జింకలు చెప్పే నీతి
నలభై ఐదేళ్ల తన ధర్మప్రచారంలో బుద్ధుడు ఏనాడూ సమయపాలన తప్పలేదు. అయితే, కొందరు భిక్షువులు ధర్మోపదేశాలు వినడానికి రోజూ వచ్చేవారు కాదు. ఒక రోజున అలాంటి ఒక యువ భిక్షుకుడితో, బుద్ధుడు ఈ కథ చెప్పాడు... ‘‘ఓ! భిక్షూ! పూర్వం అరణ్యంలో ఒక జింక ఉండేది. అది ఎన్నో విద్యలు నేర్చింది. అడవిలో ఇతర మృగాల నుండి, వేటగాళ్ల నుండి ఆపద వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఎలా తప్పించుకోవాలో నేర్చింది.
ఆ విద్యల్ని తన జాతివారికంతా నేర్పేది. దాని దగ్గర చతురుడు, చలనుడు అనే రెండు జింకలు చేరాయి. చతురుడు క్రమం తప్పకుండా గురువు చెప్పిన సమయానికి వచ్చేవాడు. చెప్పింది శ్రద్ధగా నేర్చేవాడు. కానీ, చలనుడు సమయానికి వచ్చేవాడు కాదు. దాని వల్ల విద్యలన్నీ నేర్వలేకపోయాడు.
ఒక రోజున వేటగాళ్లు పన్నిన వలల్లో ఇద్దరూ చిక్కుకున్నారు. చతురుడు గురువు నేర్పినట్లు గాలిని బంధించి చనిపోయినవాడిలా పడివున్నాడు. కానీ, చలనుడు అలా చేయలేకపోయాడు. వేటగాళ్లు వచ్చి చలనుణ్ణి పట్టి బంధించారు. చతురుణ్ణి చూసి ‘చనిపోయిన జింక’ అనుకొని వలను ఎత్తారు. చలనుడు తప్పించుకొన్నాడు. భిక్షూ! చూశావా! సమయపాలన చేసే విద్యార్థికి పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. లేనివానికి అరకొర జ్ఞానమే దక్కుతుంది. ఇలాంటి అలసత్వం వల్ల పరిపూర్ణ జ్ఞానివి కాలేవు. నిర్వాణం పొందలేవు’’ అని చెప్పాడు.
ఆనాటి నుండి ఆ యువభిక్షువు క్రమం తప్పకుండా శిక్షణ పొందాడు.
- బొర్రా గోవర్ధన్