సాహిత్యం- కొత్త పుస్తకాలు
Published Mon, Aug 5 2013 12:30 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
మావో కుహనా మార్క్సిస్టు!
మేం మళ్లీ వస్తాం.....
కొందరు టేబుల్‌ను తిరగేస్తారు. నాలుగు కాళ్లు తిరగబడి అడుగు కనపడుతూ... అదీ టేబులే! కాని చూడాల్సిన పద్ధతి వాడాల్సిన పద్ధతి అదేనా? కాని ఒకోసారి అదీ తప్పు కాదు అంటారు తోలేటి జగన్మోహనరావు వంటి అన్వేషకులు. ఇవాళ్టి ఈ పెట్టుబడిదారి ప్రపంచంలో, అమెరికా కేంద్రక ప్రపంచంలో, ‘స్పాన్సర్డ్’ ప్రజాస్వామ్య ఉద్యమాల/ రబ్బర్‌స్టాంప్ ప్రభుత్వ ఏర్పాటుల ప్రపంచంలో భవిష్యత్తు మార్క్సిజానిదే అని చెప్పడానికి సాహసిస్తున్నారు తోలేటి జగన్మోహనరావు. మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడానికి దాని ఉత్థానాన్ని, పతనాన్ని విశ్లేషించడానికి ఆయన వెనక్కు వెనక్కు ప్రయాణిస్తూ అధ్యయనం చేస్తూ ‘తప్పులు ఎన్ని చేసినా’ స్టాలిన్‌ను గొప్ప మార్క్సిస్టు- లెనినిస్టుగా గుర్తిస్తూ, ఒప్పులు ఎలా ఉన్నా మావో మార్క్సిజానికి తీవ్ర నష్టం కలుగచేశాడని భావిస్తూ నిర్ధారణలకు వచ్చినట్టుగా కనిపిస్తారు.
ఇలాంటి మాటలు సాధారణంగా చాలామంది మావో భక్తుల గుండెలవిసి పోయేలా చేస్తాయి. ఈ పుస్తకాన్ని దూరంగా పుల్లతో నెట్టేయాలని భావిస్తారు కూడా. కాని రచయితకు ఈ సంగతి తెలుసు. అందుకే ఓపెన్ మైండ్‌తో చదవమని కోరుతున్నారు. ఈ ప్రపంచం మార్క్సిజం వెలుతురులో కళకళలాడాలని ఆయన కోరిక. అయితే అందుకు పాత దేవుళ్లను గుడ్డిగా పూజించకుండా కొత్త భూమికలను ఏర్పాటు చేసుకోవాలనేదే కామన. ఏమైనా ఇది పేజీల కొద్దీ చర్చకు తావు ఇచ్చే పుస్తకం. ఆస్తికులు, నాస్తికులు కూడా తప్పక చదవాలి. చర్చించాలి. తోలేటి వంటి సీరియస్/సీనియర్ రచయిత ఏడేళ్ల పాటు శ్రమకోర్చి రాశారంటే ఇది పైపైన చూసి నాలుగు రాళ్లు విసిరే పని ఎంత మాత్రం కాదు.
మేం మళ్లీ వస్తాం- తోలేటి జగన్మోహన రావు; వెల: రూ.150; ప్రతులకు: 99082 36747
నిఖిలేశ్వర్ విమర్శ కవిత్వ శోధన
నిఖిలేశ్వర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. దిగంబర కవిగా మాత్రమే గాక కథా రచయితగా (నిఖిలేశ్వర్ కథలు), తెలుగు/హిందీ అనువాదకుడిగా (మరో భారత దేశం - వివిధ), జైలు జ్ఞాపకాలు మిగుల్చుకున్న ఉద్యమకారుడిగా (గోడల వెనుక) ఆయన రచనలు పాఠకులను విస్తృతంగా చేరాయి. మండుతున్న స్వరం, ఈనాటికీ వంటి కవిత్వ సంపుటులతో ఆయన తన వ్యక్తిగత ఉనికిని కవిగా చాటుకున్నారు కూడా. అయితే కవిత్వం పట్ల తనకున్న ఆసక్తిని ఆర్తిని విశ్లేషణాదృష్టిని ఆయన వృథా పోనివ్వలేదు.
అనేక సందర్భాల్లో కవులను, వారి కవిత్వాలను, కవితా ధోరణులను, కవిత్వ పరిణామాలను తన వ్యాసాలలో రికార్డు చేస్తూ వచ్చారు. వాటన్నింటినీ కలిపి ఇప్పుడు ‘కవిత్వ శోధన’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు. ఇందులో ఉన్న వ్యాసాలలో ‘తెలుగులో ఒక్క ఆధునిక మహాకావ్యం కూడా రాలేదు’, ‘భావ దారిద్య్రమా? కవిత్వ లోపమా?’, ‘శ్రీశ్రీకి ముందు అంతా శూన్యమా?’ మంచి ఆలోచింపదగ్గవి. నిజమైన ప్రజాపోరాటాలు సాహిత్యానికి సక్రమమైన రూపు ఇస్తాయి అని విశ్వసించే నిఖిలేశ్వర్ భావధారను ఈ పుస్తకం పట్టి చూపుతుంది. కవులు, విమర్శకులు తప్పక చదవదగ్గ పుస్తకం.
కవిత్వ శోధన- నిఖిలేశ్వర్; వెల: రూ.75; ఎమెస్కో ప్రచురణ; ప్రతులకు: 0866 2436643
గొల్ల రామవ్వ.... కెటిల్...
కరీంనగర్ జిల్లా కథలు....
కరీంనగర్ అంటే అందరికీ తెలిసింది అది విప్లవభూమి అనే. కాని అక్కడ ఉద్యమాలతో సమానంగా కథ కూడా వికసించింది. రజాకార్ ఉద్యమకాలంలో సాక్షాత్తు పి.వి.నరసింహారావే ప్రజల పక్షాన నిలబడి ‘గొల్ల రామవ్వ’ వంటి శక్తిమంతమైన కథను రాశారు. గూడూరి సీతారాం, తాడిగిరి పోతరాజు, అల్లం రాజయ్య, బి.ఎస్. రాములు.... కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద పెద్ద కథలు బయలుదేరి వచ్చి తెలుగు కథను సంపద్వంతం చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా విశాల సాహిత్య అకాడమి ‘ఆధునిక కథా సరిత్సాగరం’ పేరుతో కరీంనగర్ జిల్లా కథలను వివిధ సంకలనాలుగా వెలువరిస్తోంది.
ఇప్పటికి మూడు సంకలనాలు వచ్చాయి. ప్రస్తుతం నాలుగోది వచ్చింది. మొత్తం 20 మంది కథకుల కథలు ఉన్న ఈ సంకలనంలో కొక్కుల పద్మావతి, గుండెడప్పు కనకయ్య, కూతురు రాంరెడ్డి, వేముల ప్రభాకర్ వంటి వర్తమాన కథకులతో పాటు బిఎస్ రాములు, గూడూరి సీతారాం, పివి నరసింహారావు, తాడిగిరి పోతరాజు వంటి సీనియర్ రచయితల కథలు కూడా ఉన్నాయి. మరో విశేషం ఇవాళ ‘గణపతి’గా అందరికీ తెలిసిన మావోయిస్టు నేత ముప్పాళ్ల లక్ష్మణరావు రాసిన ‘ఎత్తున్రి పిడికిళ్లు’ కథ కూడా ఇందులో ఉంది. కరీంనగర్ జీవన పరిణామాలకు అద్దం ఈ సంకలనం.
కరీంనగర్ జిల్లా కథలు (నాల్గవ సంపుటి)- సంపాదకులు: బిఎస్ రాములు, వనమాల చంద్రశేఖర్; వెల: రూ.100; ప్రతులకు: 83319 66987, 97047 08980
Advertisement
Advertisement