పండుగనాడూ పస్తులే | Bejwada is fighting with flood | Sakshi
Sakshi News home page

పండుగనాడూ పస్తులే

Published Sat, Sep 7 2024 2:53 AM | Last Updated on Sat, Sep 7 2024 2:53 AM

Bejwada is fighting with flood

వరదతో యుద్ధం చేస్తున్న బెజవాడ 

ముంపులోనే బాధితుల జీవన్మరణ పోరాటం 

ఆహారం కోసం ఈదుకుంటూ వస్తున్న బాధితులు.. గుండెలు పిండేస్తున్న దృశ్యాలు 

బయటకు వచ్చి నిత్యావసరాలు తీసుకెళ్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు 

పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న బాధితులు 

తమనైనా పంపాలని, ఇంట్లో వారినైనా బయటకు తేవాలని బాధితుల వేడుకోలు 

పరుషపదజాలంతో ఎదురు దాడి చేస్తున్న పోలీసులు 

పండుగ సెలవు కోసం రిలీవర్‌ను పంపాలని ఉద్యోగుల విజ్ఞాపనలు

సాక్షి, అమరావతి :  హిందువుల తొలి పండుగ వినాయక చవితిని ఘనంగా నిర్వహించేందుకు దేశమంతా ఏర్పాట్లు చేసుకున్నారు. రాష్ట్ర రాజధానిలో భాగంగా చెప్పుకొనే విజయవాడలో మాత్రం పండుగ జాడ కానరావట్లేదు. బెజవాడ నగరం సగానికిపైగా వరద నీటిలో మునగడంతో బాధితులు తీవ్ర విషాదంలో ఉన్నారు. పండుగ నాడూ పస్తులుండాల్సిన స్థితిలో ఉన్నారు. వరద ప్రాంతాల్లో మంచి నీరు, ఆహారం కోసం బాధితులు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. 

దాతలు పెద్ద ఎత్తున తెస్తున్న ఆహారం, ప్రభుత్వం అందిస్తున్న మంచినీరు, ఆహారం వరద ప్రాంతాల మొదట్లోనే ఆగిపోతున్నాయి. వరద తీవ్రత ఉన్న లోపలి ప్రాంతాలకు అవి అందడంలేదు. దీంతో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు నీటిలో ఎదురీదుతూ వచ్చి నీరు, ఆహారం కోసం ట్రాక్టర్లు, వ్యాన్‌ల వెంట పరుగులు తీస్తున్న దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయి. 

వరద విపత్తుతో యుద్ధం.. 
గురువారం మధ్యాహా్ననికి వరద కొంత శాంతించిందని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బుడమేరు ఊరిపై పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నీటి ఉధృతి పెరగడంతో అజిత్‌సింగ్‌నగర్, రాజరాజశ్వరిపేట, వాంబే కాలనీ, సుందరయ్యనగర్, కండ్రిక తదితర ప్రాంతాల్లో ప్రజలు మళ్లీ  ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ప్రజల జీవన్మరణ పోరాటం.. పోలీసుల ఆంక్షలు.. ఉద్యోగుల హడావుడితో వరద ప్రాంతాల్లో యుద్ధ వాతావరణంలాంటి పరిస్థితి నెలకొంది. 

నిత్యావసరాల కోసం బయటకు వెళ్లిన వారిని మళ్లీ ఇంటికి చేరకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో కుటుంబంలో బయట కొందరు, వరద నీరు చుట్టుముట్టిన ఇళ్లలో మరికొందరు చిక్కుకుపోయారు. వారి వాళ్లను కలిసే అవకాశం లేక అవస్థలు పడుతన్నారు. అటుగా వెళ్లే ట్రాక్టర్లు, వ్యాన్‌లు, బస్సులు ఎక్కి ముంపు ప్రాంతంలోని ఇళ్లకు తిరిగి చేరేందుకు బాధితులు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటు­న్నారు. ఎక్కడ పడితే అక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి ఎవరినీ వెళ్లనీయడంలేదు. 

తమనైనా ఇళ్లకు పంపాలని, లేదంటే ఇంట్లో చిక్కుకుపోయిన వాళ్లనైనా బయటకు తీసుకురావాలని వందలాది మంది ఆందోళన చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా వారిపై పోలీసులు పరుష పదజాలంతో విరుచుకుపడుతన్నారు. దీంతో మేమేమైనా పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉన్నామా? మా ఇంటికి మేము వెళ్లకుండా అడ్డుకుంటారా? ప్రభుత్వం ఎలాగు పట్టించుకోదు.. మా చావు మేము చస్తాం అంటూ పలుచోట్ల ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు.

మాకు రిలీవర్‌ను ఇవ్వండి సార్‌.. 
అధికారులకు రోజు విడిచి రోజు షిఫ్ట్‌ పద్ధతిలో వరద ప్రాంతాల్లో విధులు కేటాయిస్తుంటే.. దిగువ స్థాయి ఉద్యోగులకు మాత్రం 24/7 విధులు చేయించడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. సార్‌.. రేపు వినాయక చవితి ఇంటికి వెళ్తాం.. ఒక్కరోజుకైనా రిలీవర్‌ను పంపించండి అంటూ వేడుకుంటున్నారు. వారం రోజులుగా విజయవాడలోనే పని చేస్తున్నామని, పండుగ ఒక్కరోజైనా వేరొకరిని కేటాయించి తమకు శలవు ఇవ్వాలని పశి్చమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీకి చెందిన ఉద్యోగులు అధికారులకు మొరపెట్టుకోవడం గమనార్హం.  

నిన్ను నమ్మలేం బాబు..బాధితుల ఆగ్రహం
వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ) : వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం ‘నిన్ను నమ్మలేం బాబు’ అంటూ ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. ఐదు రోజులుగా జనం నరకాన్ని చవిచూస్తున్నారు. మొదటి మూడ్రోజులు కొంతమందికే ఆహారం, మంచినీరు వచ్చింది. అది కూడా వంతెన పైన ఉన్న ప్రాంతాల్లో ఇచ్చి చేతులు దులుపుకున్న సంగతులు తెలిసిందే. అధికారులు, ప్రజా ప్రతినిధులు చివరివరకూ వెళ్లలేక చేతులెత్తేశారని స్థానికులు మండిపడ్డారు. 

అయితే,  ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతోంది. దీంతో సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు సాయమందిస్తాం ధైర్యంగా ఉండండి అంటూ పదేపదే భరోసా కల్పిస్తున్నప్పటికీ ఇక్కడి స్థానికులు వారి మాటలను విశ్వసించడంలేదు. మీకు రేషన్‌ బియ్యాన్ని పంపిస్తున్నాం, ఇతర సరుకులను పంపిస్తాం అంటూ తెగ ప్రచారం చేస్తున్నా మళ్లీ వరద వస్తే వీరంతా తమను వదిలేస్తారంటూ దాదాపు 30–40 శాతం మంది సురక్షిత ప్రాంతాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

అనేక బోట్లు మా ముందే ఖాళీగా వెళ్తుంటే తాము బతిమాలుతున్నా పట్టించుకోకుండా పోయారంటూ బాధితులు మండిపడుతున్నారు. అటువంటి ప్రభుత్వం ఉన్న క్రమంలో మళ్లీ వరదనీరు ముంచెత్తితే మా బతుకులు తెల్లారతాయంటూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. వరద పూర్తిగా తగ్గిన తరువాతే మా ఇళ్లకు వస్తామంటూ సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ, వాంబే కాలనీ, ఉడా కాలనీ, కండ్రిక, రాజరాజేశ్వరిపేట, ప్రకాష్‌నగర్, కబేళాలకు చెందిన వారు తేల్చిచెబుతున్నారు.  

రెండు రోజులుగా రోడ్డుపైనే ‘నిత్యావసర’ లారీలు
అన్‌లోడ్‌ చేయకపోవడంతో అవస్థలు పడుతున్న డ్రైవర్లువరద వల్ల సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లర్లు పంపించిన నిత్యావసర సరుకుల లారీలు అన్‌లోడ్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో రెండు రోజులుగా విజయవాడలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో పెద్ద సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. 

వాటిని ఎప్పుడు తీసుకెళ్తారో అర్థమవ్వక.. లారీల డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. ‘గురువారం రాత్రి బియ్యం లోడుతో అమలాపురం నుంచి విజయవాడకు వచ్చాను. అప్పటి నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డు­లోనే పార్కింగ్‌ చేసి ఉంచాను. అధికారులు ఎప్పుడు అన్‌­లోడ్‌ చేయిస్తారో అర్థమవ్వట్లేదు’ అని లారీ డ్రైవర్‌ ఏడుకొండలు వాపోయాడు.– నెహ్రూనగర్, మేడికొండూరు

ప్రకాశం బ్యారేజ్‌కు మరమ్మతులు
సాక్షి, అమరావతి: కృష్ణా వరద ఉధృతికి కొట్టుకొచ్చిన నాలుగు పడవలు ఢీకొనడంతో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్‌ మూడు గేట్లకు ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సలహాదారు కన్నయ్యనాయుడు నేతృత్వంలో మరమ్మతు పనులు ప్రారంభించారు. 

ఇందులో భాగంగా 69, 67 గేట్ల కౌంటర్‌ వెయిట్‌లను గురు, శుక్ర­వా­రాల్లో బీకెమ్‌ సంస్థ కార్మికులు తొల­గించారు. 67, 68, 69 గేట్లను కిందకు దించారు. శని­వారం 67–68 గేట్ల వద్ద ఉన్న రెండు పడవలను మరపడవతో తొలగించను­న్నారు. హైదరాబాద్‌లో తయారు చేయించిన ఐరన్‌ కౌంటర్‌ వెయిట్‌లను విజయవాడకు తెచ్చి.. వాటిని 69, 67 గేట్లకు శనివారం బిగిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement