శ్రావస్తి బౌద్ధ సంఘంలో విమలుడు మంచి భిక్షువు. బుద్ధుని ప్రబోధాల్ని చక్కగా ఆచరిస్తాడని పేరు. పంచశీల పాటించడంలో మేటి. ఒకరోజున ఒక అడవిమార్గంలో వెళ్తున్నాడు విమలుడు. అతని చెవికి ఒక జింక రోదన వినిపించింది. వెంటనే విమలుడు ఆ ఆర్తి, అరుపు వినిపించే వైపుకు నడక సాగించాడు. కొంతదూరం వెళ్లేసరికి అక్కడ ఒక జింక, దాని పిల్లలు కనిపించాయి.అవి తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. అది గింజుకుంటూ మోర పైకెత్తి అరుస్తోంది. విమలుడు దగ్గరకి వెళ్లాడు. తల్లి జింక భయంతో మరింత బిగ్గరగా అరిచింది. పిల్ల జింకలు రెండూ దూరంగా పారిపోయాయి.
ఎవరో వేటగాడు ఉచ్చులు పన్నాడు. ఆ ఉచ్చులో తల్లి జింక కాలు తగిలించుకుంది. అది ఎప్పటినుండి బలవంతాన లాక్కుంటోందో గానీ, ఆ ఉచ్చు మరింత బిగుసుకుపోయింది. కాలి చర్మం కూడా చీరుకుపోయి ఉంది. విమలుడు వెంటనే ఆ ఉచ్చు తొలగించాడు. తల్లి జింక విమలుడి వంక మెరిసే కళ్లతో చూస్తూ తన పిల్లల దగ్గరకు గెంతుతూ అరుస్తూ వెళ్లిపోయింది. ఈసారి దాని అరుపులో ఆనందం వినిపిస్తోంది. విమలుడు వాటివైపు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. అంతలో.. అతని వెనుకనుండి... ‘‘ఓరీ! బోడిగుండూ! దుర్మార్గుడా! ఎంత పని చేశావు?’’అనే అరుపు వినిపించి వెనక్కి తిరిగాడు. వేటగాడు కోపంతో తన దగ్గరకు వేగంగా వస్తున్నాడు.
‘‘నేను ఆహారం కోసం ఉచ్చులు పన్నాను. నాకు దొరికిన ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. నీవు చేసిన ఈ పనివల్ల ఈ రోజు నా కుటుంబం పస్తుండాలి. మా నోటికాడ కూడు తీసిన పాపం నీదే...’’ అని తిట్టుకుంటూ ఉచ్చులు తీసుకుని భిక్షువు వంక చుర చుర చూస్తూ చరచరా వెళ్లిపోయాడు. విమలుడు దారిలోకి వచ్చి ఆలోచిస్తూ నడక ప్రారంభించాడు. ‘‘నేను పాపం చేశానా?పుణ్యం చేశానా?’’ అనే సందేహంలో పడ్డాడు. ఆరామానికి వచ్చి, బుద్ధుని దగ్గరకు వెళ్లి, నమస్కరించి, విషయం చెప్పాడు. ‘‘విమలా! నీవు చేసింది పాపం కాదు. జీవ కారుణ్యానికి మించిన ధర్మం లేదు. నీవు శీల భ్రష్టుడివి కావు. నిందితుడివి కావు’’ అని మెచ్చుకున్నాడు.ఒక మంచిపని చేయడం వల్ల కొందరు నిందించినా బాధపడకూడదని విమలునికి అర్థమైంది.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment