వివాహం... సంస్కారం
ఆత్మీయం
మన ప్రాచీన ఋషులు వివాహ సంస్కారాన్ని పరమపవిత్రంగా, ఉత్కృష్టమైనదిగా మలచి, దానిని మహోన్నతమైన ఆశయాలతో నింపి దాంపత్య జీవితం ఆవశ్యకతను ఉద్బోధించారు. వివాహ సంస్కారం దంపతుల శరీరాలనేగాక ఆత్మ, మనస్సు, ప్రాణం... అన్నింటినీ ఏకం చేస్తుంది. ఇదే వివాహ సంస్కారంలోని విశేషం, ఉద్దేశం. ఆదర్శమైన గృహస్థ«ధర్మంతో మోక్షాన్ని పొందడమే వివాహంలోని అంతిమలక్ష్యం. సత్సంతానాన్ని కని, పితృరుణ విముక్తుడు కావడం కూడా వివాహ ఆదర్శాలలో ఒకటి. వివాహ సంస్కారం వధూవరులను విచ్చలవిడితనం నుంచి వేరుచేస్తుంది.
ధర్మార్థకామాలను సన్మార్గంలో అనుసరించేలా ప్రేరేపిస్తుంది. ఆలుమగలలో పరస్పర ప్రేమను కలిగించి, గృహస్థ జీవితాన్ని ఆనందమయం చేస్తూ, సంతానాన్ని కలిగించి ఆధ్యాత్మికోన్నతికి కారణమౌతుంది. పెళ్లితో స్త్రీపురుషుల అనుబంధానికి బలం ఏర్పడుతుంది. గుర్తింపు, గౌరవమర్యాదలు లభిస్తాయి. అందువల్ల సహజీవన సంస్కృతికన్నా వివాహ సంప్రదాయానికే పెద్దలు ప్రాధాన్యత ఇచ్చారు. దీనిని గౌరవించడం మన సంస్కారం.