పక్కింటి ఎండమావి | Eduru Addalu Book Review In Sakshi | Sakshi
Sakshi News home page

పక్కింటి ఎండమావి

Published Mon, Jul 15 2019 12:04 AM | Last Updated on Mon, Jul 15 2019 12:04 AM

Eduru Addalu Book Review In Sakshi

న్యూ మార్కెట్‌లో ఉష కొన్న సామానులన్నీ ఆరు పేకెట్లయ్యాయి. కాస్మటిక్స్‌ పాకెట్స్‌ రెండు, చీరల దుకాణంలో తయారైన పాకెట్లు మూడు, ఆపిల్స్‌ మూడు కిలోలు కట్టిన పెద్ద కాగితపు సంచీ ఒకటి అన్నీ మోసేసరికి చేతులు నొప్పులు పెడుతున్నాయి రామనాథానికి.

‘ఈమె ఖర్చు మనిషి’ అనుకున్నాడు మనస్సులో, బయటికి అంటే కలిగే పరిణామాలను గురించి తెలుసును కనక. ఇప్పుడు ఆమె షాపింగ్‌ పూర్తి కాబోతోంది. ఇంతసేపూ ఈ భారం వహించి చిట్టచివర ఆమెకు తన పొరపాటు తెలియజెయ్యడంలో మంచి ఏమీ కనిపించలేదతనికి.

‘‘బరువుగా ఉన్నాయా?’’ అంది గ్రీటింగ్‌ కార్డుల షాపు వైపు దారి తీస్తూ.

‘‘అబ్బే! లేదు’’ అన్నాడు రామనాథం. ఆమె చిరునవ్వుతో అతన్ని మరోసారి ధన్యుణ్ని చేసి న్యూ ఇయర్‌ కార్డ్స్‌ చూడటంలో నిమగ్నం అయింది.

రెండేళ్ల నించి ఎన్నోసార్లు చూసినా, తనకి ఎప్పటికీ తనివి తీరదు. ఆమె వయస్సుతోపాటు, చిరునవ్వూ, సౌందర్యమూ ఉత్కర్ష పొందుతున్నాయి.

మరో పది నిమిషాల తరువాత ఆమె ‘‘సారీ! పోదాం పదండి’’ అనడంతో స్వప్నలోకాల నుంచి న్యూ మార్కెట్‌ దుకాణాల మధ్యకి వచ్చి బయటికి నడిచాడు రామనాథం. 

కారు వెనకసీట్లో సామానులు చక్కగా సర్దిపెట్టి నిలబడ్డాడు. స్టార్టు చేసి, ‘‘నాతో వస్తారా?’’ అంది.

‘‘థాంక్స్‌. నేను రాను, కొంచెం పని ఉంది’’ అని ఆమె వైపు చూసి నవ్వి, తలుపు జాగ్రత్తగా వేశాడు. కారు తలుపులు బాదడం అంటే ఆమెకి కోపం. 

ఆమె విలాసంగా వెళ్లిపోయింది. ఆ వైపే చూస్తూ నిలబడ్డ రామనాథానికి భుజం మీద పడ్డ చెయ్యి మళ్లీ తెలివి తెప్పించింది.

‘‘నేనోయ్‌! రమణమూర్తిని... జ్ఞాపకం లేదూ?’’

‘‘నువ్వు... మీరు... రమణమూర్తి?’’ నత్తిలాగా అన్నాడు.

‘‘ఇద్దరం మీ ఎలమంచిలి బడిలో అయిదోఫారం చదువుకున్నాం...’’

‘‘ఓ మీరు...’’

రమణమూర్తి నవ్వాడు. ‘‘మీరేమిటోయ్‌! కలియక కలియక ఈ మహానగరంలో చిన్ననాటి స్నేహితుడివి కలిశావు. ఏం చేస్తున్నావ్‌?’’

తేరిపార చూశాడు రామనాథం. తెల్లటి పంట్లాం, టెరిలిన్‌ బుష్‌ షర్టు. ఆరడుగుల ఎత్తు. పాతరోజులు జ్ఞాపకం వచ్చాయి. రమణమూర్తి స్కూల్లో పేరుమోసిన రౌడీగా ఉండేవాడు. ఆటల్లో ఫస్టూ, చదువులో లాస్టూను.

‘‘ఇక్కడే ఒక ఫర్మ్‌లో ఉంటున్నాను, ఏషియాటిక్‌ ట్రేడ్స్‌లో.’’

‘‘ఉండటం ఎక్కడ?’’

‘‘భవానీపూర్‌లో. నువ్వు?’’

రమణమూర్తి నవ్వాడు. ఎందుకో అర్థం కాలేదు రామనాథానికి.

‘‘నేను... మెకంజీ కంపెనీలో పని చేస్తున్నాను, తెలుసుగా? ఫెయిర్లీ ప్లేసులో.’’

అతనెందుకు నవ్వాడో ఈసారి అర్థం అయింది రామనాథానికి. ఇక్కడ ఉన్న పెద్ద కంపెనీల్లో అది ముఖ్యమైనది. ఈ మొద్దబ్బాయికి అంత మంచి కంపెనీలో ఉద్యోగం! అతని పక్కన తన అయిదడుగుల ఆరంగుళాల ఎత్తు సిగ్గు కలగజేస్తోంది.

‘‘వెరీ గుడ్‌!’’ అన్నాడు రామనాథం చివరికి.

మళ్లీ నవ్వాడు రమణమూర్తి. రామనాథానికి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది, స్కూల్లో తనను తరచు హేళన చేస్తూ ఉండేవాడు ఇతను. ఒకసారి ఫుట్‌బాల్‌ ఆడటానికి వెడితే తాను కొంచెం పరాకుగా ఉన్నప్పుడు తన వీపుకి గురి చేసి బంతి గట్టిగా తన్నాడు. బోర్లాపడి లేస్తుంటే రమణమూర్తి సరీగా ఇలాగే నవ్వాడు. అదీకాక రమణమూర్తి దగ్గర ఖర్చులకు డబ్బులుండేవి. తన దగ్గర ఉండేవి కావు.

‘‘పద, కాఫీ తాగుదాం!’’ అన్నాడు రమణమూర్తి.

అప్రయత్నంగా జేబులో చెయ్యి పెట్టుకున్నాడు రామనాథం. గుండె జల్లుమంది. బట్టల దుకాణంలో ఇచ్చిన చిల్లర అరవై రూపాయలు జేబులో ఉన్నాయి.

ఆమెకి అవసరం వస్తే? ఆమె తిన్నగా ఇంటికి వెళ్లి ఉంటే పరవాలేదు కానీ, మరేమైనా కొనదలుచుకుంటే? మరుక్షణంలో అతనికి సంతోషం కలిగింది. సామాన్యంగా అయిదారు రూపాయలకన్నా తన దగ్గర ఉంచుకునే అలవాటు లేదతనికి. కానీ, ఈ వేళ రమణమూర్తి దగ్గర పరాభవం జరగకూడదు.

‘‘పద!’’

‘‘కారు తీసుకువెడదాం!’’ అన్నాడు రమణమూర్తి గడియారం చూస్తూ. రామనాథం ఎదురుగా ఉన్న టవర్‌ క్లాక్‌ చూశాడు. ఏడు దాటుతోంది. ఆమె తనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ...

‘‘ఏం గడియారం చూసి అలాగ అయ్యావు? భార్యగారు దెబ్బలాడతారా?’’ అన్నాడు లైట్‌హౌస్‌ సినిమా వైపు దారి తీస్తూ రమణమూర్తి.

‘‘అబ్బే, అలాంటిది కాదు!’’ అన్నాడు.

‘‘ఆవిణ్ని చూసి అలాగే అనుకున్నాను. అద్భుతమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావోయ్‌!’’ అన్నాడు.

తెల్లబోయి చూసి, ‘‘నువ్వెప్పుడు చూశావు?’’ అన్నాడు రామనాథం.

‘‘ఇందాకా నువ్వు సాగనంపుతూంటే చూశాను.’’

వెయ్యి తలపులు ఒక్కసారిగా వచ్చాయి రామనాథం మనస్సులో. కానీ, ఉషను తలుచుకోగానే ముఖంలో విచిత్రమైన కాంతి వచ్చింది.

రమణమూర్తి లైట్‌ హౌస్‌కు ఎదురుగా పార్క్‌ చేసిన పెద్ద ఫోర్డ్‌ కారు తలుపు తీసి ‘‘కూర్చో!’’ అని అతన్ని ఆహ్వానించాడు.

‘‘ఎంత బాగుంది నీ కారు!’’ అన్నాడు అప్రయత్నంగా రామనాథం.

‘‘కస్టమ్‌ మోడల్‌. ఎక్కడికి వెడదాము?’’

‘‘ట్రింకాస్‌కి పద!’’

‘‘అంతకన్న క్వాలిటీయే బాగుంటుంది’’

‘‘రెండూ అక్కడేగా. క్వాలిటీయే సరి.’’

ఎంతో మృదువుగా కారు అయిదు నిమిషాల్లో పార్క్‌ స్ట్రీట్‌ చేరుకుంది. విచిత్రంగా ఉంది రామనాథం పరిస్థితి. ముందర అతనికి రమణమూర్తి ఉషను చూసి పొందిన ఆశ్చర్యం ఎంతో సంతృప్తిని కలగజేసింది. కానీ అతని కారు చూశాక ఆ సంతృప్తి తగ్గిపోయింది.

బీచ్‌ సాండ్విచ్, పకోడా, ఐస్‌క్రీమ్స్, కాఫీ ఆర్డరు చేశాడు రమణమూర్తి. 

‘‘అదృష్టవంతుడివి రామనాథం. నిన్ను ఎప్పుడు తలుచుకున్నా నీ సౌమ్యత, మంచితనం జ్ఞాపకం వస్తాయి. అప్పుడే అనుకునేవాణ్ని నువ్వు పైకి వస్తావని’’ అన్నాడు పకోడా తింటూ రమణమూర్తి.

‘‘నీకన్నానా?’’

‘‘నాది ఏముందిలే, బాధ లేకుండా గడిచిపోవడం తప్ప’’

‘మస్తుగా ఉన్నవాళ్లందరికీ ఇదే రోగం’ అనుకుని, ‘‘నువ్వు పెళ్లి చేసుకోలేదా?’’ అన్నాడు రామనాథం.

‘‘అనేక సమస్యల వల్ల...’’

‘‘పెళ్లి చేసుకుంటే అవే తీరుతాయి’’

‘‘నీలాగా అందరికీ అదృష్టం కలిసిరావద్దూ!’’

సంభాషణ ఉష మీదకి నడవడం ఇష్టం లేదు రామనాథానికి. ‘‘నీ కారు గొప్పగా ఉంది రమణమూర్తీ’’ అన్నాడు.

‘‘ప్చ్‌’’ అన్నాడు రమణమూర్తి.

నలభై రెండు రూపాయల ఎనభై ఆరు పైసలు బిల్లు వచ్చింది. రమణమూర్తి బిల్లు తీసుకోబోయాడు. పీకపోయినా అతన్ని బిల్‌ తీసుకోనివ్వదలచుకోలేదు రామనాథం. ఐదు పది రూపాయల నోట్లు పడేసి బయటికి నడిచాడు.

‘‘సిగరెట్‌ కావాలా?’’

అర పాకెట్‌ తీసుకుని అతని కొకటి ఇచ్చి తానొకటి తీసుకున్నాడు రామనాథం.

‘‘పద, నిన్ను డ్రాప్‌ చేసి వస్తాను’’ అన్నాడు రమణమూర్తి. కొంచెం గాభరా పడ్డాడు రామనాథం.

‘‘ఎందుకూ? నేను నడిచి వెళ్లిపోతాను. ఈ మహాపట్టణంలో నడవటం అంటే నాకు సరదా’’

రమణమూర్తి బలవంతం చెయ్యలేదు. కారు స్టార్టు చేసుకుని, రామనాథానికి సలామ్‌ చెప్పి విసురుగా వెళ్లిపోయాడు. 

రమణమూర్తి సలామ్‌ రామనాథాన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఉషను గురించి చెప్పిన మాటలూ సంతోషపెట్టాయి. పార్క్‌ స్ట్రీట్‌లో నుంచి చౌరంగీ రోడ్‌కి వచ్చేసరికి అతని సంతోషం కొంచెం తగ్గింది. ఈ సాయంత్రం ఏభై ఎనిమిది రూపాయలు ఖర్చయింది. ప్రతీ పైసాకీ పూర్తి తృప్తి రాలేదని కాదు. కానీ...

ఉదయం వెడుతూంటే...

‘‘బాబుని బడిలో వెయ్యాలి’’ అంది కాంతం.

బడిలో వెయ్యడానికి బట్టలు కావాలి; పుస్తకాలు కొనాలి; ఆ డబ్బులుంటే నీకు ఒక్క మందైనా కొందును అనుకున్నాడు రామనాథం. తన దగ్గర ఎప్పుడూ ఉండదు డబ్బు. శేuŠ‡జీ ధర్మమా అని ఇంటర్‌ ఫెయిల్‌ అయినా ఆరువందలు దొరుకుతున్నాయి. ఈ కలకత్తాలో చావకుండా బతుక్కు వస్తున్నాడు.

ఏభై ఎనిమిది రూపాయలు! 

ఎంత అవివేకం! రేపు పట్టుకువెళ్లి పూర్తి సొమ్ము ఇవ్వకపోతే ఉషాదేవి ఏమంటుంది? తనకంత గర్వం దేన్ని చూసుకుని? ఐశ్వర్యంలో తులతూగుతున్న రమణమూర్తితో తనకు పోటీ ఏమిటి?

పి.జి.హాస్పిటల్‌ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా కుంగిపోయాడు. తన బ్రతుక్కి నాలుగు రూపాయల సిగరెట్లేమిటి? జేబులో ఉన్న సిగరెట్‌ పాకెట్‌ కాలవలోకి విసిరాడు. రేపు ఏం సమాధానం చెబుతావు? ఈ ఉద్యోగం ఊడితే ఏం చేస్తావు? అతనికి రమణమూర్తి మీద కోపం వచ్చింది. బయటికిరాని ఏడుపుతో ఇంటికి చేరాడు రామనాథం.

‘ఉషాదేవిని బ్రతిమిలాడాలి శేఠ్‌జీతో చెప్పవద్దని’ అనుకున్నాడు ఇంట్లో కాలు పెడుతూ.
∙∙ 
రమణమూర్తి గడియారం చూసుకున్నాడు. ఎనిమిదిన్నర కావస్తోంది. ఇంక సినిమా అయిపోతుంది.

కాలుస్తున్న బీడీ పారేసి, సీటు కింద నుంచి ఖాకీకోటు తీసి తొడుక్కుని, అద్దంలో ముఖం చూసుకుని నిట్టూర్చాడు. 

‘మేమ్‌ సాహెబ్‌ ఇంక వచ్చేస్తుంది! సినిమా వదిలేశారు’

ఇచ్ఛాపురపు జగన్నాథరావు (1931–2017)  ‘ఎదురు అద్దాలు’ సంక్షిప్త రూపం ఇది. 1999లో ప్రచురితం. జగన్నాథరావు కథలు 13 సంపుటాలుగా వెలువడినాయి. ఎదురు అద్దాలు ఒక సంపుటం పేరు కూడా. వానజల్లు, చేదు కూడా ఒక రుచే లాంటివి ఇతర సంపుటాలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement