నిర్మాణాలు సరే.. నీరొచ్చేనా?
నిర్మాణాలు సరే.. నీరొచ్చేనా?
Published Wed, Aug 3 2016 9:34 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
ఘాట్‌లు ఉన్నా.. నీరు లేదాయె
– కుడి కాలువకు నీటి విడుదల సరే, డెల్టాకు ఎప్పుడు?
– చర్యలు తీసుకోకపోతే అవస్థలే..
అమరావతి (మాచర్ల ):
పుష్కరాలను పురస్కరించుకుని పుష్కర ఘాట్‌లను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటిమట్టం తక్కువగా ఉండటంతో మంచినీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేశారు. పుష్కర ఘాట్‌ల నిర్మాణం జరుగుతున్న డెల్టా ప్రాంతంలో మాత్రం నీటి విడుదలకు సంబంధించి ఇప్పటివరకు అధికారులు ఆదేశాల జారీ చేయలేదు. దీంతో పుష్కర ఘాట్‌లకు నీటì æవిడుదల ఎప్పుడని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. విజయపురి సౌత్‌లోని కృష్ణా పరీవాహక డెల్టా ప్రాంతం నుంచి అమరావతి, విజయవాడ వరకూ పలు పుష్కర ఘాట్‌లు నిర్మిస్తున్నారు. కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేస్తారనే అంచనాలతోనే వీటి నిర్మాణం జరుగుతోంది.
ప్రభుత్వంతో అధికారుల చర్చలు
మరో 8 రోజుల్లో పుష్కరాలు ప్రారంభమయ్యే సమయంలో నీరు విడుదల చేయకపోవడం, డెల్టా ప్రాంతంలోని అన్ని పుష్కర ఘాట్‌లకు కృష్ణా పరీవాహక ప్రాంతంలో రెండు వైపులా నీరు అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. సాగర్ రిజర్వాయర్ నుంచి కృష్ణాడెల్టాకు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదల చేయకపోతే పుష్కర ఘాట్‌లకు సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రెండు రోజులుగా అధికారులతో చర్చలు జరుపుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా డెల్టాకు సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు.
అంతా అనుమానమే..
డెల్టా ద్వారా నీరు విడుదల చేయించేందుకు కృష్ణాబోర్డు ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పుష్కరాలకు నీరు విడుదల చేయడం అనివార్యమని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 10వ తేదీలోపు సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదలచేసి పుష్కరఘాట్‌ల వద్ద నీరు నిల్వ ఉండేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పుష్కరాలలోపు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం పరిధిలోని పుష్కర ఘాట్‌లకు నీటిని విడుదల చేస్తారా, లేదా అనేది వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement