నైన్‌వేద్యాలు | Vinayaka chavithi special Offerings | Sakshi
Sakshi News home page

నైన్‌వేద్యాలు

Published Sat, Sep 8 2018 12:17 AM | Last Updated on Sat, Sep 8 2018 12:17 AM

Vinayaka chavithi special Offerings - Sakshi

మంచి పెంచు స్వామీ.సంపద  ఇవ్వు స్వామీ.సంతోషం పంచు  స్వామీ.సోదరభావం నేర్పించు స్వామీ.దానాన్ని బోధించు స్వామీ.సంస్కారం అలవర్చు స్వామీ.దయను కలిగించు స్వామీ.స్వస్థత చేకూర్చు స్వామీ.శాంతిని ప్రసాదించు స్వామీ.తొమ్మిది నైవేద్యాలు స్వీకరించి  నవ జీవనాన్ని దయ చేయి తండ్రీ.

పాల తాలికలు
కావలసినవి: పాలు – ఒక లీటరు; బెల్లం పొడి – పావు కేజీ; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; సగ్గు బియ్యం – 50 గ్రా.; బియ్యం – పావు కేజీ; జీడి పప్పు – 50 గ్రా.; నెయ్యి – 6 టీ స్పూన్లు; ఉప్పు – చిటికెడు
తయారీ ∙ముందురోజు బియ్యాన్ని తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీళ్లు శుభ్రంగా ఒంపేసి, పొడి వస్త్రం మీద బియ్యం ఆరబోసి, బియ్యంలోని తడి పోయిన తరవాత, మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఈ పిండికి బెల్లం పొడి, వేడి పాలు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙ కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని సన్నగా పొడవుగా తాలికలుగా ఒత్తి పక్కన ఉంచాలి ∙ఒక మందపాటి గిన్నెలో లీటరు పాలకు కప్పుడు నీళ్లు జత చేసి, సగ్గుబియ్యం కూడా వేసి స్టౌ మీద ఉంచి, సగ్గు బియ్యం ఉడికేవరకు మరిగించాక, తయారుచేసి ఉంచుకున్న తాలికలను పాలలో వేసి జాగ్రత్తగా కలపాలి ∙ చివరగా బెల్లం, నెయ్యి, ఏలకుల పొడి జత చేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి దింపేయాలి ∙చల్లగా అందించాలి.

పప్పు ఉండ్రాళ్లు
కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; పెసర పప్పు – ఒక కప్పు (నానబెట్టి, నీరు ఒంపేయాలి); బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా
తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నీళ్లు పోసి మరిగించాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యప్పిండి వేసి కలుపుతుండాలి ∙పిండి గట్టిపడ్డాక బాణలి దింపేసి, పిండి కొద్దిగా చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙వేరొక బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙నానబెట్టి ఉంచుకున్న పెసర పప్పును వేసి కలపాలి ∙బెల్లం పొడి జత చేసి మరోమారు కలిపి, తగినన్ని నీళ్లు జత చేయాలి ∙పెసర పప్పు బాగా ఉడికిన తరవాత ఏలకుల పొడి వేసి కలియబెట్టాలి ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న చిన్ని చిన్ని ఉండ్రాళ్లను ఇందులో వేసి కలిపి దింపేయాలి ∙అంతే పప్పు ఉండ్రాళ్లు సిద్ధమైనట్లే. 

ఉండ్రాళ్లు
కావలసినవి: బియ్యపు రవ్వ – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; సెనగ పప్పు/పెసర పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా.
తయారీ: ∙స్టౌ మీద మందపాటి ఇత్తడి గిన్నె కాని బాణలి కాని ఉంచి వేడి చేయాలి ∙వేడెక్కిన తరవాత టేబుల్‌ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙జీలకర్ర వేసి వేయించాలి ∙శుభ్రంగా కడిగిన కరివేపాకు వేసి బాగా వేయించాలి ∙ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి ∙సెనగపప్పు, ఉప్పు జత చేసి కలియబెట్టాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యపు రవ్వ వేసి ఆపకుండా కలుపుతుండాలి ∙మంట బాగా తగ్గించి, మూత పెట్టాలి     ∙ మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బాగా ఉడుకుపడుతుండగా టేబుల్‌ స్పూను నెయ్యి వేసి కలపాలి     ∙ పూర్తిగా ఉడికిన తరవాత గిన్నె/బాణలి దింపేసి ఉడికిన రవ్వను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.చల్లారాక కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని గుండ్రంగా ఉండ్రాళ్లు తయారుచేసుకోవాలి ∙వినాయకుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి.

ఫ్రైడ్‌ మోదక్‌
కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూను; గోరు వెచ్చని నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని
ఫిల్లింగ్‌ కోసం: బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; వేయించిన నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ముప్పావు కప్పు.
పైభాగం తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, గోరు వెచ్చని నూనె, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి, సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి.
ఫిల్లింగ్‌ తయారీ: ∙ఫిల్లింగ్‌ కోసం చెప్పిన పదార్థాలను ఒక మందపాటి పాత్రలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపి పక్కన ఉంచాలి.
మోదకాల తయారీ: ∙గోధుమపిండి మి్రÔ¶ మాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ కర్రతో చపాతీలా ఒత్తి చేతిలోకి తీసుకోవాలి ∙ఫిల్లింగ్‌ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, ఒత్తిన చపాతీ మధ్యలో ఉంచి, అన్నిపక్కలా కొద్దికొద్దిగా దగ్గరకు తీసుకుంటూ (బొమ్మలో చూపిన విధంగా)  మూసేయాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసి పక్కన ఉంచుకోవాలి ∙ బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, కాగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ నాప్‌కిన్‌ మీదకు తీసుకోవాలి.

చాకొలేట్‌ మోదక్‌
కావలసినవి: పచ్చి కోవా – ఒక కప్పు (సన్నగా తురమాలి); చాకొలేట్‌ చిప్స్‌ – అర కప్పు; పంచదార పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; నెయ్యి – కొద్దిగా
గార్నిషింగ్‌ కోసం: పిస్తా పప్పుల తరుగు – రెండు టీ స్పూన్లు; గులాబీ రేకలు – కొద్దిగా.
తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడి చేసి, మంట బాగా తగ్గించి పచ్చి కోవా తురుము వేసి, ఆపకుండా కలుపుతుండాలి ∙కోవా కరగడం మొదలైన తరవాత, పంచదార పొడి వేసి బాగా కలిపాక, చాకొలేట్‌ చిప్స్‌ వేసి వెంటనే కలిపేయాలి ∙చాకొలేట్‌ చిప్స్‌ కరిగి, మిశ్రమం చిక్కబడుతుండగా ఏలకుల పొడి వేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం బాగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙మిశ్రమం మరీ గట్టిపడకుండా చూసుకోవాలి ∙ఉడుకుతున్న మిశ్రమం అంచులను విడవగానే, ఒక పాత్రలోకి తీసుకుని, చల్లారనివ్వాలి     ∙బాగా చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙మోదక్‌ మౌల్డ్స్‌ తీసుకుని ఒక్కో ఉండను అందులో ఉంచి జాగ్రత్తగా మూత తీసి మోదకాలను, నెయ్యి పూసిన ప్లేట్‌లో ఉంచాలి ∙గులాబీ రేకలు, పిస్తా తరుగు తో అందంగా అలంకరించి, వినాయకుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా సేవించాలి (ఇష్టపడేవారు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా కూడా తినొచ్చు. వీటిని త్వరగా తినేయాలి, లేదంటే చాకొలేట్‌ కరిగిపోయే అవకాశం ఉంటుంది)

డ్రైఫ్రూట్స్‌ మోదక్‌
కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – పావు టీ స్పూను

మోదక్‌ ఫిల్లింగ్‌ కోసం: నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; పచ్చి కోవా – 100 గ్రా.; గసగసాలు – ఒక టీ స్పూను; బాదం పప్పులు – పావు కప్పు; జీడి పప్పు పలుకులు – 2 టేబుల్‌ స్పూన్లు; పిస్తా తరుగు – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; చిరోంజీ – ఒక టేబుల్‌ స్పూను; ఖర్జూరాల తరుగు – ఒక టేబుల్‌ స్పూను; కిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – పావు కప్పు.

తయారీ: ∙ఒక పాత్రను స్టౌ మీద ఉంచి వేడయ్యాక నీళ్లు పోసి మరిగించాలి ∙పావు టీ స్పూను ఉప్పు వేసి కలియబెట్టాలి ∙నీళ్లు బాగా మరుగుతుండగా మంట తగ్గించి, బియ్యప్పిండి వేస్తూ కలపాలి ∙కొద్దిగా ఉడికించి వెంటనే దింపేయాలి ∙ఉడికిన పిండిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙పిండి బాగా చల్లారాక చేతితో బాగా కలిపి మూత పెట్టి పావు గంట సేపు పక్కన ఉంచాలి. 

డ్రై ఫ్రూట్స్‌ స్టఫింగ్‌ తయారీ: డ్రై ఫ్రూట్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక ఒక టేబుల్‌ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙తరిగి ఉంచుకున్న బాదం పప్పులు, జీడి పప్పు పలుకులు, పిస్తా, ఖర్జూరం, చిరోంజీ, కిస్‌మిస్‌లను వేసి రెండు నిమిషాల పాటు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ∙గసగసాలు వేసి చిటపటలాడేవరకు వేయించి డ్రైఫ్రూట్స్‌తో పాటు పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో కోవా వేసి బాగా కలపాలి ∙కోవా కరుగుతున్న సమయంలో పావు కప్పు పంచదార వేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం ఉడుకుపట్టగానే, పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, గసగసాలు వేసి కలిపి దింపేసి, మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకోవాలి.

మోదకాల తయారీ: ∙ఉడికించిన బియ్యప్పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఒత్తాలి ∙డ్రైఫ్రూట్స్‌ మిశ్రమం కొద్దిగా తీసుకుని అందులో ఉంచి, అన్నివైపులా మూసేయాలి (మౌల్డ్స్‌లో చేసుకుంటే చూడటానికి బాగుంటాయి) ∙అన్నీ తయారుచేసుకున్నాక ఇడ్లీ స్టాండులో ఉంచి, స్టౌ మీద పెట్టి ఆవిరి మీద ఉడికించి దింపేయాలి.

కొబ్బరి ఉండ్రాళ్ల పాయసం
కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – రుచికి తగినంత; నూనె – ఒక టీ స్పూను; పంచదార – 3 టేబుల్‌ స్పూన్లు; పాలు – 3 కప్పులు; కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్లు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకులు – 2 (పొడి చేయాలి); కిస్‌మిస్‌ – కొద్దిగా
తయారీ: ∙స్టౌ మీద మందపాటి పాత్ర పెట్టి వేడి చేయాలి ∙నీళ్లు పోసి మరిగించాక, ఉప్పు జత చే సి బాగా కలపాలి ∙కొద్దిగా నూనె వేసి మరోమారు కలపాలి ∙నీళ్లు మరిగాక బియ్యప్పిండి వేసి మంట తగ్గించి, పిండి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి ∙పిండి ఉడికి బాగా గట్టిపడ్డాక దింపి, చల్లారనివ్వాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద మరో బాణలి పెట్టి, వేడయ్యాక పాలు పోసి మరిగించాలి ∙పంచదార, ఏలకుల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న చిన్న ఉండ్రాళ్లను పాలలో వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ∙కొద్దిగా పాలలో టేబుల్‌ స్పూను బియ్యప్పిండి వేసి కలిపి, ఉడుకుతున్న పాలలో వేయాలి ∙జీడి పప్పులు వేసి మరోమారు కలియబెట్టాలి ∙కొద్దిగా ఉడుకుçపట్టాక  కొబ్బరి తురుము వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి.

ఉండ్రాళ్ల పాయసం
కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; పాలు – అర లీటరు; పంచదార – ఒక కప్పు; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీస్పూను; జీడి పప్పు – కొద్దిగా; సార పలుకులు – కొద్దిగా
తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, సార పలుకులు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి ∙నీళ్లు మరిగిన వెంటనే టీ స్పూను పంచదార వేసి కలపాలి ∙బియ్యప్పిండి (కొద్దిగా పిండి పక్కన ఉంచుకోవాలి) వేసి కలపాలి ∙పిండి ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతూ, పిండి గట్టి పడ్డాక స్టౌ మీద నుంచి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙వేరే బాణలిలో పాలు పోసి మరిగించాలి ∙ఒక కప్పు పంచదార వేసి కరిగించాలి ∙కొద్దిగా ఏలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి ∙ఏలకుల వలన సువాసన వస్తుంది ∙పాలు మరిగి చిక్కబడేవరకు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న చిన్నచిన్న ఉండ్రాళ్లను మరుగుతున్న పాలలో వేయాలి ∙పక్కన ఉంచుకున్న బియ్యప్పిండిని కొద్దిగా చన్నీళ్లలో వేసి కలిపి, ఉడుకుతున్న పాలలో వేసి మరోమారు కలియబెట్టాలి ∙చివరగా... వేయించి ఉంచుకున్న జీడి పప్పులు, సార పలుకులను వేసి బాగా కలిపి దింపేయాలి ∙వినాయకుడికి నివేదన చేసి సేవించాలి.

పూర్ణం కుడుములు
కావలసినవి: సెనగ పప్పు – ఒక కప్పు; నీళ్లు – 3 కప్పులు; బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా
తయారీ: ∙సెనగ పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడిలా చేయాలి ∙బాణలిలో బెల్లం, కొద్దిగా నీరు పోసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించాలి ∙పాకం బాగా చిక్కబడ్డాక ఏలకుల పొడి వేసి మరోమారు కలియబెట్టాలి ∙పొడి చేసి ఉంచుకున్న సెనగపప్పును వేసి కలియబెట్టాలి ∙పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం దగ్గరపడేవరకు ఆపకుండా కలిపి దింపేయాలి ∙చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి.వేరొక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙కొద్దిగా నెయ్యి జత చేసి కలపాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యప్పిండి వేసి బాగా కలిపి ఉడికించాలి ∙ఉడికిన పిండిని ఒక పళ్లెంలోకి తీసి, చేతితో మెదుపుతూ ఉండలా చేయాలి ∙చేతికి కొద్దిగా నెయ్యి పూసుకోవాలి ∙ఉడికించిన బియ్యప్పిండిని కొద్దిగా తీసుకుని చేతితో ఒత్తాలి ∙సెనగ పప్పు + బెల్లం ఉండను మధ్యలో ఉంచి బియ్యప్పిండితో మూసేసి నున్నగా చేసి పక్కన ఉంచాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙వీటిని ఇడ్లీ స్టాండ్‌లో ఉంచి మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి ∙ఉడికిన తరవాత దింపేసి, బయటకు తీసి, చల్లారాక తినాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement