New Arrivals
-
కన్నీళ్లు పెట్టించే ముస్లిం బతుకు వెతలు
ముస్లిం కథకులు తమ లోపల సుళ్ళు తిరుగుతున్న అనేక ఆలోచనల్ని పంచుకుంటూ మిగతా సమాజంతో చేస్తున్న వొక సంభాషణ ‘కథామినార్’. ముస్లిం జీవితాల్ని పట్టిపీడిస్తున్న అవిద్యనీ పేదరికాన్నీ అనైక్యతనీ అన్నిటికీ మించి అభద్రతనీ సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఇరవై ముగ్గురు రచయితలు వినిపిస్తున్న బాధా తప్త స్వరాలివి. ముస్లింల పట్ల మెజారిటీ సమాజానికి వున్న అపోహలను తొలగించి సెన్సిటైజ్ చేయడం, సొంత మతం లోపలి అభివృద్ధి నిరోధక భావజాలాన్ని తిరస్కరించడం, మతోన్మాదుల నిజస్వరూపాల్ని బహిర్గతం చేసి దేశస్థుల మధ్య వెల్లివిరియాల్సిన మానవీయ బంధాల్ని నిర్మించడం, ప్రజాస్వామ్య లౌకిక భావజాలాన్ని బోధించడం యీ కథలకు వస్తువు. అందుకు నేపథ్యంగా గత పదిహేనేళ్ళుగా భారతీయ సమాజంలో చోటుచేసుకున్న అనేక రాజకీయ ఘటనలు, పాలకుల పాలసీలు ముస్లిం జీవితంపై చూపిన ప్రభావాల్ని రచయితలు వొడుపుగా పట్టుకున్నారు. ముంబాయి తాజ్‌పై వుగ్ర దాడి దగ్గర్నుంచీ స్థానికంగా మక్కామసీదు గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ళ దరిమిలా ముస్లిం సమాజంపై అమలయిన స్టేట్ స్పాన్సర్డ్ వయోలెన్స్, దాని కారణంగా యేర్పడ్డ అభద్రత కథల్లో చర్చకు వచ్చింది. బతుకు బండి నడపడానికి చిన్నా చితకా వృత్తిపనుల్లో తలమునకలై వున్నవాళ్ళూ తోపుడు బండ్లపై పూలూ పండ్లూ అమ్ముకొనేవాళ్ళూ మసీదుల దగ్గర చెప్పుల స్టాండ్ పెట్టుకునేవాళ్ళూ పొట్టకూటి కోసం అడ్డాలమీది కూలీలు హోటల్ సర్వర్లు మోటర్ మెకానిక్కులు ... యీ కథల్ని నడుపుతారు. అప్పో సప్పో చేసి పండగ రోజున యింటిల్లి్లపాదికీ బట్టలు కుట్టించి తాను మాత్రం పాతబట్టలే ధరించే సత్తార్లు(శశిశ్రీ), కుటుంబ పోషణకోసం యింట్లో బయటా పని చేసి గంధపు చెక్కల్లా అరిగిపోయే అమ్మలూ (అక్కంపేట ఇబ్రహీం), మతోన్మాద తోడేళ్ళ మూకుమ్మడి దాడుల్లో బలయ్యే బుజ్జిమేక పిల్లలూ(డానీ), ఆధిక్యభావనతో మతం పేర్న అవమానించేవాళ్ళలో మానవత్వానికి పురుడుపోసే బూబవ్వలూ (జి బాషా), పేదరికంలో తల్లిదండ్రుల ద్వారానే అరబ్బులకు అమ్ముడుపోయే చిన్నారి తబస్సుంలూ (రెహానా), కరువు ప్రాంతాల్లో రోజూ నీళ్లు మోసే ఘోష నుంచి తప్పించుకోడానికి గోషా జీవితాన్ని కోరుకునే చాందినీలు (షరీఫ్), సరైన ఉపాధి లేక అసాంఘిక శక్తుల చేతిలో పావుగా మారే సలీంలు(అమర్ అహ్మద్) కన్నీళ్లు పెట్టిస్తారు. రాజ్యహింస తండ్రి ప్రేమను హరిస్తే జ్వర పీడితుడైన ముస్తాక్ (ఖదీర్) మాత్రం మొత్తం ముస్లిం సమాజాన్ని జ్వరగ్రస్తం చేస్తున్న కారణాల పట్ల అప్రమత్తం చేస్తాడు. ద్వేషించే మనుషుల మధ్య ప్రేమని పంచే మిస్బా (వాహెద్) కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. గుజరాత్ గాయం తర్వాత వెలువడ్డ వతన్ (సంపా. స్కైబాబా)కి కొనసాగింపుగా వచ్చిన సమకాలీన ముస్లిం నేపథ్య కథలు (2005–2018) యివి. ఇవి కంప్లైంట్ చేయవు. ద్వేషాన్ని పెంచవు. కావడానికి స్థల కాల నిర్దిష్టతలోంచి వచ్చినవే అయినప్పటికీ స్థల కాలాలతో ప్రమేయం లేని బతుకు వెతలే. స్వీయ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం పెనుగులాడుతోన్న బాధిత సమూహాల వేదనే అడుగడుగునా కనిపిస్తుంది. ఎ.కె.ప్రభాకర్ -
కొత్త పుస్తకాలు
అద్వితీయుడు అంబేద్కర్ స్మారకోపన్యాసాలు డా.బి.ఆర్. అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ 1986 నుంచి 2013 వరకు ప్రతి ఏటా నిర్వహించిన అంబేద్కర్ స్మారకోపన్యాసాల సంకలనం ఇది. జస్టిస్ చిన్నపరెడ్డి, ప్రొ.డి. నరసింహారెడ్డి, ప్రొ.జయశంకర్, ప్రొ.జి.హరగోపాల్, ప్రొ.గోపాల్‌గురు, ప్రొ.వకుళాభరణం రామకృష్ణ వంటి పెద్దలందరూ అంబేద్కర్‌ను వివిధ మార్గాల్లో దర్శించడం ఈ సంకలనంలో కనిపిస్తుంది. అంబేద్కర్ సామాజికత తత్వం, దళిత విమోచన దృక్పథం, బౌద్ధమతం, స్త్రీవాదం వంటి అనేక విషయాల మీద సమగ్రమైన లోతైన అవగాహన కల్పించే విలువైన ఉపన్యాసాలివి. వెల: రూ.150 ప్రచురణ: హెచ్‌బిటి ప్రతులకు: 040 23521849 వేగు చుక్కలు అన్నమయ్య వేమన వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం కాలంలో అంతరం ఉన్నా ఒకే ప్రాంతానికి చెందిన వైతాళికులు అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం. ముగ్గురు జనం కోసం నిలబడినవారే. జనానికి చెరుపు చేసే ఆధిపత్య భావజాలాన్ని భాషనీ వర్ణ పెత్తనాన్ని వ్యతిరేకించినవారే. కనుకనే వారు వేగుచుక్కలయ్యారు అని తన అధ్యయనంతో నిరూపిస్తున్నారు వినోదిని. ‘ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’ అన్నాడు అన్నమయ్య. ‘పిండములు చేసి పితరులు తలపోసి’ అని నిరసించాడు వేమన. ‘మతము కల్పితమ్ము మార్గమొక్కటే గదా’ అన్నాడు వీరబ్రహ్మం. మహనీయులు మానవ సమాజాన్ని సంస్కరించడానికే చూస్తారు అని నిరూపించే పుస్తకం ఇది. వెల: రూ. 80 ప్రతులకు: 040- 23521849 చాగంటి సోమయాజులు భారతీయ సాహిత్య నిర్మాతలు చాగంటి సోమయాజులు మానవ జీవితాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించి కళాత్మకంగా కథ చెప్పిన విశిష్ట రచయిత. మార్క్సిస్టు తత్వాన్ని జీర్ణించుకున్న జీవన దార్శనికుడు. తాను పుట్టి పెరిగిన విజయనగర ప్రాంత ప్రజల జీవితాన్ని మాండలికంలో వ్యక్తం జేసి కథకి కావ్య గౌరవాన్ని కలిగించిన సృజనకారుడు. ఆయన రాసిన వఱపు, వాయులీనం, ఎంపు, ఏలూరెళ్లాలి, కుంకుడాకు, ఎందుకు పారేస్తాను నాన్నా.. వంటి కథలు తెలుగు కథా సాహిత్యంలో చిరస్థాయిగా నిలబడి ఉన్నాయి. చా.సో తెలుగు కథకు ఒక ఉపాధ్యాయుడు. ఆయన మీద ఆయన కుమార్తె చాగంటి కృష్ణకుమారి రాసిన మోనోగ్రాఫ్ ఇది. చా.సో జీవితం సాహిత్యం మీద విస్తృత సమాచారం దృష్టి ప్రశంస ఇందులో ఉన్నాయి. కొన్ని తెలియని వ్యక్తిగత వివరాలు కూడా. ప్రతి కథాభిమాని తప్పక ఉంచుకోదగ్గ పుస్తకం ఇది. సాహిత్య అకాడెమీ ప్రచురణ, వెల: రూ. 50 ప్రతులకు: నవోదయ, హైదరాబాద్. -
సాహిత్యం- కొత్త పుస్తకాలు
మావో కుహనా మార్క్సిస్టు! మేం మళ్లీ వస్తాం..... కొందరు టేబుల్‌ను తిరగేస్తారు. నాలుగు కాళ్లు తిరగబడి అడుగు కనపడుతూ... అదీ టేబులే! కాని చూడాల్సిన పద్ధతి వాడాల్సిన పద్ధతి అదేనా? కాని ఒకోసారి అదీ తప్పు కాదు అంటారు తోలేటి జగన్మోహనరావు వంటి అన్వేషకులు. ఇవాళ్టి ఈ పెట్టుబడిదారి ప్రపంచంలో, అమెరికా కేంద్రక ప్రపంచంలో, ‘స్పాన్సర్డ్’ ప్రజాస్వామ్య ఉద్యమాల/ రబ్బర్‌స్టాంప్ ప్రభుత్వ ఏర్పాటుల ప్రపంచంలో భవిష్యత్తు మార్క్సిజానిదే అని చెప్పడానికి సాహసిస్తున్నారు తోలేటి జగన్మోహనరావు. మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడానికి దాని ఉత్థానాన్ని, పతనాన్ని విశ్లేషించడానికి ఆయన వెనక్కు వెనక్కు ప్రయాణిస్తూ అధ్యయనం చేస్తూ ‘తప్పులు ఎన్ని చేసినా’ స్టాలిన్‌ను గొప్ప మార్క్సిస్టు- లెనినిస్టుగా గుర్తిస్తూ, ఒప్పులు ఎలా ఉన్నా మావో మార్క్సిజానికి తీవ్ర నష్టం కలుగచేశాడని భావిస్తూ నిర్ధారణలకు వచ్చినట్టుగా కనిపిస్తారు. ఇలాంటి మాటలు సాధారణంగా చాలామంది మావో భక్తుల గుండెలవిసి పోయేలా చేస్తాయి. ఈ పుస్తకాన్ని దూరంగా పుల్లతో నెట్టేయాలని భావిస్తారు కూడా. కాని రచయితకు ఈ సంగతి తెలుసు. అందుకే ఓపెన్ మైండ్‌తో చదవమని కోరుతున్నారు. ఈ ప్రపంచం మార్క్సిజం వెలుతురులో కళకళలాడాలని ఆయన కోరిక. అయితే అందుకు పాత దేవుళ్లను గుడ్డిగా పూజించకుండా కొత్త భూమికలను ఏర్పాటు చేసుకోవాలనేదే కామన. ఏమైనా ఇది పేజీల కొద్దీ చర్చకు తావు ఇచ్చే పుస్తకం. ఆస్తికులు, నాస్తికులు కూడా తప్పక చదవాలి. చర్చించాలి. తోలేటి వంటి సీరియస్/సీనియర్ రచయిత ఏడేళ్ల పాటు శ్రమకోర్చి రాశారంటే ఇది పైపైన చూసి నాలుగు రాళ్లు విసిరే పని ఎంత మాత్రం కాదు. మేం మళ్లీ వస్తాం- తోలేటి జగన్మోహన రావు; వెల: రూ.150; ప్రతులకు: 99082 36747 నిఖిలేశ్వర్ విమర్శ కవిత్వ శోధన నిఖిలేశ్వర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. దిగంబర కవిగా మాత్రమే గాక కథా రచయితగా (నిఖిలేశ్వర్ కథలు), తెలుగు/హిందీ అనువాదకుడిగా (మరో భారత దేశం - వివిధ), జైలు జ్ఞాపకాలు మిగుల్చుకున్న ఉద్యమకారుడిగా (గోడల వెనుక) ఆయన రచనలు పాఠకులను విస్తృతంగా చేరాయి. మండుతున్న స్వరం, ఈనాటికీ వంటి కవిత్వ సంపుటులతో ఆయన తన వ్యక్తిగత ఉనికిని కవిగా చాటుకున్నారు కూడా. అయితే కవిత్వం పట్ల తనకున్న ఆసక్తిని ఆర్తిని విశ్లేషణాదృష్టిని ఆయన వృథా పోనివ్వలేదు. అనేక సందర్భాల్లో కవులను, వారి కవిత్వాలను, కవితా ధోరణులను, కవిత్వ పరిణామాలను తన వ్యాసాలలో రికార్డు చేస్తూ వచ్చారు. వాటన్నింటినీ కలిపి ఇప్పుడు ‘కవిత్వ శోధన’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు. ఇందులో ఉన్న వ్యాసాలలో ‘తెలుగులో ఒక్క ఆధునిక మహాకావ్యం కూడా రాలేదు’, ‘భావ దారిద్య్రమా? కవిత్వ లోపమా?’, ‘శ్రీశ్రీకి ముందు అంతా శూన్యమా?’ మంచి ఆలోచింపదగ్గవి. నిజమైన ప్రజాపోరాటాలు సాహిత్యానికి సక్రమమైన రూపు ఇస్తాయి అని విశ్వసించే నిఖిలేశ్వర్ భావధారను ఈ పుస్తకం పట్టి చూపుతుంది. కవులు, విమర్శకులు తప్పక చదవదగ్గ పుస్తకం. కవిత్వ శోధన- నిఖిలేశ్వర్; వెల: రూ.75; ఎమెస్కో ప్రచురణ; ప్రతులకు: 0866 2436643 గొల్ల రామవ్వ.... కెటిల్... కరీంనగర్ జిల్లా కథలు.... కరీంనగర్ అంటే అందరికీ తెలిసింది అది విప్లవభూమి అనే. కాని అక్కడ ఉద్యమాలతో సమానంగా కథ కూడా వికసించింది. రజాకార్ ఉద్యమకాలంలో సాక్షాత్తు పి.వి.నరసింహారావే ప్రజల పక్షాన నిలబడి ‘గొల్ల రామవ్వ’ వంటి శక్తిమంతమైన కథను రాశారు. గూడూరి సీతారాం, తాడిగిరి పోతరాజు, అల్లం రాజయ్య, బి.ఎస్. రాములు.... కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద పెద్ద కథలు బయలుదేరి వచ్చి తెలుగు కథను సంపద్వంతం చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా విశాల సాహిత్య అకాడమి ‘ఆధునిక కథా సరిత్సాగరం’ పేరుతో కరీంనగర్ జిల్లా కథలను వివిధ సంకలనాలుగా వెలువరిస్తోంది. ఇప్పటికి మూడు సంకలనాలు వచ్చాయి. ప్రస్తుతం నాలుగోది వచ్చింది. మొత్తం 20 మంది కథకుల కథలు ఉన్న ఈ సంకలనంలో కొక్కుల పద్మావతి, గుండెడప్పు కనకయ్య, కూతురు రాంరెడ్డి, వేముల ప్రభాకర్ వంటి వర్తమాన కథకులతో పాటు బిఎస్ రాములు, గూడూరి సీతారాం, పివి నరసింహారావు, తాడిగిరి పోతరాజు వంటి సీనియర్ రచయితల కథలు కూడా ఉన్నాయి. మరో విశేషం ఇవాళ ‘గణపతి’గా అందరికీ తెలిసిన మావోయిస్టు నేత ముప్పాళ్ల లక్ష్మణరావు రాసిన ‘ఎత్తున్రి పిడికిళ్లు’ కథ కూడా ఇందులో ఉంది. కరీంనగర్ జీవన పరిణామాలకు అద్దం ఈ సంకలనం. కరీంనగర్ జిల్లా కథలు (నాల్గవ సంపుటి)- సంపాదకులు: బిఎస్ రాములు, వనమాల చంద్రశేఖర్; వెల: రూ.100; ప్రతులకు: 83319 66987, 97047 08980