అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. అయోధ్యలో పెరుగుతున్న రద్దీ చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దీంతో రానున్న రోజుల్లో దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని.. పర్యాటక రంగంలో ఉత్తరప్రదేశ్ అగ్రగామి అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన విభాగం అంచనా వేసింది.
ఈ ఏడాది అయోధ్యను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరగడంతో ఉత్తరప్రదేశ్‌లో దేశీయ, విదేశీ పర్యాటకుల మొత్తం ఖర్చు ఈ ఏడాది చివరి నాటికి 4 లక్షల కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మునుపటి కంటే కూడా రూ. 20000 నుంచి రూ. 25000 కోట్లు ఎక్కువని అంచనా..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలోని ఆధ్యాత్మిక పరిశ్రమను అభివృద్ధి చేయడంలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఆధ్యాత్మిక టూరిజంలో ఉత్తరప్రదేశ్ గణనీయ వృద్ధి సాధించనుంది. గంగా నది, వారణాసి, తాజ్ మహల్ వంటి పర్యాటక ప్రదేశాల జాబితాలో అయోధ్య రామాలయం కూడా చేరిపోయింది.
2022లో మాత్రమే 32 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉత్తరప్రదేశ్ సందర్శించారు. ఇందులో కేవలం అయోధ్యను మాత్రమే సందర్శించిన వారు 2.21 కోట్లు. ఇది 2021తో పోలిస్తే ఏకంగా 200 శాతం ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 'కాంతి ఘోష్' ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో దేశీయ పర్యాటకులు దాదాపు రూ. 2.2 లక్షల కోట్లు, విదేశీ పర్యాటకులు రూ.10,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే యూపీలో పర్యాటకుల ఖర్చు మొత్తం రూ.2.3 లక్షల కోట్లని తెలుస్తోంది.
2019లో అంతర్జాతీయ పర్యాటక వసూళ్లలో భారతదేశం వాటా 14వ ర్యాంక్‌తో 2.06 శాతం తక్కువగా ఉండేది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కూడా, ఇది ఆరవ ర్యాంక్‌తో కేవలం 7 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. ఇది రాబోయే రోజుల్లో తప్పకుండా వృద్ధి చెందుతుందని ప్రస్తుత పరిస్థితుల ద్వారా అవగతమవుతోంది.
జీడీపీలో ఉత్తరప్రదేశ్ వాటా..
2028 ఆర్ధిక సంవత్సరం నాటికి భారతదేశం ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, ఇందులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ఏకంగా 500 బిలియన్ డాలర్లగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ వృద్ధి భారతదేశ జీడీపీ పెరుగుదలకు దోహదపడుతుంది.
ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
2027 - 2028లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మూడవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అప్పటికి ఆర్ధిక వృద్ధిలో 500 బిలియన్ డాలర్ల మార్కుని అధిగమించే రెండు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటిగా ఉండనుంది. ఇది నార్వే, హంగేరీ మొదలైన యూరోపియన్ దేశాల కంటే ఎక్కువని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment