కోరుకున్నది సాధించిన తర్వాత? | Review On Some Day Some Day Maybe Book In Sakshi Sahityam | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 3 2018 12:45 AM | Last Updated on Mon, Sep 3 2018 12:45 AM

Review On Some Day Some Day Maybe Book In Sakshi Sahityam

జనవరి 1995. ఇరవై ఏళ్ళు దాటిన ఫ్రేణీకి బ్రోడ్వేలో నటి అవాలన్న కోరిక. అందుకోసమని న్యూయార్క్‌ వచ్చి రెండున్నరేళ్ళు గడుస్తాయి. నటనలో రాణించడానికి, తనకు తానే విధించుకున్న మూడేళ్ళ గడువులో ఇంక ఆరు నెలలే మిగిలి ఉంటాయి. సుప్రసిద్ధ నటి మెరిల్‌ స్ట్రీప్‌ స్థానంలో తన్ని తాను చూసుకుంటుంది ఫ్రేణీ.

దువ్వెనకి లొంగని ఉంగరాల జుత్తు ఆమెది. త్వరత్వరగా మాట్లాడే స్వభావం. హాస్యం ఇష్టపడుతుంది. ‘ముఖ్యమైన పని’ మాత్రమే చేయాలనుకున్న ఫ్రేణీకి అప్పటివరకూ దొరికిన  పాత్రలు– గిన్నెలు తోమే సబ్బుల ప్రకటనల వంటివి మాత్రమే. బ్రోక్లిన్‌లో ఉన్న అపార్టుమెంటును స్నేహితులైన జేన్, డాన్‌తో పంచుకుంటుంది. ఖర్చులు గడవడానికి క్లబ్బులో వెయిట్రెస్‌గా పని చేస్తుంది.

ఆత్మ విశ్వాసం తక్కువయి, ‘నేను అందంగానే ఉన్నానా? అని స్నేహితులను అడుగుతుంటుంది. ఇంటికి వెనక్కొచ్చేయమని పోరే తండ్రి ‘అప్పుడప్పుడూ, నీకు మంచి కూడా జరుగుతుందని కూడా ఊహించుకోమ్మా’ అని ఫోన్లో సలహాలు ఇస్తుంటాడు.

‘నటుల పని నటించడం. పెర్ఫ్యూములు అమ్మడం, వంటల పుస్తకాలు రాయడం కాదు’ అన్న నిర్ధారణకు వచ్చిన ఫ్రేణీ– తన లక్ష్యం సాధించలేకపోయిన పరిస్థితిలో– సొంత ఊరికి తిరిగెళ్ళి, తండ్రిలా టీచర్‌ అయి, షికాగోలో ‘లా’ చదువుతున్న బోయ్‌ఫ్రెండును పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. కాలం పరిగెడుతుండగా, తాజా తీర్మానాలు మొదలవుతాయి: ‘సూర్యుడితో పాటు లేవాలి. వద్దు. అవసరం లేదు. 8 కల్లా లేస్తే చాలు. సిగరెట్లు మానాలి. ఛీజ్‌ పఫ్స్‌ తినడం ఆపేయాలి. పర్సులూ, గొడుగులూ పోగొట్టుకోకూడదు.’ 

‘నాకు అనవసరం అయినవారి ఆమోదం కోసం ఎదురు చూడకుండా నేనింకా శ్రమపడాలి’ అనుకుంటూ, అనేకమైన ఏక్టింగ్‌ క్లాసులకి వెళ్తూ, ఆడిషన్స్‌ కోసం ప్రయాస పడుతుంటుంది. ఏజెంటుకి ఫోన్‌ చేస్తే సమాధానం ఇవ్వడు. ఆఖరుకి అర్ధ నగ్నంగా నటించే ఒక పాత్ర దొరికినప్పుడు, డబ్బు ఎక్కువ ముడుతున్నప్పటికీ, అది ‘‘తను కోరుకున్న ‘నిజమైన’ సినిమాయే కానీ దిగంబరత్వం తనకి సరిపడదు’’ అని గుర్తించి, దాన్ని నిరాకరిస్తుంది. 

హఠాత్తుగా లాస్‌ ఏంజెలెస్‌లో ఉన్న పెద్ద ఏజెన్సీ వొకటి, ఆమెకి ప్రధాన పాత్రను ఇస్తుంది. అప్పుడే, నటుడైన జేమ్సుతో సంబంధమూ మొదలవుతుంది. పరిస్థితులు చక్కబడి, తోటివారి గౌరవం పొందుతున్నప్పుడు, ‘దేనికోసం ఇంత శ్రమపడ్డాను! నాకు నిజంగా అవసరం అయినది ఇదేనా?’ అన్న సందేహాలు మొదలవుతాయి ఫ్రేణీకి.

అక్కడితో కథ మందగించి, ఫ్రేణీ భవిష్యత్తు ఏమవుతుందో అన్నది పాఠకుల ఊహకే వదిలి పెడతారు టీవీ షోల నటి అయిన రచయిత్రి లౌరెన్‌ గ్రాయమ్‌. 

ఫ్రేణీ పాత్రను ఇష్టపడకుండా ఉండలేము. నవల్లో చాలా పేజీలు ఆమె ఆలోచనలు ఆక్రమించినవే. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించే ఆడపిల్లలు ఎదుర్కునే అవమానాల వర్ణనలు తమాషాగా ఉన్నప్పటికీ, ప్రామాణికమైనవిగా అనిపిస్తాయి. 

‘సమ్‌డే, సమ్‌డే, మేబి’ ఆశల, కలల కథ. యువత దేన్నయినా పిచ్చిగా, గాఢంగా కోరుకోవడం, తమను తాము అర్థం చేసుకోవడం గురించినది. మనం కోరుకున్నదే మనకి శ్రేయస్కరం అయి ఉండకపోవచ్చు అన్న గుర్తింపు చుట్టూ తిరిగే ఈ కథ, నటనా రంగంలోకి ప్రవేశించేవారు పడే సంఘర్షణను చిత్రిస్తుంది. నటులనూ, సినీ పరిశ్రమనీ కూడా ఎగతాళి చేసే ఇందులో పుష్కలమైన హాస్యం ఉంటుంది.

సృజనాత్మక రంగాల్లో పైకి వద్దామనుకునేవారు– కలకూ, వాస్తవానికీ మధ్యనున్న రేఖ చెరిగిపోయి, వారు రంగాన్ని సరైన సమయాన వదలకుండా దాన్నే పట్టుకు వేళ్ళాడుతూ– తమకున్న శక్తినీ, వనరులనూ వెచ్చించేస్తారంటారు రచయిత్రి.
గ్రాహమ్‌ రాసిన యీ తొలి నవలని బాలెంటైన్‌ బుక్స్‌ 2013లో ప్రచురించింది. 
కృష్ణ వేణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement