మోడల్ కార్తికేయనడకతోపాటే నాట్యం కూడా నేర్చుకున్నాడు కార్తికేయ. వినాయక చవితి స్టేజ్‌తో మొదలు పెట్టి అంతర్జాతీయ వేదికపై మెరిశాడీ మోడలింగ్ ప్రిన్స్. థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ మోడలింగ్ పోటీల్లో ‘ప్రిన్స్ వరల్డ్–2024’ టైటిల్ సొంతం చేసుకుని వైజాగ్‌కు తిరిగి వచ్చిన కార్తికేయ సక్సెస్ స్టోరీ ఇది.
థాయ్‌లాండ్‌లో ‘ప్రిన్స్’కిరీటం..
కార్తికేయ రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టార్ కిడ్స్ సీజన్–2, ఆంధ్రా ఫ్యాషన్ వీక్ పోటీలలో విజేతగా నిలిచాడు. కోళికోడ్ నగరంలో జరిగిన జాతీయ స్థాయి మోడలింగ్ పోటీల్లో కూడా విజయం సాధించాడు. ప్రిన్స్ ఆఫ్ ఏపీ సబ్ టైటిల్‌ను గెలిచి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. దీంతో ఇటీవల థాయ్‌లాండ్‌లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పేరుతో పోటీలు నిర్వహించారు. దీనికి 11 దేశాల నుంచి 45 మంది చిన్నారులు పోటీ పడ్డారు.
ఇందులో కార్తికేయ మనదేశానికి ప్రాతినిథ్యం వహించాడు. నాలుగవ తరగతి చదువుతున్న ఈ విశాఖపట్నం కుర్రాడు మోడలింగ్‌తోపాటు వ్యాఖ్యానం, నటన, కథలు చెప్పడం, యోగా ఇలా అనేక రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కార్తికేయ తండ్రి బి.జె.శ్రీనివాసరెడ్డి ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆయన కథలు, కవితలు, వెబ్ పేజీలకు ఆర్టికల్స్ రాస్తుంటారు. వీటితోపాటు సేంద్రియ వ్యవసాయం, తేనెటీగల పెంపకం ఆయన ఆసక్తులు. కార్తికేయ తల్లి పావనీ లత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)లో ఇంజినీర్. చిత్రకారిణి కూడా. తల్లిదండ్రులిద్దరిలోనూ సృజనాత్మకత మెండుగా ఉండడం పిల్లల మీద మంచి ప్రభావం చూపించింది.
రెండేళ్లకు బ్రేక్
కార్తికేయ రెండేళ్ల వయసులో గాజువాకలో వినాయక చవితి ఉత్సవాలలో తొలిసారిగా చేసిన డ్యాన్స్‌కు మంచి ప్రశంసలందాయి. ప్లే స్కూల్‌లో పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే.. కార్తికేయ డ్యాన్సులతో ఆ పిల్లలను అలరించేవాడు. దీంతో తల్లిదండ్రులు మంచి డ్యాన్సర్‌ను చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మూడో ఏట కాలికి సర్జరీ అవడంతో ఏడాదిపాటు డ్యాన్స్‌కు దూరం కావల్సి వచ్చింది. గాయం తగ్గిన వెంటనే మళ్లీ డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కాడు. పాశ్చాత్య నృత్యాన్ని అభ్యసించాడు. స్కూల్‌లో జరిగే కల్చరల్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు. అతడు ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం విమర్శకుల మన్ననలు పోందింది. రాగయుక్తంగా శ్లోకాలు, గీతాలు పాడి అందరి అభినందనలు అందుకున్నాడు. డ్యాన్స్‌లోనే కాకుండా తొలిసారిగా ఫ్యాషన్ షోలో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. డ్యాన్సర్‌గా, మోడల్‌గా పలు రాష్ట్రాల్లో షోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
ఇద్దరూ ఆణిముత్యాలే
తమ్ముడు కార్తికేయ రెడ్డి డ్యాన్స్, మోడలింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అక్క హరి శ్రేయసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. 34 శ్లోకాల సమాహారమైన ‘శ్యామలదండకం’ వల్లించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదైంది. అలాగే చిత్ర లేఖనం, పాటల పోటీలలో కూడా బహుమతులు గెలుచుకుంది. 2024లో ఉగాది ప్రతిభా పురస్కారం అందుకుంది.
– దుక్క మురళీకృష్ణారెడ్డి, సాక్షి, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment