయితో మరియమ్మాళ్ సమాధిని, లాజర్ సమాధిని నిర్మించారు. ఈ రెంటికి ఎదురుగా దీర్ఘ చతురస్రాకారంలో పిళ్లై సమాధి ఉంది. 1983 వరకూ ధర్మపురం మఠం వారు ఈ సమాధులను పరిరక్షించారు. అనంతరం ఎవ్వరూ వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకున్నారు. సమాధిపైన కలుపు మొక్కలు పెరిగిపోరుు అధ్వానంగా దర్శనమిస్తోంది.