
కుప్పలి వెంకటప్ప గౌడ పుట్టప్ప
తొలుత ఇంగ్లిష్‌లో రాయడం మొదలుపెట్టి, ‘బిగినర్స్ మ్యూజ్’ పేరుతో కవితల సంపుటి కూడా వెలువరించిన ‘కువెంపు’, తర్వాత మాతృభాష కన్నడంలోనే రాయాలని నిశ్చయించుకున్నారు. ‘మాతృభాషలోనే విద్యాబోధన’ నినాదంతో కర్ణాటకలో కన్నడ మాధ్యమం వేళ్లూనుకోవడానికి నడుం బిగించారు. ‘కువెంపు’ కలంపేరుతో ప్రసిద్ధుడైన ‘పద్మ విభూషణ్’ కుప్పలి వెంకటప్ప గౌడ పుట్టప్ప (1904–1994) ఇరవయ్యో శతాబ్దపు గొప్ప కన్నడ కవిగా కీర్తినొందారు. జ్ఞానపీఠ్ పురస్కారం(1967) అందుకున్న తొలి కన్నడిగుడు కూడా. ఇతిహాసం, నవల, కవిత్వం, నాటకం, విమర్శ, ఆత్మకథ, బాలసాహిత్యం, అనువాదం... దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ విస్తారంగా రాశారు. ఆధునిక రీతిలో వ్యాఖ్యానించిన కావ్యం ‘శ్రీ రామాయణ దర్శనం’ ఆయన ప్రసిద్ధ ఇతిహాసం. ‘శూద్ర తపస్వి’, ‘కానూరు హెగ్గడితి’ (ఇదే పేరుతో గిరీశ్ కర్నాడ్ దర్శకత్వంలో దీని ఆధారంగా సినిమా కూడా వచ్చింది) ఆయన ఇతర రచనలు. తన రచనలు ‘విశ్వమానవతా వాదా’నికి ప్రోద్బలం ఇస్తాయని అనేవారు. ‘జై భారత జననియ తనుజాతె/ జయహే కర్ణాటక మాతే’ పేరుతో రాసిన ఆయన గేయాన్నే కర్ణాటక రాష్ట్రగీతంగా పాడుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం ప్రవేశపెట్టిన ‘కర్ణాటక రత్న’ బిరుదును కూడా ఆయనకే తొలుత ప్రదానం చేశారు. మైసూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. మరో గొప్ప కన్నడ కథకుడు, కవి పూర్ణచంద్ర తేజస్వి (1938–2007) కువెంపు కుమారుడే.
Comments
Please login to add a commentAdd a comment