కట్న దాహానికి గర్భిణి బలి
- గొంతు నులిమి చంపేసిన భర్త
ఉప్పల్: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం నిండుచూలాలు అని కూడా చూడకుండా గొంతునులిమి భార్యను హత్య చేశాడు. రామంతాపూర్‌లోని వెంకటరెడ్డినగర్‌లో శుక్రవారం ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...ప్రకాశంజిల్లా గిద్దలూరు సమీపంలోని రెవెల్లి గ్రామానికి చెందిన సౌజన్య(21)తో అదే జిల్లా రాచర్ల మండలం అనుముల గ్రామానికి చెందిన వేమురెడ్డి జయరాంరె డ్డి (25)తో ఏడాదిన్నర క్రితం పెళ్లైంది. సౌజన్య ప్రస్తుతం 8 నెలల గర్భిణి. జయరాంరెడ్డి మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ హోంగార్డుగా పని చేస్తున్నాడు.
ఇతను గత కొంతకాలంగా అదనపు కట్నం, స్థలం కోసం తరచూ భార్యతో గొడవపడుతున్నాడు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం కూడా వీరి మధ్య గోడవ జరిగింది. ఎప్పటిలాకే శుక్రవారం ఉదయాన్నే జయరాంరెడ్డి విధులకు వెళ్లాడు. మధ్యాహ్నం అవుతున్నా సౌజన్య ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా సౌజన్య మంచంపై పడి ఉంది.
చేయిపట్టుకొని లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చి వైద్యుడిని పిలిపించి పరీక్ష చేయించగా.. ఉదయమే ఆమె మృతి చెందినట్టు నిర్థారించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా..ఉప్పల్ సీఐ బాలకృష్ణారెడ్డి, ఎస్‌ఐ లింగం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి మెడపై గాట్లు ఉన్నాయి. దీని బట్టి భర్తే ఆమెను గొంతు నులిమి చెప్పి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనపై ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. భర్త జయరాంరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని త్వరలోనే సౌజన్య హత్యకు దారి తీసిన కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.