రచయిత్రి అనితా నాయర్
‘నన్ను నేను చంపుకున్న ఆ సోమవారం స్పష్టంగా, ప్రకాశవంతంగా ఉన్నది. నా మరణం చుట్టుపక్కల వారి దృష్టిలో నన్ను ‘కేరళా వర్జీనియా వుల్ఫ్’ను చేసింది. మార్కోస్ మాత్రం నా పేరెత్తలేదు. అర్ధరాత్రి శ్మశానానికి వచ్చి, నా కుడిచేతి చూపుడి వేలి ఎముకను తీసుకెళ్ళాడు. ఆ నా ఆత్మను, నేనతనికి బహూకరించిన వెల్వెట్ పెన్ను డబ్బాలో ఉంచి, కర్ర బీరువా రహస్యపు అరలో పెట్టాడు. నా భౌతిక భాగం, లోకంలో ఉన్నంతవరకూ తప్పించుకోలేను. సంవత్సరాలు గడిచాయి. బీరువా మరేదో చోటుకి తరలించబడింది. నా పేరు శ్రీలక్ష్మి, రచయిత్రిని.’ ఇది అనితా నాయర్ రాసిన ‘ఈటింగ్ వాస్ప్స్’ నవల.
కేరళలోని నీలా నది పక్కనుండే ఊర్లో చనిపోయిన శ్రీలక్ష్మి 30ల్లో ఉన్న ఉపాధ్యాయురాలు, సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత. ‘ఒకసారి కందిరీగను మింగి, దాని పోట్లను తట్టుకున్నాను. కానీ, మరణించిన తరువాత మరిచిపోబడిన ఎముకగా మాత్రమే మిగిలాను’ అంటుంది. 52 ఏళ్ళ తరువాత, ఒక హోటెల్లో ప్రాచీనకాలపు బీరువాలో దాక్కున్న పిల్ల మేఘ, దాన్లో ఉన్న సున్నంతో నిలవబెట్టబడిన ఆ వేలి ఎముకను చేతిలోకి తీసుకుంటుంది. ‘దయ్యాలు, రచయితలు ఒకేలా ఉంటారు. మీరు మాకు చెప్పకపోయినా గానీ, మీ ఆలోచనలను మేము వినగలం. నేను దయ్యాన్నీ, రచయిత్రినీ కూడా’ అంటూ, తనను ఆ తరువాత తాకిన మిగతా తొమ్మండుగురు స్త్రీల కథలనూ పసిగడుతుంది శ్రీలక్ష్మి. అలా అణచివేతనూ, మనోభావాల గాయాలనూ మోస్తున్న– భిన్నమైన నేపథ్యాలకు, మతం, కులం, వయస్సుకు చెందిన స్త్రీల జీవితాలు బయటపడతాయి. అందరూ లింగ వివక్షను ఎదుర్కొంటున్నవారే. తమ ఆశలను వెళ్ళబుచ్చినందుకు సమాజపు ఎగతాళి అనుభవించినవారే. అలా, ఒకరితో మరొకరికి ఏ సంబంధం లేని ఊర్వశి, నజ్మా, ఇతర స్త్రీల జీవితాలు పాఠకులకు పరిచయం అవుతాయి. నజ్మా ఏసిడ్ దాడి బాధితురాలు. ఊర్వశి పాత్రికేయురాలు. పెళ్ళయి, పెద్ద పిల్లలున్న స్త్రీ. డేటింగ్ అప్లికేషన్ వాడి, ఒక వ్యక్తిని కలుసుకుని అతనికి కావలసినది కేవలం భౌతిక సంబంధం మాత్రమే అని గుర్తించి దూరం తొలిగిపోతుంది. అతను వెంటాడుతాడు. వీరందరూ దృఢమైన స్త్రీల్లా కనిపించినా, ఎవరి బలహీనతలు వారికుంటాయి. అయితే, పరిస్థితులకు తలవంచరు.
దీన్లో ప్రాధాన్యత ఉండేది శ్రీలక్ష్మి, ఊర్వశి కథలకే. మిగతా స్త్రీలకి ఒక అధ్యాయమో తక్కువో కేటాయించబడతాయి. మిగతావారు కొన్ని అధ్యాయాల్లో సహాయక పాత్రలు పోషిస్తారు. ‘ఇది ఇచ్ఛలూ, వాటి పర్యవసానాల పుస్తకం’ అంటారు నాయర్. ‘ఇచ్ఛ భౌతికమైనదే కానవసరం లేదు. పరిస్థితులని తప్పించుకునే ఆశ అయిండొచ్చు. తమ గుర్తింపు కోసమైన అన్వేషణ అవ్వొచ్చు. తమని సమాజం పట్టించుకోవాలన్న కోరిక కావొచ్చు. స్త్రీలకు ఇచ్ఛలు ఉండకూడదని పవిత్ర గ్రంథాలు చెప్తాయి. నా కథలో స్త్రీలు అలాంటివారు కారు. వారు తమ చర్యల పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధపడినవారు’ అంటారు. నవల్లో ఉండే అనేకమైన పాత్రల, ఉపకథలవల్ల కొంత అయోమయం కలిగించినా, సారం మాత్రం స్పష్టంగా ఉంటుంది.
చివర్న, కథనం కథకురాలి మీదకి మళ్ళి, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అన్న అంశానికి తిరిగి వస్తుంది. మిగతా ఏ పాత్రకీ ముగింపునివ్వరు రచయిత్రి. ‘మీ టూ’ ఆందోళన ఊపందుకుంటున్న కాలపు నేపథ్యంతో వచ్చిన ఈ పుస్తకాన్ని, ‘కాంటెక్స్’ 2018లో ప్రచురించింది.1960లో కేరళ సాహిత్య పురస్కారం పొంది, 35 ఏళ్ళ వయస్సులో ఆత్మహత్య చేసుకున్న ప్రసిద్ధ మలయాళ రచయిత్రి/కవయిత్రి రాజలక్ష్మిని శ్రీలక్ష్మి పాత్రకు ఆధారంగా తీసుకున్నారు అనితా నాయర్. అనిత కూడా రచయిత్రీ, కవయిత్రీ. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో పుట్టారు. 2012లో కేరళ సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్నారు.
-కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment