కొత్త పుస్తకాలు | Books: New arrivals | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు

Published Sat, Jun 7 2014 12:12 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

Books: New arrivals

అద్వితీయుడు
 అంబేద్కర్ స్మారకోపన్యాసాలు
 డా.బి.ఆర్. అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ 1986 నుంచి 2013 వరకు ప్రతి ఏటా నిర్వహించిన అంబేద్కర్ స్మారకోపన్యాసాల సంకలనం ఇది. జస్టిస్ చిన్నపరెడ్డి, ప్రొ.డి. నరసింహారెడ్డి, ప్రొ.జయశంకర్, ప్రొ.జి.హరగోపాల్, ప్రొ.గోపాల్‌గురు, ప్రొ.వకుళాభరణం రామకృష్ణ వంటి పెద్దలందరూ అంబేద్కర్‌ను వివిధ మార్గాల్లో దర్శించడం ఈ సంకలనంలో కనిపిస్తుంది. అంబేద్కర్ సామాజికత తత్వం, దళిత విమోచన దృక్పథం, బౌద్ధమతం, స్త్రీవాదం వంటి అనేక విషయాల మీద సమగ్రమైన లోతైన అవగాహన కల్పించే విలువైన ఉపన్యాసాలివి.
 వెల: రూ.150 ప్రచురణ: హెచ్‌బిటి ప్రతులకు: 040 23521849
 
 వేగు చుక్కలు
 అన్నమయ్య వేమన వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం
 కాలంలో అంతరం ఉన్నా ఒకే ప్రాంతానికి చెందిన వైతాళికులు అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం. ముగ్గురు జనం కోసం నిలబడినవారే. జనానికి చెరుపు చేసే ఆధిపత్య భావజాలాన్ని భాషనీ వర్ణ పెత్తనాన్ని వ్యతిరేకించినవారే. కనుకనే వారు వేగుచుక్కలయ్యారు అని తన అధ్యయనంతో నిరూపిస్తున్నారు వినోదిని. ‘ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’ అన్నాడు అన్నమయ్య. ‘పిండములు చేసి పితరులు తలపోసి’ అని నిరసించాడు వేమన. ‘మతము కల్పితమ్ము  మార్గమొక్కటే గదా’ అన్నాడు వీరబ్రహ్మం. మహనీయులు మానవ సమాజాన్ని సంస్కరించడానికే చూస్తారు అని నిరూపించే పుస్తకం ఇది.
 వెల: రూ. 80  ప్రతులకు: 040- 23521849
 
 చాగంటి సోమయాజులు
 భారతీయ సాహిత్య నిర్మాతలు
 చాగంటి సోమయాజులు మానవ జీవితాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించి కళాత్మకంగా కథ చెప్పిన విశిష్ట రచయిత. మార్క్సిస్టు తత్వాన్ని జీర్ణించుకున్న జీవన దార్శనికుడు. తాను పుట్టి పెరిగిన విజయనగర ప్రాంత ప్రజల జీవితాన్ని మాండలికంలో వ్యక్తం జేసి కథకి కావ్య గౌరవాన్ని కలిగించిన సృజనకారుడు. ఆయన రాసిన వఱపు, వాయులీనం, ఎంపు, ఏలూరెళ్లాలి, కుంకుడాకు, ఎందుకు పారేస్తాను నాన్నా.. వంటి కథలు తెలుగు కథా సాహిత్యంలో చిరస్థాయిగా నిలబడి ఉన్నాయి. చా.సో తెలుగు కథకు ఒక ఉపాధ్యాయుడు. ఆయన మీద ఆయన కుమార్తె చాగంటి కృష్ణకుమారి రాసిన మోనోగ్రాఫ్ ఇది. చా.సో జీవితం సాహిత్యం మీద విస్తృత సమాచారం దృష్టి ప్రశంస ఇందులో ఉన్నాయి. కొన్ని తెలియని వ్యక్తిగత వివరాలు కూడా. ప్రతి కథాభిమాని తప్పక ఉంచుకోదగ్గ పుస్తకం ఇది.
 సాహిత్య అకాడెమీ ప్రచురణ, వెల: రూ. 50  ప్రతులకు: నవోదయ, హైదరాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement