ఒక ఊళ్లో (పేరెందుకు లెండి) ఒక జూ వుంది. చిన్న జూ. ఒక పులి, రెండు మొసళ్లూ, మూడు పాములూ, ఒక జీబ్రా, ఒక ఆస్ట్రిచ్, ఒక కోతి ఉన్నాయక్కడ. ఇవి గాక పక్షులు, చేపలు, కప్పలు వగైరా ఎలాగూ ఉంటాయి గదా. యుద్ధం ప్రారంభమయ్యాక, ఫాసిస్టులు వేసిన బాంబుల్లో ఒకటి సరిగ్గా జూ మీద పడింది. అంటే జంతువులకు ప్రళయం వచ్చినట్టే. మూడు పాములు, ఆస్ట్రిచ్ మంటల్లో కాలిపోయాయి. మిగతా జంతువులకేం కాలేదు. అన్నింటికన్నా ఎక్కువ భయపడింది కోతి. దానికోసం కట్టిన ఇనుప చువ్వల పంజరం బోల్తా పడింది. ఒకవైపు విరిగింది. కోతి జూ దాటి రోడ్డెక్కింది. అది మనిషి కాదు. ఏ పని చెయ్యాలన్నా ఆజ్ఞలూ, అనుమతులు దానికక్కర్లేదు. చెట్టు మీదికి ఎగిరి, అటు నుంచి గోడ మీదికి దూకి పరిగెత్తింది. బాంబులింకా పడుతున్నట్టుగా, యింకా దూరం పారిపోవాలని ప్రయత్నం.ఊరంతా కలియ తిరిగింది. వీధి వీధిని పరిశీలించి చూసింది. జనావాసాలు క్షేమంగా కనిపించనట్టుంది. పొలిమేరలను చేరుకుంది. మనిషి కాదు గదా కోతి. ఎందుకు, ఏమిటని ప్రశ్నిస్తే జవాబులు చెప్పలేదు.పరిగెత్తితే ఎవరైనా అలసిపోతారు. కోతి గూడా. చెట్టె క్కింది. ఆకలిగా ఉందేమో, ఓ ఈగను మింగింది. ఆ తర్వాత మరో రెండు పురుగుల్ని చప్పరించింది. కొమ్మ మీద ఆదమరచి నిద్రపోయింది.అప్పుడు, ఓ మిలటరీ వాహనం అటుగా వచ్చింది. డ్రైవర్ కోతిని చూసి ఆశ్చర్యపడ్డాడు. చెట్టెక్కి దాన్ని పట్టుకుని, ట్రక్కులో వేసుకున్నాడు.
‘‘పాపం, ఒంటరి కోతి. ఆకలికి మాడి చస్తుంది. నా మిత్రుడికి బహుమానంగా ఇస్తాను. కనీసం తిండి పెట్టి పోషిస్తాడు. అలాగైనా దీని యిక్కట్లు తీరుతాయి’’ అనుకున్నాడు.‘‘నా ముద్దుల కోతి, నువ్విక్కడే కూర్చోవమ్మా. ఇప్పుడే వస్తాను’’ అంటూ అయిదు నిమిషాలు అలా వెళ్లాడో లేదో కోతి ట్రక్కులోంచి దూకి పరిగెత్తింది. మళ్లీ వీధుల్లో, ఇళ్ల కప్పుల మీద, చెట్ట మీద. చూసేవాళ్లకిదంతా వింతగానే ఉంది. పట్టుకోవడానికీ ప్రయత్నించారు. కానీ అది అంత సులభంగా దొరుకుతుందా? జనం కోతిని యిబ్బంది పెట్టారు. కోతి జనాన్ని ఇబ్బంది పెట్టింది. మరి కాసేపటికి ఆకలేసింది. హోటల్‌కెళ్లాలి. కనీసం ఒక కో–ఆపరేటివ్ స్టోర్స్ కన్నా. కానీ డబ్బుల్లేవు. ఇంక డిస్కౌంట్లు, రేషన్ కూపన్లు తలచుకుని ఏం ప్రయోజనం.ఎదురుగా పెద్ద క్యూ కనిపించింది. కూరగాయలు పంచుతున్నారు. క్యారట్లు, దోసకాయలు, కోతులకు క్యూలో నిల్చునే ఓపిక ఉంటుందా? తోసుకోవడం, కుమ్ముకోవడం కూడా వీలుపడదు. చెంగున కౌంటర్‌మీదికెగిరి కూర్చుంది. ‘‘క్యారట్లు కిలో ఎంత?’’ అని అడగలేదు. పౌర బాధ్యతలు దానికి తెలియవు. కావలసినవి నోట కరచుకుని తుర్రుమంది. డబ్బులూ, మర్యాదా తర్వాత. అన్నింటినీ మించిన అవసరం ఆకలి.
జనం అరిచారు. గోల పెట్టారు. కూరగాయలు తూస్తున్న పిల్ల మూర్చపోయింది. క్రమశిక్షణా రాహిత్యం అనర్థదాయకం. అందరూ ఇలాగే ఎగబడి ఎవరికి తోచింది వాళ్లు తీసుకుపోతామంటే ఇంక స్టోర్సు, రేషన్ కూపన్లు ఎందుకు?ఇలాంటి తుంటరి వెధవల్ని శిక్షించాలి. అందరూ కలిసి వెంటబడ్డారు. నోటిలో క్యారట్ పెట్టుకుని కొత్త విన్యాసాలు చేసింది కోతి. ఆకలేసినంత మాత్రాన దొరికింది నోట కరచుకోవడం నేరమని తెలియదు. అయినా కోతులకు యుక్తాయుక్త విచక్షణ ఉండదని అందరికీ తెలుసు.వెంటపడటం పిల్లలకు సరదా.పెద్దవాళ్లకు కోపం.పోలీసు మనిషి కూడా డ్యూటీగా విజిలూదుతూ కాసేపు పరిగెత్తాడు.మనుషులు సరిపోలేదని ఓ కుక్క కూడా మొరుగుతూ వెంట పడింది. పట్టుబడితే ఇలాంటి క్షుద్ర జీవులను చీల్చెయ్యాలని అందరికీ సరదా.కోతి పరుగు లంకించుకొంది. ‘‘జూ విడిచి రావడమే పెద్ద పొరబాటు’’ అనుకుంటున్నదేమో! ‘‘నగరం నా నివాసం కాదు. జూలోని ఇనుప చువ్వల పంజరమే నా ఇల్లు. అక్కడే నా స్వేచ్ఛ. నా సుఖం’’ అనీ అనుకున్నదేమో.కోతి పశ్చాత్తాప పడినంత మాత్రాన కుక్క దాన్ని క్షమించవలసిన పనిలేదు. దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్న దొంగకోతి కంచె దూకింది. కుక్క పంజా విసిరింది. నోటిలోని క్యారెట్‌తో కుక్క ముట్టె మీద టపీమని కొట్టింది కోతి. కుక్కకు దిమ్మ తిరిగింది. ఇది దోపిడి దొంగ లాగుంది. వెంట ఆయుధాలు కూడా తెచ్చుకుంది. కుయ్యో మొర్రోమంటూ తోకను కాళ్ల మధ్యన దోపుకుని కూలబడింది కుక్క.‘‘మహా ప్రభువులకు విన్నవించుకుంటున్నాను. ఇళ్లకు కాపలాకాయడం నా డ్యూటీ. కోతుల్ని వెంటాడటం కాదు. అదనపు బాధ్యతలు నెత్తిమీద వేసుకుంటే ఇలాగే ముట్టె బొప్పి కడుతుంది.’’ అనుకున్నది కాబోలు.గోడమీద తిరుగుతున్న కోతికి ఆలేషా కనిపించాడు. కుర్రాడు. కట్టెలు కొడుతున్నాడు. కోతిని చూసి గొడ్డలి కింద పడేశాడు. చిన్నారి కోతి. ముద్దొస్తోంది.షర్టు విప్పి, ఒడుపుగా మీదికి విసరి పట్టుకున్నాడు. ఒక కోతిని పెంచుకోవాలని ఎన్నాళ్లుగానో అనుకున్నాడు. ఇన్నాళ్లకు కోరిక తీరింది. ఇంటికి తెచ్చి, తిండి పెట్టాడు. తాగడానికీ టీ ఇచ్చాడు. కోతికి ఇదంతా బాగానే ఉంది. కానీ కాస్త ఇబ్బంది లేకపోలేదు.
ఆలేషా అమ్మమ్మకు కోతిని ఇంట్లో పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఒకసారి కొట్టబోయింది కూడాను. కోతి పెద్ద నేరమేమీ చెయ్యలేదు. మధ్యాహ్నం ఎవరూ చూడకుండా తినాలని ముసలావిడ దాచుకున్న మిఠాయిని గుటుక్కుమనిపించింది.మనుషుల మర్యాదలతో కోతులకేం సంబంధం? ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్లు ప్రవర్తిస్తారు. ముసలావిడ దుఃఖించింది. ఈ పాడు కోతికి తన మిఠాయి ముక్క కావలసి వచ్చిందా? కన్నీళ్ల పర్యంతమై ఒక ప్రకటన జారీ చేసింది.‘‘ఇది మనుషులుండే యిల్లు. కోతుల రాణి వాసం కాదు. దీని మొహం చూస్తే రాత్రికి నిద్ర పట్టదు. ఇంట్లో యిదైనా ఉండాలి. నేనైనా ఉండాలి. దీన్ని వెంటనే జూకు తీసికెళ్లకపోతే నేనే అక్కడకి పోతాను. కోతులు యిళ్లల్లో. మనుషులు జూలో. ఏం రోజులు వచ్చాయిరా బాబూ!’’.ఆలేషాకు అమ్మమ్మంటే ఇష్టం.‘‘నువ్వు జూకి వెళ్లొద్దు. ఈ కోతి ఇకమీద నీ వస్తువులేవీ ముట్టదు. దీనికి మనుషుల పద్ధతులన్నీ నేర్పిస్తాను. నువ్వే చూస్తావుగా. కొద్దిరోజుల్లో ఇది స్పూన్‌తో తింటుంది. గ్లాసులోంచి టీ తాగుతుంది. ఇక గెంతడమంటావా? జాతి లక్షణమది. నీ మీదికి దూకినా నీవు భయపడవద్దు అమ్మమ్మా. దానికి నువ్వంటే ఇష్టం. ఆఫ్రికా అడవుల్లో వూడలు పట్టుకుని వూగిన కోతి. కొన్ని అలవాట్లు మార్చుకోలేదు.’’తెల్లారి స్కూలుకు పోతూ ఆలేషా అమ్మమ్మకు కోతికి జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పాడు.‘‘ముసలిదైతే మాత్రం కోతి బాగోగులు కూడా తనే చూడాలా? వాడికి తనంటే అంత చులకనా? ఇదెక్కడికన్నా పోతే పీడా విరగడవుతుంది.’’ అనుకుని వాలు కుర్చీలో నిద్రపోయింది ముసలావిడ.కోతి కిటికిలోంచి దూకి వీధిలో పడింది. ఇల్లు విడిచి రావాలని దాని ఉద్దేశం కాకపోవచ్చు. కాస్త షికారుకెళ్లాలని కోరిక కావచ్చు. లేదా మరో కొట్లో మరేవైనా రుచికరమైన వస్తువులు దొరుకుతాయేమోనని ఆశ కావచ్చు. – డబ్బుల్లేవనుకోండి. అది వేరే సంగతి.
సరిగ్గా ఆ సమయంలో ఓ వృద్ధుడు అటుగా నడుస్తున్నాడు. చేతిలో సబ్బు, టవల్, పబ్లిక్ బాత్‌రూంలో స్నానం చెయ్యడానికి పోతున్నాడు. చేతిలో చిన్న బుట్ట.కోతిని చూసి తన కళ్లను నమ్మలేకపోయాడు. కోతి విధుల్లోకి రావడమేమిటి? కాస్త మందు కొట్టి ఉన్నాడు. అంతా తన ఊహకాబోలు అనుకున్నాడు. పరికించి చూశాడు. నిజంగా కోతే. దీన్ని పట్టుకుని మార్కెట్లో అమ్మితే కనీసం వంద రూబుళ్లు వస్తాయి. అప్పుడు కడుపు నిండా బీరు తాగవచ్చు. ఎలా మాట్లాడి దాన్ని బుట్టలో వేసుకోవాలో అర్థం కాలేదు. తనకు కోతి భాష రాదు. జంతువుల్లో కల్లా తెలివైనది కోతి. జేబులోంచి చక్కర బిళ్ల తీసి చూపించాడు. కోతి ‘‘థ్యాంక్స్’’ అనాలనుకుంది. కానీ దానికి మాటలు రావుగా. తింటుంటే మాత్రం తియ్యగా ఉంది. మొత్తంమీద అలాగ బుట్టలో పడింది కోతి. ఆ వృద్ధుడు తనను మోసుకెడుతుంటే గర్వించింది కూడాను.మంచిధర వస్తుంది.స్నానాల గది నీటి పొగతో వేడిగా ఉంది. కోతికి ఆఫ్రికా జ్ఞాపకం వచ్చింది. పుట్టింటికి వచ్చినట్టనిపించింది. అంతలోనే సబ్బు నురగ మింగింది. ఛ, అదేం రుచి. అసహ్యమేసింది. తల విదిలించింది. ఈసారి సబ్బుతో కళ్లలో మంట మొదలైంది. అసలే కోతి. పిచ్చెక్కింది. వృద్ధుడి వేలు కొరికి బైట పడింది.సబ్బు నురగతో తెల్లటి బంతిలాగున్న కోతిని వీధిలో ఎవరూ గుర్తు పట్టలేదు. అసహనంతో అటూ ఇటూ గెంతింది.బాత్‌రూం ముందర స్నానాలకు టికెట్లు అమ్మే కౌంటర్ ఉంది. అక్కడో లావుపాటి పిల్ల కూర్చుంది. కోతిని చూసి బాంబనుకుంది. ‘‘హెల్ప్, హెల్ప్’’ అని కేకలేస్తూ పరిగెత్తింది.ఈ అరుపులూ, పెడబొబ్బలూ కోతికర్థం కాలేదు. ఒంటికి సబ్బు, కళ్లలో మంట. అందరి కన్నా వెనుక తనకు మిఠాయి పెట్టిన ముసలాడు.ఇదే అదనుగా కుక్క(అదే కుక్క) కూడా వెంట పడింది. అయితే ఒకసారి గర్వ భంగమైంది గనుక కుక్క తన జాగ్రత్తలో తానున్నది. దూరం నుంచే మొరిగి భయపెట్టింది.‘‘కోతి కన్నా నా ముట్టె నాకు ముఖ్యం’’ అనుకుంది.మన ఆలేషా అప్పుడే స్కూలు నుంచి తిరిగి వచ్చాడు. కోతి ఇంట్లో లేదు. ఏడుపొచ్చింది. అంత అపురూపమైన కోతి మళ్లీ తనకు దొరికేనా!దిగాలుగా వీధుల వెంట నడిచాడు. జనం హడావిడిగా అటూ ఇటూ పరిగెడుతున్నారు. ఫాసిస్టులు బాంబులు వేస్తున్నారా? కోతి కోసం పరుగులు తీస్తున్నారా అని ఆ కుర్రాడికి చాలా సేపటిదాకా అర్థం కాలేదు.
మొత్తం మీద కోతి కనిపించింది. పరిగెత్తి దాన్ని తీసుకుని ముద్దాడాడు. జనం ఆలేషా చుట్టూ మూగారు.వృద్ధుడు వచ్చి కోతి తనదన్నాడు.‘‘ఇదిగో సాక్ష్యం. నా వేలు కొరికింది కూడాను. డబ్బులు చాలా అవసరం. రేపు దీన్ని మార్కెట్లో అమ్మాలి.’’‘‘ఇది నా కోతి. పొమ్మన్నా పోదు. నేనంటేనే దానికిష్టం’’ అన్నాడు ఆలేషా.‘‘మీద్దరిదీ కాదు. ఇది నాది. ట్రక్కులో తీసుకొచ్చింది నేనే.’’‘‘అయితే ప్రస్తుతం నేను యుద్ధానికి పోతున్నాను. ఎవరు ప్రేమగా పెంచుకుంటానంటే వాళ్లకిస్తాను’’ అన్నాడు డ్రైవర్. ఈ ముసలోడు. దయలేనివాడు. కుర్రాడిదే నిజమైన ప్రేమ’’ అనుకుంది కోతి.జనం చప్పట్లు కొట్టారు.ఆలేషా, కోతి ఇంటికి చేరారు.వృద్ధుడు వేలి గాయం చప్పరిస్తూ బాత్‌రూం వైపు నడిచాడు.ఇప్పటికీ మన కోతి ఆలేషా దగ్గిరే ఉంటోంది.మొన్న ఆ వూరికి వెళ్లినప్పుడు చూడటానికెళ్లాను. కోతి ఇప్పుడెక్కడికీ పారిపోదు. వినయం విధేయతా నేర్చుకుంది. జేబురుమాలుతో ముక్కు తుడుచుకుంటుంది. ఆలేషా అమ్మమ్మక్కూడా ఇప్పుడదంటే కోపం లేదు. దాన్ని మళ్లీ జూకు పంపించే ఉద్దేశం లేదు.కోతి టేబుల్ మీద కూర్చుని కాస్త టెక్కుగా నా వైపు చూసింది.. టికెట్లమ్మేవాడు తన వల్లే ప్రేక్షకులంతా సినిమా చూడగలుగుతున్నారని గర్వించినట్టు. స్పూన్‌తో భోజనం చేస్తోంది.‘‘విద్యాబుద్ధులు చెప్పించాను. మర్యాదా, మన్ననా అలవాటు చేశాను. ఇలాంటి కోతిని చూసి పిల్లలూ, పెద్దలూ కూడా నేర్చుకోవాల్సిందెంతో ఉంది’’ అన్నాడు ఆలేషా.
రష్యన్ మూలం : మిహాయిల్ జోష్చెంకో
అనువాదం: ముక్తవరం పార్థసారథి
కోతి నా ఆదర్శం
Published Sun, Jan 21 2018 12:50 AM | Last Updated on Sun, Jan 21 2018 12:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment