వర్షించిన మేఘం!
బౌద్ధవాణి
భిక్షువులు కొందరు సోమరిపోతుల్లా గడుపుతుండేవారు. జ్ఞానబోధ చేయని భిక్షువు భిక్షకు అర్హుడు కాదని బుద్ధుడు చెప్పేవాడు. చదువు పట్ల, బోధ పట్ల నిర్లక్ష్యం చూపి, సోమరుల్లా విహారాల్లో గడిపేవారిని వారించేవాడు. సోమరితనం సర్వనాశనానికి కారణం అని పదే పదే చెప్పేవాడు. ఒకరోజు కొందరు శిష్యులు ఒక సోమరి భిక్షువును బుద్ధుని దగ్గరకు తీసుకువచ్చారు. బుద్ధుడు అతడితో ఇలా చెప్పాడు...
‘‘ఒక ఊళ్లో ఎందరో కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు. ఒక వేదాంతి వచ్చి ‘నాయనా, ఈ ఊళ్లో ఓ పుష్కరం పాటు వానలు పడవు’ అని చెప్పాడు. ఆయన మాటలు విని రైతులంతా ఊరు ఖాళీ చేసి, పొరుగూరు వెళ్లిపోయారు. కానీ ఒకే ఒక రైతు నాగలి కట్టి పొలం దున్నుతున్నాడు. ఆకాశంలో పోయే మేఘాలు అతడిని చూసి ఆశ్చర్యపడి, దిగి వచ్చి, ‘ఓ కర్షకుడా... మేము పన్నెండేళ్ల పాటు వర్షించబోమని తెలిసి కూడా ఎందుకు పొలం దున్నుతున్నావు?’ అని అడిగాయి.
దానికా రైతు నవ్వి - ‘ఈ పన్నెండేళ్లూ నేను పనులు చేయకుండా కూర్చుంటే, పన్నెండేళ్ల తర్వాత మీరు వర్షించినా నాకు ఉపయోగం లేదు. ఈలోపు సోమరితనం పెరిగి, నా పనులు నేను మరిచేపోతాను. అప్పుడు మీరు వర్షించినా, వర్షించకున్నా ఒకటే’ అన్నాడు. రైతు మాటలు విని మేఘాలకు భయం వేసింది. తామూ తమ పనిని మరచిపోతామేమో అనుకుని వెంటనే వర్షించాయి’’ అని కథ ముగించాడు బుద్ధుడు. భిక్షువుకి జ్ఞానోదయం అయింది.
- బొర్రా గోవర్ధన్