మత్స్యకారులు క్షేమం
తప్పిపోయిన వారి ఆచూకీ పరదీప్ లో లభ్యం
కాకినాడ తీసుకొచ్చేందుకు ముగ్గురు సిబ్బంది ఒడిశా పయనం
కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివరాలు వెల్లడి
కాకినాడ క్రైం: కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడిశా పరదీప్‌లో ఉన్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేటకెళ్లి కనిపించకుండా పోయిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ విషయం తమకు గురువారం ఉదయం 10.30 గంటలకు తెలిసిందన్నారు. ఈ నెల 31న వేట నిషేద కాలంలో కాకినాడ పర్లోపేటకు చెందిన కొందు లక్ష్మణరావు ఐఎన్డీ– ఏపీ–ఈ3–ఎండీ–1260 నెంబర్ ఫైబర్ బోటుపై పొట్టి తాతారావు, చింతపల్లి అగ్గిపెటి, వాడమొదుల జగదీష్, చింతపల్లి రాజు, దుమ్ములపేటకు చెందిన సూరాడ రాజు, తిరిది అప్పారావు, మేడ శ్రీనులు చేపల వేట కోసం సముద్రంలో కెళ్లినట్లు తెలిపారు. సముద్రంలో రోజున్నర ప్రయాణం చేసిన ఇంజన్ మరమ్మతుకు గురైందన్నారు. ఇంజన్‌కి మరమ్మతులు నిర్వహించిన తర్వాత చేపలవేట కొనసాగించేందుకు ముందుకెళ్లగా మరొకసారి ఇంజన్ మరమ్మతుకు గురైందన్నారు. ఈ లోగా వాతావరణంలో సంభవించిన మార్పులతో సముద్ర కెరటాల ఉధృతి, వడి పెరగడంతో గాలికి ఫైబర్ బోటు ఉత్తర తీరం వైపు డీప్ సీలోకి వెళ్లిపోయిందన్నారు. బోట్ మరమ్మతుకు గురైందన సమాచారం తెలిపేలోగా డీప్సీలోకి వెళ్లిపోవడం, అక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో సమాచారాన్ని చేరవేయలేకపోయినట్టు తెలిపారు. బోటు ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్ పోర్టు వద్ద డీప్ సీ లోనుంచి పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లిపోతుండగా, ఒడిశాకు చెందిన వేటగాళ్లకు గల్లంతైన బోటు, వేటగాళ్లు కనిపించడం, తెలుగు మాట్లాడే వేటగాడు అక్కడ ఉండటంతో మత్స్యకారుల ఆచూకీ లభించినట్లు తెలిపారు. బోటును పరదీప్ పోర్టుకి తీసుకొచ్చేందుకు వీలుగా ఒడిశాకు చెందిన బోటు సిబ్బంది 10 లీటర్ల డీసెల్, ఆహారాన్ని అందించినట్టు తెలిపారు. ఫైబర్‌బోటు తప్పిపోయినట్లు 12న తనకు యజమాని నుంచి ఫిర్యాదు వచ్చిన తక్షణమే కోస్ట్‌గార్డు, హెలికాప్టర్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. వేటగాళ్ల గాలింపు కోసం కాకినాడ తీరం నుంచి మూడు, విశాఖపట్నం నుంచి నాలుగు ఓడలు, చెన్నై నుంచి ప్రత్యేక విమానం 13 నుంచి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. విశాఖపట్నం నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పలుసార్లు హెలికాప్టర్ రెక్కీ నిర్వహించామన్నారు. వేటగాళ్ల ఆచూకీ కోసం రిలయన్స్, ఓఎన్జీసీ సహకారం తీసుకున్నట్టు తెలిపారు. వేటగాళ్ల గాలింపునకు సీఎం చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు తనతో సంప్రదింపులు చేసి మత్స్యకారులను సురక్షితంగా తీసుకు రావాలని ఆదేశించినట్టు తెలిపారు. బోటులో ఉన్న ఆహార పదార్థాలు 12వ తేదీ రాత్రితో అయిపోయినట్టు తెలిపారు. పరదీప్‌కు చేరుకున్న ఏడుగురు మత్స్యకారులు సుక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. వీరికి మెరుగైన వైద్య చికిత్స, ఆహారం అందించేలా ఒడిశా మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి సమకూర్చామన్నారు. మత్స్యకారులతో స్వయంగా మాట్లాడానని అందరూ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. ఒడిశా నుంచి కాకినాడ తీసుకొచ్చేందుకు రెవెన్యూ నుంచి ఒకరు, మత్స్యశాఖ నుంచి ఇద్దరు అధికారులను పంపినట్టు తెలిపారు. వీరు గురువారం రాత్రి, శుక్రవారం ఉదయానికి కాకినాడ చేరుకునేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.కోటేశ్వరరావు, అమలాపురం డీడీ పి.జయరావు పాల్గొన్నారు.
భద్రతా ప్రమాణాలు పాటించాలి
సముద్రంలోకెళ్లే వేటగాళ్లు విధిగా భద్రత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా కోరారు. మోటరైజ్డ్, మెకనైజ్డ్, కంట్రీ క్రాఫ్ట్స్ బోట్లు, పడవలపై చేపల వేటలకు వెళ్లే వారు బోట్లలో లైఫ్ సేవింగ్, నేవిగేషన్ ఎక్విప్మెంట్, డాట్ మిషన్, లైఫ్ జాకెట్లు, లైఫ్ప్లోట్స్ వంటి ఎక్విప్మెంట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎంఎఫ్బీ బోట్లు, 471, మోటరైజ్డ్ బోట్లు 2,888, సీసీ–1.సీసీ–2 బోట్లు 253 బోట్లు ఉన్నట్లు తెలిపారు. వీటికి తప్పకుండా డాట్ మిషన్, నేవిగేషన్, సీసేఫిటీ ఎక్విప్మెంట్లు, రిజిస్ట్రేషన్ ఉండాలన్నారు. వీటితో పాటూ మిగతా అన్ని రకాల బోట్లకు సీసేఫిటీ ఎక్విప్మెంట్, రిజిస్ట్రేషన్ విధిగా ఉండాలన్నారు. రెండు వారాల వ్యవధిలో బోట్ల రిజిస్ట్రేషన్, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ఎక్విప్‌మెంట్‌పై మత్స్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో ఉన్న 28 ప్రధాన లేండింగ్ సెంటర్ల వద్ద మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లలో డాట్ మిషన్ల ఏర్పాట్లు, బోట్ల రిజిస్ట్రేషన్‌పై వారం పది రోజుల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.