సోమర్‌సెట్‌ మామ్‌ ‘జీవనపాశం’ | Article On Kakani Chakrapani In Sakshi | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 5 2018 1:19 AM | Last Updated on Mon, Aug 13 2018 7:56 PM

Article On Kakani Chakrapani In Sakshi

కాకాని చక్రపాణి వృత్తిరీత్యా ఇంగ్లిష్‌ లెక్చరర్‌. ప్రవృత్తి రీత్యా తెలుగు కథకుడు, నవలా రచయిత, చేయి తిరిగిన అనువాదకుడు. ఆంగ్ల సాహిత్యాన్ని ఇష్టపడి అధ్యయనం చేసినవాడు. ఆంగ్ల సాహి త్యంలో సోమర్‌సెట్‌ మామ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు నవలా సాహిత్యంపై సోమర్‌సెట్‌ మామ్‌ ప్రభావం అన్న అంశంపై చక్ర పాణి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్నారు. అందులో భాగంగానే సోమర్‌సెట్‌ మామ్‌ ‘ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజ్‌’ నవలను తెలుగులోకి ‘జీవనపాశం’గా అనువదించారు.

చక్రపాణిగారు కన్నుమూసిన కొద్ది రోజుల తర్వాత జరిగిన సంతాపసభలో ఆయన ఇద్దరు కుమారుల సమక్షంలో జీవనపాశాన్ని ఆవిష్కరింప జేశారు. అనారోగ్యం తీవ్రంగా బాధిస్తున్నా ఆయన సాహితీ వ్యాసంగాన్ని వదలకుండా ఎలా జీవన్ము క్తులు అయ్యారో ఆ సభలో పాల్గొన్న వక్తలు తలచు కుని కంటతడి పెట్టారు.

నిర్దిష ప్రాంత భాషా సంస్కృతుల సొగసు జారి పోకుండా తెలుగు చేయడంలో చక్రపాణి గారిది అందె వేసిన చేయి. పుస్తకానికి సోమర్‌సెట్‌ మామ్‌ రాసుకున్న ముందుమాట ఇందులో వేయి వరహాల మూటగా మనకు ముందు దర్శనమిస్తుంది. సోమర్‌ సెట్‌ మామ్‌ (1874–1965) 1915లో రాసిన నవల ఇది. ఇరవయ్యవ శతాబ్దపు వంద అత్యుత్తమ ఇంగ్లిష్‌ నవలల్లో ఒకటి. ఫిలిప్‌ కథా నాయకుడు. పుట్టుకతోనే కాళ్లు వంకర, అందరిలా నడవలేడు. తొమ్మిదేళ్ల వయస్సులోనే అనాథ అవుతాడు. కొంతకాలం బంధువుల దగ్గర పెరుగుతాడు. బోర్డింగ్‌ స్కూల్లో చేరతాడు. వైకల్యం, అతి సున్నిత మనస్తత్వం వల్ల మిగతా విద్యార్థులతో కలవలేకపోతాడు. ఆక్స్‌ఫర్డ్‌లో స్కాలర్‌షిప్‌ కోసం ప్రయత్నించాల్సిందిగా ఒత్తిడి వస్తుంది. కానీ ఫిలిప్‌ మాత్రం జర్మనీలో ప్రత్యక్ష మవుతాడు. తరువాత లండన్‌లో అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా చేరిన చోట కూడా అంతగా రాణించడు. అయితే అక్కడి ఒక మేనేజర్‌తో పాటు బిజినెస్‌ ట్రిప్‌లో భాగంగా పారిస్‌కు వెళ్లడం ఫిలిప్‌కు ఒక మలుపు. పారిస్‌లో ఆర్ట్‌ క్లాసులకు కూడా వెళతాడు. అక్కడ ప్రైస్‌ పేద విద్యార్థిని. ఆమె ఎవరితోనూ కలవదు. ఫిలిప్‌ అంటే ఇష్టం పెరుగుతుంది. ఆమె ఫిలిప్‌తో పీకల్లోతు ప్రేమలో పడుతుంది. కానీ ఫిలి ప్‌కు ఇవేమీ తెలియదు. అతడికి అలాంటి భావం కల గలేదు. తరువాత శూన్యాన్ని భరించలేక ప్రైస్‌ ఆత్మ హత్య చేసుకుంటుంది.

తను ఎప్పటికీ ప్రొఫెషనల్‌ ఆర్టిస్ట్‌ కాలేనని నిర్ణ యించుకుంటాడు ఫిలిప్‌. ఇంగ్లండుకు వెనక్కు వచ్చే స్తాడు. శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా చాలా ఇబ్బందిపడి మెడికల్‌ స్కూల్‌లో చేరతాడు. స్కూల్‌ టీ షాపులో సర్వర్‌గా పనిచేసే అమ్మాయి మిల్డ్రెడ్‌ ప్రేమలో పడతాడు. ఆమెతోనే లోకం అనుకుం టాడు. ఒక శుభోదయాన నాకు ఫలానా వాడితో పెళ్లి అని మిల్డ్రెడ్‌ ఫిలిప్‌కు చెబుతుంది. ఫిలిప్‌ గుండె బద్ద లవుతుంది. మౌనంగా రోదిస్తాడు.

కొంత కాలానికి నవలా రచయిత నోరా ప్రేమలో పడతాడు. చిగురించిన ప్రేమ పూలు పూయకముందే– మిల్డ్రెడ్‌ వెనక్కు వస్తుంది – గర్భ వతిగా. ఫిలిప్‌ నోరాకు దూరమై మిల్డ్రెడ్‌కు దగ్గర వుతాడు. ఆర్థికంగా ఆమెను ఆదుకుంటాడు. పాప పుడుతుంది. మిల్డ్రెడ్‌ ఈసారి మరో వ్యక్తి హారీ ప్రేమలో పడుతుంది. ఫిలిప్‌కు చెప్పకుండా అతడితో లేచిపోతుంది. ఒక ఏడాది తరువాత ఫిలిప్‌ మిల్డ్రె డ్‌ను వెతికి పట్టుకుంటాడు. సానుభూతితో ఆదరి స్తాడు. ఆమెకంటే ఆమె పాప ఫిలిప్‌కు బాగా దగ్గర వుతుంది. ఈసారి మిల్డ్రెడ్‌ చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తే ఫిలిప్‌ దూరం పెడతాడు. గొడవలు పెద్ద వవుతాయి. నానా రాద్దాంతం చేసి మిల్డ్రెడ్‌ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఫిలిప్‌ మైనింగ్‌లో పెట్టుబడులు పెట్టి ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు. చివరికి ఇంటి అద్దె కట్ట లేని పరిస్థితి.

అథెల్నీ మంచి రచయిత. ఫిలిప్‌ వీధిపాలు కావడం చూడలేక ఒక డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇష్టం లేకపోయినా తప్పనిసరై చేస్తాడు ఫిలిప్‌. కొంత జీతం పెరుగుతుంది. అతి కష్టంమీద మెడిసిన్‌ కోర్సు పూర్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. లైసెన్స్‌డ్‌ డాక్టర్‌ అయ్యాడు. భాగస్వామ్యంలో ఆసుపత్రి పెడదామని వైద్యుడు సౌత్‌ ఆఫర్‌ ఇస్తాడు. ఫిలిప్‌ తిరస్కరించి తనకు సహాయం చేసిన అథెల్నీతో వాళ్ల ఊరికి వెళతాడు. ఆయన కూతురు శాలీ ఫిలిప్‌ను ప్రేమిస్తుంది. శారీ రకంగా దగ్గరవుతారు. శాలీ గర్భవతి అని తెలియ గానే పెళ్లి ప్రతిపాదన చేస్తాడు ఫిలిప్‌. డాక్టర్‌ సౌత్‌ ఆఫర్‌కు ఓకే చెప్పి శాలీని పెళ్లి చేసుకుని హాయిగా కాలం గడుపుతాడు ఫిలిప్‌. 

సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అన్న మాటతో నవల ముగుస్తుంది. ఇది చాలా పెద్ద నవల. ముందు బ్యూటీ ఫ్రమ్‌ ది యాషెస్‌ అని పేరు పెట్టాలను కున్నాడు మామ్‌. తర్జన భర్జన తరువాత ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజ్‌ అని నామకరణం చేశాడు. ప్రేమ–వైఫల్యం, వైకల్యం–మానసిక సంఘర్షణ, ఇష్టాలు–ద్వేషాలు, కష్టాలు– కన్నీళ్లు, బంధాలు– స్వేచ్ఛ, సాధించటం–రాజీలు ఇలా ఎన్నో వైరుధ్యాల మధ్య జీవనపాశం ఎలా కట్టి పడేస్తుంటుందో చెబు తుంది ఈ నవల.

ప్రతులకు: జీవన పాశం : ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజ్‌– విలియం సోమర్‌సెట్‌ మామ్, తెలుగు అనువాదం– కాకాని చక్రపాణి, సంపాదకులు– డి. చంద్రశేఖర్‌రెడ్డి, పేజీలు– 752, వెల– రూ. 400, ప్రచురణ– ఎమెస్కో.

పమిడికాల్వ మధుసూదన్‌, మొబైల్‌ : 99890 90018

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement