కన్నీళ్లు పెట్టించే ముస్లిం బతుకు వెతలు | A Book On Charminar Muslims In Sakshi Sahityam | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 3 2018 12:36 AM | Last Updated on Mon, Sep 3 2018 12:36 AM

A Book On Charminar Muslims In Sakshi Sahityam

ముస్లిం కథకులు తమ లోపల సుళ్ళు తిరుగుతున్న  అనేక  ఆలోచనల్ని పంచుకుంటూ మిగతా సమాజంతో చేస్తున్న వొక సంభాషణ ‘కథామినార్‌’. ముస్లిం జీవితాల్ని పట్టిపీడిస్తున్న అవిద్యనీ పేదరికాన్నీ అనైక్యతనీ అన్నిటికీ మించి అభద్రతనీ సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఇరవై ముగ్గురు రచయితలు వినిపిస్తున్న బాధా తప్త స్వరాలివి. 
ముస్లింల పట్ల మెజారిటీ సమాజానికి వున్న అపోహలను తొలగించి సెన్సిటైజ్‌ చేయడం, సొంత మతం లోపలి అభివృద్ధి నిరోధక భావజాలాన్ని తిరస్కరించడం, మతోన్మాదుల నిజస్వరూపాల్ని బహిర్గతం చేసి దేశస్థుల మధ్య వెల్లివిరియాల్సిన మానవీయ బంధాల్ని నిర్మించడం, ప్రజాస్వామ్య లౌకిక భావజాలాన్ని బోధించడం యీ కథలకు వస్తువు. అందుకు నేపథ్యంగా గత పదిహేనేళ్ళుగా భారతీయ సమాజంలో చోటుచేసుకున్న అనేక రాజకీయ ఘటనలు, పాలకుల పాలసీలు  ముస్లిం జీవితంపై చూపిన ప్రభావాల్ని  రచయితలు వొడుపుగా పట్టుకున్నారు. ముంబాయి తాజ్‌పై వుగ్ర దాడి దగ్గర్నుంచీ స్థానికంగా మక్కామసీదు గోకుల్‌ చాట్, దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ళ దరిమిలా ముస్లిం సమాజంపై అమలయిన స్టేట్‌ స్పాన్సర్డ్‌ వయోలెన్స్, దాని కారణంగా యేర్పడ్డ అభద్రత కథల్లో  చర్చకు వచ్చింది.
బతుకు బండి నడపడానికి చిన్నా చితకా వృత్తిపనుల్లో తలమునకలై వున్నవాళ్ళూ తోపుడు బండ్లపై పూలూ పండ్లూ అమ్ముకొనేవాళ్ళూ మసీదుల దగ్గర చెప్పుల స్టాండ్‌ పెట్టుకునేవాళ్ళూ పొట్టకూటి కోసం అడ్డాలమీది కూలీలు హోటల్‌ సర్వర్లు  మోటర్‌ మెకానిక్కులు ... యీ కథల్ని నడుపుతారు. అప్పో సప్పో చేసి పండగ రోజున యింటిల్లి్లపాదికీ బట్టలు కుట్టించి తాను మాత్రం పాతబట్టలే ధరించే సత్తార్లు(శశిశ్రీ), కుటుంబ పోషణకోసం యింట్లో బయటా పని చేసి గంధపు చెక్కల్లా అరిగిపోయే అమ్మలూ (అక్కంపేట ఇబ్రహీం), మతోన్మాద తోడేళ్ళ మూకుమ్మడి దాడుల్లో బలయ్యే బుజ్జిమేక పిల్లలూ(డానీ), ఆధిక్యభావనతో మతం పేర్న అవమానించేవాళ్ళలో మానవత్వానికి పురుడుపోసే బూబవ్వలూ (జి బాషా), పేదరికంలో తల్లిదండ్రుల ద్వారానే అరబ్బులకు అమ్ముడుపోయే చిన్నారి తబస్సుంలూ (రెహానా), కరువు ప్రాంతాల్లో  రోజూ నీళ్లు మోసే ఘోష నుంచి తప్పించుకోడానికి గోషా జీవితాన్ని కోరుకునే చాందినీలు (షరీఫ్‌), సరైన ఉపాధి లేక అసాంఘిక శక్తుల చేతిలో పావుగా మారే సలీంలు(అమర్‌ అహ్మద్‌) కన్నీళ్లు పెట్టిస్తారు. రాజ్యహింస తండ్రి ప్రేమను హరిస్తే జ్వర పీడితుడైన ముస్తాక్‌  (ఖదీర్‌) మాత్రం మొత్తం ముస్లిం సమాజాన్ని  జ్వరగ్రస్తం చేస్తున్న కారణాల పట్ల అప్రమత్తం చేస్తాడు. ద్వేషించే మనుషుల మధ్య ప్రేమని పంచే మిస్బా (వాహెద్‌) కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు.
గుజరాత్‌ గాయం తర్వాత వెలువడ్డ వతన్‌ (సంపా. స్కైబాబా)కి కొనసాగింపుగా వచ్చిన సమకాలీన ముస్లిం నేపథ్య కథలు (2005–2018) యివి. ఇవి కంప్లైంట్‌ చేయవు. ద్వేషాన్ని పెంచవు. కావడానికి స్థల కాల నిర్దిష్టతలోంచి వచ్చినవే అయినప్పటికీ స్థల కాలాలతో ప్రమేయం లేని బతుకు వెతలే. స్వీయ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం పెనుగులాడుతోన్న బాధిత  సమూహాల వేదనే అడుగడుగునా కనిపిస్తుంది.
ఎ.కె.ప్రభాకర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement