ఆధునిక సాహిత్యం - అస్తిత్వవాద ధోరణులు
స్త్రీవాద కవిత్వం
అంతర్జాతీయ మహిళా దశాబ్ది (1975- 85) స్ఫూర్తితో తెలుగులో స్త్రీవాద కవిత్వం రూపుదిద్దుకుంది. ఆంగ్లంలో వర్జీనియా ఉల్ఫ్ రాసిన ‘ఎ రూమ్ ఆఫ్ ఒన్‌స ఓన్’, మిల్లెట్ రాసిన ‘సెక్సువల్ పాలిటిక్స్’ వంటి గ్రంథాల ప్రభావం కూడా దీనిపై ఉంది.
పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ అణచివేతకు గురవుతోందనీ, లైంగికత్వం, సంతానోత్పత్తి వంటివి పురుషాధిక్య సంబంధాలని స్త్రీ వాదుల ఆరోపణ. పురుషాధిక్యత నశించాలనీ, అన్ని రంగాల్లో మహిళల సమానహక్కులను, స్వేచ్ఛను పరిరక్షించాలనీ, స్త్రీలు మూఢాచారాల ముసుగులో పడకూడదన్న ఆశయాలతో, అస్తిత్వ నిరూపణ లక్ష్యంతో స్త్రీవాద కవిత్వం ప్రారంభమైంది.
తొలి స్త్రీవాద కవితగా 1972లో ఓల్గా రాసిన ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే కవితను విమర్శకులు గుర్తించారు. 1980 నుంచి వచ్చిన స్త్రీవాద కవితలను త్రిపురనేని శ్రీనివాస్ ‘గురి చూసి పాడేపాట’ పేరుతో 1990లో తొలి స్త్రీవాద కవితా సంకలనాన్ని ప్రచురించారు. 1984లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సావిత్రి రాసిన బందిపోట్లు కవితా ఖండిక సంచలనం సృష్టించింది. తర్వాత నీలిమేఘాలు (1993) సంకలనంలో ఈ కవిత చోటు చేసుకుంది.
1993లో నీలిమేఘాలు కవితా సంకలనాన్ని శతాధిక కవయిత్రుల కవితలతో అస్మిత ప్రచురించింది. అందులో వసంతా కన్నాభిరామన్ రాసిన ‘స్త్రీగా రాయటమంటే’, ఓల్గా రచించిన ‘సంకెళ్లు తెగుతున్న సంగీతం’ వ్యాసాలు స్త్రీవాద దృక్పథాన్ని, సిద్ధాంత పరిధిని వివరించాయి. స్త్రీవాద కవితా ధోరణిపై ఎన్నో వాదాలూ, వివాదాలూ చెలరేగాయి. ఈ వివాదాలన్నింటినీ ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో ఎస్. సూర్యప్రకాశ్ సంకలనకర్తగా అ.ర.సం. 1997లో ప్రచురించింది. ఎన్.గోపి, ఎండ్లూరి సుధాకర్, భగ్వాన్, ఆశారాజు వంటి కవులు కూడా స్త్రీవాద ధోరణితో కవితలు రాశారు. ఎండ్లూరి సుధాకర్ ‘షమ్మా’, శిఖామణి ‘పూల బజార్’ వంటి సంకలనాలను ప్రచురించారు.
ప్రముఖ స్త్రీవాద కవితా సంపుటాలు
1. జయప్రభ: పైటను తగలెయ్యాలి,
వామనుడి మూడో పాదం (1988)
2. రేవతీ దేవి: శిలాలోలిత (1980)
3. కొండేపూడి నిర్మల: సందిగ్ధ సంధ్య(1986),
నడిచే గాయాలు (1990), మల్టీ నేషనల్
ముద్దు (1992)
4. పాటిబండ్ల రజని: ఎర్రజాబిళ్ల ఎరీనా,
అబార్షన్ స్టేట్‌మెంట్
5. మంధరపు హైమావతి: సూర్యుడు
తప్పిపోయాడు
6. విమల: వంటిల్లు, సౌందర్యాత్మక హింస
(కవితా ఖండికలు)
7. తూర్లపాటి రాజేశ్వరి: తాళికట్టిన మృగం
8. బి. పద్మావతి: గుక్కపట్టిన బాల్యం
9. అలిశెట్టి ప్రభాకర్: వేశ్య (కవితా ఖండిక)
10. ఆశారాజు: అద్దంలో ప్రతిబింబం
స్త్రీవాద నవలలు, కథలు కోకొల్లలుగా వచ్చాయి. తొలి స్త్రీవాద నవల రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’. ‘స్వేచ్ఛ’, ‘మానవి’, ‘ఆకాశంలో సగం’ ఓల్గా ప్రసిద్ధ నవలలు. మల్లాది సుబ్బమ్మ ‘వంశాకురం’, కుప్పిలి పద్మ ‘మూడుపాయల జలపాతం’ వంటివి మరికొన్ని ప్రముఖ నవలలు.
దళితవాద కవిత్వ ధోరణి
అంబేద్కర్ తాత్వికత పునాదిగా, జ్యోతిబా పూలే ఆశయాలు లక్ష్యంగా 1990ల్లో దళితవాద కవితాధోరణి ఆవిర్భవించింది. తొలి రోజుల్లో హరిజన, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన వారి సమస్యల చిత్రీకరణను విస్తృత పరిధిలో దళిత సాహిత్యంగా భావించారు. దళిత వర్గాలు సృష్టించిందే దళిత సాహిత్యంగా కొందరు పేర్కొన్నారు. ఈ భావన సరైంది కాదు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం అగ్రవర్ణాలవారు సృష్టించిన సాహిత్యం కూడా దళిత సాహిత్యమే అవుతుంది. అయితే దళితేతరుల సాహిత్యం కంటే దళితుల సాహిత్యం వాస్తవ రూపానికి అద్దం పడుతుంది. ‘ఆయా సమస్యలు అనుభవిస్తున్న దళితుడి అభివ్యక్తి లోనూ, ఆత్మాశ్రయరీతిలోనూ గాఢత చోటు చేసుకుంటుంది’ అనే కొండపల్లి సుదర్శన రాజు అభిప్రాయం అమోదయోగ్యంగా ఉంది.
జాషువా, బోయి భీమన్న, కుసుమ ధర్మ న్న, కొలకలూరి ఇనాక్, కత్తి పద్మారావు వంటి వారి కవిత్వంలో దళిత ఉద్యమ స్పృహ బలంగా ఉంది. గరిమెళ్ల సత్యనారాయణ, వంగపండు, మాష్టార్జీ వంటి వాళ్లు పాటల ద్వారా దళిత చైతన్యాన్ని కలిగించారు. ‘గబ్బిలం’ జాషువా తొలి దళిత కావ్యం. ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ బోయి భీమన్న విశిష్ట దళిత కావ్యం. దళిత కవితా ఉద్యమం రూపుదిద్దుకున్న తర్వాత వి. సిమ్మన్న, కొండపల్లి సుదర్శన రాజు ఆధ్వర్యంలో తొలి దళిత కవితాసంపుటి ‘దళిత కవితా సంకలనం’ 1991లో వెలువడింది. జయధీర్ తిరుమలరావు ప్రధాన సంపాదకుడిగా దళిత గీతాలు సంకలనం 1993లో వచ్చింది. జి. లక్ష్మీ నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ సంపా దకత్వంలో ‘పదునెక్కిన పాట’ 1996లో కవితా సంకలనాన్ని ప్రచురించారు.
దళిత కవులు, దళిత నాయకస్తుతి, దళిత సంఘీభావ కాంక్ష, దళితుల కర్తవ్య బోధ, మను వు నిరసన, శంబూక, ఏకలవ్యుల సంస్మరణ, దళితుల రాజ్యాధికారం, రిజర్వేషన్ల పరిరక్షణ వంటి అంశాలు కవితా వస్తువులుగా దళిత కవితలు అసంఖ్యాకంగా వస్తున్నాయి. దళిత ఉద్యమస్ఫూర్తితో నవలలు, కథలు, నాటికలు అసంఖ్యాకంగా వస్తున్నాయి.
ముస్లింవాద కవితా ధోరణి
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇటీవల బలంగా వస్తున్న అస్తిత్వవాద కవితా ధోరణి ఇది. హిందూ మతఛాందస వాదుల తీరును ముస్లిం కవులు జీర్ణించుకోలేకపోయారు. బాబ్రీ మసీదు విధ్వంసంతో గాయపడ్డ ముస్లింల ఉనికి కోసం, హక్కుల పరిరక్షణ కోసం ముస్లిం కవితా ధోరణి ఆవిర్భవించింది. దళిత కవితా ధోరణిలో మైనార్టీలను భాగస్వాములుగా పేర్కొన్నా.. వీరి ప్రత్యేక అస్తిత్వం కోసం స్కైబాబా సంపాదకత్వంలో తొలి ముస్లింవాద కవితా సంపుటి ‘జల్ జిలా’ 1998లో ప్రచురించారు. ఈ సంపుటిలో సమాజ ప్రగతి కాంక్షతో, వారి హక్కుల పరిరక్షణ కోసం వజీర్ రహ్మాన్, ఇస్మాయిల్, స్మైల్, దేవీప్రియ, సుగమ్ బాబు వంటివారి కవితలున్నాయి.
ముస్లిం స్త్రీవాద కవిత్వాన్ని ‘షాజహానా’ బురఖా నిరసనతో ప్రారంభించారు. యన్. రజియాబేగం ‘అల్లానే అన్నాడు’, షంషాద్ బేగం ‘పర్సనల్ లా’ వంటి కవితా ఖండికలు పాఠకుల్లో ఆలోచన రేకెత్తించాయి. ముస్లింవాద నవలలు, కథాసంపుటాలు ఉద్యమ స్ఫూర్తితో వస్తున్నాయి. ఇటీవల అస్తిత్వవాదాల్లో భాగంగా బీసీ వాద, ప్రాంతీయ వాద కవితా ధోరణుల వంటివి రూపుదిద్దుకుంటున్నాయి.
అనుభూతి వాద కవితా ధోరణి
అనుభూతి కవిత్వం అంటే అనుభూతికి సంబంధించిందని, అనుభూతి కోసం ప్రాధాన్యతనిచ్చే కవిత్వమని అర్థం. కవి తాను పొందిన అనుభూతిని కవిత్వంలో చక్కగా ఆవిష్కరిస్తాడు. అనుభూతి కోసం అన్వేషిస్తూ దాన్ని సాహితీ జగత్తులో సాక్షాత్కరింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే అది అనుభూతి కవిత్వం అవుతుంది. కవి ఏ అనుభవంతో చెప్పాలనుకున్నాడో అదే భావన పాఠకుడికి కలిగేలా చేయడమే ఈ కవిత్వ లక్ష్యం. అనుభూతి కవిత్వాన్ని గురించి ప్రముఖ విమర్శకులు ఆర్.యస్. సుదర్శనం ‘అనుభూతి కవిగా గుర్తు పట్టడానికి ప్రధానమైన లక్షణం కవిత చదివిన తర్వాత మిగిలేది ఒక సందేశం, ఒక భావనం, ఒక దృక్పథం కాకుండా కేవలం అనిర్దిష్టమైన అనుభూతి కావాలి. అది పోలికలు, పదాల అల్లిక, ఇంద్రియ సంవేదన రేకెత్తించే వర్ణనల్లో దేని ద్వారానైనా కావచ్చు. కానీ అందులోని నవ్యత హృదయానికి అనుభూతిగా మిగలాలి’ అని నిర్వచించారు. ఆచార్య జి.వి. సుబ్ర హ్మణ్యం, గుంటూరి శేషేంద్రశర్మ, మాదిరాజు రంగారావు, అద్దేపల్లి రామమోహనరావు వంటి వారు ఈ కవిత్వాన్ని ఒక శాఖగా గుర్తించారు.
ఏ ఇజానికి కట్టుబడనని నిర్దిష్టంగా చెప్పిన ఆధునిక కవి తిలక్. ఈయన రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటిని అనుభూతవాద కవిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా విమర్శకులు పేర్కొన్నారు. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం అనుభూతి వాద కవులను మూడు రకాలుగా వర్గీకరించారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మాదిరాజు రంగారావు, వేగుంట మోహన ప్రసాద్, ఇస్మాయిల్, అజంతా, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వంటివారు అనుభూతి వాద కవులు.
ప్రముఖ అనుభూతివాద కవితా సంపుటాలు
ఆర్. యస్. సుదర్శనం - నిశాంతం
చలం - సుధ
ఇస్మాయిల్ - చెట్టు నా ఆదర్శం, మృత్యు
వృక్షం, చిలుకలు వాలిన చెట్టు, రాత్రివచ్చిన రహస్యపు వాన
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ - అనుభూతి గీతాలు
వేగుంట మోహనప్రసాద్ - చితి-చింత,
రహస్తంత్రి
కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ- వెలుతురు పిట్టలు.
మాదిరి ప్రశ్నలు
1. ‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారన్నప్పుడే భయంవేసింది’ అని పేర్కొన్న కవయిత్రి?
1) ఓల్గా 2) సావిత్రి
3) జయప్రభ 4) హైమావతి
2. ‘బతకడానికి నానాచావులు చస్తున్న వాళ్లం, చావడానికి మా దగ్గరకు రాకండి’ అని పేర్కొన్న కవయిత్రి?
1) వాణీ రంగారావు 2) ఓల్గా
3) జయప్రభ 4) రాజేశ్వరి
3. ‘అయ్యో! పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు’ అన్నవారు?
1) సత్యవతి 2) రేవతీ దేవి
3) పాటిబండ్ల రజని 4) బి. పద్మావతి
4. ‘నవ్వే నక్షత్రంలా అమ్మకావాలి, నాన్న చేత తన్నులు తినని అమ్మకావాలి’ అని కోరుకున్న కవయిత్రి?
1) సుమతి 2) రేవతీ దేవి
3) నిర్మల 4) బి. పద్మావతి
5. ‘నేనింకా నిషిద్ధ మానవుణ్నే, నాది బహి ష్కృత శ్వాస’ అని చెప్పిన కవి?
1) శిఖామణి
2) ఎండ్లూరి సుధాకర్
3) మద్దూరి నగేష్‌బాబు 4) సుదర్శన రాజు
6. ‘కవిని నేను వర్ణచాపాన్ని విరగ్గొట్టడానికి వచ్చిన దళిత కవిని నేను’ అని ప్రకటంచినవారు?
1) కత్తి పద్మారావు 2) ఇనాక్
3) శిఖామణి 4) సతీష్‌చందర్
7 . ‘పంచముడంటే ఐదో వేలు లేనివాడని మా ముత్తాత ఏకలవ్యుడు చెప్పాడు’ అని పేర్కొన్న కవి?
1) సతీష్ చందర్
2) మద్దూరి నగేష్ బాబు
3) సిమ్మన్న 4) సుదర్శన రాజు
8. ‘రిజర్వేషనంటే సౌకర్యమో, సదుపాయమో కాదు తండ్రీ! అదొక పచ్చబొట్టు,అదొక ప్రాథమిక హక్కు’ అన్న కవి?
1) ఏకాంబరం
2) కత్తి పద్మారావు
3) మద్దూరి నగేష్‌బాబు
4) సతీష్ చందర్
9. ‘అంటరానివసంతం’ నవలా రచయిత?
1) ఇనాక్ 2) జి. కళ్యాణరావు
3) చల్లపల్లి స్వరూపరాణి 4) స్వర్ణలత
10. ‘పువ్వులమ్మి అమ్మి పుప్పొడిని కోల్పోయిన వాళ్లం, గిన్నెలకు మాట్లేసి మాట్లేసి సొట్టబోయిన వాళ్లం’ అని ఆవేదనతో చెప్పిన కవి?
1) ఖాదర్ 2) అఫ్సర్
3) జావేద్ 4) సయ్యద్ గఫార్
11. ‘ఈ దేశ పటాన్ని చుట్టచుట్టి నీ కింద పెట్టుకోవడానికి అది నీ అయ్య జాగీరు కాదు’ అని నిరసించిన కవి?
1) గఫార్ 2) అఫ్సర్
3) దిలావర్ 4) కరీముల్లా
12. ‘నేను కసాయిబును కాదు అనివార్య హింసావృత్తిలో జీవన పరమార్థాన్ని దర్శించే ముస్లిం ధర్మవ్యాధుణ్ని’ అని చెప్పిన కవి?
1) ఇక్బాల్ చంద్ 2) అఫ్సర్
3) దిలావర్ 4) గౌస్ మొహిద్దీన్
13. మొదటి మైనారిటీ వాద నవల?
1) పుట్టుమచ్చ 2) వెండిమేఘం
3) నీలినీడలు 4) రేగడి విత్తులు
14. ‘అయిదు నెలలకే నాలుగు నెలల కడుపు చేసి తలాక్ ఇచ్చి వెళ్లగొడతాడని నాకేం తెలుసు, నా పర్సనల్ లాయే నాకిది చాలన్నప్పుడు ఇక దేనికి మొరపెట్టుకోవాలి’ అని సగటు ముస్లిం స్త్రీ ఆవేదనను చెప్పిన కవయిత్రి?
1) షాజహాన్ 2) రజియా సుల్తాన్
3) షంషాద్ బేగం 4) మొహజబీన్
15. ఈ దేశం కేలండర్ పై తారీఖులం అని ప్రకటించిన కవులు?
1) విప్లవ కవులు 2) దిగంబర కవులు
3) మైనార్టీ కవులు 4) పైగంబర కవులు
16. ‘పద్యాన్ని లోతుగా తవ్వుతున్నాడు కవి. టన్నుల కొద్దీ మన్నుకింద, టన్నుల కొద్దీ మనస్సు కింద ఇంత లోతుగా దీన్ని ఎవరు పాతేశారో తెలీదు’ అన్న కవి?
1) శ్రీకాంత శర్మ 2) శేషేంద్రశర్మ
3) ఇస్మాయిల్ 4) వై. శ్రీరాములు
17. ‘పరుగెత్తిన వాళ్ల పాదాల గుర్తులు రేపటికి బాటలు పరుస్తాయి’ అని పేర్కొన్న కవి?
1) ఇస్మాయిల్
2) మోహన్ ప్రసాద్
3) శ్రీకాంత శర్మ 4) రేవతీ దేవి
సమాధానాలు
1) 2; 2) 2; 3) 3; 4) 4; 5) 2;
6) 3; 7) 1; 8) 3; 9) 2; 10) 4;
11) 2; 12) 3; 13) 2; 14) 3; 15) 2;
16) 3; 17) 3.
‘నవ్వే నక్షత్రంలా అమ్మకావాలి...!’
Published Mon, Oct 13 2014 9:57 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement